వ్యయప్రయాసలకోర్చి పుణ్యం మూటగట్టుకోవడానికి చేసే తీర్థయాత్రలు అనాదిగా ఉన్నవే. వినోదం కోసం, ఆటవిడుపు కోసం చేసే విహారయాత్రలు కూడా తెలిసినవే. ఇటీవలి కాలంలో స్వస్థత కోసం, మానసిక ఉల్లాసం, ఆధ్యాత్మిక వికాసంతో పాటు శారీరక ఉత్తేజం కోసం యాత్రలు చేసే పర్యాటకులు పెరిగారు. ఇలాంటి పర్యాటకాన్ని ‘వెల్‌నెస్ టూరిజం’ అంటున్నారు. తీర్థయాత్రలు, వినోద విహార యాత్రలకు వెళ్లే పర్యాటకుల కంటే ఇటీవలి సంవత్సరాల్లో ‘వెల్‌నెస్ టూరిజం’ పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా వెల్‌నెస్ టూరిజం మార్కెట్ పరిమాణం 2015 నాటికి 56,320 కోట్ల డాలర్లు (రూ.35.83 లక్షల కోట్లు) మేరకు ఉంది. ప్రపంచవ్యాప్తంగా వెల్‌నెస్ టూరిజం మార్కెట్ వార్షిక వృద్ధి రేటు 6.8 శాతంగా నమోదవుతోందని ‘గ్లోబల్ వెల్‌నెస్ ఎకానమీ మానిటర్’ తాజా సంచిక వెల్లడించడం విశేషం. వెల్‌నెస్ టూరిజం మార్కెట్‌లో ప్రపంచవ్యాప్త వృద్ధి రేటును మించి భారత్ దాదాపు 20 శాతం వృద్ధి రేటుతో దూసుకుపోతోంది. ఇదే దూకుడు కొనసాగితే ఈ రంగంలో భారత్ 2020 నాటికి అగ్రస్థానంలో నిలవగలదని నిపుణుల అంచనా.
స్వస్థత నుంచి సౌందర్యం వరకు...
స్వస్థత పొందడం నుంచి సౌందర్యం పెంపొందించుకోవడం వరకు అనేక కారణాలతో పర్యాటకులు ‘వెల్‌నెస్ టూరిజం’ బాట పడుతున్నారు. ‘వెల్‌నెస్ టూరిజం’లో పర్యాటకులు రవాణా, వసతి సౌకర్యాల కోసం ఎక్కువ మొత్తంలో వెచ్చిస్తున్నారు. ఆ తర్వాత తాము ఆశించిన ప్రయోజనం మేరకు సౌందర్య చికిత్సలు, ఒత్తిడి నివారణ చికిత్సలు, యోగ, ధ్యానం, ప్రత్యామ్నాయ ఆహార చికిత్సలు, మూలికా చికిత్సలు, మసాజ్, స్పా వంటి సేవల కోసం వెచ్చిస్తున్నారు.
పని ఒత్తిడే ప్రధాన కారణం
ప్రపంచవ్యాప్తంగా వెల్‌నెస్ టూరిజం శరవేగంగా పెరుగుతుండటానికి పని ఒత్తిడే ప్రధాన కారణంగా ఉంటోందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వివిధరంగాల్లో పనిచేసే ఉద్యోగులు పని ఒత్తిడి కారణంగా ఆరోగ్య సమస్యల బారిన పడుతున్నారు. పని ఒత్తిడి ఫలితంగా ఉద్యోగుల్లో తలెత్తే ఆరోగ్యసమస్యల వల్ల ప్రపంచ ఆర్థికరంగం ఉత్పాదకత సుమారు 10–15 శాతం మేరకు తగ్గుతున్నట్లు అంతర్జాతీయ అంచనాలు చెబుతున్నాయి. పని ఒత్తిడి వల్ల పెరుగుతున్న ఆరోగ్య సమస్యలే వెల్‌నెస్ టూరిజం పెరుగుదలకు దోహదపడుతున్నాయని వివిధ అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మధ్యతరగతి జనాభా ఆర్థికంగా పరిపుష్టం కావడం, ప్రజల్లో ఆరోగ్య స్పృహ పెరగడం, వార్ధక్య నియంత్రణ వస్తువులు, సేవలపై ఆసక్తి పెరగడం, సౌందర్యం కోసం, వార్ధక్య నివారణ కోసం ఎంత మొత్తమైనా ఖర్చు చేసే తత్వం పెరగడం, ఒత్తిడిని అధిగమించడంతో పాటు ఆధ్యాత్మిక వికాసం, మానసిక ప్రశాంతత కోసం ఎంత దూరమైనా వెళ్లాలనుకోవడం వంటి కారణాలు ‘వెల్‌నెస్ టూరిజం’ రంగాన్ని వృద్ధి మార్గంలో పరుగులు తీయిస్తున్నాయి. తాజా లెక్కల ప్రకారం వెల్‌నెస్ టూరిజం రంగంలో అమెరికా అగ్రస్థానంలో కొనసాగుతుండగా, ఈ రంగంలో భారత్ పన్నెండో స్థానంలో నిలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ముప్పయి దేశాలు వెల్‌నెస్ టూరిజం కేంద్రాలుగా ఉంటున్నాయి. వాటిలో సుమారు 86 శాతం వెల్‌నెస్ టూరిజం వ్యాపారం తొలి ఇరవై స్థానాల్లో ఉన్న దేశాల్లోనే సాగుతోంది. భారత్‌లో వెల్‌నెస్ టూరిజం రంగం కొంత ఆలస్యంగా పుంజుకున్నా, గత కొద్ది సంవత్సరాలుగా శరవేగంగా వృద్ధి సాధిస్తోంది.
రిషికేశ్, ఉత్తరాఖండ్
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో హిమాలయాల వద్ద ఉండే రిషికేశ్ పుణ్యక్షేత్రంగా తరతరాలుగా ప్రసిద్ధి పొందింది. ఇదివరకు ఇక్కడకు వచ్చేవారిలో అత్యధికులు తీర్థయాత్రికులే ఉండేవారు. ఇప్పుడు పరిస్థితి కొంత మారింది. కేవలం పుణ్యం కోసం వచ్చే తీర్థయాత్రికులే కాదు, స్వస్థత, ప్రశాంతత వంటి పురుషార్థాల కోసం వచ్చే వెల్‌నెస్ టూరిస్టులను సైతం రిషికేశ్ విశేషంగా ఆకట్టుకుంటోంది. రిషికేశ్‌లో వంద ఎకరాల విస్తీర్ణంలో వెలసిన ‘ఆనంద’ రిసార్ట్స్‌కు దేశ విదేశాలకు చెందిన వెల్‌నెస్ టూరిస్టులు పెద్దసంఖ్యలో బారులు తీరుతున్నారు. ప్రిన్స్ చార్లెస్, కెమిల్లా దంపతులు నాలుగేళ్ల కిందట భారత్ వచ్చినప్పుడు ఇక్కడ కొద్దిరోజులు ప్రశాంతంగా గడిపి వెళ్లారు. చుట్టూ పచ్చని వనాలు, కనుచూపు మేరలో ధవళ కాంతులతో కనువిందు చేసే హిమాలయాలు ఇక్కడకు వచ్చే పర్యాటకులను ఇట్టే సేద దీరుస్తాయి. ‘ఆనంద’ రిసార్ట్స్‌లో సంప్రదాయ ఆయుర్వేద నిపుణుల ఆధ్వర్యంలో నిర్వహించే ఎనభై రకాల స్పా సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. రిషికేశ్‌లో మరికొన్ని ప్రకృతి వైద్య కేంద్రాలు, యోగ, ఆయుర్వేద కేంద్రాలు కూడా వెల్‌నెస్ టూరిస్టులకు ప్రత్యేక సేవలు అందిస్తున్నాయి.
భారత్‌లో ఆకట్టుకునే ప్రదేశాలు
భారత్‌లో వెల్‌నెస్ టూరిస్టులను ఆకట్టుకునే ప్రదేశాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా యోగ, ఆయుర్వేదంతో పాటు చక్కని పరిసరాలు, ప్రకృతి సౌందర్యంతో చూపరులను మంత్రముగ్ధులను చేసే ప్రదేశాలకు దేశ విదేశాల వెల్‌నెస్ టూరిస్టులు బారులు తీరుతున్నారు. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, కేరళ, కర్ణాటక, గుజరాత్, రాజస్తాన్, గోవా వంటి రాష్ట్రాలకు వెల్‌నెస్ టూరిస్టుల తాకిడి ఎక్కువగా ఉంటోంది. మన దేశంలో పెద్దసంఖ్యలో వెల్‌నెస్ టూరిస్టులను ఆకట్టుకునే టాప్–10 ప్రదేశాలు... వాటి వివరాలు...
బెంగళూరు
కర్ణాటక రాజధాని బెంగళూరు నగరం దేశంలో ప్రధానమైన ఐటీ హబ్‌గా పేరు పొందిన సంగతి తెలిసిందే. ఇది ఐటీ హబ్ మాత్రమే కాదు, వెల్‌నెస్ టూరిస్టులను విశేషంగా ఆకట్టుకుంటున్న విలక్షణ నగరం కూడా. ఏడాది పొడవునా చల్లని వాతావరణంతో ఉండే బెంగళూరుకు విదేశీ పర్యాటకులు రకరకాల పనుల మీద వస్తుంటారు. ఇటీవలి కాలంలో దేశ విదేశాల నుంచి వెల్‌నెస్ టూరిస్టులను ఆకట్టుకోవడంలో బెంగళూరు నగరం దేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తోంది. బెంగళూరులోని ఆయుర్వేదగ్రామ్ హెరిటేజ్ వెల్‌నెస్ సెంటర్, శ్రేయస్ యోగా రిట్రీట్ వంటి కేంద్రాలు వెల్‌నెస్ టూరిస్టులకు చక్కని విడిదిగా ఉంటున్నాయి.. ప్రశాంత వాతావరణంలో పచ్చని చెట్లతో నిండిన ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాలకు వెల్‌నెస్ టూరిస్టులు పెద్దసంఖ్యలో బారులు తీరుతుంటారు. సంప్రదాయ పద్ధతుల్లో చర్మ సమస్యలు, కీళ్ల సమస్యలు, జుట్టురాలడం, మానసిక కుంగుబాటు, అధిక బరువు వంటి రుగ్మతలకు ఇక్కడి నిపుణులు చికిత్స అందిస్తారు. ఇక్కడ కొద్దిరోజులు ప్రశాంతంగా గడిపితే యవ్వనోత్సాహం ఉరకలేస్తుందని పర్యాటకులు చెబుతుంటారు.
కోవళం, కేరళ
ఆయుర్వేదం భారతదేశం అంతటా వ్యాప్తిలో ఉన్న ప్రాచీన వైద్య ప్రక్రియే అయినా, గడచిన కొన్నేళ్లలో ఆయుర్వేదానికి కేరళ రాష్ట్రం బ్రాండ్ అంబాసిడర్‌లా మారింది. ముఖ్యంగా పంచకర్మ చికిత్సకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. వివిధ నగరాల్లో కేరళ పంచకర్మ ఆయుర్వేద కేంద్రాలు వెలసినా, వెల్‌నెస్ టూరిస్టులు మాత్రం ఈ చికిత్స కోసం నేరుగా కేరళ వెళ్లేందుకు మొగ్గు చూపుతున్నారు. కేరళలోని కోవళం పంచకర్మ ఆయుర్వేద చికిత్సకు ప్రధాన కేంద్రంగా ఉంటోంది. సౌందర్యపోషణ, వార్ధక్య నివారణ, ఒత్తిడి నివారణ చికిత్సల కోసం దేశ విదేశాలకు చెందిన పర్యాటకులు పెద్ద సంఖ్యలో ఎగబడుతున్నారు. కోవళంలోని ‘లీలా కోవళం’ పంచకర్మ చికిత్స, యోగా చికిత్సలకు ప్రధాన కేంద్రంగా పర్యాటకులను ఆకట్టుకుంటోంది. కోవళంలోనే సోమతీరం చికిత్స కేంద్రం కూడా వెల్‌నెస్ టూరిస్టులకు పంచకర్మ, ఆయుర్వేద, యోగ, ప్రకృతి ఆహార చికిత్సలను అందిస్తోంది.
గోవా
ఇటీవలి కాలంలో గోవాకు వెల్‌నెస్ టూరిస్టుల తాకిడి కూడా పెరిగింది. గోవాలో ప్రత్యేకమైన స్పాలు, ఆయుర్వేద, ప్రకృతి వైద్య కేంద్రాలు వెల్‌నెస్ టూరిస్టులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అరేబియన్ సముద్రపు అందాలను తిలకిస్తూ సేదదీరేందుకు వచ్చే పర్యాటకులు ఇక్కడ సౌందర్య పోషణ, వార్ధక్య నివారణ చికిత్సలను పొందేందుకు మక్కువ చూపుతున్నారు. గోవాలోని దివార్ దీవిలో ‘దేవాయ’ ఆయుర్వేద, ప్రకృతి వైద్య, యోగా కేంద్రం వెల్‌నెస్ టూరిస్టులకు వివిధ రకాల సేవలందిస్తోంది. ఇక్కడి నిపుణులు ఒత్తిడి నుంచి ఉపశమనానికి తగిన యోగ పద్ధతుల్లో చికిత్సను, ప్రకృతి సహజమైన సమతుల ఆహారాన్ని అందిస్తారు. మసాజ్, హైడ్రోథెరపీల ద్వారా పలు దీర్ఘకాలిక రుగ్మతలకు ఉపశమనం కలిగిస్తారు.
పుణే, మహారాష్ట్ర
మహారాష్ట్రలోని పుణే నగరం ప్రధానంగా వ్యాపార కేంద్రంగానే అందరికీ తెలుసు. ఇటీవలి కాలంలో ఈ నగరం వెల్‌నెస్ టూరిస్టులను ఆకట్టుకోవడంలో ముందంజలో నిలుస్తోంది. ఇక్కడ ఏర్పాటైన ఆత్మంతన్ కేంద్రం వెల్‌నెస్ టూరిస్టులకు సంప్రదాయ ఆయుర్వేద, యోగ, ప్రకృతి చికిత్సలతో పాటు పాశ్చాత్య పద్ధతులకు చెందిన రకరకాల మసాజ్‌లు, టర్కిష్ హమామ్ స్నానాలు, హైడ్రోథెరపీ, ఆక్యుప్రెషర్, బాడీ పాలిష్ వంటి విలక్షణమైన సేవలను అందిస్తోంది. ప్రాక్ పాశ్చాత్య పద్ధతులకు చెందిన సేవలన్నీ ఒకే కేంద్రంలో లభిస్తుండటంతో దేశ విదేశీ వెల్‌నెస్ టూరిస్టులు ఇక్కడకు క్యూ కడుతున్నారు. చర్మసౌందర్యం మెరుగుపరచడానికి, కండరాలు, కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనానికి ఇక్కడి చికిత్సలు ఎంతో బాగుంటున్నాయని, ఇక్కడి వాతావరణం ఒత్తిడిని ఇట్టే దూరం చేస్తోందని ఇక్కడకు వచ్చే పర్యాటకులు చెబుతుండటం విశేషం.
మెహ్‌సానా, గుజరాత్
గుజరాత్‌లోని చారిత్రక నగరం మెహ్‌సానా. ఇక్కడకు సాధారణంగా చరిత్రపై ఆసక్తి, పరిశోధనపై అభిలాష గల పర్యాటకులే ఇదివరకు ఎక్కువగా వస్తుండేవారు. ఇటీవలి కాలంలో ఈ నగరానికి వెల్‌నెస్ టూరిస్టుల రాక కూడా పెరుగుతోంది. మెహ్‌సానా నగరంలోని నింబా నేచర్ క్యూర్ సెంటర్ దేశ విదేశాలకు చెందిన వెల్‌నెస్ టూరిస్టులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ అధునాతన ప్రకృతి చికిత్స కేంద్రం విలక్షణ రీతుల్లో సౌందర్య పరిరక్షణ, వార్ధక్య నివారణ, స్థూలకాయ నివారణ చికిత్సలను అందిస్తోంది. వైబ్రో మసాజ్, అయాన్ డీటాక్స్, మడ్ బాత్, స్పైన్ బాత్, డైట్ థెరపీ వంటి చికిత్సల కోసం పెద్ద సంఖ్యలో వెల్‌నెస్ టూరిస్టులు ఇక్కడకు వస్తుంటారు.
సిమ్లా, హిమాచల్‌ప్రదేశ్
హిమాచల్‌ప్రదేశ్ రాజధాని సిమ్లా నగరానికి వినోదయాత్రల కోసం పర్యాటకులు వస్తుండటం చిరకాలంగా కొనసాగుతున్నదే. ఇటీవలి కాలంలో ఇక్కడకు వచ్చేవారిలో వెల్‌నెస్ టూరిస్టుల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. ఇక్కడ ఉన్న వైల్డ్ ఫ్లవర్ హాల్ కేంద్రం వెల్‌నెస్ టూరిస్టులకు వివిధ రకాల స్వస్థత సేవలను అందిస్తోంది. స్థూలకాయం, కీళ్లనొప్పులు, కండరాల నొప్పుల నుంచి ఉపశమనానికి, శరీరంలోని మలినాలను తొలగించుకునే డీటాక్స్ చికిత్సలు చేయించుకోవడానికి ఇక్కడకు వచ్చే పర్యాటకులు ఆసక్తి చూపుతుంటారు. రీవైటలైజింగ్ బాడీ థెరపీ, స్కిన్‌కేర్, నెయిల్ కేర్ వంటి ప్రత్యేక సౌందర్య చికిత్సలు, ఆయుర్వేద చికిత్సలు, యోగా, ప్రత్యేక స్నాన చికిత్సలు వంటి సేవలతో సేదదీరేందుకు వెల్‌నెస్ టూరిస్టులు ఇక్కడకు పెద్దసంఖ్యలో వస్తుంటారు.
ఆగ్రా, ఉత్తరప్రదేశ్
ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా నగరం చారిత్రక కట్టడమైన తాజ్‌మహల్‌కు ఆలవాలం. ప్రపంచ వింతల్లో ఒకటిగా పేరుగాంచిన తాజ్‌మహల్ అందాలను తిలకించేందుకే ఇక్కడకు ఎక్కువ మంది పర్యాటకులు వస్తుండేవారు. తాజ్‌మహల్ సందర్శనతో పాటు సంప్రదాయ చికిత్సలతో, యోగా, మసాజ్ వంటి సేవలతో ఒత్తిడి నుంచి ఉపశమనం పొందాలనుకునే వెల్‌నెస్ టూరిస్టులు కూడా ఇటీవలి కాలంలో ఎక్కువగా ఆగ్రాకు వస్తున్నారు. తాజ్ మహల్‌కు దాదాపు అరకిలోమీటరు దూరంలోని ‘అమర్‌విలాస్’ రిసార్ట్ వెల్‌నెస్ టూరిస్టులకు చక్కని విడిదిగా ఉంటోంది. ప్రత్యేకమైన స్పా, మసాజ్, రీవైటలైజింగ్ బాడీ థెరపీతో పాటు నెయిల్ కేర్, హెయిర్ కేర్, స్కిన్ కేర్ వంటి సౌందర్య పోషణ చికిత్సలు, యోగా, మెడిటేషన్ శిక్షణ, ప్రకృతి ఆహార చికిత్సలు వంటి సేవలు లభిస్తుండటంతో పర్యాటకులు ఇక్కడ బస చేసేందుకు ముచ్చటపడుతుంటారు.
అజబ్‌గఢ్, రాజస్తాన్
రాజస్తాన్‌లోని ఆరావళి పర్వతశ్రేణులపై ఉండే అజబ్‌గఢ్ పట్టణం చారిత్రక ప్రాంతంగా పేరుపొందింది. చరిత్ర, పురావస్తు పరిశోధనలపై ఆసక్తి ఉన్నవారే ఒకప్పుడు ఇక్కడకు ఎక్కువగా వచ్చేవారు. ఇక్కడి అమన్‌బాగ్ శాంక్చుయరీ అరుదైన పక్షులకు, జంతువులకు ఆలవాలంగా ఉంటోంది. చుట్టుపక్కల రాష్ట్రాల విద్యార్థులు అప్పుడప్పుడు ఇక్కడకు వచ్చిపోతుంటారు. అయితే, ఇటీవలి కాలంలో ఇక్కడ ఆయుర్వేద సౌందర్య చికిత్స, స్వస్థత కేంద్రాలు, యోగా కేంద్రాల వంటివి ఏర్పడటంతో వెల్‌నెస్ టూరిస్టుల తాకిడి పెరిగింది.
వెల్‌నెస్ టూరిజం రంగంలో మన దేశం శరవేగంగా అభివృద్ధి సాధిస్తున్నా, తెలుగు రాష్ట్రాలు రెండూ ఈ రంగంలో కొంత వెనుకబడే ఉన్నాయి. ప్రకృతి సౌందర్యానికి ఆలవాలమైన పర్యాటక ప్రదేశాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో తగినన్ని ఉన్నా, ఈ ప్రాంతాల్లో వెల్‌నెస్ టూరిస్టులను ఆకట్టుకోలేకపోతున్నాయి. వెల్‌నెస్ టూరిస్టులను ఆకట్టుకునే వసతులను ఈ ప్రదేశాల్లో ఏర్పాటు చేయడంపై తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు దృష్టి సారించినట్లయితే, ఈ రంగంలో తెలుగు రాష్ట్రాలో అభివృద్ధి సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
భారత్‌లో వెల్‌నెస్ టూరిజం
భారత ప్రభుత్వం 2002లో ‘ఇన్‌క్రెడిబుల్ ఇండియా’ నినాదంతో ప్రచారం ప్రారంభించిన తర్వాత దేశంలో వెల్‌నెస్ టూరిజం రంగం వేగంగా పుంజుకోవడం మొదలైంది. మన దేశంలో తరతరాల సంపదగా ఉన్న ఆయుర్వేదం, సిద్ధ వంటి ప్రాచీన వైద్య విధానాలు, శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతతను ఇచ్చే ధ్యానం, యోగా వంటి అనాది విద్యలు ఇక్కడకు వచ్చే వెల్‌నెస్ టూరిస్టులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. వెల్‌నెస్ టూరిస్టులుగా భారత్‌కు వస్తున్న వారిలో సామాన్య పర్యాటకులే కాకుండా, ప్రిన్స్ చార్లెస్, కెమిల్లా దంపతుల వంటి ప్రముఖులు కూడా ఉంటుండటం విశేషం. నాలుగేళ్ల కిందట భారత పర్యటనకు వచ్చిన ప్రిన్స్ చార్లెస్, కెమిల్లా దంపతులు రిషికేశ్‌లోని ఒక ఆశ్రమంలో ప్రశాంతంగా గడిపి వెళ్లారు. ఇతరేతర కారణాలపై వచ్చే పర్యాటకుల కంటే వెల్‌నెస్ టూరిజం కోసం వచ్చే పర్యాటకులు పెద్దమొత్తంలో డబ్బు ఖర్చు చేస్తుండటంతో ఈ రంగం నానాటికీ ఆర్థికంగా బలపడుతోంది. అంతర్జాతీయంగా వెల్‌నెస్ టూరిజం వార్షిక వృద్ధి రేటు 6.8 శాతం వరకు ఉంటే, భారత్‌లో ఈ రంగంలో వార్షిక వృద్ధి రేటు దాదాపు 20 శాతం వరకు ఉంటోంది. ఈ రంగంలో ఇదే దూకుడు కొనసాగితే 2020 నాటికి వెల్‌నెస్ టూరిజంలో భారత్ మొదటి స్థానానికి చేరుకోగలదని ఆర్థిక నిపుణులు, పర్యాటక రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment