సమావేశంలో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: గిరిజనులకు పోడు భూములకు సంబంధించిన పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని జూన్ 24 నుంచి 30 వరకు నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. పోడు పట్టాలు పొందిన గిరిజనుల వివరాలు సేకరించి రైతుబంధు పథకాన్ని వర్తింపచేయాలని ఆదేశించారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రోజువారీ కార్యక్రమాల షెడ్యూల్ ఖరారు, పోడు పట్టాల పంపిణీ, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై మంగళవారం సచివాలయంలో సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
పోడు పట్టాల పంపిణీ కార్యక్రమానికి తాను స్వయంగా హాజరవుతానని ముఖ్యమంత్రి తెలిపారు. అటవీ హక్కుల గుర్తింపు చట్టం (ఆర్‌ఓఎఫ్‌ఆర్)–2006 కింద పట్టాలు పొంది రైతుబంధు అందుకుంటున్న గిరిజన రైతులతో, కొత్తగా పోడు పట్టాలు అందుకోబోతున్న గిరిజన లబ్ధిదారులను క్రోడీకరించాలని సూచించారు. ఇతర రైతుల తరహాలోనే వీరికీ రైతుబంధు అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ప్రభుత్వమే బ్యాంకు ఖాతాలను తెరిచి పోడు భూముల పట్టాల యాజమానులకు నేరుగా వారి ఖాతాల్లో రైతుబంధు మొత్తాన్ని జమ చేస్తుందని చెప్పారు. కొత్తగా పోడు పట్టాలు అందుకుంటున్న గిరిజన రైతుల బ్యాంకు ఖాతాల వివరాలను ఆర్థిక శాఖకు అందజేయాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ను కేసీఆర్ ఆదేశించారు.
అర్హులైన నిరుపేదలకు భూములు
గ్రామాల్లో ఇంకా మిగిలి వున్న నివాసయోగ్యమైన ప్రభుత్వ భూములను గుర్తించి, దశాబ్ది ఉత్సవాల సందర్భంగా అర్హులైన నిరుపేదల ఇళ్ల నిర్మాణాల కోసం పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. సొంత జాగాలో ఇళ్ల నిర్మాణానికి రూ.3 లక్షల ఆర్థిక సహాయం అందించేందుకు ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకం విధివిధానాలను త్వరితగతిన తయారు చేయాలని, జూలైలో ఈ పథకాన్ని ప్రారంభించాలని ఆదేశించారు. జూలైలోనే దళితబంధు కొనసాగింపు కోసం ఏర్పాట్లు చేయాలని సీఎస్‌కు సూచించారు.
కలెక్టర్లతో రేపు సదస్సు
తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లకు సంబంధించి ఈ నెల 25న జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్సు నిర్వహించాలని సీఎం నిర్ణయించారు. ఈ సమావేశంలో మంత్రులు, జిల్లా ఎస్పీలు పాల్గొంటారు.
14న నిమ్స్ విస్తరణకు శంకుస్థాపన
వైద్యారోగ్య దినోత్సవం సందర్భంగా జూన్ 14న నిమ్స్ ఆస్పత్రి విస్తరణ పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. 2,000 పడకలతో నూతనంగా నిర్మించనున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ భవన నిర్మాణం పనులకు పునాదిరాయి వేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment