
సాక్షి, హైదరాబాద్: జీసీసీ (గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్) ఉత్పత్తులన్నీ వినియోగదారుల ముంగిట్లోకి తెచ్చేందుకు గిరిజన సంక్షేమ శాఖ చర్యలు చేపట్టింది. ఇప్పటివరకు ప్రభుత్వ కార్యాలయాల వరకే పరిమితమైన అమ్మకాలను, తాజాగా ఆన్‌లైన్‌కు విస్తరించేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. ఈ మేరకు ఈ–కామర్స్‌తో గిరిజన సంక్షేమ శాఖ ఒప్పందం కుదుర్చుకోనుంది. దీనికోసం గత కొంతకాలంగా చర్చలు జరిపిన అధికారులు అవగాహన కుదుర్చుకోనున్నారు.
సంప్రదాయ ఉత్పత్తుల పేరుతో..
జీసీసీ ద్వారా తేనె, సబ్బులు, షాంపూలు, కారం, పసుపు, మసాలా పొడులు విక్రయిస్తున్నారు. వీటికి సంబంధించి ఐటీడీఏ పరిధిలో పలుచోట్ల ప్రాసెసింగ్ కేంద్రాలు సైతం ఏర్పాటు చేయడంతో ఉత్పత్తుల సంఖ్య కూడా పెరుగుతోంది. మరోవైపు గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని టీఆర్‌ఐ (ట్రైబల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్) ద్వారా గిరిజనుల సంస్కృతులకు సంబంధించి చిత్రకళను సైతం అభివృద్ధి చేస్తున్నారు. ఇందులో భాగంగా ఔత్సాహిక కళాకారులను గుర్తించి వారితో పెయింటింగ్స్ వేయించి విక్రయించే వెసులుబాటు కల్పించారు. తాజాగా జీసీసీ ఉత్పత్తులతోపాటు గిరిజన సాంస్కృతిక చిత్రాలను కూడా అమెజాన్ వెబ్‌సైట్ ద్వారా విక్రయించనున్నారు. వీటిని ట్రైబల్ ట్రెడిషన్ ప్రొడక్ట్స్ పేరిట ప్రత్యేకంగా వెబ్‌సైట్‌లో పొందుపర్చనున్నారు.
అమెజాన్‌తో అవగాహన నేపథ్యంలో కంపెనీ అధికారులు పలుమార్లు జీసీసీని సందర్శించారు. అదేవిధంగా పెయింటింగ్స్‌ను సైతం పరిశీలించారు. అవగాహన కుదిరితే ఉత్పత్తుల్లో శాంపిల్‌ను గోడౌన్‌లో అందుబాటులో పెట్టాల్సి ఉంటుంది. మిగతా వాటిని డిమాండ్‌కు తగినట్లు సరఫరా చేయాలి. అమెజాన్ వెబ్‌సైట్‌లో గిరిజన సంక్షేమ శాఖ సెల్లర్ కేటగిరీలో కనిపిస్తుంది. ప్రస్తుతం జీసీసీ నుంచి వచ్చే తేనెకు విపరీతమైన డిమాండ్ ఉంది. అదేవిధంగా కారం, పసుపు, సహజసిద్ధమైన సబ్బులకు సైతం డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో వార్షిక టర్నోవర్ రూ.200 కోట్లకు చేరింది. ఆన్‌లైన్ విక్రయాలు మొదలుపెడితే టర్నోవర్ రెట్టింపు అయ్యే అవకాశాలున్నట్లు గిరిజన సంక్షేమ శాఖ అంచనా వేస్తోంది. అవగాహన ప్రక్రియ పూర్తయితే వచ్చేనెల మొ దటివారం నుంచి గిరిజన ఉత్పత్తులు ఆన్‌లైన్ ద్వారా అందుబాటులోకి రానున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment