సాక్షి, హైదరాబాద్: గిరిజనుల సాగుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించాలని తెలంగాణ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ (ట్రైకార్) నిర్ణయించింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, సాగు పద్ధతుల్లో మెళకువలను రైతులకు వివరించేందుకు గిరిజన సంక్షేమ శాఖ కార్యాచరణ సిద్ధం చేసింది. ఈమేరకు శుక్రవారం డీఎస్‌ఎస్ భవన్‌లోని ట్రైకార్ కార్యాలయంలో ఇక్రిశాట్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. 2017–18లో ఎంపిక చేసిన 500 మంది రైతులకు శిక్షణలు ఇవ్వడం, కొత్త పద్ధతులపై అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలు చేపట్టనుంది. దీనికి గిరిజన సంక్షేమ శాఖ బడ్జెట్‌లో రూ.10 కోట్లు కేటాయించింది.
మహిళా రైతులకూ ప్రాధాన్యత..
సాగు పద్ధతుల్లో సాంకేతికత వినియోగంపై అవగాహన కల్పించేందుకు జిల్లాల వారీగా అర్హులైన రైతులను ఎంపిక చేయాల్సిందిగా గిరిజన సంక్షేమ శాఖ కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఇతర రాష్ట్రాల్లో క్షేత్రస్థాయి పరిశీలనకు ఏర్పాటు చేస్తారు. వ్యవసాయ పంటల సాగుకు ఇక్రిశాట్, అగ్రికల్చర్ వర్సిటీలలో అవగాహన కల్పించనున్నారు. ఉద్యా న పంటల సాగుపై బెంగళూరులోని జాతీ య ఉద్యాన పరిశోధన సంస్థ, తమిళనాడు లోని నీలగిరి ఉద్యాన అభివృద్ధి శాఖ, కూర గాయల పంటలు, మార్కెటింగ్‌పై పుణే లోని శనిసింగాపూర్ కూరగాయల మార్కెటింగ్ సొసైటీ, మత్స్యసాగుపై కేరళలోని కొచ్చి, ఏపీలోని కాకినాడ, డెయిరీ పరిశ్రమలపై గుజరాత్ డెయిరీ పరిశోధన సంస్థ, హరియా ణాలోని ప్రైవేటు డెయిరీ ఫోరమ్స్‌లో సదస్సులు నిర్వహించి శిక్షణ ఇస్తారు.
గిరిజనుల ఆర్థిక ఎదుగుదల కోసమే..
గిరిజనులు ఆర్థికంగా ఎదగాలనే లక్ష్యంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. ఈ ఏడాది 500 మందికి అవకాశం కల్పిస్తున్నాం. సాగులో మెళకువలు నేర్పడంతో పాటు ఆధునిక పద్ధతులపై అవగాహన కల్పిస్తాం. జిల్లాల వారీగా అర్హులైన రైతులను ఎంపిక చేసిన వెంటనే ఈ కార్యక్రమాన్ని చేపడతాం.
– తాటి వెంకటేశ్వర్లు, చైర్మన్, ట్రైకార్
Comments
Please login to add a commentAdd a comment