
కస్తూర్బాధలు...!
- కేజీబీవీల్లో మెరుగుపడని వసతులు
- అరకొర సిబ్బందితో నెట్టుకొస్తున్న పాఠశాలలు
- సాంఘిక సంక్షేమం కంటే తక్కువ కేటాయింపులు
బాలికా విద్యను ప్రోత్సహించేందుకు.. డ్రాపవుట్స్‌ను నిరోధానికి, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయా (కేజీబీవీ)లు ఆవిర్భవించాయి. ఇవి ఏర్పాటై మూడేళ్లవుతున్నా మౌలిక వసతుల కోసం యాతన తప్పని పరిస్థితి. జిల్లాలోని 34 కేజీ బీవీల్లో సుమారు 5 వేలమంది విద్యార్థినులున్నారు. చాలా కేజీబీవీలు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. వీటిలో విద్యార్థినులకు సరిపడా మరుగుదొడ్లు, స్నానపు గదులు లేక అవస్థపడుతున్నారు.
జిల్లాలో 2011-12 విద్యా సంవత్సరం నుంచి కేజీబీవీలు నడుస్తున్నాయి. ఇందులో 18 కేజీబీవీలు రాజీవ్ విద్యామిషన్ (ఆర్‌వీఎం) ఆధ్వర్యంలోను, గిరిజన సంక్షేమ శాఖ ద్వారా 8, సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా 3, ఏపీ రెసిడెన్షియల్ సొసైటీలో ఐదు ఉన్నాయి. ఆరంభంలో 6, 7, 8 తరగతుల విద్యార్థుల్ని చేర్చుకున్నారు. గత విద్యా సంవత్సరంలో 9వ తరగతి, ఈ విద్యా సంవత్సరంలో 10వ తరగతిని అప్‌గ్రేడ్ చేస్తూ వచ్చారు. గరిష్టంగా ఒక్కో పాఠశాలకు 200 మందిని విద్యార్థుల్ని కేటాయించారు.
అయితే ఆ స్థాయిలో వసతుల్ని మాత్రం కల్పించలేదు. సబ్జెక్టుకు ఒకరు చొప్పున ఒక్కో కేజీబీవీకి ఏడుగురు ఉపాధ్యాయులుండాలి. పీఈటీ, అటెండర్, ఏఎన్‌ఎం, ఇద్దరు వంట మనుషులు, ఇద్దరు సహాయకులు, స్కావెంజర్, పగలు, రాత్రి కాపలా కాసేందుకు ఇద్దరు వాచ్‌మెన్లను నియమించాలి. చాలా చోట్ల ఈ పరిస్థితి కానరావట్లేదు. బోధనా సిబ్బంది, కంప్యూటర్ బోధకుల కొరత.
ఆర్‌వీఎం ఆనందపురం, చోడవరం, గొలుగొండ, నర్సీపట్నం, అచ్యుతాపురం మండలాల్లో భవన నిర్మాణాలు పూర్తి చేసింది. వాటిలోనే ప్రస్తుతం కేజీబీవీలు నడుస్తున్నాయి.
నాతవరం, కోటవురట్ల, ఎస్.రాయవ రం, కశింకోట, కొయ్యూరుల్లో భవనాలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి.
నక్కపల్లి, సబ్బవరం, మాకవరపాలెం, చీడికాడ, రాంబిల్లి, మునగపాక, వి.మాడుగుల మండలాల్లో టెండర్లు పిలిచారు. మార్చిలో పనులు ప్రారంభించే అవకాశాలున్నాయి.
భీమిలి మండలంలో నిర్మాణ స్థలంపై కోర్టు వివాదం నడుస్తోంది.
గతంలో ఇక్కడి బోధనా సిబ్బందిని ప్రభుత్వ టీచర్ల నుంచే డెప్యుటేషన్‌పై కొనసాగించారు. ఇప్పుడు డెప్యూటేషన్లను రద్దు చేసి, ప్రత్యేక పరీక్ష ద్వారా సిబ్బంది(సీఆర్‌టీ)ని నియమించారు.
డెప్యుటేషన్‌పై పనిచేస్తున్న రెగ్యులర్ టీచర్లు కోర్టుకెళ్లారు. ఈ విద్యాసంవత్సరం చివరి వరకు పాత స్థానాల్లోనే కొనసాగించాల్సిందిగా కోరుతున్నారు. ఈ వివాదం ఇంకా నడుస్తోంది.
చాలా సబ్జెక్టులకు ఉపాధ్యాయుల కొరత వేధిస్తోంది.
నర్సీపట్నం కేజీబీవీలో తెలుగు, హిందీ, ఇంగ్లీష్, బయాలజీ సబ్జెక్టులు అతిథి టీచర్లతోనే నడుస్తున్నాయి.
ఎస్.రాయవరం కేజీబీవీలో విద్యార్థినుల దుస్థితిపై గతంలో జిల్లా విద్యాశాఖాధికారి(డీఈవో) బి.లింగేశ్వరరెడ్డి తనిఖీలు నిర్వహించి వసతుల లేమిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలోని 34 కేజీబీవీల్లో ఇక్కడే విద్యార్థులు తక్కువగా ఉన్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.