- అచ్యుతాపురం హైస్కూల్‌లో అక్రమాలు
- 850 హాజరైతే 500 మందికే వంట
- బిందెలతో బియ్యం దారి మళ్లింపు
అచ్యుతాపురం : ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడడంతో మధ్యాహ్న భోజనం నిర్వాహకులు భారీ అక్రమాలకు పాల్పడుతున్నారు. విద్యార్థులను అర్ధాకలితో మాడ్చి వేల రూపాయలు వెనకేసుకుంటున్నారు. అచ్యుతాపురం హైస్కూల్‌లో ఎంపీపీ చేకూరిశ్రీనివాసరావు, ఎంపీడీఓ ఎస్.మంజులవాణి, ఎంఈఓ సూర్యారావు, సీపీఎం నాయకులు కర్రి అప్పారావు, పాఠశాల అభివృద్ధి కమిటి మెంబర్ పుర్రె శ్రీనివాసరావులు ఈ వారంలో నిర్వహించిన ఆకస్మిక తనిఖీలతో అక్రమాలు వెలుగులోకి వచ్చాయి.
అచ్యుతాపురం హైస్కూల్‌లో 950 మంది చదువుతుండగా మొదటిసారి తనిఖీ జరిగిన మంగళవారం 850 మందే హాజరయ్యారు. 350 మంది బాక్స్‌లు తెచ్చుకున్నారు.120 కిలోల బియ్యం వండాల్సి ఉండగా నిర్వాహకులు 50 కిలోలే వండారు. మిగిలిన బియ్యాన్ని బిందెలతో నిర్వాహకులు ఇళ్లకు తరలించారు. కందిపప్పు 26 కిలోలకు బదులు 14 కిలోలు వేశారు. తీరా భోజనం వడ్డిస్తే 500 మందికి మాత్రమే సరిపోయింది. కూర 430 మందికి వచ్చింది. 70 మంది చారుతో అన్నం తిన్నారు. ఆకలివేసి రెండవ సారి అన్నం అడిగితే ప్రభుత్వం 150 గ్రాములు మాత్రమే మంజూరు చేస్తోంది. అంతకు మించి అన్నం వడ్డించలేమని నిర్వాహకురాలు చెప్పారు.
రెండవ సారి బుధవారం జరిగిన తనిఖీలో 850 మంది హాజరు ఉన్నప్పటికీ బాక్స్‌లు తీసుకువచ్చిన విద్యార్థులను మినహాయించి 650 మందికి భోజనం తయారు చేశారు. 80 కిలోల బియ్యం వండిన ట్టు నిర్వాహకులు తెలిపారు. సభ్యుల పరిశీలనలో 55 కిలోలు మాత్రమే వండిన ట్టు రుజువయింది. ఎంత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినా నిర్వాహకులు బియ్యాన్ని దారి మళ్లించడం సభ్యులను ఆగ్రహానికి గురిచేసింది. నిర్వాహకులకు అండగా రాజకీయ పార్టీ నాయకులు ఉండడంతో ఏమీ చేయలేక వెనుదిరిగారు.
నిర్వాహకులపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన దాఖలాలు లేవు. గడిచిన ఐదేళ్లలో 60 టన్నుల బియ్యం పక్కదారి పట్టినట్టు అంచనా. ఇదికాకుండా కందిపప్పును తగ్గించడం, గుడ్లు మిగల్చడం వల్ల ఐదేళ్లలో లక్షల రూపాయలను వెనకేసుకున్నట్టు అర్థమవుతోంది. ఒక్క స్కూల్ పరిస్థితి ఇలా ఉంటే మండలంలోని ఎనిమది హైస్కూళ్లు, 10 ప్రాథమికోన్నత పాఠశాలల పరిస్థితి ఎలా ఉందో? పిల్లల ఆకలిని చూడలేక ఉపాధ్యాయులు ప్రశ్నిస్తే వారిని బదిలీ చేయిస్తామని నిర్వాహకులు బెదిరించినట్టు తెలిసింది.
కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం
అచ్యుతాపురం పాఠశాలలో తనిఖీలు నిర్వహించినప్పడు లోపాలు బయటపడ్డాయి. 350 మంది విద్యార్ధులు పాఠశాలలో భోజనం చేయడంలేదు. హాజరు మాత్రం వేస్తున్నారు. ఈ విషయాలను కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం.
- ఎస్.మంజులవాణి, ఎంపిడిఓ అచ్యుతాపురం
సహించేది లేదు
అన్ని పాఠశాలలకు తిరుగుతున్నాం. లోపాల్ని గుర్తించాం. సరిచేసుకోమని చెబుతున్నాం. మధ్యాహ్న భోజనం నిర్వాహకులు మొండిగా వ్యవహరిస్తే తొలగించాల్సి ఉంటుంది. పిల్లల నోటిదగ్గర కూటికి ఆశపడితే సహించేదిలేదు.
- చేకూరిశ్రీనివాసరాజు, ఎంపీపీ, అచ్యుతాపురం