సాక్షి, హైదరాబాద్: తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ(టీటీడబ్ల్యూఆర్‌ఈఐఎస్) పరిధిలోని గురుకుల పాఠశాలలకు అదనపు హంగులు దిద్దాలని గిరిజన సంక్షేమ శాఖ నిర్ణయించింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు ముందు తెలంగాణలో 47 గిరిజన గురుకుల పాఠశాలలున్నాయి.
ఇవన్నీ శాశ్వత భవనాల్లోనే నిర్వహిస్తున్నప్పటికీ... ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఈ భవనాల సామర్థ్యం సరిపోవడం లేదు. దీంతో శాశ్వత ప్రాతిపదికన అదనపు గదులు, డారి్మటరీలు, డైనింగ్ హాల్స్ ఏర్పాటు కోసం గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది.
గిరిజనుల కోసం ప్రత్యేకంగా అమలు చేస్తున్న షెడ్యూల్డ్ ట్రైబ్ స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్(ఎస్టీ ఎస్‌డీఎఫ్) ద్వారా సివిల్ పనులు చేపట్టేలా ప్రతిపాదనలు తయారు చేయగా... రాష్ట్ర ప్రభుత్వం వెనువెంటనే ఆమోదం తెలిపింది.
ఒక్కో పాఠశాలకు రూ. 5 కోట్లు...
గిరిజన గురుకుల సొసైటీ పరిధిలో పాత పాఠశాలల్లో నిర్మాణ పనుల కోసం ఒక్కో గురుకులానికి రూ.5 కోట్లు చొప్పున కేటాయించింది. చాలాచోట్ల తరగతి గదులతో పాటు డార్మిటరీ భవనాల ఆవశ్యకత ఎక్కువగా ఉంది. ఇదివరకు ఒక్కో పాఠశాలలో ఒక తరగతికి ఒక సెక్షన్ మాత్రమే ఉండేది. ఇప్పుడు విద్యార్థుల సంఖ్య రెట్టింపు అయ్యింది. దీంతో పాటు ఇంటరీ్మడియట్ కాలేజీలుగా దాదాపు అన్నీ అప్‌గ్రేడ్ అయ్యాయి.
ఈ క్రమంలో విద్యార్థుల సంఖ్యకు తగినట్లుగా వసతి లేకపోవడంతో ప్రత్యామ్నాయ చర్యలతో ఇప్పటివరకు నెట్టుకొచ్చారు. తాజాగా ఎస్టీ ఎస్‌డీఎఫ్ ద్వారా నిధుల లభ్యతకు అనుగుణంగా నిధులు కేటాయించారు. మొత్తం 47 పాఠశాలలకు రూ.235 కోట్లు కేటాయించారు. అతి త్వరలో ఈ పనులకు సంబంధించి టెండర్లు ఖరారు చేసిన తర్వాత పనులు ప్రారంభించనున్నారు.
గిరిజన విద్యార్థుల అడ్మిషన్ల డిమాండ్‌కు అనుగుణంగా 2023–24 వార్షికంలో కొత్తగా మరో రెండు పాఠశాలల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో వీటికి శాశ్వత ప్రాతిపదికన భవనాలను నిర్మించేందుకు ప్రత్యేక నిధులను సైతం కేటాయించింది. ఒక్కో పాఠశాలకు రూ.12కోట్లు చొప్పున రెండింటికి కలిపి రూ.24కోట్లు కేటాయించింది. దీంతో గురుకుల పాఠశాలల నిర్మాణ పనులకు మొత్తంగా రూ.259 కోట్లు ఖర్చు చేయనుంది.
గిరిజన ఇంజనీరింగ్ పర్యవేక్షణ...
ఎస్టీ గురుకులాల్లో త్వరలో చేపట్టనున్న ఈ సివిల్ పనుల బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో ఉన్న గిరిజన ఇంజనీరింగ్ విభాగానికి అప్పగించింది. టెండర్ల ఖరారు, పనుల కేటాయింపు, పర్యవేక్షణ, నాణ్యత పరిశీలన తదితర పూర్తిస్థాయి బాధ్యతలను గిరిజన ఇంజనీరింగ్ అధికారులే చూసుకుంటారు. గత మూడేళ్లుగా నిర్మాణ పనులకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వకపోవడంతో స్తబ్ధుగా ఉన్న గిరిజన ఇంజనీరింగ్ విభాగానికి తాజాగా ఊరట లభించినట్లయింది.
Comments
Please login to add a commentAdd a comment