
సాక్షి, హైదరాబాద్: గిరిజన విద్యార్థినీ, విద్యార్థుల సంపూర్ణ ఆరోగ్య పరిరక్షణకై ఉద్దేశించిన ‘గిరిబాల వికాస్’ పథకాన్ని గిరిజన సంక్షేమశాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ ఏటూరు నాగారం పరిధిలోని గిరిజన పాఠశాలల్లో శుక్రవారం ప్రారంభించారు. ఈ పథకం ద్వారా విద్యార్థుల సమస్యల్ని తొలిదశలోనే గుర్తించి నివారించవచ్చన్నారు. పీరియాడికల్ చెకింగ్‌తో అనారోగ్య సమస్యల్ని వెంటనే పరిష్కరించవచ్చని చెప్పారు.
ఇదే పథకాన్ని గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి మహేశ్‌దత్ ఎక్కా నాగర్‌కర్నూల్ జిల్లా మన్ననూరులోని గిరిజన బాలికల పాఠశాలలో ప్రారంభించారు. గిరిజన శాఖ కమిషనర్ క్రిస్టినాజెడ్ చొంగ్తూ ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులోని గిరిజన బాలికల ఉన్నత ఆశ్రమ పాఠశాలలో ఈ పథకాన్ని ప్రారంభించి, ప్రయోజనాలను వివరించారు.