
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో, ఎగువ రాష్ట్రాల్లో విస్తారంగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల కృష్ణా, గోదావరి, వంశధార నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయని, ఇలాంటి సమయంలో నదుల్లో విహారయాత్రలకు వెళ్లడం ఏ మాత్రం క్షేమకరం కాదని జల వనరుల శాఖ మంత్రి డాక్టర్ అనిల్‌కుమార్ యాదవ్ చెప్పారు. కొంత కాలం నదుల్లో విహార యాత్రలను వాయిదా వేసుకోవాలని ప్రజలకు సూచించారు. శుక్రవారం విజయవాడలో నీటి పారుదల శాఖ కార్యాలయంలో ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరరావు, 13 జిల్లాల చీఫ్ ఇంజినీర్‌లతో వరద ఉధృతి, జలాశయాల్లో నీటి నిల్వలు, సాగునీటి ప్రాజెక్టుల పనులపై సమీక్ష నిర్వహించారు.
దసరా పండుగ నేపథ్యంలో ప్రజలు పుణ్యస్నానాల కోసం గోదావరి, కృష్ణా నదుల్లోకి వెళ్తారని.. ఇలాంటి సమయంలో ప్రమాదం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఈలకు సూచించారు. అంతకుముందు చిత్తూరు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల ప్రగతిపై డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, తెలుగు గంగ, గాలేరు– నగరి, చిన్న నీటిపారుదల శాఖ ఇంజినీర్లుతో సమీక్షించారు.