హైదరాబాద్: శ్రీశైలం జలవిద్యుత్ వివాదంపై వెంటనే అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్ను టీటీడీపీ నేతలు డిమాండ్ చేశారు. శనివారం హైదరాబాద్లో టీటీడీపీ నేతలు ఎర్రబెల్లి, ఎల్ రమణ, రావుల చంద్రశేఖరరెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ... తాము రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతున్నట్లు స్పష్టం చేశారు. రైతుల ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉండాలని తెలంగాణ సర్కార్కు హితవు పలికారు. కేంద్రాన్ని, ఏపీ సీఎం చంద్రబాబును విమర్శిస్తూ కేసీఆర్ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
కేసీఆర్ వైఖరీతో నష్టపోయేది తెలంగాణే అని వారు స్పష్టం చేశారు. ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులందర్నీ కలిశామని తెలిపారు. ఏపీ నుంచి తమకు నిర్దిష్ట ప్రతిపాదనలు వస్తున్నాయి.... కానీ తెలంగాణ నుంచి మాత్రం ప్రతిపాదనలేవీ రావడం లేదని సాక్షాత్తూ కేంద్రమంత్రులే అంటున్నారని చెప్పారు. ఇప్పటికైనా మేల్కోవాలని టీటీడీపీ నేతలు కేసీఆర్ సర్కార్కు హితవు పలికారు.