‘స్థానికత మేరకు చేపట్టే బదిలీలతో మాకు అన్యాయం జరుగుతోంది. ఖమ్మం జిల్లా నుంచి నియమితులమై..అన్ని రకాల సంబంధ బాంధవ్యాలను తెలంగాణతోనే ఏర్పాటు చేసుకున్నాం. అటువంటి మాకు స్థానికతతో ముడిపెట్టకుండా బదిలీలకు అవకాశం కల్పించాలి.’ అంటూ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించిన జడ్పీ ఉపాధ్యాయులకు అనుకూలంగా తీర్పు వెలువడింది. ముంపు ప్రాంత ఉద్యోగుల్లో హర్షం వ్యక్తమవుతోంది.
ఎంచుకున్న దాన్నిబట్టే ముంపు బదిలీలు
- ముంపు స్థానికత ఉన్న వారికీ అవకాశం
- ట్రిబ్యునల్ తీర్పుతో ఉపాధ్యాయుల్లో హర్షాతిరేకాలు
- రేపు గిరిజన సంక్షేమశాఖలో సర్దుబాటు
భద్రాచలం :ఏపీలో విలీనమైన ముంపు మండలాల్లో పనిచేస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఆప్షన్‌ల మేరకే బదిలీలు జరగనున్నారు. బుధవారం నాడు ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుతో ఉద్యోగుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ముంపు స్థానికత ఉన్నా తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తామని ఆప్షన్ ఇచ్చిన ఉద్యోగులందరికీ బదిలీల్లో అవకాశం కల్పించాలని ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం కూడా సానుకూలత వ్యక్తం చేయటంతో ఇక అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలోనే బదిలీలు చేపట్టేందుకు జిల్లా ఉన్నతాధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు.
విలీన మండలాల్లో పనిచేస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయులను జిల్లాలో సర్దుబాటు చేసేందుకు అంగీకరిస్తూ.. మార్చి 19న రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 130ని విడుదల చేసింది. కేవలం తెలంగాణ స్థానికత ఉన్న వారికే బదిలీల్లో అవకాశం కల్పించి, ముంపు స్థానికత ఉన్న వారిని అక్కడనే ఉంచాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఉద్యోగుల స్థానికత నిర్ధారణ కోసం సర్వీసు రిజిస్టర్‌లను తనిఖీ చేసి కేవలం తెలంగాణ స్థానికత ఉన్న ఉద్యోగుల జాబితానే బదిలీల కోసం అధికారులు సిద్ధం చేశారు. దీన్ని ప్రాతిపదికగా తీసుకునే ఇప్పటికే వైద్య ఆరోగ్యశాఖకు చెందిన ఉద్యోగుల బదిలీ కౌన్సెలింగ్‌ను పూర్తి చేశారు.
మరికొన్ని శాఖల్లో బదిలీలు..
జడ్పీ, గిరిజన సంక్షేమశాఖల పరిధిలోని ఉపాధ్యాయులు, రెవెన్యూశాఖ పరిధిలోని వీఆర్‌వోలకు మాత్రమే ఇంకా బదిలీలు చేయాల్సి ఉంది. అయితే స్థానికత మేరకు చేపట్టే బదిలీలతో తమకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, ఖమ్మం జిల్లా ద్వారా నియమితులై.. అన్ని రకాల సంబంధ బాంధవ్యాలను తెలంగాణతోనే ఏర్పాటు చేసుకున్న తమకూ స్థానికతతో ముడిపెట్టకుండా బదిలీలకు అవకాశం కల్పించాలని జడ్పీ పరిధిలోని కొంతమంది ఉపాధ్యాయులు ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు.
దీనిపై వాదోపవాదనలు విన్న ట్రిబ్యునల్ ఉద్యోగులకు అనుకూలంగా తీర్పు వెలువరించింది. ముంపు మండలాల వాసులే అరుునా సకల జనుల సమ్మె, తెలంగాణ ఉద్యమాల్లో వారు కూడా పాల్గొన్నృదష్ట్యా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉద్యోగుల విషయంలో సానుకూలంగానే ఉన్నట్లు సమాచారం. ట్రిబ్యునల్ తీర్పును శిరసావహించేందుకే సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే విలీన మండలాల్లోని అన్నిశాఖల వారికి ఆప్షన్‌ల మేరకే బదిలీలు జరిగే అవకాశం ఉంది. ఉద్యోగుల ఆప్షన్‌ల మేరకు బదిలీలు నిర్వహణకు ట్రిబ్యునల్ తీర్పు ఇవ్వటం హర్షనీయమని ముంపు ఉద్యోగుల ఫోరమ్ సమన్వయకర్త స్వరూప్‌కుమార్, గిరిజన సంక్షేమ ఉపాధ్యాయ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి హరిసింగ్‌రాథోడ్ పేర్కొన్నారు.
రేపు ట్రైబల్ వెల్ఫేర్‌లో...
గిరిజన సంక్షేమ శాఖలో గురువారం బదిలీలు చేపట్టేందుకు అంతా సిద్ధం చేశారు. స్థానికత మేరకే బదిలీల జాబితాను తయారు చేసి, జాబితాను ప్రకటించారు. కానీ ట్రిబ్యునల్ తీర్పుతో తెలంగాణకు వచ్చే ఉపాధ్యాయ, ఉద్యోగుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నందున గురువారం జరగాల్సిన సర్దుబాటు బదిలీలను వాయిదా వేశారు. దీన్ని శుక్రవారం నిర్వహించనున్నట్లుగా గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ నరోత్తమరెడ్డి ‘సాక్షి’కి తెలిపారు.
ఆప్షన్‌కు ఓకే
Published Fri, May 1 2015 2:38 AM | Last Updated on Sun, Sep 3 2017 1:10 AM
Advertisement
Advertisement