acyutapuram
-
నిర్వాహకులకే ‘భోజనం’!
అచ్యుతాపురం హైస్కూల్లో అక్రమాలు 850 హాజరైతే 500 మందికే వంట బిందెలతో బియ్యం దారి మళ్లింపు అచ్యుతాపురం : ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడడంతో మధ్యాహ్న భోజనం నిర్వాహకులు భారీ అక్రమాలకు పాల్పడుతున్నారు. విద్యార్థులను అర్ధాకలితో మాడ్చి వేల రూపాయలు వెనకేసుకుంటున్నారు. అచ్యుతాపురం హైస్కూల్లో ఎంపీపీ చేకూరిశ్రీనివాసరావు, ఎంపీడీఓ ఎస్.మంజులవాణి, ఎంఈఓ సూర్యారావు, సీపీఎం నాయకులు కర్రి అప్పారావు, పాఠశాల అభివృద్ధి కమిటి మెంబర్ పుర్రె శ్రీనివాసరావులు ఈ వారంలో నిర్వహించిన ఆకస్మిక తనిఖీలతో అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. అచ్యుతాపురం హైస్కూల్లో 950 మంది చదువుతుండగా మొదటిసారి తనిఖీ జరిగిన మంగళవారం 850 మందే హాజరయ్యారు. 350 మంది బాక్స్‌లు తెచ్చుకున్నారు.120 కిలోల బియ్యం వండాల్సి ఉండగా నిర్వాహకులు 50 కిలోలే వండారు. మిగిలిన బియ్యాన్ని బిందెలతో నిర్వాహకులు ఇళ్లకు తరలించారు. కందిపప్పు 26 కిలోలకు బదులు 14 కిలోలు వేశారు. తీరా భోజనం వడ్డిస్తే 500 మందికి మాత్రమే సరిపోయింది. కూర 430 మందికి వచ్చింది. 70 మంది చారుతో అన్నం తిన్నారు. ఆకలివేసి రెండవ సారి అన్నం అడిగితే ప్రభుత్వం 150 గ్రాములు మాత్రమే మంజూరు చేస్తోంది. అంతకు మించి అన్నం వడ్డించలేమని నిర్వాహకురాలు చెప్పారు. రెండవ సారి బుధవారం జరిగిన తనిఖీలో 850 మంది హాజరు ఉన్నప్పటికీ బాక్స్‌లు తీసుకువచ్చిన విద్యార్థులను మినహాయించి 650 మందికి భోజనం తయారు చేశారు. 80 కిలోల బియ్యం వండిన ట్టు నిర్వాహకులు తెలిపారు. సభ్యుల పరిశీలనలో 55 కిలోలు మాత్రమే వండిన ట్టు రుజువయింది. ఎంత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినా నిర్వాహకులు బియ్యాన్ని దారి మళ్లించడం సభ్యులను ఆగ్రహానికి గురిచేసింది. నిర్వాహకులకు అండగా రాజకీయ పార్టీ నాయకులు ఉండడంతో ఏమీ చేయలేక వెనుదిరిగారు. నిర్వాహకులపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన దాఖలాలు లేవు. గడిచిన ఐదేళ్లలో 60 టన్నుల బియ్యం పక్కదారి పట్టినట్టు అంచనా. ఇదికాకుండా కందిపప్పును తగ్గించడం, గుడ్లు మిగల్చడం వల్ల ఐదేళ్లలో లక్షల రూపాయలను వెనకేసుకున్నట్టు అర్థమవుతోంది. ఒక్క స్కూల్ పరిస్థితి ఇలా ఉంటే మండలంలోని ఎనిమది హైస్కూళ్లు, 10 ప్రాథమికోన్నత పాఠశాలల పరిస్థితి ఎలా ఉందో? పిల్లల ఆకలిని చూడలేక ఉపాధ్యాయులు ప్రశ్నిస్తే వారిని బదిలీ చేయిస్తామని నిర్వాహకులు బెదిరించినట్టు తెలిసింది. కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం అచ్యుతాపురం పాఠశాలలో తనిఖీలు నిర్వహించినప్పడు లోపాలు బయటపడ్డాయి. 350 మంది విద్యార్ధులు పాఠశాలలో భోజనం చేయడంలేదు. హాజరు మాత్రం వేస్తున్నారు. ఈ విషయాలను కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం. - ఎస్.మంజులవాణి, ఎంపిడిఓ అచ్యుతాపురం సహించేది లేదు అన్ని పాఠశాలలకు తిరుగుతున్నాం. లోపాల్ని గుర్తించాం. సరిచేసుకోమని చెబుతున్నాం. మధ్యాహ్న భోజనం నిర్వాహకులు మొండిగా వ్యవహరిస్తే తొలగించాల్సి ఉంటుంది. పిల్లల నోటిదగ్గర కూటికి ఆశపడితే సహించేదిలేదు. - చేకూరిశ్రీనివాసరాజు, ఎంపీపీ, అచ్యుతాపురం -
కస్తూర్బాధలు...!
కేజీబీవీల్లో మెరుగుపడని వసతులు అరకొర సిబ్బందితో నెట్టుకొస్తున్న పాఠశాలలు సాంఘిక సంక్షేమం కంటే తక్కువ కేటాయింపులు బాలికా విద్యను ప్రోత్సహించేందుకు.. డ్రాపవుట్స్‌ను నిరోధానికి, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయా (కేజీబీవీ)లు ఆవిర్భవించాయి. ఇవి ఏర్పాటై మూడేళ్లవుతున్నా మౌలిక వసతుల కోసం యాతన తప్పని పరిస్థితి. జిల్లాలోని 34 కేజీ బీవీల్లో సుమారు 5 వేలమంది విద్యార్థినులున్నారు. చాలా కేజీబీవీలు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. వీటిలో విద్యార్థినులకు సరిపడా మరుగుదొడ్లు, స్నానపు గదులు లేక అవస్థపడుతున్నారు. జిల్లాలో 2011-12 విద్యా సంవత్సరం నుంచి కేజీబీవీలు నడుస్తున్నాయి. ఇందులో 18 కేజీబీవీలు రాజీవ్ విద్యామిషన్ (ఆర్వీఎం) ఆధ్వర్యంలోను, గిరిజన సంక్షేమ శాఖ ద్వారా 8, సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా 3, ఏపీ రెసిడెన్షియల్ సొసైటీలో ఐదు ఉన్నాయి. ఆరంభంలో 6, 7, 8 తరగతుల విద్యార్థుల్ని చేర్చుకున్నారు. గత విద్యా సంవత్సరంలో 9వ తరగతి, ఈ విద్యా సంవత్సరంలో 10వ తరగతిని అప్‌గ్రేడ్ చేస్తూ వచ్చారు. గరిష్టంగా ఒక్కో పాఠశాలకు 200 మందిని విద్యార్థుల్ని కేటాయించారు. అయితే ఆ స్థాయిలో వసతుల్ని మాత్రం కల్పించలేదు. సబ్జెక్టుకు ఒకరు చొప్పున ఒక్కో కేజీబీవీకి ఏడుగురు ఉపాధ్యాయులుండాలి. పీఈటీ, అటెండర్, ఏఎన్ఎం, ఇద్దరు వంట మనుషులు, ఇద్దరు సహాయకులు, స్కావెంజర్, పగలు, రాత్రి కాపలా కాసేందుకు ఇద్దరు వాచ్మెన్లను నియమించాలి. చాలా చోట్ల ఈ పరిస్థితి కానరావట్లేదు. బోధనా సిబ్బంది, కంప్యూటర్ బోధకుల కొరత. ఆర్వీఎం ఆనందపురం, చోడవరం, గొలుగొండ, నర్సీపట్నం, అచ్యుతాపురం మండలాల్లో భవన నిర్మాణాలు పూర్తి చేసింది. వాటిలోనే ప్రస్తుతం కేజీబీవీలు నడుస్తున్నాయి. నాతవరం, కోటవురట్ల, ఎస్.రాయవ రం, కశింకోట, కొయ్యూరుల్లో భవనాలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. నక్కపల్లి, సబ్బవరం, మాకవరపాలెం, చీడికాడ, రాంబిల్లి, మునగపాక, వి.మాడుగుల మండలాల్లో టెండర్లు పిలిచారు. మార్చిలో పనులు ప్రారంభించే అవకాశాలున్నాయి. భీమిలి మండలంలో నిర్మాణ స్థలంపై కోర్టు వివాదం నడుస్తోంది. గతంలో ఇక్కడి బోధనా సిబ్బందిని ప్రభుత్వ టీచర్ల నుంచే డెప్యుటేషన్‌పై కొనసాగించారు. ఇప్పుడు డెప్యూటేషన్లను రద్దు చేసి, ప్రత్యేక పరీక్ష ద్వారా సిబ్బంది(సీఆర్టీ)ని నియమించారు. డెప్యుటేషన్‌పై పనిచేస్తున్న రెగ్యులర్ టీచర్లు కోర్టుకెళ్లారు. ఈ విద్యాసంవత్సరం చివరి వరకు పాత స్థానాల్లోనే కొనసాగించాల్సిందిగా కోరుతున్నారు. ఈ వివాదం ఇంకా నడుస్తోంది. చాలా సబ్జెక్టులకు ఉపాధ్యాయుల కొరత వేధిస్తోంది. నర్సీపట్నం కేజీబీవీలో తెలుగు, హిందీ, ఇంగ్లీష్, బయాలజీ సబ్జెక్టులు అతిథి టీచర్లతోనే నడుస్తున్నాయి. ఎస్.రాయవరం కేజీబీవీలో విద్యార్థినుల దుస్థితిపై గతంలో జిల్లా విద్యాశాఖాధికారి(డీఈవో) బి.లింగేశ్వరరెడ్డి తనిఖీలు నిర్వహించి వసతుల లేమిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలోని 34 కేజీబీవీల్లో ఇక్కడే విద్యార్థులు తక్కువగా ఉన్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. -
తీరని దాహం
=మత్స్యకార గ్రామాల్లో నీటి ఎద్దడి =పైపులైన్ల లీకేజీలతో అవస్థలు =చెలమలు పూడుకుపోయి ఇబ్బందులు కళ్లు తెరిచిన నాటి నుంచి వారికి సాగరమే సర్వస్వం. నీటితోటిదే వారి లోకం. కానీ జలమే బతుకుకు ఆలంబన అయిన గంగపుత్రులకు గుక్కెడు నీరు దొరకడం మాత్రం గగనం. తీర ప్రాంతాల్లో నివసిస్తున్న మత్స్యకారుల కుటుంబాలకు దాహం తీరడం దుర్లభం. తాగునీటి కొరత తీరక వారు పడుతున్న కష్టాలు అనంతం. ఏళ్ల తరబడి సమస్యలు పరిష్కా రం కాకపోవడంతో వివిధ మండలాల్లోని తీర ప్రాంత వాసులు నానా అవస్థలు పడుతున్నారు. ఉప్పు నీటినో, కలుషిత జలాలనో తాగి కాలం గడుపుతున్నారు. రక్షిత మంచినీటి సరఫరా వ్యవస్థలు పనిచేయక ఇబ్బందు లు ఎదుర్కొంటున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా చాలా చోట్ల జనాభాలో జగం మంది మంచినీరు తాగే అదృష్టానికి నోచుకోకుండా కాలం గడుపుతున్నారు. యలమంచిలి/అచ్యుతాపురం, న్యూస్‌లైన్: వారు పేరుకే గంగపుత్రులు.. వాస్తవంలో గుక్కెడు తాగునీటికి కూడా నోచుకోని అభాగ్యులు. దాహంతో అలమటిస్తున్నా, అది తీరే దారి లేక విలవిలలాడుతున్న దీనులు. ఏళ్ల తరబడి తాగునీటి కోసం ఆరాటపడుతున్నా, అధికారుల నిర్లక్ష్యంతో ఎండమావుల వెంట పరుగులు తీస్తున్న అమాయకులు. బావులు, బోర్లలో లభించే ఏ నీరైనా మహాభాగ్యమనుకుంటూ బతుకీడ్చే సామాన్యులు. జిల్లాలో తీరప్రాంతంలో పరవాడ, అచ్యుతాపురం, రాంబిల్లి, ఎస్.రాయవరం, నక్కపల్లి, పాయకరావుపేట మండలాల్లో మత్స్యకారుల తాగునీటి తిప్పలు అన్నీ ఇన్నీ కావు. నిన్నమొన్నటి వరకు చెలమలనీటి తో గొంతు తడుపుకుంటున్న మత్స్యకారులకు ఇటీవల వరదలు, తుఫాన్లు శాపంగా పరిణమించాయి. నీటి వనరులు పూడుకుపోయాయి. అందుబాటులో ఉన్న రక్షిత మంచినీటి సరఫరా వ్యవస్థలు అధికారుల పర్యవేక్షణ లోపంతో మొరాయిస్తున్నాయి. తీరప్రాంతంలో అచ్యుతాపురం, రాంబిల్లి, నక్కపల్లి, పాయకరావుపేట మండలాల్లో తీవ్ర మంచినీటి ఎద్దడి నెలకొంది. రక్షిత మంచినీటి వ్యవస్థల ద్వారా అరకొరగా సరఫరా చేస్తున్న తాగునీరు గ్రామాల్లో 20 శాతం కుటుంబాలకు కూడా చాలడంలేదు. అచ్యుతాపురం మండలం పూడిమడకలో 12వేలమంది జనాభా ఉండగా ఇక్కడ ఏర్పాటుచేసిన లక్ష లీటర్ల ట్యాంకు ద్వారా సగం మందికే తాగునీరు అందుతోంది. పైపులైన్ పాడైపోవడంతో రెండేళ్లుగా కడపాలెంలో పదో వార్డుకు చుక్కనీరందలేదు. వీరంతా చెలమల నీటిని వినియోగిస్తున్నారు. పైపులైన్ల లీకేజీల కారణంగా గ్రామంలో పూర్తి స్థాయిలో నీటిసరఫరా జరగడం లేదు. బ్రాం డెక్స్ పరిశ్రమ నీటిశుద్ధి ప్లాంట్‌ను ఏర్పాటుచేసి శుభ్రమైన నీటిని సరఫరా చేస్తున్నా రూ. 250 డిపాజిట్, నెలకి రూ. 30 చెల్లించేవారికి మాత్రమే నీరందుతోంది. ఏలేరు కాలువనుంచి ఎస్ఈజెడ్కు సరఫరా అవుతున్న నీటిని పూడిమడకకు పైపులైన్‌ద్వారా సరఫరా చేయాలని రూ. 1.2 కోట్లతో అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. అవి కార్యరూపం దాల్చలేదు. రాంబిల్లి మండలం లోవపాలెం, వెంకయ్యపాలెం, వాడపాలెం గ్రామాల్లో తీవ్ర తా గునీటి ఎద్దడి నెలకొంది. లోవపాలెం, వాడపాలెంలలో రక్షిత నీటి సరఫరా వ్యవస్థ ద్వారా ఉప్పునీరు వస్తుండడంతో బావులను ఆశ్రయిస్తున్నారు. ఉత్తుత్తి పథకాలు పాయకరావుపేట మండలం వెంకటనగరం, పాల్మన్‌పేట, పెంటకోట, గజపతినగరం గ్రామాల్లో రక్షిత మం చినీటి పథకాలు సక్రమంగా పనిచేయడంలేదు. విద్యుత్ కోత, పైపుల లీకేజీలతో సక్రమంగా తాగునీరు అందడంలేదు. నక్కపల్లి మండలంలో చినతీనర్ల, పెదతీనర్ల, రాజయ్యపేట మత్స్యకార గ్రామాలతోపాటు అమలాపురం గ్రామంలో తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొంది. ఎస్.రాయవరం మండలం బంగారమ్మపాలెం చేరువలోని కాపులవాతాడలో తాగునీటి సరఫరా వ్యవస్థ ద్వారా రెండ్రోజులకు ఓసారి మాత్రమే తాగునీటి సరఫరా జరుగుతోంది. అన్నీ కట్టాలే.. కడపాలెం పదోవార్డుకి సేనాకాలం బట్టి నీల్లేవు. అప్పడెప్పడో గొట్టాలేసారు. చుక్కాచుక్కా నీరొచ్చేది. ఆ తరవాత పూర్తిగా రానేదు. చెలమల నీరు తెద్దామంటే తుపానుకి మూసుకుపోనాయి. కొలాయిల దగ్గిరకెళ్లి బతిమాలుకుంటున్నాం. ఇవ్వకపోతే నుయ్యిలకెళ్లడమే. - కొవిరి దేవుడమ్మ, కడపాలెం నీల్లు సాలడం నేదు మంచినీలు సాలడంనేదు. బాండెక్సోలు కొండపాలెంలో మంచినీరు ప్లాంటుపెట్టారు. అక్కడికెళ్లి తెచ్చుకోవాలంటే సేనా కష్టం. కడపాలెంలోకూడా ఇంకోప్లాంటు పెడతామన్నారు. నుయ్యిలు ఎండిపోతే నీళ్లుకి సేనా ఇబ్బందిపడిపోతాం. - ఎరిపల్లి మసేను, పూడిమడక