
అసలేం జరుగుతోంది?
విద్యార్థుల ఉపకార వేతనాల కుంభకోణంలో పీకల్లోతు అవినీతిలో కూరుకుపోరుున గిరిజన సంక్షేమ శాఖలో ఏం జరుగుతుందో....
గిరిజన సంక్షేమ శాఖలో ఏం జరుగుతోందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రూ.లక్షల్లో అవినీతి చోటు చేసుకుంటున్నా..అధికార పార్టీ కీలక నేత అండదండలతో కొందరు అధికారులు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. నాలుగేళ్లుగా ఈ శాఖకు డీడీని పూర్తి స్థాయిలో నియమించే పరిస్థితి లేకపోవడంతో ఈ శాఖలో అవినీతికి మరింత ప్రోత్సహించినట్టయింది. దీంతో అధికారుల్లో కొందరు ఎవరిష్టం వచ్చినట్టు వారు వ్యవహరిస్తూ చివరకు విద్యార్థుల ఉపకార వేతనాల్లో భారీ అవినీతికి పాల్పడ్డారు. ఏసీబీ విచారణలో రోజుకొక కొత్త విషయం వెలుగులోకి వస్తుండడంతో ఈ శాఖపై విమర్శల జడివాన కురుస్తోంది.
* గిరిజన సంక్షేమ శాఖలో...
* నాలుగేళ్లుగా భర్తీ కాని డీడీ పోస్టు
* ఇన్‌చార్జిలతోనే కాలయాపన!
సీతంపేట : విద్యార్థుల ఉపకార వేతనాల కుంభకోణంలో పీకల్లోతు అవినీతిలో కూరుకుపోరుున గిరిజన సంక్షేమ శాఖలో ఏం జరుగుతుందో ఎవరికీ అంతుబట్టడం లేదు. ఈ శాఖకు దిశ నిర్దేశం కరువైంది. గిరిజన సంక్షేమానికి సంబంధించి ప్రణాళికను రచించాల్సిన నాధుడు ఇక్కడ లేకపోవడం..ఇన్‌చార్జిలతోనే కాలం నెట్టుకొస్తుండడం పలు విమర్శలకు తావిస్తుంది. ఇదే అదునుగా అక్రమార్కులు చాప కింద నీరులా తమ పని కానిచ్చేస్తున్నారు.
నాలుగేళ్లగా ఈ పోస్టులో గిరిజన ఉప సంచాలకుడు పోస్టు భర్తీ కాలేదంటే ఈ శాఖపై, గిరిజన సంక్షేమంపై ప్రభుత్వానికి, పాలకులకు ఎంత చిత్తశుద్ధి ఉందో అర్ధమవుతోంది. 2012లో గ్రూప్ వన్ అధికారి సర్వేశ్వరరెడ్డి బదిలీ అయిన తరువాత అందరూ ఇన్‌చార్జిలతోనే ఈ శాఖ కాలం నెట్టుకొస్తోంది. గతంలో ఏపీవోగా పని చేసిన నాగోరావు, విజయనగరం జిల్లా స్పెషల్ డిప్యూటి కలెక్టర్ శర్మ ఇన్‌చార్జిలుగా వ్యవహరించారు. వారి బదిలీలు తర్వాత ప్రస్తుతం ఐటీడీఏ డిప్యూటి డీఎంఅండ్‌హెచ్‌వో ఎంపీవీ నాయిక్ గిరిజన సంక్షేమ శాఖ డీడీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
ఈయన ఇటు వైద్య, అటు విద్యా శాఖలను చూడాల్సి ఉంది. ఐటీడీఏ పరిధిలో 44 గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, మూడు కేజీబీవీలు, మరో రెండు వసతిగృహాలు, అలాగే 18 పోస్ట్‌మెట్రిక్ వసతిగృహాలు నడుస్తున్నారుు. వీటిలో 18 వేల మంది గిరిజన విద్యార్థులు చదువుతున్నారు. ఆయా విద్యా సంస్థలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించి, ఎక్కడ ఎటువంటి అక్రమాలు జరగకుండా చూడడం, మెనూ సక్రమంగా అమలు అవుతుందా! లేదా! పర్యవేక్షించడం ప్రదాన విధి. గిరిపుత్రిక, గిరిజన విద్యోన్నతి, అంబేడ్కర్ వోవర్సీస్ వంటి పథకాలను అమలు చేయడం వంటివి చేయాల్సి ఉంది. ఇన్ని అమలు చేయాల్సిన చోట పూర్తి స్థాయి డీడీని నియమించకపోవడం గమనార్హం.
ఇదీ పరిస్థితి...
కింది స్థాయి ఏటీడబ్ల్యూవోల్లో ఇటీవల సీతంపేట ఏటీడబ్ల్యూవో సస్పెన్సన్‌కు గురయ్యారు. ఆయన కనుసన్నల్లోనే అక్రమాలు ఎక్కువగా చోటు చేసుకున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏటీడబ్ల్యూవోగా ఉంటూనే తనకు అనుకూలమైన వారిని కొన్ని పోస్ట్‌మెట్రిక్ వసతిగృహాలకు వార్డెన్‌లుగా నియమించుకుని వారిని బినామీలుగా పెట్టుకుంటూ అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏమంటే జిల్లాకు చెందిన కీలక అధికార పార్టీ నేత ఆశీస్సులు కూడా ఉన్నాయనే అండతో లక్షల కుంభకోణాలకు పాల్పడినట్టు తెలిసింది.
బీసీ ఉపకార వేతనాలను శ్రీకాకుళం గిరిజన సంక్షేమ శాఖ హెచ్‌డీ(హాన్‌రోరియం డెరైక్టర్) ఖాతాలోకి వేసినట్టు సమాచారం. గతంలో శ్రీకాకుళం వసతిగృహాల నిర్వహాణలో పలు అక్రమాలు చోటు చేసుకోవడంతో అప్పట్లో విచారణ జరిగింది. ఒక విద్యార్థిని మృతి చెందడంతో ఆ మృతి బయటకు పొక్కకుండా ఉండేందుకు కొంతమంది ఎస్‌ఎఫ్‌ఐ నాయకులకు డబ్బులు ఇస్తానని చెప్పడంతో వారు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. విచారణ అనంతరం ఏకంగా గిరిజన సంక్షేమ శాఖకు చెందిన కమిషనర్ ఏటీడబ్ల్యూవోను సస్పెండ్ చేయడం జరిగింది. ఇన్ని జరుగుతున్నా గిరిజన సంక్షేమ శాఖకు చికిత్స చేసే నాధుడు కరువయ్యాడు.