
తీరని దాహం
=మత్స్యకార గ్రామాల్లో నీటి ఎద్దడి
=పైపులైన్ల లీకేజీలతో అవస్థలు
=చెలమలు పూడుకుపోయి ఇబ్బందులు
కళ్లు తెరిచిన నాటి నుంచి వారికి సాగరమే సర్వస్వం. నీటితోటిదే వారి లోకం. కానీ జలమే బతుకుకు ఆలంబన అయిన గంగపుత్రులకు గుక్కెడు నీరు దొరకడం మాత్రం గగనం. తీర ప్రాంతాల్లో నివసిస్తున్న మత్స్యకారుల కుటుంబాలకు దాహం తీరడం దుర్లభం. తాగునీటి కొరత తీరక వారు పడుతున్న కష్టాలు అనంతం. ఏళ్ల తరబడి సమస్యలు పరిష్కా రం కాకపోవడంతో వివిధ మండలాల్లోని తీర ప్రాంత వాసులు నానా అవస్థలు పడుతున్నారు. ఉప్పు నీటినో, కలుషిత జలాలనో తాగి కాలం గడుపుతున్నారు. రక్షిత మంచినీటి సరఫరా వ్యవస్థలు పనిచేయక ఇబ్బందు లు ఎదుర్కొంటున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా చాలా చోట్ల జనాభాలో జగం మంది మంచినీరు తాగే అదృష్టానికి నోచుకోకుండా కాలం గడుపుతున్నారు.
యలమంచిలి/అచ్యుతాపురం, న్యూస్‌లైన్: వారు పేరుకే గంగపుత్రులు.. వాస్తవంలో గుక్కెడు తాగునీటికి కూడా నోచుకోని అభాగ్యులు. దాహంతో అలమటిస్తున్నా, అది తీరే దారి లేక విలవిలలాడుతున్న దీనులు. ఏళ్ల తరబడి తాగునీటి కోసం ఆరాటపడుతున్నా, అధికారుల నిర్లక్ష్యంతో ఎండమావుల వెంట పరుగులు తీస్తున్న అమాయకులు. బావులు, బోర్లలో లభించే ఏ నీరైనా మహాభాగ్యమనుకుంటూ బతుకీడ్చే సామాన్యులు. జిల్లాలో తీరప్రాంతంలో పరవాడ, అచ్యుతాపురం, రాంబిల్లి, ఎస్.రాయవరం, నక్కపల్లి, పాయకరావుపేట మండలాల్లో మత్స్యకారుల తాగునీటి తిప్పలు అన్నీ ఇన్నీ కావు. నిన్నమొన్నటి వరకు చెలమలనీటి తో గొంతు తడుపుకుంటున్న మత్స్యకారులకు ఇటీవల వరదలు, తుఫాన్లు శాపంగా పరిణమించాయి.
నీటి వనరులు పూడుకుపోయాయి. అందుబాటులో ఉన్న రక్షిత మంచినీటి సరఫరా వ్యవస్థలు అధికారుల పర్యవేక్షణ లోపంతో మొరాయిస్తున్నాయి. తీరప్రాంతంలో అచ్యుతాపురం, రాంబిల్లి, నక్కపల్లి, పాయకరావుపేట మండలాల్లో తీవ్ర మంచినీటి ఎద్దడి నెలకొంది. రక్షిత మంచినీటి వ్యవస్థల ద్వారా అరకొరగా సరఫరా చేస్తున్న తాగునీరు గ్రామాల్లో 20 శాతం కుటుంబాలకు కూడా చాలడంలేదు. అచ్యుతాపురం మండలం పూడిమడకలో 12వేలమంది జనాభా ఉండగా ఇక్కడ ఏర్పాటుచేసిన లక్ష లీటర్ల ట్యాంకు ద్వారా సగం మందికే తాగునీరు అందుతోంది.
పైపులైన్ పాడైపోవడంతో రెండేళ్లుగా కడపాలెంలో పదో వార్డుకు చుక్కనీరందలేదు. వీరంతా చెలమల నీటిని వినియోగిస్తున్నారు. పైపులైన్ల లీకేజీల కారణంగా గ్రామంలో పూర్తి స్థాయిలో నీటిసరఫరా జరగడం లేదు. బ్రాం డెక్స్ పరిశ్రమ నీటిశుద్ధి ప్లాంట్‌ను ఏర్పాటుచేసి శుభ్రమైన నీటిని సరఫరా చేస్తున్నా రూ. 250 డిపాజిట్, నెలకి రూ. 30 చెల్లించేవారికి మాత్రమే నీరందుతోంది. ఏలేరు కాలువనుంచి ఎస్‌ఈజెడ్‌కు సరఫరా అవుతున్న నీటిని పూడిమడకకు పైపులైన్‌ద్వారా సరఫరా చేయాలని రూ. 1.2 కోట్లతో అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. అవి కార్యరూపం దాల్చలేదు. రాంబిల్లి మండలం లోవపాలెం, వెంకయ్యపాలెం, వాడపాలెం గ్రామాల్లో తీవ్ర తా గునీటి ఎద్దడి నెలకొంది. లోవపాలెం, వాడపాలెంలలో రక్షిత నీటి సరఫరా వ్యవస్థ ద్వారా ఉప్పునీరు వస్తుండడంతో బావులను ఆశ్రయిస్తున్నారు.
ఉత్తుత్తి పథకాలు
పాయకరావుపేట మండలం వెంకటనగరం, పాల్మన్‌పేట, పెంటకోట, గజపతినగరం గ్రామాల్లో రక్షిత మం చినీటి పథకాలు సక్రమంగా పనిచేయడంలేదు. విద్యుత్ కోత, పైపుల లీకేజీలతో సక్రమంగా తాగునీరు అందడంలేదు. నక్కపల్లి మండలంలో చినతీనర్ల, పెదతీనర్ల, రాజయ్యపేట మత్స్యకార గ్రామాలతోపాటు అమలాపురం గ్రామంలో తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొంది. ఎస్.రాయవరం మండలం బంగారమ్మపాలెం చేరువలోని కాపులవాతాడలో తాగునీటి సరఫరా వ్యవస్థ ద్వారా రెండ్రోజులకు ఓసారి మాత్రమే తాగునీటి సరఫరా జరుగుతోంది.
అన్నీ కట్టాలే..
కడపాలెం పదోవార్డుకి సేనాకాలం బట్టి నీల్లేవు. అప్పడెప్పడో గొట్టాలేసారు. చుక్కాచుక్కా నీరొచ్చేది. ఆ తరవాత పూర్తిగా రానేదు. చెలమల నీరు తెద్దామంటే తుపానుకి మూసుకుపోనాయి. కొలాయిల దగ్గిరకెళ్లి బతిమాలుకుంటున్నాం. ఇవ్వకపోతే నుయ్యిలకెళ్లడమే. - కొవిరి దేవుడమ్మ, కడపాలెం
నీల్లు సాలడం నేదు
మంచినీలు సాలడంనేదు. బాండెక్సోలు కొండపాలెంలో మంచినీరు ప్లాంటుపెట్టారు. అక్కడికెళ్లి తెచ్చుకోవాలంటే సేనా కష్టం. కడపాలెంలోకూడా ఇంకోప్లాంటు పెడతామన్నారు. నుయ్యిలు ఎండిపోతే నీళ్లుకి సేనా ఇబ్బందిపడిపోతాం.
- ఎరిపల్లి మసేను, పూడిమడక