Excursions
-
గిరిజనుల జీవనశైలిని చూసొద్దాం రండి..
పెద్దదోర్నాల: విద్యార్థులు వేసవి సెలవులను ఎంజాయ్ చేస్తున్నారు. నిత్యం పాఠ్య పుస్తకాలతో కుస్తీ పట్టే పిల్లలు సెలవుల్లో విజ్ఞానం పెంచుకోవడానికి విహారయాత్రలు చేసేందుకు ఇష్టపడతారు. అలాగే ఉద్యోగులు, వివిధ వృత్తులలో ఉన్నవారు సైతం వేసవికాలంలో కాస్తంత విశ్రాంతి, మానసికానందం కోసం పర్యాటక ప్రదేశాలు చూసేందుకు వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లాకు సరిహద్దులో ఉన్న ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలోని చెంచులక్ష్మి ట్రెబల్ మ్యూజియంలో చెంచుల జీవిత విశేషాలను తెలుసుకునేందుకు ఎక్కువమంది ఆసక్తి చూపిస్తున్నారు. ఐటీడీఏ ఏర్పాటుచేసిన ఈ ట్రైబల్ మ్యూజియంలో చెంచులతోపాటు అడవి బిడ్డలైన శోలాములు, కోంధులు, గోండులు, నాయకపోడులు, యానాదులు మొదలైన వారందరి చరిత్ర, సంస్కృతిని తెలియజేసేలా ప్రతిమలు ఉన్నాయి. ట్రైబల్ మ్యూజియంలో ఇవీ ప్రత్యేకతలు... » ప్రధాన ద్వారం నుంచి లోపలికి అడుగుపెట్టగానే ఎదురుగా ఒక పుట్ట, దానిముందు పామును ఆడిస్తున్నట్టుగా ఒక చెంచు గిరిజనుడి ప్రతిమ కనిపిస్తాయి. నాదస్వరంతో సర్పాన్ని ఆడిస్తున్న తీరు చెంచులకు వాటితో గల అనుబంధం, భక్తి, విశ్వాసాలను తెలియజేస్తుంది. » రెండో గదిలో ఢంకా బజాయిస్తున్న చెంచు, ఆ చుట్టూ గోడలకు అవజాల, మద్దెల, మృదంగం, తుడుము, విడక, తప్పెట, డోలు, డోల్కాడ్, మువ్వలదండు, పిల్లనగ్రోవి, కికిరి, పికిరి, డిర్జింగోవరాయ్, గుమ్మలం, పర్ర మొదలైన గిరిజన తెగల వారి సంగీత వాయిద్యాలు ఉన్నాయి. మల్లికార్జున స్వామికి ఇష్టమైన వీటిని మహాశివరాత్రి ఉత్సవాల్లో వివిధ తెగలకు చెందిన గిరిజనులు వాయిస్తుంటారు. » మూడో గదిలో చెంచుగుచ్చ ఏర్పాటుచేశారు. చెంచుల ఆభరణాలు, ఆయుధాలు, ఇతర వస్తు సామగ్రి ఇందులో చూడవచ్చు. » ఐదో గదిలో రవితార, చిడతలు పట్టి శివకథలను చెబుతున్న దేవచెంచుల బొమ్మ ఉంది. శివపూజ చేసే దేవ చెంచులే కష్టాలకోర్చి శ్రీశైలాన్ని రక్షించినట్లు తెలుస్తోంది. శ్రీశైలంలో ఉన్న చెంచులంతా ఈ దేవ చెంచుల జాతికి చెందినవారే. వీరు వాడే పెరుబాకు, కొడవలి, గొరక, వంకటి తెడ్డు, రోకలి, తేనెబుట్ట, గుండురాయి ఈ గదిలో ఉన్నాయి. »తొమ్మిదో గదిలో సోది చెప్పే ఎరుకలసాని కొరవంజి కనపడుతుంది. ఈమె భ్రమరాంబ మల్లికార్జునుల పెళ్లి సంగతి, శ్రీశెలం పెద్ద పట్టణంగా విస్తరించి 12 ఆమడల పట్టణం అవుతుందని సోది చెప్పినట్టు పెద్దలు చెబుతారు. ఈ గదిలో ఎరుకల, యానాదులు ఉపయోగించే వివిధ రకాల వాయిద్య పరికరాలు కూడా ఉన్నాయి. వీటితోపాటు ఎన్నో విశేషాలతో కూడిన ప్రతిమలు సందర్శకులను ఆకట్టుకుంటాయి. -
‘నదుల్లో విహార యాత్రలు వాయిదా వేసుకోండి’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో, ఎగువ రాష్ట్రాల్లో విస్తారంగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల కృష్ణా, గోదావరి, వంశధార నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయని, ఇలాంటి సమయంలో నదుల్లో విహారయాత్రలకు వెళ్లడం ఏ మాత్రం క్షేమకరం కాదని జల వనరుల శాఖ మంత్రి డాక్టర్ అనిల్‌కుమార్ యాదవ్ చెప్పారు. కొంత కాలం నదుల్లో విహార యాత్రలను వాయిదా వేసుకోవాలని ప్రజలకు సూచించారు. శుక్రవారం విజయవాడలో నీటి పారుదల శాఖ కార్యాలయంలో ఈఎన్సీ ఎం.వెంకటేశ్వరరావు, 13 జిల్లాల చీఫ్ ఇంజినీర్లతో వరద ఉధృతి, జలాశయాల్లో నీటి నిల్వలు, సాగునీటి ప్రాజెక్టుల పనులపై సమీక్ష నిర్వహించారు. దసరా పండుగ నేపథ్యంలో ప్రజలు పుణ్యస్నానాల కోసం గోదావరి, కృష్ణా నదుల్లోకి వెళ్తారని.. ఇలాంటి సమయంలో ప్రమాదం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఈలకు సూచించారు. అంతకుముందు చిత్తూరు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల ప్రగతిపై డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, తెలుగు గంగ, గాలేరు– నగరి, చిన్న నీటిపారుదల శాఖ ఇంజినీర్లుతో సమీక్షించారు. -
‘తను..మనసు మాట వింటే బాగుండేది’
వెనిజులా టూరిస్ట్ కార్లా స్టెఫానిక్ హత్యోదంతంతో.. ఒంటరిగా విహార యాత్రలకు వెళ్లే మహిళలు స్వేచ్ఛగా, సంతోషంగా పర్యటించి వచ్చే పరిస్థితులు నెలకొనేవరకు ‘సోలో ట్రిప్’ను వాయిదా వేసుకోవలసిందేనా అనే చర్చ మొదలైంది. విహారయాత్రలు చేయడం.. అది కూడా ఒంటరిగా.. చాలా ఎగ్జయిటింగ్‌గా ఉంటుంది. అటువంటి సాహస యాత్రకు సంబంధించిన పదిలమైన ఙ్ఞాపకాలు స్నేహితులతో పంచుకుంటూ.. వీడియోల్లో బంధించడం మరొక సరదా. అయితే ఒక్కోసారి ఒంటరి ప్రయాణాలు జీవిత కాలపు విషాదాల్ని మిగులుస్తాయి. ఆప్తులను మనకు శాశ్వతంగా దూరంగా చేస్తాయి. ముఖ్యంగా మహిళలకు ఈ ఒంటరి ప్రయాణాలు ప్రాణాంతకంగా మారుతున్నాయని.. కార్లా స్టెఫానిక్ అనే మహిళ ఉదంతం హెచ్చరించింది. మహిళా ట్రావెలర్స్‌కు ఈ ప్రయాణాలు ఎంతవరకు క్షేమం అనే విషయం గురించి అంతర్జాతీయంగా చర్చను లేవనెత్తింది. అమెరికా– వెనిజులా ద్వంద్వ పౌరసత్వం కలిగి ఉన్న కార్లా.. తన ముఫ్పై ఆరవ పుట్టిన రోజును కాస్త భిన్నంగా జరుపుకోవాలని భావించారు. అందుకు వేదికగా మధ్య అమెరికా దేశమైన కోస్టారికాను ఎంచుకున్న ఆమె.. ఐదు రోజుల పాటు తన ట్రిప్ సాఫీగా సాగేందుకు గేటెడ్ ఎయిర్‌బీఎన్‌బీ విల్లాలో బస చేయాలనుకున్నారు. ఎయిర్‌పోర్టుకు అత్యంత సమీపంలో ఉండటం, పరిశుభ్రమైన పరిసరాలు ఆకర్షించడంతో అక్కడే బస చేయాలని నిశ్చయించుకున్నారు. సంతోషంగా, సాఫీగా ట్రిప్ ముగించుకుని ఫ్లోరిడాకు తిరిగి వెళ్లాలని భావించారే గానీ.. అదే తనకు ఆఖరి రోజు అవుతుందని ఆమె ఏమాత్రం ఊహించలేకపోయారు. ఆరోజు ఏం జరిగింది..? సోలో ట్రావెలర్‌గా ప్రయాణం మొదలెట్టిన కార్లా.. తన అడ్వెంచర్ ట్రిప్ తాలూకు అనుభవాలను పంచుకునేందుకు స్నేహితురాలు లారా జైమ్కు ఫోన్ చేశారు. స్థానిక మార్కెట్లో ముచ్చటపడి కొనుక్కున్న ప్రత్యేకమైన చెవి దుద్దులను వీడియో కాల్లో.. ఆమెకు చూపించారు. రేపు ఉదయమే ఆమెను కలుస్తానని చెప్పి.. ఫోర్ట్ లారెడ్డేల్–హాలీవుడ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు వచ్చి తనని పికప్ చేసుకోకపోతే బాగోదు అంటూ స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చారు. అయితే ఆ సమయంలో విల్లాను కూడా చూపిస్తూ తన మనసేదో కీడు శంకిస్తోందని.. అయినా తాను ధైర్యంగా ఉన్నానని చెప్పి ఫోన్ కట్ చేశారు. కానీ ముందుగా అనుకున్నట్లుగా కార్లా నవంబర్ 28న జైమ్‌ను కలవలేకపోయారు.స్నేహితురాలితో మాట్లా డిన రాత్రే ఆమె దారుణ హత్యకు గురయ్యారు. మనసు మాట వింటే బాగుండేది! కార్లా బస చేసిన ఎయిర్‌బీఎన్‌బీ విల్లాకు సమీపంలోని అడవిలో.. సగం కాలిపోయి ప్లాస్టిక్ కవర్లలో చుట్టి ఉన్న కార్లా మృత దేహాన్ని కోస్టారికాన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హంతకుడిగా భావిస్తున్న విల్లా సెక్యూరిటీ గార్డును అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. ఈ ఘటన గురించి కార్ల ఫ్రెండ్ జైమ్ మాట్లాడుతూ.. ‘ ఆరోజు రాత్రి 8.20 నిమిషాలకు నాతో మాట్లాడుతున్న సమయంలో ఏదో అపాయం పొంచి ఉందని కార్లా ముందే ఊహించింది. కొన్నిసార్లు మెదడు, మనసు మనల్ని హెచ్చరిస్తాయి. అలాంటి సమయాల్లో మనసు మాట వినాల్సి ఉంటుంది. అయితే కార్లా అలా చేయలేదు. అందుకే తను దూరంగా వెళ్లిపోయింది’ అని ఆవేదన వ్యక్తం చేశారు. కార్లా ఒక్కరే కాదు..! మగవారితో పోలిస్తే ఆడవాళ్లకు ఒంటరి ప్రయాణాలు అంత సురక్షితం కాదని ఇటువంటి ఘటనలు హెచ్చరిస్తున్నాయి. గతేడాది డిసెంబరులో మొరాకోలోని అట్లాస్ పర్వతాలను అధిరోహించడానికి వెళ్లిన లూసియా వెస్ట్రేగర్ (24– డెన్మార్క్), మారెన్ ఊలాండ్ (28)లు దారుణ పరిస్థితుల్లో శవాలై తేలగా.. అదే నెలలో బ్రిటన్ గ్రేస్ అనే మహిళ కూడా హత్యకు గురయ్యారు. వీళ్లే కాదు మూడేళ్ల క్రితం థాయ్‌లాండ్ పర్యటనకు వెళ్లిన 19 ఏళ్ల యువతి ఒకరు సామూహిక అత్యాచారానికి గురికాగా.. ఓ బెల్జియన్ మహిళను అత్యంత దారుణంగా హతమార్చాడో కామాంధుడు. అంతేకాదు మనదేశంలో కూడా ఇటీవల మహిళా పర్యాటకులపై అకృత్యాలు పెచ్చుమీరుతున్నాయి. కొన్ని నెలల క్రితం ఓ విదేశీ మహిళా ప్రయాణికురాలిని దేశ రాజధానిలో ఆటోవాలాలు ఇబ్బంది పెట్టడం, బుద్ధగయకు వచ్చిన మహిళతో గైడ్ అసభ్య ప్రవర్తనతో పాటు విదేశీ మహిళలపై పలు అత్యాచార ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి ఘటనల నేపథ్యంలో కొంతమంది మహిళా సోలో ట్రావెలర్స్ తమ అనుభవాల సారంతో కొన్ని జాగ్రత్తలను షేర్ చేసుకుంటున్నారు. ఏ ప్రాంతానికి వెళ్తున్నారో ఆ ప్రాంతానికి తగ్గట్టే డ్రెస్ వేసుకోవడం, ఒంటరి ప్రయాణం అన్న సంగతిని, బస చేస్తున్న ప్రదేశాల వివరాలు వగైరాలను బయటపెట్టకపోవడం, స్థానిక హెల్ప్‌లైన్స్ నంబర్లను దగ్గర పెట్టుకోవడం వంటివి చేస్తే ప్రమాదాల నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుందని సూచిస్తున్నారు. జరిగిన ఘటనలన్నిటినీ నిశితంగా పరిశీలించినట్లైతే వీటన్నింటికీ మగవారి అనుచిత ప్రవర్తనే కారణం అన్న విషయం స్పష్టంగా అర్థమవుతుంది. విచక్షణ కోల్పోకుండా, మనుషుల్లా ప్రవర్తించినపుడే ఇంటా బయటా మహిళలు సురక్షితంగా ఉండగలుగుతారనే విషయం పురుషులకు బోధపడితే ఎవరూ ఎవరిని నిందించాల్సిన పరిస్థితి ఏర్పడదు. ఆ పురుషుల కూతుళ్లు, సోదరీమణులు కూడా ఎక్కడైనా స్వేచ్ఛగా జీవించగలుగుతారు. లింగ వివక్ష పోవాలి : ఫుమ్జిలే మియాంబో, ఐక్యరాజ్యసమితి మహిళా విభాగం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇంట్లో ఉన్నా బయటకు వెళ్లినా మహిళలపై అత్యాచారాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎక్కడ ఉన్నాం ఏం చేస్తున్నామనే అంశాలతో సంబంధం లేకుండా ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. సామాజిక అసమానతలు, లింగ వివక్షే ఇందుకు ప్రధాన కారణం. ఈ పరిస్థితులు మారాలి. ఇక ఒంటరి ప్రయాణాల్లో మగవారితో పోలిస్తే ఆడవాళ్లకే రిస్క్ ఎక్కువగా ఉంటోంది. -సుష్మారెడ్డి యాళ్ల, సాక్షి వెబ్ డెస్క్ -
దీవెన యాత్ర
ప్రాచీనకాలం నుంచి మన దేశంలో యాత్రలంటే తీర్థయాత్రలే! ఎలాంటి రవాణా సౌకర్యాలు లేని రోజుల్లో సైతం మన పూర్వీకులు తప్పనిసరిగా తీర్థయాత్రలు చేసేవారు. రవాణా వ్యవస్థ మెరుగుపడిన తర్వాత తీర్థయాత్రలే కాదు, వినోదం కోసం చేసే విహారయాత్రలు, సాహస యాత్రలు కూడా పెరిగాయి. వినోదం కోసం విలాసభరితమైన విహారయాత్రలు ఎన్ని చేసినా, జీవితకాలంలో కనీసం కొన్ని పుణ్యక్షేత్రాలనైనా దర్శించుకోవడం భారతీయుల ఆనవాయితీ. దర్శనీయమైన పుణ్యక్షేత్రాలకు, వివిధ మతాలకు చెందిన చరిత్రాత్మక ప్రార్థన కేంద్రాలకు మన దేశం ఆలవాలం. జనవరి 25న జాతీయ పర్యాటక దినోత్సవం సందర్భంగా మన దేశంలో జాతీయస్థాయిలో ప్రఖ్యాతి పొందిన పుణ్యక్షేత్రాలతో తెలుగు రాష్ట్రాల్లోని పేరెన్నిక గల పుణ్యక్షేత్రాల గురించిన విశేషాలు మీకోసం... తిరుపతి తిరుమల భారతదేశంలోనే అత్యధికంగా భక్తులు సందర్శించుకునే పవిత్ర క్షేత్రం తిరుమల. శ్రీవేంకటేశ్వరస్వామి కొలువైన ఈ క్షేత్రం నిత్యం భక్తులతో కిటకిటలాడుతూనే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో ఉన్న ఈ క్షేత్రంలో ఏటా జరిగే బ్రహ్మోత్సవాలు, మకర సంక్రాంతి, ఉగాది తదితర పర్వదినాల్లోనైతే భక్తుల రద్దీ మరింత ఎక్కువగా ఉంటుంది. తూర్పు కనుమల్లోని శేషాచలం పర్వతశ్రేణులపై ఏడుకొండల మీద వెలసినందున శ్రీవేంకటేశ్వరస్వామిని భక్తులు ఏడుకొండలస్వామిగా పిలుచుకుంటారు. ఇక్కడి సహజ శిలాతోరణం ఒక భౌగోళిక అద్భుతం. ఇదే కాకుండా, ఆకాశగంగ, పాపవినాశనం జలపాతాలు, శ్రీవారి పాదముద్రలు సందర్శకులకు కనువిందు చేస్తాయి. తిరుపతి–తిరుమలకు వచ్చే భక్తులు తప్పనిసరిగా గోవిందరాజులస్వామి ఆలయం, ఆదివరాహస్వామి ఆలయం, తిరుచానూరులోని పద్మావతి అమ్మవారి ఆలయాలను ఇవే కాకుండా ఇక్కడి కోదండ రామాలయం, వరదరాజస్వామి దేవాలయం, ఇస్కాన్ ఆలయం, జీవకోన, కపిలతీర్థం వంటి సందర్శనీయ స్థలాలు ఎన్నో ఉన్నాయి. శ్రీవేంకటేశ్వర నేషనల్ పార్క్‌లో అరుదైన వృక్షజాతులను, పక్షులను చూడవచ్చు. శ్రీవేంకటేశ్వర జూలాజికల్ పార్కులో అరుదైన జంతుజాలాన్ని, పక్షులను చూడవచ్చు. తిరుపతికి చేరువలోనే మరికొన్ని పుణ్యక్షేత్రాలు ఉన్నాయి.వాటిలో శ్రీకాళహస్తి సుప్రసిద్ధ శైవక్షేత్రం. కాలసర్పదోషం వంటి గ్రహదోషాలకు పరిహారంగా భక్తులు ఇక్కడ ప్రత్యేకపూజలు చేయించుకుంటారు. కాణిపాకంలోని వినాయక ఆలయం, కార్వేటినగరంలోని వేణుగోపాల స్వామి ఆలయం, నారాయణవనంలోని కళ్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయం, కైలాసనాథస్వామి ఆలయం, గుడిమల్లంలోని పరశురామేశ్వర ఆలయం, ముక్కోటిలోని శివాలయం, అప్పలాయగుంటలో ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయం, నగలాపురంలో వేదనారాయణస్వామి ఆలయం వంటి చాలా సందర్శనీయ ఆలయాలు ఉన్నాయి. తిరుపతికి చేరువలో విహారయాత్రలకు అనువైన ప్రదేశాలు కూడా చాలానే ఉన్నాయి. అటవీ సౌందర్యానికి ఆలవాలమైన తలకోన, కళ్యాణి ఆనకట్ట, నారాయణవనంలోని కైలాసకోన, ఆంధ్రా ఊటీగా పేరుపొందిన హార్స్లీ హిల్స్ వంటి ప్రదేశాలు ఆటవిడుపుగా గడపటానికి అనువుగా ఉంటాయి. వారణాసి ప్రపంచంలోనే అత్యంత పురాతన నగరాల్లో ఒకటైన వారణాసిని కాశీ అని కూడా అంటారు. పవిత్ర గంగా తీరంలో ఉన్న కాశీ క్షేత్రాన్ని గురించిన ప్రస్తావన చాలా పురాణాల్లో కనిపిస్తుంది. ఉత్తరప్రదేశ్‌లో ఉన్న ఈ నగరం నిత్యం పర్యాటకులతో కిటకిటలాడుతూ ఉంటుంది. వరుణ, అసి అనే రెండు నదులు ఈ నగరం వద్ద గంగానదిలో కలుస్తాయి. అందుకే దీనికి వారణాసి అనే పేరు వచ్చింది. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన విశ్వేశ్వర లింగం వారణాసిలో ఉంది. ఇక్కడ విశ్వేశ్వరాలయంతో పాటు విశాలాక్షి ఆలయం, అన్నపూర్ణ ఆలయం, కాలభైరవ ఆలయం, సంకటమోచన ఆలయం, వారాహీమాత ఆలయం, దుర్గామాత ఆలయం, కవళీమాత ఆలయం, తులసీ మానసమందిరం వంటి పురాతన ఆలయాలు ఎన్నో సందర్శకులను ఆకట్టుకుంటాయి. ఇక్కడ గంగానది ఒడ్డున యాత్రికులు స్నానాలు ఆచరించేందుకు వీలుగా అనేక స్నానఘట్టాలు కనిపిస్తాయి. వీటిలో కాశీ విశ్వనాథ ఆలయం పక్కనే ఉన్న దశాశ్వమేధ ఘాట్, మణికర్ణికా ఘాట్ల ప్రస్తావన పురాణాల్లోనూ కనిపిస్తుంది. కార్తీకమాసంలోను, మహాశివరాత్రి పర్వదినాన ఇక్కడ భక్తుల రద్దీ మరింతగా కనిపిస్తుంది. వారణాసిలో ముస్లిం పాలకుల హయాంలో నిర్మించిన పురాతన మసీదులు సందర్శకులను ఆకట్టుకుంటాయి. దశాశ్వమేధఘాట్ సమీపంలోని జంతర్‌మంతర్, గంగాతీరం తూర్పువైపున రామనగర్ కోట, ఈ కోటలో ఉన్న మ్యూజియం సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. శబరిమల మన దేశంలో భక్తుల రద్దీ విపరీతంగా ఉన్న క్షేత్రాలలో శబిరమల ఒకటి. కేరళలోని సహ్యాద్రి పర్వతశ్రేణుల్లోని శబరిమలపై వెలసిన అయ్యప్పను దర్శించుకునేందుకు దీక్షలు తీసుకున్న భక్తులు పెద్దసంఖ్యలో వస్తుంటారు. దట్టమైన అడవులు, పద్దెనిమిది కొండల మధ్య కేంద్రీకృతమైన శబరిమలకు సాగించే యాత్ర అనిర్వచనీయమైన అనుభూతినిస్తుంది. శబరిమల యాత్రలో ఏటా నవంబరు 17న జరిగే మండలపూజ, మకరసంక్రాంతి రోజున జరిగే మకరవిళక్కు ప్రధాన ఘట్టాలు. ఈ రెండు రోజుల్లోను, ప్రతి మలయాళ నెలలోనూ ఐదో రోజున అయ్యప్పస్వామి ఆలయాన్ని తెరిచి ఉంచుతారు. మిగిలిన అన్ని రోజులూ ఆలయాన్ని మూసి ఉంచుతారు. శబరిమల యాత్ర ఎరుమేలితో మొదలవుతుంది. ముందుగా ఎరుమేలిలోని మసీదులో కొలువైన వావరుస్వామిని భక్తులు దర్శించుకుంటారు. దట్టమైన అడవుల గుండా సాగే కాలినడక మార్గంలో అళదానదిలోను, పంపానదిలోను భక్తులు స్నానాలు ఆచరిస్తారు. పచ్చని అడవులు, కొండలు, కోనల మీదుగా సాగే శబరిమల యాత్ర పర్యాటకులకు గొప్ప అనుభూతినిస్తుంది. ఏడాది పొడవునా భక్తుల తాకిడి ఉండకపోయినా, మండలపూజ, మకరవిళక్కు సీజన్లో మాత్రం ఇక్కడ విపరీతంగా భక్తుల రద్దీ కనిపిస్తుంది. షిరీడీ ఆధ్యాత్మిక ప్రవక్త అయిన సాయిబాబా నివాసం ఉన్న షిరిడీ గడచిన శతాబ్దకాలంలో ఆధ్యాత్మిక క్షేత్రంగా ప్రాచుర్యం పొందింది. మహారాష్ట్రలోని షిరిడీ పట్టణం ఇక్కడి సాయిబాబా ఆలయం కారణంగా అంతర్జాతీయ ప్రఖ్యాతి పొందింది. మన దేశంలో తిరుపతి తర్వాత ఏడాది పొడవునా భక్తులు అత్యధిక సంఖ్యలో సందర్శించుకునే యాత్రా స్థలం షిరిడీనే. ప్రేమ, కరుణ, శాంతి, సహనం, గురుపూజ వంటి ఉన్నత విలువలను, దేవుడు ఒక్కడేనంటూ మత సామరస్యాన్ని బోధించిన షిరిడీ సాయిబాబాకు దేశ విదేశాల్లో కోట్లాదిగా భక్తులు ఉన్నారు. షిరిడీలో సాయిబాబా అస్తికలను ఉంచిన షిరిడీసాయి ప్రధాన ఆలయంతో పాటు, సాయిబాబా తన జీవితంలో ఎక్కువకాలం గడిపిన ద్వారకామాయి మసీదు, దానికి సమీపంలోని చావిడి, గురుషాన్ వద్దనున్న వేపచెట్టు తదితర ప్రదేశాలను భక్తులు పెద్దసంఖ్యలో సందర్శించుకుంటూ ఉంటారు. ఇక్కడి సాయి హెరిటేజ్ విలేజ్, దీక్షిత్‌వాడా మ్యూజియం, వెట్ ఎన్ జాయ్ వాటర్ పార్క్ సందర్శకులను ఆకట్టుకుంటాయి. షిరిడీలోని పురాతన ఖండోబా ఆలయం, షిరిడీకి దాదాపు 70 కిలోమీటర్ల దూరంలోని శింగణాపూర్‌లో ఉన్న శనైశ్చర దేవాలయాలను కూడా భక్తులు పెద్దసంఖ్యలో సందర్శించుకుంటూ ఉంటారు. రామేశ్వరం ద్వాదశ జ్యోతిరింగ క్షేత్రాల్లో ఒకటైన రామేశ్వరం పురాణకాలం నుంచి ప్రసిద్ధి పొందింది. సాక్షాత్తు శ్రీరాముడు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాడని రామాయణం చెబుతోంది. బ్రాహ్మణుడైన రావణుడిని వధించిన తర్వాత బ్రహ్మహత్యా పాతకం నుంచి విముక్తుడు కావడం కోసం రాముడు ఇక్కడ ప్రతిష్ఠించిన జ్యోతిర్లింగం రామనాథేశ్వర లింగంగా ప్రసిద్ధి పొందింది. కాశీలోని విశ్వనాథుడిని దర్శించుకున్న భక్తులు అక్కడి నుంచి గంగా జలాన్ని తీసుకొచ్చి రామేశ్వరంలోని రామనాథస్వామిని దర్శించుకుని, తీరంలోని సముద్రంలో కలిపితేనే కాశీయాత్ర పూర్తి చేసుకున్న ఫలితం దక్కుతుందని భక్తులు విశ్వసిస్తారు. తమిళనాడు రామేశ్వరం ఒక చిన్న దీవి. ప్రధాన భూభాగం నుంచి దీనిని పంబన్ కాలువ వేరు చేస్తోంది. రాముడు ఇక్కడే సేతువు నిర్మించి వానర సైన్యంతో లంకపైకి దండెత్తి వెళ్లాడని పురాణాలు చెబుతున్నాయి.ప్రస్తుతం ఇక్కడ కనిపించే రామేశ్వర ఆలయాన్ని క్రీస్తుశకం పదో శతాబ్దిలో శ్రీలంక చక్రవర్తి పరాక్రమ బాహు నిర్మించాడు. ఈ ఆలయంతో పాటు ఇక్కడ కనిపించే రామపాదాలు, విభీషణాలయం, సేతువు ఉన్న ధనుష్కోటి ప్రాంతం, సువిశాలమైన బీచ్‌లు సందర్శకులకు కనువిందు చేస్తాయి. సారనాథ్ ఉత్తరప్రదేశ్‌లోని వారణాసికి చేరువలో ఉన్న సారనాథ్ నాలుగు ప్రధాన బౌద్ధక్షేత్రాల్లో ఒకటి. బోధిగయలో జ్ఞానోదయం పొందిన ఐదు వారాలకు సారనాథ్ చేరుకున్న గౌతమ బుద్ధుడు ఇక్కడే తన శిష్యులకు మొదటి ‘ధర్మ’ ఉపదేశం చేశాడు. దీనినే ధర్మచక్ర పరివర్తన సూత్రం అంటారు. ఇక్కడే బుద్ధుని ఐదుగురు శిష్యులతో మొదటి బౌద్ధసంఘం ఏర్పడింది. బుద్ధుని కాలంలో సారనాథ్‌ను ఉసీపట్నం అనేవారు.ఇక్కడి మూలగంధి కుటీరంలో బుద్ధుడు ఐదేళ్లు గడిపాడు. సారనాథ్‌లో బౌద్ధులకు చెందిన అనేక పురాతన చారిత్రక ఆధారాలు నేటికీ చెక్కుచెదరకుండా కనిపిస్తాయి. అశోకుడు స్థాపించిన స్థూపాలు, వాటికపై బుద్ధుని సూక్తులను, అశోకుని శాసనాలను చూడవచ్చు. వీటిలో నాలుగు సింహాలతో కూడిన అశోకస్థూపం మన జాతీయచిహ్నంగాను, ఇందులోని అశోకచక్రం మన జాతీయ జెండాపైన గౌరవం పొందుతున్నాయి. ఇక్కడి చుఖంది స్థూపంలో బుద్ధుని అస్థికలను భద్రపరచారు. సారనాథ్‌లోని జింకల పార్కులోనే బుద్ధుడు తొలి ఉపదేశం చేసిన ప్రదేశాన్ని చూడవచ్చు. శతాబ్దం కిందటి తవ్వకాల్లో బయటపడిన మ్యూజియంలో ఉన్న పురాతన కళాఖండాలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. వారణాసికి వెళ్లే యాత్రికుల్లో చారిత్రక విశేషాలపై ఆసక్తిగలవారు సారనాథ్‌ను కూడా తప్పక సందర్శించుకుంటూ ఉంటారు. అజ్మీర్ రాజస్థాన్‌లోని అజ్మీర్ దర్గాకు ముస్లింలతో పాటు ఇతర మతస్తులూ పెద్ద సంఖ్యలో వస్తుంటారు. సూఫీ సాధువు మొయినుద్దీన్ చిస్తీ సమాధి చెందిన ఈ దర్గా అజ్మీర్‌లోని తారాగఢ్ కొండ దిగువన ఉంది. ఇక్కడ ప్రార్థనలు జరిపిన తర్వాతే మొఘల్ చక్రవర్తి అక్బర్‌కు కొడుకు పుట్టాడని ప్రతీతి. అందుకే అక్బర్ తన పట్టమహిషితో కలసి ఈ దర్గాను దర్శించుకోవడానికి ఆగ్రా నుంచి కాలినడకన వచ్చేవాడని చెబుతారు. ఆగ్రా నుంచి అజ్మీర్ దర్గాకు చేరుకునే మార్గంలో ప్రతి రెండు మైళ్లకొకటి చొప్పున నిర్మించిన ‘కోసే మీనార్’ స్తంభాల వద్ద ఆగి కాసేపు విశ్రాంతి తీసుకుని మళ్లీ అక్బర్ దంపతులు పాదయాత్ర సాగించేవారని చెబుతారు. హైదరాబాద్ నిజాం ప్రభువు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఇచ్చిన విరాళంతో అజ్మీర్ దర్గా ప్రధాన ద్వారాన్ని నిర్మించారు. నిజాం ద్వారం తర్వాత షాజహాన్ నిర్మించిన షాజహానీ దర్వాజా, మహమ్మద్ ఖిల్జీ నిర్మించిన బులంద్ దర్వాజా చూపరులను ఆకట్టుకుంటాయి. ఇస్లాం సంప్రదాయం ప్రకారం ఏటా రజాబ్ నెలలోని ఆరో రోజు లేదా ఏడో రోజున మొయినుద్దీన్ చిస్తీ వర్ధంతి సందర్భంగా ఉర్సు వేడుకలను నిర్వహిస్తారు. ఈ వేడుకల్లో లక్షలాదిగా జనం పాల్గొంటారు. కోరికలు తీరాలని ప్రార్థనలు జరిపే భక్తులు కొందరు ఈ దర్గాకు చాదర్లు సమర్పించుకుంటారు. ఇక్కడకు చేరువలోనే మొఘల్ చక్రవర్తి షాజహాన్ నిర్మించిన అక్బరీ మసీదు కూడా పర్యాటకులను ఆకట్టుకుంటుంది. ఆరావళి పర్వతాల నడుమ ఉన్న అజ్మీర్ నగరానికి పదకొండు కిలోమీటర్ల దూరంలోనే ఉన్న పుష్కర్‌లో అత్యంత అరుదైన బ్రహ్మదేవుని ఆలయం ఉంది. అజ్మీర్‌లోని కొండపై ఎనిమిదో శతాబ్దికి చెందిన ఒకటో అజయరాజా నిర్మించిన ‘అజయమేరు’ కోటనే ఇప్పుడు తారాగఢ్ కోటగా పిలుస్తున్నారు. అజయమేరు కోట ఉన్న నగరం కావడం వల్ల గతంలో దీనిని అజయమేరు నగరంగా పిలిచేవారు. కాలక్రమేణా ఈ పేరే అజ్మీర్‌గా మారింది. తారాగఢ్ కోటకు చేరువలోని పృథ్వీరాజ్ విగ్రహం, నగరంలోని పురాతన సరోవరాలు, వాటి పరిసరాలు చూపరులను ఆహ్లాదపరుస్తాయి. ఇక్కడి ‘సోనీజీ కీ నసియాన్’ జైన ఆలయంలోని ప్రధాన మందిరాన్ని ‘స్వర్ణనగరి’ అని అంటారు. వెయ్యి కిలోల బంగారంతో నిర్మించిన ఈ మందిరం చూపరులను ఆకట్టుకుంటుంది. అజ్మీర్‌లో ఒకప్పుడు అక్బర్ కొడుకు సలీం నివసించిన పురాతన భవనంలో ప్రస్తుతం మ్యూజియం కొనసాగుతోంది. ఇందులోని పురావస్తువులు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. పాత గోవా ఉత్తర గోవా జిల్లాలోని పాత గోవా ప్రాంతాన్నే పోర్చుగీసు భాషలో ‘వెల్హ గోవా’ అని, ఇంగ్లిష్‌లో ఓల్గోవా అని అంటారు. ఇక్కడి ‘బేసిలికా ఆఫ్ బామ్ జీసస్’ చర్చిలో పదహారో శతాబ్దికి చెందిన రోమన్ కేథలిక్ క్రైస్తవ మత బోధకుడు సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ అస్థికలు ఉంటాయి. వీటిని తిలకించేందుకు దేశ విదేశాల నుంచి క్రైస్తవులతో పాటు ఇతర మతాలకు చెందిన పర్యాటకులు కూడా పెద్దసంఖ్యలో వస్తుంటారు.పురాతనమైన ఈ చర్చిని యూనెస్కో ప్రపంచ వారసత్వ సంపదల్లో ఒకటిగా గుర్తించింది. ఇదే కాకుండా, ఇక్కడ చర్చ్ ఆఫ్ సెయింట్ ఫ్రాన్సిస్ అసిసీ, చాపెల్ ఆఫ్ సెయింట్ కేథరీన్, రాయల్ చాపెల్ ఆఫ్ సెయింట్ ఆంథోనీ, చర్చ్ ఆఫ్ అవర్ లేడీ ఆఫ్ మౌంట్, చర్చ్ ఆఫ్ సెయింట్ జాన్ ఆఫ్ గాడ్ వంటి పురాతన చర్చిలు చాలా కనిపిస్తాయి. ఇక్కడి పురాతన చర్చిల్లో ఒకటైన చర్చ్ ఆఫ్ సెయింట్ అగస్టీన్ శిథిలాలు మాత్రమే ప్రస్తుతం కనిపిస్తాయి. గోవా సముద్ర తీర సౌందర్యాన్ని తిలకించే పర్యాటకుల్లో చాలామంది ఈ పురాతన చర్చిలను తిలకించడానికి పాత గోవాకు వస్తుంటారు. గోవాలో పోర్చుగీసుల హయాంలో నిర్మించిన చర్చిలు మాత్రమే కాకుండా, శతాబ్దాల నాటి హిందూ ఆలయాలు కూడా కనిపిస్తాయి. గోవాలోని పన్నెండో శతాబ్ది నాటి మహాదేవ శివాలయం, పదిహేనో శతాబ్దికి చెందిన మహామాయ కాళికా దేవాలయం, ఇక్కడి కవ్లే ప్రాంతంలోని శాంత దుర్గా ఆలయం, అమోనా ప్రాంతంలోని భేతాళ ఆలయం, మషేల్లోని శ్రీ దేవకీ కృష్ణ రవల్నాథ్ ఆలయం వంటి అరుదైన దేవాలయాలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. పండుగ వేళల్లో ఈ ఆలయాల వద్ద భక్తుల రద్దీ కనిపిస్తుంది. అమృత్సర్ పంజాబ్‌లోని అమృత్సర్ సిక్కులకు పవిత్రక్షేత్రం. ఇక్కడి స్వర్ణదేవాలయం సిక్కులకు అత్యంత పవిత్ర ప్రార్థన కేంద్రం. స్వర్ణదేవాలయాన్నే ‘హరిమందిర్ సాహిబ్’ అంటారు. ప్రతిరోజూ లక్షలాది మంది సందర్శించుకునే ఈ ఆలయానికి సిక్కులతో పాటు ఇతర మతస్తులూ వస్తుంటారు. అమృత్‌సర్‌లో స్వర్ణదేవాలయమే కాకుండా రామాయణ కాలానికి చెందిన మరికొన్ని పవిత్ర స్థలాలు కూడా ఉన్నాయి.ఇక్కడ వాల్మీకి తీర్థస్థల్లో వాల్మీకి ఆశ్రమం ఉంది. వాల్మీకి ఆశ్రమానికి చేరువలోనే ఉన్న ‘రామతీర్థ’ ఆశ్రమంలోనే సీతాదేవి లవకుశులకు జన్మనిచ్చినట్లు ప్రతీతి. అశ్వమేధం చేసిన రాముడు విడిచిన యాగాశ్వాన్ని లవకుశులు బంధించి, దానికి రక్షణగా వచ్చిన హనుమంతుడిని ఒక చెట్టుకు కట్టేశారని పురాణాల కథనం. ఇక్కడి దుర్గయినా ఆలయానికి చేరువలోని చెట్టుకే లవకుశులు హనుమంతుడిని కట్టేశారని చెబతారు. సిక్కుల నాలుగో గురువైన గురు రామదాస్ ఈ నగరాన్ని స్థాపించినందున ఇదివరకు ఈ నగరాన్ని రామదాస్నగర్ అనేవారు. ఇక్కడి గోవింద్గఢ్ కోట, రామ్‌బాగ్ ప్యాలెస్, మహారాజా రంజిత్‌సింగ్ మ్యూజియం సందర్శకులను ఆకట్టుకుంటాయి. ఇక్కడి జలియన్‌వాలాబాగ్ నాటి బ్రిటిష్ పాలకుల దాష్టీకానికి నిలువెత్తు సాక్షిగా కనిపిస్తుంది. పూరీ ఒడిశాలోని బంగాళాఖాతం తీరంలోనున్న పూరీ శ్రీక్షేత్రంగా ప్రసిద్ధి పొందింది. బలభద్ర, సుభద్రా సమేతుడై జగన్నాథుడు వెలసిన పూరీ క్షేత్రాన్ని పురుషోత్తమ క్షేత్రమని కూడా అంటారు. పూరీలోని జగన్నాథ ఆలయం దాదాపు వెయ్యేళ్ల నాటిది. దాదాపు నాలుగు లక్షల చదరపు అడుగుల సువిశాల స్థలంలో నిర్మించిన పూరీ జగన్నాథ ఆలయ ప్రాంగణంలో 120 ఉపాలయాలు, పూజ మందిరాలు ఉన్నాయి.యావత్ భారతదేశంలోనే అతిపెద్ద వంటశాల ఈ ఆలయంలోనే ఉంది. ఇక్కడ ప్రతిరోజూ 56 వంటకాలను వండి, ఇక్కడి దేవతామూర్తులకు నివేదిస్తారు. ఏటా ఆషాఢ శుక్ల విదియ నాడు జరిగే జగన్నాథ రథయాత్రను తిలకించేందుకు దేశ విదేశాల నుంచి లక్షలాదిగా సందర్శకులు వస్తుంటారు. రథయాత్రలో జగన్నాథ బలభద్ర సుభద్రలు గుండిచా మందిరానికి చేరుకుంటారు. ఆషాఢ శుక్ల దశమి వరకు ఇక్కడ కొలువుదీరే జగన్నాథుడు దశావతారాల్లో భక్తులకు దర్శనమిస్తాడు. పూరీలోని విమలాదేవి ఆలయంలో ఆశ్వీయుజ మాసం ప్రారంభానికి ఎనిమిది రోజుల ముందు నుంచి విజయదశమి వరకు పదహారు రోజుల పాటు జరిగే పూజలకు కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. పూరీ సముద్ర తీరానికి పర్యాటకులు నిత్యం పెద్దసంఖ్యలో వస్తుంటారు. పూరీకి చేరువలోని కోణార్క్ సూర్యదేవాలయం, సాక్షిగోపాల్‌లోని సాక్షిగోపాల ఆలయం కూడా పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. పూరీకి చేరువలోనే ఉన్న ఒడిశా రాజధాని భువనేశ్వర్ ‘ఆలయ నగరం’గా ప్రసిద్ధి పొందింది. పూరీ వచ్చే పర్యాటకుల్లో చాలామంది భువనేశ్వర్‌లోని పురాతన లింగరాజ్ ఆలయం, రాజారాణీ ఆలయం, ఖండగిరి, ఉదయగిరి గుహలు, ఇతర సందర్శనీయ ప్రదేశాలు చూపరులను ఆకట్టుకుంటాయి. -
2020 నాటికి వెల్నెస్ టూరిజంలో భారత్ నం.1
వ్యయప్రయాసలకోర్చి పుణ్యం మూటగట్టుకోవడానికి చేసే తీర్థయాత్రలు అనాదిగా ఉన్నవే. వినోదం కోసం, ఆటవిడుపు కోసం చేసే విహారయాత్రలు కూడా తెలిసినవే. ఇటీవలి కాలంలో స్వస్థత కోసం, మానసిక ఉల్లాసం, ఆధ్యాత్మిక వికాసంతో పాటు శారీరక ఉత్తేజం కోసం యాత్రలు చేసే పర్యాటకులు పెరిగారు. ఇలాంటి పర్యాటకాన్ని ‘వెల్నెస్ టూరిజం’ అంటున్నారు. తీర్థయాత్రలు, వినోద విహార యాత్రలకు వెళ్లే పర్యాటకుల కంటే ఇటీవలి సంవత్సరాల్లో ‘వెల్నెస్ టూరిజం’ పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా వెల్నెస్ టూరిజం మార్కెట్ పరిమాణం 2015 నాటికి 56,320 కోట్ల డాలర్లు (రూ.35.83 లక్షల కోట్లు) మేరకు ఉంది. ప్రపంచవ్యాప్తంగా వెల్నెస్ టూరిజం మార్కెట్ వార్షిక వృద్ధి రేటు 6.8 శాతంగా నమోదవుతోందని ‘గ్లోబల్ వెల్నెస్ ఎకానమీ మానిటర్’ తాజా సంచిక వెల్లడించడం విశేషం. వెల్నెస్ టూరిజం మార్కెట్లో ప్రపంచవ్యాప్త వృద్ధి రేటును మించి భారత్ దాదాపు 20 శాతం వృద్ధి రేటుతో దూసుకుపోతోంది. ఇదే దూకుడు కొనసాగితే ఈ రంగంలో భారత్ 2020 నాటికి అగ్రస్థానంలో నిలవగలదని నిపుణుల అంచనా. స్వస్థత నుంచి సౌందర్యం వరకు... స్వస్థత పొందడం నుంచి సౌందర్యం పెంపొందించుకోవడం వరకు అనేక కారణాలతో పర్యాటకులు ‘వెల్నెస్ టూరిజం’ బాట పడుతున్నారు. ‘వెల్నెస్ టూరిజం’లో పర్యాటకులు రవాణా, వసతి సౌకర్యాల కోసం ఎక్కువ మొత్తంలో వెచ్చిస్తున్నారు. ఆ తర్వాత తాము ఆశించిన ప్రయోజనం మేరకు సౌందర్య చికిత్సలు, ఒత్తిడి నివారణ చికిత్సలు, యోగ, ధ్యానం, ప్రత్యామ్నాయ ఆహార చికిత్సలు, మూలికా చికిత్సలు, మసాజ్, స్పా వంటి సేవల కోసం వెచ్చిస్తున్నారు. పని ఒత్తిడే ప్రధాన కారణం ప్రపంచవ్యాప్తంగా వెల్నెస్ టూరిజం శరవేగంగా పెరుగుతుండటానికి పని ఒత్తిడే ప్రధాన కారణంగా ఉంటోందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వివిధరంగాల్లో పనిచేసే ఉద్యోగులు పని ఒత్తిడి కారణంగా ఆరోగ్య సమస్యల బారిన పడుతున్నారు. పని ఒత్తిడి ఫలితంగా ఉద్యోగుల్లో తలెత్తే ఆరోగ్యసమస్యల వల్ల ప్రపంచ ఆర్థికరంగం ఉత్పాదకత సుమారు 10–15 శాతం మేరకు తగ్గుతున్నట్లు అంతర్జాతీయ అంచనాలు చెబుతున్నాయి. పని ఒత్తిడి వల్ల పెరుగుతున్న ఆరోగ్య సమస్యలే వెల్నెస్ టూరిజం పెరుగుదలకు దోహదపడుతున్నాయని వివిధ అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మధ్యతరగతి జనాభా ఆర్థికంగా పరిపుష్టం కావడం, ప్రజల్లో ఆరోగ్య స్పృహ పెరగడం, వార్ధక్య నియంత్రణ వస్తువులు, సేవలపై ఆసక్తి పెరగడం, సౌందర్యం కోసం, వార్ధక్య నివారణ కోసం ఎంత మొత్తమైనా ఖర్చు చేసే తత్వం పెరగడం, ఒత్తిడిని అధిగమించడంతో పాటు ఆధ్యాత్మిక వికాసం, మానసిక ప్రశాంతత కోసం ఎంత దూరమైనా వెళ్లాలనుకోవడం వంటి కారణాలు ‘వెల్నెస్ టూరిజం’ రంగాన్ని వృద్ధి మార్గంలో పరుగులు తీయిస్తున్నాయి. తాజా లెక్కల ప్రకారం వెల్నెస్ టూరిజం రంగంలో అమెరికా అగ్రస్థానంలో కొనసాగుతుండగా, ఈ రంగంలో భారత్ పన్నెండో స్థానంలో నిలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ముప్పయి దేశాలు వెల్నెస్ టూరిజం కేంద్రాలుగా ఉంటున్నాయి. వాటిలో సుమారు 86 శాతం వెల్నెస్ టూరిజం వ్యాపారం తొలి ఇరవై స్థానాల్లో ఉన్న దేశాల్లోనే సాగుతోంది. భారత్‌లో వెల్నెస్ టూరిజం రంగం కొంత ఆలస్యంగా పుంజుకున్నా, గత కొద్ది సంవత్సరాలుగా శరవేగంగా వృద్ధి సాధిస్తోంది. రిషికేశ్, ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో హిమాలయాల వద్ద ఉండే రిషికేశ్ పుణ్యక్షేత్రంగా తరతరాలుగా ప్రసిద్ధి పొందింది. ఇదివరకు ఇక్కడకు వచ్చేవారిలో అత్యధికులు తీర్థయాత్రికులే ఉండేవారు. ఇప్పుడు పరిస్థితి కొంత మారింది. కేవలం పుణ్యం కోసం వచ్చే తీర్థయాత్రికులే కాదు, స్వస్థత, ప్రశాంతత వంటి పురుషార్థాల కోసం వచ్చే వెల్నెస్ టూరిస్టులను సైతం రిషికేశ్ విశేషంగా ఆకట్టుకుంటోంది. రిషికేశ్‌లో వంద ఎకరాల విస్తీర్ణంలో వెలసిన ‘ఆనంద’ రిసార్ట్స్‌కు దేశ విదేశాలకు చెందిన వెల్నెస్ టూరిస్టులు పెద్దసంఖ్యలో బారులు తీరుతున్నారు. ప్రిన్స్ చార్లెస్, కెమిల్లా దంపతులు నాలుగేళ్ల కిందట భారత్ వచ్చినప్పుడు ఇక్కడ కొద్దిరోజులు ప్రశాంతంగా గడిపి వెళ్లారు. చుట్టూ పచ్చని వనాలు, కనుచూపు మేరలో ధవళ కాంతులతో కనువిందు చేసే హిమాలయాలు ఇక్కడకు వచ్చే పర్యాటకులను ఇట్టే సేద దీరుస్తాయి. ‘ఆనంద’ రిసార్ట్స్‌లో సంప్రదాయ ఆయుర్వేద నిపుణుల ఆధ్వర్యంలో నిర్వహించే ఎనభై రకాల స్పా సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. రిషికేశ్‌లో మరికొన్ని ప్రకృతి వైద్య కేంద్రాలు, యోగ, ఆయుర్వేద కేంద్రాలు కూడా వెల్నెస్ టూరిస్టులకు ప్రత్యేక సేవలు అందిస్తున్నాయి. భారత్‌లో ఆకట్టుకునే ప్రదేశాలు భారత్‌లో వెల్నెస్ టూరిస్టులను ఆకట్టుకునే ప్రదేశాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా యోగ, ఆయుర్వేదంతో పాటు చక్కని పరిసరాలు, ప్రకృతి సౌందర్యంతో చూపరులను మంత్రముగ్ధులను చేసే ప్రదేశాలకు దేశ విదేశాల వెల్నెస్ టూరిస్టులు బారులు తీరుతున్నారు. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, కేరళ, కర్ణాటక, గుజరాత్, రాజస్తాన్, గోవా వంటి రాష్ట్రాలకు వెల్నెస్ టూరిస్టుల తాకిడి ఎక్కువగా ఉంటోంది. మన దేశంలో పెద్దసంఖ్యలో వెల్నెస్ టూరిస్టులను ఆకట్టుకునే టాప్–10 ప్రదేశాలు... వాటి వివరాలు... బెంగళూరు కర్ణాటక రాజధాని బెంగళూరు నగరం దేశంలో ప్రధానమైన ఐటీ హబ్‌గా పేరు పొందిన సంగతి తెలిసిందే. ఇది ఐటీ హబ్ మాత్రమే కాదు, వెల్నెస్ టూరిస్టులను విశేషంగా ఆకట్టుకుంటున్న విలక్షణ నగరం కూడా. ఏడాది పొడవునా చల్లని వాతావరణంతో ఉండే బెంగళూరుకు విదేశీ పర్యాటకులు రకరకాల పనుల మీద వస్తుంటారు. ఇటీవలి కాలంలో దేశ విదేశాల నుంచి వెల్నెస్ టూరిస్టులను ఆకట్టుకోవడంలో బెంగళూరు నగరం దేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తోంది. బెంగళూరులోని ఆయుర్వేదగ్రామ్ హెరిటేజ్ వెల్నెస్ సెంటర్, శ్రేయస్ యోగా రిట్రీట్ వంటి కేంద్రాలు వెల్నెస్ టూరిస్టులకు చక్కని విడిదిగా ఉంటున్నాయి.. ప్రశాంత వాతావరణంలో పచ్చని చెట్లతో నిండిన ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాలకు వెల్నెస్ టూరిస్టులు పెద్దసంఖ్యలో బారులు తీరుతుంటారు. సంప్రదాయ పద్ధతుల్లో చర్మ సమస్యలు, కీళ్ల సమస్యలు, జుట్టురాలడం, మానసిక కుంగుబాటు, అధిక బరువు వంటి రుగ్మతలకు ఇక్కడి నిపుణులు చికిత్స అందిస్తారు. ఇక్కడ కొద్దిరోజులు ప్రశాంతంగా గడిపితే యవ్వనోత్సాహం ఉరకలేస్తుందని పర్యాటకులు చెబుతుంటారు. కోవళం, కేరళ ఆయుర్వేదం భారతదేశం అంతటా వ్యాప్తిలో ఉన్న ప్రాచీన వైద్య ప్రక్రియే అయినా, గడచిన కొన్నేళ్లలో ఆయుర్వేదానికి కేరళ రాష్ట్రం బ్రాండ్ అంబాసిడర్లా మారింది. ముఖ్యంగా పంచకర్మ చికిత్సకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. వివిధ నగరాల్లో కేరళ పంచకర్మ ఆయుర్వేద కేంద్రాలు వెలసినా, వెల్నెస్ టూరిస్టులు మాత్రం ఈ చికిత్స కోసం నేరుగా కేరళ వెళ్లేందుకు మొగ్గు చూపుతున్నారు. కేరళలోని కోవళం పంచకర్మ ఆయుర్వేద చికిత్సకు ప్రధాన కేంద్రంగా ఉంటోంది. సౌందర్యపోషణ, వార్ధక్య నివారణ, ఒత్తిడి నివారణ చికిత్సల కోసం దేశ విదేశాలకు చెందిన పర్యాటకులు పెద్ద సంఖ్యలో ఎగబడుతున్నారు. కోవళంలోని ‘లీలా కోవళం’ పంచకర్మ చికిత్స, యోగా చికిత్సలకు ప్రధాన కేంద్రంగా పర్యాటకులను ఆకట్టుకుంటోంది. కోవళంలోనే సోమతీరం చికిత్స కేంద్రం కూడా వెల్నెస్ టూరిస్టులకు పంచకర్మ, ఆయుర్వేద, యోగ, ప్రకృతి ఆహార చికిత్సలను అందిస్తోంది. గోవా ఇటీవలి కాలంలో గోవాకు వెల్నెస్ టూరిస్టుల తాకిడి కూడా పెరిగింది. గోవాలో ప్రత్యేకమైన స్పాలు, ఆయుర్వేద, ప్రకృతి వైద్య కేంద్రాలు వెల్నెస్ టూరిస్టులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అరేబియన్ సముద్రపు అందాలను తిలకిస్తూ సేదదీరేందుకు వచ్చే పర్యాటకులు ఇక్కడ సౌందర్య పోషణ, వార్ధక్య నివారణ చికిత్సలను పొందేందుకు మక్కువ చూపుతున్నారు. గోవాలోని దివార్ దీవిలో ‘దేవాయ’ ఆయుర్వేద, ప్రకృతి వైద్య, యోగా కేంద్రం వెల్నెస్ టూరిస్టులకు వివిధ రకాల సేవలందిస్తోంది. ఇక్కడి నిపుణులు ఒత్తిడి నుంచి ఉపశమనానికి తగిన యోగ పద్ధతుల్లో చికిత్సను, ప్రకృతి సహజమైన సమతుల ఆహారాన్ని అందిస్తారు. మసాజ్, హైడ్రోథెరపీల ద్వారా పలు దీర్ఘకాలిక రుగ్మతలకు ఉపశమనం కలిగిస్తారు. పుణే, మహారాష్ట్ర మహారాష్ట్రలోని పుణే నగరం ప్రధానంగా వ్యాపార కేంద్రంగానే అందరికీ తెలుసు. ఇటీవలి కాలంలో ఈ నగరం వెల్నెస్ టూరిస్టులను ఆకట్టుకోవడంలో ముందంజలో నిలుస్తోంది. ఇక్కడ ఏర్పాటైన ఆత్మంతన్ కేంద్రం వెల్నెస్ టూరిస్టులకు సంప్రదాయ ఆయుర్వేద, యోగ, ప్రకృతి చికిత్సలతో పాటు పాశ్చాత్య పద్ధతులకు చెందిన రకరకాల మసాజ్‌లు, టర్కిష్ హమామ్ స్నానాలు, హైడ్రోథెరపీ, ఆక్యుప్రెషర్, బాడీ పాలిష్ వంటి విలక్షణమైన సేవలను అందిస్తోంది. ప్రాక్ పాశ్చాత్య పద్ధతులకు చెందిన సేవలన్నీ ఒకే కేంద్రంలో లభిస్తుండటంతో దేశ విదేశీ వెల్నెస్ టూరిస్టులు ఇక్కడకు క్యూ కడుతున్నారు. చర్మసౌందర్యం మెరుగుపరచడానికి, కండరాలు, కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనానికి ఇక్కడి చికిత్సలు ఎంతో బాగుంటున్నాయని, ఇక్కడి వాతావరణం ఒత్తిడిని ఇట్టే దూరం చేస్తోందని ఇక్కడకు వచ్చే పర్యాటకులు చెబుతుండటం విశేషం. మెహ్సానా, గుజరాత్ గుజరాత్‌లోని చారిత్రక నగరం మెహ్సానా. ఇక్కడకు సాధారణంగా చరిత్రపై ఆసక్తి, పరిశోధనపై అభిలాష గల పర్యాటకులే ఇదివరకు ఎక్కువగా వస్తుండేవారు. ఇటీవలి కాలంలో ఈ నగరానికి వెల్నెస్ టూరిస్టుల రాక కూడా పెరుగుతోంది. మెహ్సానా నగరంలోని నింబా నేచర్ క్యూర్ సెంటర్ దేశ విదేశాలకు చెందిన వెల్నెస్ టూరిస్టులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ అధునాతన ప్రకృతి చికిత్స కేంద్రం విలక్షణ రీతుల్లో సౌందర్య పరిరక్షణ, వార్ధక్య నివారణ, స్థూలకాయ నివారణ చికిత్సలను అందిస్తోంది. వైబ్రో మసాజ్, అయాన్ డీటాక్స్, మడ్ బాత్, స్పైన్ బాత్, డైట్ థెరపీ వంటి చికిత్సల కోసం పెద్ద సంఖ్యలో వెల్నెస్ టూరిస్టులు ఇక్కడకు వస్తుంటారు. సిమ్లా, హిమాచల్‌ప్రదేశ్ హిమాచల్‌ప్రదేశ్ రాజధాని సిమ్లా నగరానికి వినోదయాత్రల కోసం పర్యాటకులు వస్తుండటం చిరకాలంగా కొనసాగుతున్నదే. ఇటీవలి కాలంలో ఇక్కడకు వచ్చేవారిలో వెల్నెస్ టూరిస్టుల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. ఇక్కడ ఉన్న వైల్డ్ ఫ్లవర్ హాల్ కేంద్రం వెల్నెస్ టూరిస్టులకు వివిధ రకాల స్వస్థత సేవలను అందిస్తోంది. స్థూలకాయం, కీళ్లనొప్పులు, కండరాల నొప్పుల నుంచి ఉపశమనానికి, శరీరంలోని మలినాలను తొలగించుకునే డీటాక్స్ చికిత్సలు చేయించుకోవడానికి ఇక్కడకు వచ్చే పర్యాటకులు ఆసక్తి చూపుతుంటారు. రీవైటలైజింగ్ బాడీ థెరపీ, స్కిన్‌కేర్, నెయిల్ కేర్ వంటి ప్రత్యేక సౌందర్య చికిత్సలు, ఆయుర్వేద చికిత్సలు, యోగా, ప్రత్యేక స్నాన చికిత్సలు వంటి సేవలతో సేదదీరేందుకు వెల్నెస్ టూరిస్టులు ఇక్కడకు పెద్దసంఖ్యలో వస్తుంటారు. ఆగ్రా, ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా నగరం చారిత్రక కట్టడమైన తాజ్‌మహల్‌కు ఆలవాలం. ప్రపంచ వింతల్లో ఒకటిగా పేరుగాంచిన తాజ్‌మహల్ అందాలను తిలకించేందుకే ఇక్కడకు ఎక్కువ మంది పర్యాటకులు వస్తుండేవారు. తాజ్‌మహల్ సందర్శనతో పాటు సంప్రదాయ చికిత్సలతో, యోగా, మసాజ్ వంటి సేవలతో ఒత్తిడి నుంచి ఉపశమనం పొందాలనుకునే వెల్నెస్ టూరిస్టులు కూడా ఇటీవలి కాలంలో ఎక్కువగా ఆగ్రాకు వస్తున్నారు. తాజ్ మహల్‌కు దాదాపు అరకిలోమీటరు దూరంలోని ‘అమర్‌విలాస్’ రిసార్ట్ వెల్నెస్ టూరిస్టులకు చక్కని విడిదిగా ఉంటోంది. ప్రత్యేకమైన స్పా, మసాజ్, రీవైటలైజింగ్ బాడీ థెరపీతో పాటు నెయిల్ కేర్, హెయిర్ కేర్, స్కిన్ కేర్ వంటి సౌందర్య పోషణ చికిత్సలు, యోగా, మెడిటేషన్ శిక్షణ, ప్రకృతి ఆహార చికిత్సలు వంటి సేవలు లభిస్తుండటంతో పర్యాటకులు ఇక్కడ బస చేసేందుకు ముచ్చటపడుతుంటారు. అజబ్‌గఢ్, రాజస్తాన్ రాజస్తాన్‌లోని ఆరావళి పర్వతశ్రేణులపై ఉండే అజబ్‌గఢ్ పట్టణం చారిత్రక ప్రాంతంగా పేరుపొందింది. చరిత్ర, పురావస్తు పరిశోధనలపై ఆసక్తి ఉన్నవారే ఒకప్పుడు ఇక్కడకు ఎక్కువగా వచ్చేవారు. ఇక్కడి అమన్బాగ్ శాంక్చుయరీ అరుదైన పక్షులకు, జంతువులకు ఆలవాలంగా ఉంటోంది. చుట్టుపక్కల రాష్ట్రాల విద్యార్థులు అప్పుడప్పుడు ఇక్కడకు వచ్చిపోతుంటారు. అయితే, ఇటీవలి కాలంలో ఇక్కడ ఆయుర్వేద సౌందర్య చికిత్స, స్వస్థత కేంద్రాలు, యోగా కేంద్రాల వంటివి ఏర్పడటంతో వెల్నెస్ టూరిస్టుల తాకిడి పెరిగింది. వెల్నెస్ టూరిజం రంగంలో మన దేశం శరవేగంగా అభివృద్ధి సాధిస్తున్నా, తెలుగు రాష్ట్రాలు రెండూ ఈ రంగంలో కొంత వెనుకబడే ఉన్నాయి. ప్రకృతి సౌందర్యానికి ఆలవాలమైన పర్యాటక ప్రదేశాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో తగినన్ని ఉన్నా, ఈ ప్రాంతాల్లో వెల్నెస్ టూరిస్టులను ఆకట్టుకోలేకపోతున్నాయి. వెల్నెస్ టూరిస్టులను ఆకట్టుకునే వసతులను ఈ ప్రదేశాల్లో ఏర్పాటు చేయడంపై తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు దృష్టి సారించినట్లయితే, ఈ రంగంలో తెలుగు రాష్ట్రాలో అభివృద్ధి సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. భారత్‌లో వెల్నెస్ టూరిజం భారత ప్రభుత్వం 2002లో ‘ఇన్క్రెడిబుల్ ఇండియా’ నినాదంతో ప్రచారం ప్రారంభించిన తర్వాత దేశంలో వెల్నెస్ టూరిజం రంగం వేగంగా పుంజుకోవడం మొదలైంది. మన దేశంలో తరతరాల సంపదగా ఉన్న ఆయుర్వేదం, సిద్ధ వంటి ప్రాచీన వైద్య విధానాలు, శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతతను ఇచ్చే ధ్యానం, యోగా వంటి అనాది విద్యలు ఇక్కడకు వచ్చే వెల్నెస్ టూరిస్టులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. వెల్నెస్ టూరిస్టులుగా భారత్‌కు వస్తున్న వారిలో సామాన్య పర్యాటకులే కాకుండా, ప్రిన్స్ చార్లెస్, కెమిల్లా దంపతుల వంటి ప్రముఖులు కూడా ఉంటుండటం విశేషం. నాలుగేళ్ల కిందట భారత పర్యటనకు వచ్చిన ప్రిన్స్ చార్లెస్, కెమిల్లా దంపతులు రిషికేశ్‌లోని ఒక ఆశ్రమంలో ప్రశాంతంగా గడిపి వెళ్లారు. ఇతరేతర కారణాలపై వచ్చే పర్యాటకుల కంటే వెల్నెస్ టూరిజం కోసం వచ్చే పర్యాటకులు పెద్దమొత్తంలో డబ్బు ఖర్చు చేస్తుండటంతో ఈ రంగం నానాటికీ ఆర్థికంగా బలపడుతోంది. అంతర్జాతీయంగా వెల్నెస్ టూరిజం వార్షిక వృద్ధి రేటు 6.8 శాతం వరకు ఉంటే, భారత్‌లో ఈ రంగంలో వార్షిక వృద్ధి రేటు దాదాపు 20 శాతం వరకు ఉంటోంది. ఈ రంగంలో ఇదే దూకుడు కొనసాగితే 2020 నాటికి వెల్నెస్ టూరిజంలో భారత్ మొదటి స్థానానికి చేరుకోగలదని ఆర్థిక నిపుణులు, పర్యాటక రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. -
ఒక కార్డుతోనే అన్ని దేశాలు చుట్టేయొచ్చు
వ్యాపారం పనిమీద లేదా విహార యాత్రల కోసం ఒకేసారి రెండు మూడు దేశాలు తిరగాల్సి ఉంటుంది. ఇలా దేశం మారినప్పుడల్లా కరెన్సీ కూడా మార్చుకోవాల్సి ఉంటుంది. దేశం నుంచి మరో దేశం మారినప్పుడల్లా కరెన్సీ మార్చుకోవడం, దీనికి సంబంధించిన కరెన్సీ ఎక్స్ఛేంజీ కార్యాలయాలు వెతుక్కోవడం అనేది చాలా వ్యయప్రయాసలతో కూడిన పని. ఈసమస్యకు మల్టీ కరెన్సీ కార్డులు చక్కటి పరిష్కారాన్ని చూపుతున్నాయి. ఒకే కార్డులో మీకు కావాల్సిన దేశాల కరెన్సీలు లోడ్ చేసుకుని విదేశాలు చుట్టి వచ్చేయొచ్చు. త్వరలోనే యూఏఈ ఎక్స్ఛేంజ్ కూడా మల్టీ కరెన్సీ కార్డుని ప్రవేశపెడుతోంది. ఎన్ని కరెన్సీలు ఇటీవలి కాలంలో వివిధ పనుల మీద విదేశాలు సందర్శించేవారి సంఖ్య పెరుగడంతో వీరి అవసరాలను తీర్చే విధంగా బ్యాంకులు, ఇతర సంస్థలు మల్టీ కరెన్సీ ట్రావెల్ కార్డులను అందుబాటులోకి తీసుకొచ్చాయి. ప్రధానమైన 15 నుంచి 20 దేశాల కరెన్సీలను ఈ కార్డులో లోడ్ చేసుకునే అవకాశాన్ని ఈ సంస్థలు అందిస్తున్నాయి. కాని చాలా సంస్థలు ఒక కార్డులో గరిష్టంగా 8 నుంచి 10 దేశాల కరెన్సీలను లోడ్ చేసుకోవడానికి అనుమతిస్తున్నాయి. ఒక సారి కరెన్సీ లోడ్ చేసుకున్న తర్వాత ఆయా దేశాల షాపింగుల్లో, ఏటీఎంల్లో నగదును విత్‌డ్రా చేసుకోవడానికి వినియోగించుకోవచ్చు. భద్రతకి ఢోకా లేదు: నేరుగా కరెన్సీ తీసుకు వెళ్లడంతో పోలిస్తే ఈ మల్టీ కరెన్సీ కార్డులు చాలా సురక్షితమైనవని చెప్పొచ్చు. ఈ కార్డులు పోగొట్టుకున్నా పిన్ నంబర్ ఉంటుంది కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అలాగే ఒకసారి కార్డు పోయిన తర్వాత ఆ విషయాన్ని సంస్థకు తెలియచేస్తే ఆ కార్డు లావాదేవీలను వెంటనే స్తంభింప చేయడమే కాకుండా మరుసటి రోజుకల్లా మీరున్న చోటకే కొత్త కార్డును అందిస్తాయి. అంతేకాదు సాధారణంగా నేరుగా నగదు రూపంలో అయితే 3,000 డాలర్లకు మించి తీసుకెళ్లడానికి ఉండదు. అదే ఈ కార్డు ద్వారా అయితే గరిష్టంగా 20,000 డాలర్ల వరకు తీసుకెళ్ళొచ్చు. అంతేకాదు ఇతర ఫారిన్ ఎక్స్ఛేంజీలతో పోలిస్తే ఈ కార్డుల్లో రుసుములు కూడా తక్కువ. ఏమేం కావాలి?.. ఈ కార్డుల కోసం ప్రత్యేకంగా ఎటువంటి కాగితాలు సమర్పించాల్సిన అవసరం లేదు. పాస్పోర్టుతో పాటు, ఇతర కేవైసీ వివరాలు ఇస్తే సరిపోతుంది. అదే కొన్ని సందర్భాల్లో అంటే 10,000 డాలర్లు మించి తీసుకెళుతుంటే వీసా కాపీలు కూడా జత చేయాల్సి ఉంటుంది.