వెనిజులా టూరిస్ట్ కార్లా స్టెఫానిక్ హత్యోదంతంతో.. ఒంటరిగా విహార యాత్రలకు వెళ్లే మహిళలు స్వేచ్ఛగా, సంతోషంగా పర్యటించి వచ్చే పరిస్థితులు నెలకొనేవరకు ‘సోలో ట్రిప్’ను వాయిదా వేసుకోవలసిందేనా అనే చర్చ మొదలైంది.
విహారయాత్రలు చేయడం.. అది కూడా ఒంటరిగా.. చాలా ఎగ్జయిటింగ్‌గా ఉంటుంది. అటువంటి సాహస యాత్రకు సంబంధించిన పదిలమైన ఙ్ఞాపకాలు స్నేహితులతో పంచుకుంటూ.. వీడియోల్లో బంధించడం మరొక సరదా. అయితే ఒక్కోసారి ఒంటరి ప్రయాణాలు జీవిత కాలపు విషాదాల్ని మిగులుస్తాయి. ఆప్తులను మనకు శాశ్వతంగా దూరంగా చేస్తాయి. ముఖ్యంగా మహిళలకు ఈ ఒంటరి ప్రయాణాలు ప్రాణాంతకంగా మారుతున్నాయని.. కార్లా స్టెఫానిక్ అనే మహిళ ఉదంతం హెచ్చరించింది. మహిళా ట్రావెలర్స్‌కు ఈ ప్రయాణాలు ఎంతవరకు క్షేమం అనే విషయం గురించి అంతర్జాతీయంగా చర్చను లేవనెత్తింది.
అమెరికా– వెనిజులా ద్వంద్వ పౌరసత్వం కలిగి ఉన్న కార్లా.. తన ముఫ్పై ఆరవ పుట్టిన రోజును కాస్త భిన్నంగా జరుపుకోవాలని భావించారు. అందుకు వేదికగా మధ్య అమెరికా దేశమైన కోస్టారికాను ఎంచుకున్న ఆమె.. ఐదు రోజుల పాటు తన ట్రిప్ సాఫీగా సాగేందుకు గేటెడ్ ఎయిర్‌బీఎన్‌బీ విల్లాలో బస చేయాలనుకున్నారు. ఎయిర్‌పోర్టుకు అత్యంత సమీపంలో ఉండటం, పరిశుభ్రమైన పరిసరాలు ఆకర్షించడంతో అక్కడే బస చేయాలని నిశ్చయించుకున్నారు. సంతోషంగా, సాఫీగా ట్రిప్ ముగించుకుని ఫ్లోరిడాకు తిరిగి వెళ్లాలని భావించారే గానీ.. అదే తనకు ఆఖరి రోజు అవుతుందని ఆమె ఏమాత్రం ఊహించలేకపోయారు.
ఆరోజు ఏం జరిగింది..?
సోలో ట్రావెలర్‌గా ప్రయాణం మొదలెట్టిన కార్లా.. తన అడ్వెంచర్ ట్రిప్ తాలూకు అనుభవాలను పంచుకునేందుకు స్నేహితురాలు లారా జైమ్‌కు ఫోన్ చేశారు. స్థానిక మార్కెట్లో ముచ్చటపడి కొనుక్కున్న ప్రత్యేకమైన చెవి దుద్దులను వీడియో కాల్‌లో.. ఆమెకు చూపించారు. రేపు ఉదయమే ఆమెను కలుస్తానని చెప్పి.. ఫోర్ట్ లారెడ్‌డేల్–హాలీవుడ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు వచ్చి తనని పికప్ చేసుకోకపోతే బాగోదు అంటూ స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చారు. అయితే ఆ సమయంలో విల్లాను కూడా చూపిస్తూ తన మనసేదో కీడు శంకిస్తోందని.. అయినా తాను ధైర్యంగా ఉన్నానని చెప్పి ఫోన్ కట్ చేశారు. కానీ ముందుగా అనుకున్నట్లుగా కార్లా నవంబర్ 28న జైమ్‌ను కలవలేకపోయారు.స్నేహితురాలితో మాట్లా డిన రాత్రే ఆమె దారుణ హత్యకు గురయ్యారు.
మనసు మాట వింటే బాగుండేది!
కార్లా బస చేసిన ఎయిర్‌బీఎన్‌బీ విల్లాకు సమీపంలోని అడవిలో.. సగం కాలిపోయి ప్లాస్టిక్ కవర్లలో చుట్టి ఉన్న కార్లా మృత దేహాన్ని కోస్టారికాన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హంతకుడిగా భావిస్తున్న విల్లా సెక్యూరిటీ గార్డును అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. ఈ ఘటన గురించి కార్ల ఫ్రెండ్ జైమ్ మాట్లాడుతూ.. ‘ ఆరోజు రాత్రి 8.20 నిమిషాలకు నాతో మాట్లాడుతున్న సమయంలో ఏదో అపాయం పొంచి ఉందని కార్లా ముందే ఊహించింది. కొన్నిసార్లు మెదడు, మనసు మనల్ని హెచ్చరిస్తాయి. అలాంటి సమయాల్లో మనసు మాట వినాల్సి ఉంటుంది. అయితే కార్లా అలా చేయలేదు. అందుకే తను దూరంగా వెళ్లిపోయింది’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
కార్లా ఒక్కరే కాదు..!
మగవారితో పోలిస్తే ఆడవాళ్లకు ఒంటరి ప్రయాణాలు అంత సురక్షితం కాదని ఇటువంటి ఘటనలు హెచ్చరిస్తున్నాయి. గతేడాది డిసెంబరులో మొరాకోలోని అట్లాస్ పర్వతాలను అధిరోహించడానికి వెళ్లిన లూసియా వెస్ట్‌రేగర్ (24– డెన్మార్క్), మారెన్ ఊలాండ్ (28)లు దారుణ పరిస్థితుల్లో శవాలై తేలగా.. అదే నెలలో బ్రిటన్ గ్రేస్ అనే మహిళ కూడా హత్యకు గురయ్యారు. వీళ్లే కాదు మూడేళ్ల క్రితం థాయ్‌లాండ్ పర్యటనకు వెళ్లిన 19 ఏళ్ల యువతి ఒకరు సామూహిక అత్యాచారానికి గురికాగా.. ఓ బెల్జియన్ మహిళను అత్యంత దారుణంగా హతమార్చాడో కామాంధుడు. అంతేకాదు మనదేశంలో కూడా ఇటీవల మహిళా పర్యాటకులపై అకృత్యాలు పెచ్చుమీరుతున్నాయి. కొన్ని నెలల క్రితం ఓ విదేశీ మహిళా ప్రయాణికురాలిని దేశ రాజధానిలో ఆటోవాలాలు ఇబ్బంది పెట్టడం, బుద్ధగయకు వచ్చిన మహిళతో గైడ్ అసభ్య ప్రవర్తనతో పాటు విదేశీ మహిళలపై పలు అత్యాచార ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం.
ఇలాంటి ఘటనల నేపథ్యంలో కొంతమంది మహిళా సోలో ట్రావెలర్స్ తమ అనుభవాల సారంతో కొన్ని జాగ్రత్తలను షేర్ చేసుకుంటున్నారు. ఏ ప్రాంతానికి వెళ్తున్నారో ఆ ప్రాంతానికి తగ్గట్టే డ్రెస్ వేసుకోవడం, ఒంటరి ప్రయాణం అన్న సంగతిని, బస చేస్తున్న ప్రదేశాల వివరాలు వగైరాలను బయటపెట్టకపోవడం, స్థానిక హెల్ప్‌లైన్స్ నంబర్లను దగ్గర పెట్టుకోవడం వంటివి చేస్తే ప్రమాదాల నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుందని సూచిస్తున్నారు. జరిగిన ఘటనలన్నిటినీ నిశితంగా పరిశీలించినట్లైతే వీటన్నింటికీ మగవారి అనుచిత ప్రవర్తనే కారణం అన్న విషయం స్పష్టంగా అర్థమవుతుంది. విచక్షణ కోల్పోకుండా, మనుషుల్లా ప్రవర్తించినపుడే ఇంటా బయటా మహిళలు సురక్షితంగా ఉండగలుగుతారనే విషయం పురుషులకు బోధపడితే ఎవరూ ఎవరిని నిందించాల్సిన పరిస్థితి ఏర్పడదు. ఆ పురుషుల కూతుళ్లు, సోదరీమణులు కూడా ఎక్కడైనా స్వేచ్ఛగా జీవించగలుగుతారు.
లింగ వివక్ష పోవాలి : ఫుమ్‌జిలే మియాంబో, ఐక్యరాజ్యసమితి మహిళా విభాగం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్
ఇంట్లో ఉన్నా బయటకు వెళ్లినా మహిళలపై అత్యాచారాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎక్కడ ఉన్నాం ఏం చేస్తున్నామనే అంశాలతో సంబంధం లేకుండా ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. సామాజిక అసమానతలు, లింగ వివక్షే ఇందుకు ప్రధాన కారణం. ఈ పరిస్థితులు మారాలి. ఇక ఒంటరి ప్రయాణాల్లో మగవారితో పోలిస్తే ఆడవాళ్లకే రిస్క్ ఎక్కువగా ఉంటోంది.
-సుష్మారెడ్డి యాళ్ల, సాక్షి వెబ్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment