గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయం
ఒంగోలు టూటౌన్: జిల్లా గిరిజన సంక్షేమ శాఖలో గాడితప్పిన సంక్షేమం కొలిక్కి వచ్చేనా..? అన్న సంశయం గిరిజన సంఘాలను వెంటాడుతోంది. గతంలో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ డీటీఓగా పనిచేసి రిటైర్డ్ అయిన ప్రేమనందం అనంతరం ఆయన స్థానంలో జిల్లా గిరిజన సంక్షేమశాఖ అధికారిగా రెవెన్యూ శాఖకు చెందిన కె. రాజ్యలక్ష్మి డిప్యూటేషన్‌పై 2017 అక్టోబర్ నెలలో బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి అవుట్ సోర్సింగ్ గిరిజన ఉద్యోగులకు కష్టాలు మొదలయ్యాయి.
అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు జీతాల్లేవ్..
జిల్లాలో గిరిజన సంక్షేమశాఖ ద్వారా 14 గురుకుల పాఠశాలలు, 17 ఆశ్రమ పాఠశాలలు పనిచేస్తున్నాయి. వీటితో పాటు మూడు పోస్టు మెట్రిక్, మూడు ఫ్రీ మెట్రిక్ వసతి గృçహాలు మొత్తం 37 వసతి గృహాలు నడుస్తున్నాయి. సుమారుగా 4 వేల మంది గిరిజన విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వీటిలో ప్రభుత్వం ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కలిపి మొత్తం 140 వరకు పనిచేస్తుండగా అందులో 56 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు గత కొన్నేళ్లుగా పనిచేస్తున్నారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు నెల వేతనం రూ.12 వేల వరకు ఉండగా కటింగ్‌లు పోను రూ.10,300 వరకు చేతికొస్తోంది. ఆ చాలీచాలనీ వేతనంతోనే తమ కుటుంబాలను పోషించుకుంటున్నారు. ఇలాంటి సమయంలో డిప్యూటేషన్‌పై బాధ్యతలు చేపట్టిన కె. రాజ్యలక్ష్మి అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకం నిబంధనలకు విరుద్ధంగా జరిగిందంటూ సడెన్‌గా నిలుపుదల చేశారు. 2018 విద్యా సంవత్సరం ప్రారంభమైన తరువాత జూన్‌లో రెన్యువల్ ఆర్డర్లు అడగటానికి జిల్లా గిరిజన సంక్షేమశాఖకు వెళ్లిన అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు చేదు అనుభవం ఎదురైంది. డీటీడబ్ల్యూఓ మిమ్మలను తొలగిస్తున్నట్లు తెలపడంతో అందరూ ఒక్కసారిగా అవాక్కయ్యారు.
దీంతో 56 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఒక్కసారిగా రోడ్డున పడ్డారు. తరువాత పనిచేసిన కాలంలో రావాల్సిన పది నెలల వేతనాలు మంజూరు కాక ఆర్థిక కష్టాల పాలయ్యారు. నిత్యం అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేయని రోజులేదు. దీంతో గత్యంతరం లేక గిరిజన సంఘం నాయకుల ఆధ్వర్యంలో బాధితులు స్థానిక ప్రకాశం భవనం వద్ద ధర్నాలకు దిగారు. ఆందోళనలు నిర్వహించారు. చివరకు రిలే నిరాహార దీక్షలు చేశారు. ఆమెను మాతృశాఖకు బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై కలెక్టర్‌తో పాటు గిరిజన సంక్షేమశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా బాధితుల ఆవేదన, ఆక్రందన ఆవేదనగానే మిగిలిపోయింది. ఎవరూ సమస్యను పరిష్కరించలేకపోయారు. చివరకు పాలకుల దృష్టికి గిరిజన సంఘం నాయకులు తీసుకెళ్లారు. దీంతో డీటీడబ్ల్యూఓని బదిలీ చేస్తూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు ఇచ్చింది. ఆమె స్థానంలో నెల్లూరు జిల్లా పౌరసరఫరాల శాఖలో విజిలెన్స్ విభాగంలో పనిచేసే ఎం. వెంకటసుధాకర్‌ను ఇటీవల గిరిజన సంక్షేమశాఖ అధికారిగా నియమించింది. ఆయన వెంటనే బాధ్యతలు చేపట్టారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఆయనకు గిరిజన సంఘం రావూరి శ్రీనివాసరావు, సంఘం నాయకులు కలిసి తమ సమస్యలు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను విన్నవించారు. వీటితో పాటు భూమి కొనుగోలు పథకం అమలు, సీఆర్‌టీలకు వేతనాలు, ఎన్‌ఎస్‌ఎఫ్‌టీసీ ఇలా పలు గిరిజన సంక్షేమ పథకాలు పడకేశాయని గిరిజన సంఘం నాయకులు లక్ష్మయ్య, శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. వీటిని అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని కొత్తగా బాధ్యతలు చేపట్టిన డీటీడబ్ల్యూఓకి విజ్ఞప్తి చేశారు. ఈయన ఏ మేరకు సమస్యలు పరిష్కరిస్తారో వేచిచూడాలి మరి.
Comments
Please login to add a commentAdd a comment