శ్రీశైలం ప్రాజెక్ట్/విజయపురిసౌత్: ఎగువ నుంచి వరద తగ్గిపోవడంతో శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల గేట్లను సోమవారం సాయంత్రం మూసివేశారు. కృష్ణా బేసిన్‌లో వర్షం తగ్గడంతో జూరాలలో గేట్లను మూసివేయడంతోపాటు విద్యుత్ ఉత్పాదనను కూడా నిలిపివేశారు. తుంగభద్ర డ్యాం 19వ గేటు కొట్టుకుపోవడంతో సుంకేసుల బ్యారేజీకి ఓవర్‌ఫ్లో ప్రవాహం పెరిగింది. సుంకేసుల నుంచి శ్రీశైలానికి 77,598 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో వస్తోంది.
ఈ ప్రవాహంతోపాటు దిగువకు విడుదలవుతున్న నీరు, డ్యాం గరిష్టస్థాయి నీటిమట్టాన్ని బేరీజు వేసుకుని ఇంజనీర్లు శ్రీశైలం గేట్లను మూసివేశారు. సోమవారం సాయంత్రం సమయానికి డ్యాం నీటిమట్టం 881.20 అడుగులు కాగా, 194.3069 టీఎంసీలు నీరు నిల్వ ఉంది.
అదేవిధంగా నాగార్జునసాగర్ జలాశయంలో 588.80 అడుగులు నీటిమట్టంతో 308.4658 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ఎగువ నుంచి నాగార్జునసాగర్ జలాశయానికి 47,035 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా, అంతే నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి వచ్చే వరదను బట్టి మళ్లీ సాగర్ రేడియల్ క్రస్ట్‌గేట్లను ఎత్తే అవకాశం ఉంటుంది.
‘తుంగభద్ర గేటుకు వెంటనేమరమ్మతులు చేయాలి’
సాక్షి, అమరావతి: తుంగభద్ర ప్రాజెక్టుకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఏపీ రైతు సంఘం, కౌలు రైతు సంఘాలు, సీపీఎం రాష్ట్ర కమిటీ డిమాండ్ చేశాయి. ఈ మేరకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, ఏపీ రైతు సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వి.కృష్ణయ్య, కే ప్రభాకరరెడ్డి, కౌలు రైతు సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వై.రాధాకృష్ణ, ఎం.హరిబాబు సోమవారం వేర్వేరు ప్రకటనలు విడుదల చేశారు. ప్రాజెక్టు నుంచి నీరంతా వృథాగా పోతుండడంతో ఈ రెండు జిల్లాల్లోని ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment