విశాఖలో ఇన్ఫోసిస్ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం ఉద్యోగులతో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం/సాక్షి, అమరావతి: ఐటీ సేవల హబ్‌గా మారేందుకు విశాఖపట్నానికి అన్ని అవకాశాలు, సామర్థ్యాలు పుష్కలంగా ఉన్నాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. విశాఖలో ఇన్ఫోసిస్ సెంటర్ ప్రారంభోత్సవంలో పాలు పంచుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. టైర్ 1 సిటీగా విశాఖ రూపాంతరం చెందేందుకు ఇన్ఫోసిస్ రాక దోహదం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వివిధ ప్రభుత్వ రంగ సంస్థలతోపాటు 20 వేల మంది నేవీ ఉద్యోగులతో తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రంగా ఉన్న విశాఖ ఎడ్యుకేషన్ హబ్‌గా కూడా నిలిచిందని గుర్తు చేశారు.
ఇక్కడ ఇప్పటికే రెండు పోర్టులున్నాయని త్వరలోనే మూడో పోర్టు సమీపంలోని శ్రీకాకుళంలో రానుందని తెలిపారు. మరో రెండేళ్లల్లో పూర్తిస్థాయి అంతర్జాతీయ పౌర విమానాశ్రయం కూడా సిద్ధం కానుందని చెప్పారు. పరిశ్రమలకు ఏ సహాయం కావాలన్నా ఒక్క ఫోన్ కాల్ దూరంలో అందుబాటులో ఉంటామని పారిశ్రామికవేత్తలకు హామీ ఇచ్చారు. సోమవారం విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో పర్యటన సందర్భంగా విశాఖలో ఇన్ఫోసిస్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను సీఎం జగన్ ప్రారంభించారు.
ఫార్మా కంపెనీల నాలుగు యూనిట్లకు ప్రారంభోత్సవాలు, రెండు యూనిట్లకు శంకుస్థాపనలు నిర్వహించారు. మొత్తం రూ.1,646 కోట్ల విలువైన ఐటీ కార్యాలయాలు, ఫార్మా యూనిట్ల ఏర్పాటుతో 3,450 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది. విశాఖలో సముద్ర తీరం శుభ్రత కోసం జీవీఎంసీ సిద్ధం చేసిన ఆరు బీచ్ క్లీనింగ్ యంత్రాలను కూడా ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో సీఎం జగన్ ఏమన్నారంటే..
విశాఖకు విశేష సామర్థ్యం..
విశాఖ నగరానికి విశేషమైన సామర్ధ్యం ఉంది. హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై తరహాలో విశాఖపట్నం కూడా ఐటీ హబ్‌గా మారబోతోంది. ఆ స్ధాయిలో ఈ నగరానికి సహకారాన్ని అందిస్తున్నాం. రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ తరహా మెట్రో నగరం ఆంధ్రప్రదేశ్‌లో లేదు. ఐటీ, ఐటీ సేవలకు సంబంధించిన పరిశ్రమలు గతంలో విశాఖలో ఏర్పాటు కాలేదు. వాస్తవానికి ఆ కంపెనీల ఏర్పాటుకు కావాల్సిన అన్ని అర్హతలు, సామర్ధ్యం నగరానికి ఉన్నప్పటికీ అవన్నీ అప్పటి రాజధాని హైదరాబాద్‌లోనే ఏర్పాటయ్యాయి.
ఏపీలో విశాఖ అతిపెద్ద నగరం. టైర్ 1 సిటీగా ఎదగడానికి కావాల్సిన అన్ని అర్హతలు, సామర్ధ్యం ఈ నగరానికి ఉన్నాయి. ప్రథమశ్రేణి నగరంగా ఎదగడానికి అవసరమైన తోడ్పాటును ఇన్ఫోసిస్ అందించగలదని నేను బలంగా నమ్ముతున్నా. దాదాపు 3.28 లక్షల మంది ఉద్యోగులు, 18.5 బిలియన్ డాలర్ల రెవెన్యూ సామర్ధ్యం కలిగిన ఇన్ఫోసిస్‌తో పాటు టీసీఎస్, విప్రో లాంటి సంస్ధలు నగర ఐటీ స్వరూపాన్ని, ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చి వేస్తాయి. విశాఖకు ఇప్పుడు ఇన్ఫోసిస్ వచ్చింది. రానున్న రోజుల్లో మిగిలిన ఐటీ కంపెనీలు కూడా ఆ జాబితాలో చేరనున్నాయి.
విశాఖలో ఆదానీ డేటాసెంటర్ కూడా రాబోతుంది. సబ్‌మెరైన్ ఇంటర్నెట్ కేబుల్ మనకు ప్రత్యేకంగా సింగపూర్ నుంచి వస్తుంది. రాబోయే రెండేళ్లలో డేటా సెంటర్ రానుంది. క్లౌడింగ్‌తో పాటు ఐటీ రంగంలో చాలా మార్పులు రానున్నాయి. ఇవన్నీ సాకారం కానున్నాయి. నీలాంజన్, నీలాద్రిప్రసాద్, సురేష్, రఘు లాంటి ఐటీ నిపుణులతో మాట్లాడిన తర్వాత వీరంతా విశాఖ ఐటీలో కచ్చితంగా ఒకరోజు అద్భుతాలు సృష్టిస్తారని బలంగా విశ్వసిస్తున్నా. నాకు ఆ నమ్మకం ఉంది.
ఇవాళ 1,000 మందితో ఇక్కడ ప్రారంభమైన ఇన్ఫోసిస్ రానున్న రోజుల్లో మరింత విస్తరించాలని ఆకాంక్షిస్తున్నా. రాష్ట్ర ప్రభుత్వ సహకారం, ఇన్ఫోసిస్‌తో కలసి ఐటీ రంగంలో విశాఖ బహుముఖ ప్రగతిని సాధిస్తుందన్న విశ్వాసం నాకుంది. రానున్న రోజుల్లో విశాఖలో పెట్టుబడులకు అనేక మంది ముందుకొచ్చే అవకాశాలున్నాయి. అందుకు అనుగుణంగా పారిశ్రామికవేత్తలకు అవసరమైన సహకారాన్ని అందించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాం.
ఇప్పటికే ఎడ్యుకేషన్ హబ్
విశాఖలో ఇప్పటికే అత్యంత ప్రతిష్టాత్మక సంస్ధలు ఏర్పాటయ్యాయి. 14 ఇంజనీరింగ్ కాలేజీలు, 8 యూనివర్సిటీలు, 4 మెడికల్ కాలేజీలు, 12 డిగ్రీ కాలేజీలతో విశాఖ ఎడ్యుకేషన్ హబ్‌గా ఉంది. ఇక్కడి నుంచి ఏటా దాదాపు 12 వేల నుంచి 15 వేల మంది ఇంజనీర్లు డిగ్రీ పూర్తి చేసుకుని వస్తున్నారు. వీటితో పాటు ఐఐఎం, నేషనల్ లా యూనివర్సిటీ లాంటి అత్యంత ప్రతిష్టాత్మక సంస్ధలు కూడా విశాఖలో ఉన్నాయి. ఇదీ విశాఖ సామర్ధ్యం. ఇక్కడే ఐవోసీతోపాటు తూర్పు నౌకా దళం ప్రధాన కేంద్రం కూడా ఉంది. విశాఖ, గంగవరం లాంటి రెండు బలమైన పోర్టులు కూడా ఉన్నాయి. వీటితో పాటు శ్రీకాకుళంలో మూడో పోర్టు వస్తోంది.
మధురవాడ ఐటీ హిల్స్‌లో ఇన్ఫోసిస్
గన్నవరం నుంచి విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న ముఖ్యమంత్రి జగన్ తొలుత మధురవాడ ఐటీ హిల్స్‌లో రూ.35 కోట్లతో ఏర్పాటైన ఇన్ఫోసిస్ డెవలప్‌మెంట్ సెంటర్‌ని ప్రారంభించారు. సంస్థ ప్రాంగణమంతా పరిశీలించారు. అనంతరం గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) సముద్రతీర ప్రాంత శుభ్రత కోసం రూ.15 కోట్లతో ఏర్పాటు చేసిన 6 బీచ్ క్లీనింగ్ యంత్రాలను ప్రారంభించారు. క్లీనింగ్ యంత్రాలపైకి ఎక్కి అవి ఎలా పనిచేస్తాయన్న వివరాలను ముఖ్యమంత్రి ఆరా తీశారు. ఆ తరువాత పరవాడ చేరుకుని రూ.500 కోట్లతో ఫార్మాసిటీలో 19.34 ఎకరాల్లో ఏర్పాటైన అరబిందో ఫార్మా అనుబంధ సంస్థ యూజియా స్టెరిలైజ్ యూనిట్‌ను ప్రారంభించారు.
ఈ సంస్థ ఏటా 420 మిలియన్ సామర్థ్యం కలిగిన జనరల్ ఇంజెక్టబుల్స్‌ను తయారు చేయనుంది. అనంతరం అచ్యుతాపురంలో లారస్ సంస్థ రూ.440 కోట్లతో నిర్మించిన ఫార్ములేషన్ బ్లాక్‌ను, రూ.191 కోట్లతో ఏర్పాటైన యూనిట్–2ను సీఎం ప్రారంభించారు. లారస్ రూ.240 కోట్లతో 450 మందికి ఉపాధి కల్పించేలా నిర్మించనున్న యూనిట్–3తో పాటు మరో రూ.240 కోట్లతో ఇదే సంస్థ పరవాడ వద్ద నిర్మించనున్న యూనిట్–7కు సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. ఫార్మా ఉత్పత్తుల గురించి అడిగి తెలుసుకున్నారు.
కాగా పరిపాలన రాజధానిగా శరవేగంగా ముస్తాబవుతున్న విశాఖకు అక్టోబర్‌కే తరలి వెళ్లాల్సి ఉన్నా కార్యాలయాలు ఇంకా పూర్తి స్థాయిలో సిద్ధం కాకపోవడం, విస్తృత భద్రతా కారణాల దృష్ట్యా అధికారుల సూచనల మేరకు డిసెంబర్‌లో వెళ్లే అవకాశం ఉందని సీఎం సమావేశంలో చెప్పారు.
ఈ కార్యక్రమాల్లో ఇన్ఫోసిస్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నీలాంజన్ రాయ్, వైస్ ప్రెసిడెంట్ నీలాద్రి ప్రసాద్ మిశ్రా, లారస్ సీఈవో సత్యనారాయణతో పాటు డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, మంత్రులు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్‌నాథ్, ఆదిమూలపు సురేష్, విడదల రజని, మేయర్ హరివెంకటకుమారి, ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, డా.సత్యవతి, గొడ్డేటి మాధవి, ఉత్తరాంధ్ర వైఎస్సార్‌సీపీ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, కలెక్టర్ డా.మల్లికార్జున, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
40 శాతం మహిళా ఉద్యోగులే
1981లో ఏర్పాటైన ఇన్ఫోసిస్ భవిష్యత్తు డిజిటల్ సేవలు, కన్సల్టింగ్‌లో ప్రపంచవ్యాప్తంగా అగ్రగామిగా ఉంది. 56 దేశాలలో 274 చోట్ల సంస్థ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సెక్యూరిటీస్ డీలర్స్ ఆటోమేటెడ్ కొటేషన్స్ (నాస్‌డాక్) జాబితాలో భారత తొలి ఐటీ కంపెనీగా ఇన్ఫోసిస్ రికార్డు సృష్టించింది. ప్రస్తుతం ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ సుమారు 71.01 బిలియన్ డాలర్లుగా ఉంది.
ఇన్ఫోసిస్‌లో ప్రపంచవ్యాప్తంగా 3,50,000 మంది ఉద్యోగులు పని చేస్తుండగా వీరిలో 40 శాతం మంది మహిళా ఉద్యోగులే కావడం గమనార్హం. 2023లో ప్రపంచంలో అత్యంత నైతికత (ఎథికల్) సంస్థలలో ఒకటిగా ఇన్ఫోసిస్ గుర్తింపు పొందింది. టైమ్ మ్యాగజైన్ టాప్ 100 ప్రపంచ అత్యుత్తమ సంస్థలు 2023 జాబితాలో ఉన్న ఏకైక భారతీయ సంస్థగా ఇన్ఫోసిస్ నిలిచింది. గ్లోబల్ టాప్ ఎంప్లాయర్ 2023 సర్టిఫికేషన్‌ను సొంతం చేసుకుంది.
అలల ప్రేరణతో కార్యాలయం
టాలెంట్ స్ట్రాటజీలో భాగంగా ప్రతిభా కేంద్రాలకు దగ్గరగా డెవలప్‌మెంట్ సెంటర్లను ఏర్పాటు చేయాలని ఇన్ఫోసిస్ నిర్దేశించుకుంది. మంగళూరు, మైసూర్, త్రివేండ్రం, నాగ్‌పూర్, ఇండోర్, జైపూర్, హుబ్లీ, చండీగఢ్, భువనేశ్వర్, కోయంబత్తూర్ లాంటి టైర్ 2 నగరాల్లో డెలివరీ కేంద్రాలను ఏర్పాటు చేసింది. తాజాగా విశాఖలో సేవలను ప్రారంభించింది. మధురవాడలోని ఐటీ హిల్ నం.2లో ఉన్న సిగ్నిటివ్ టవర్స్‌లో లీజుకు తీసుకున్న బిల్డ్ అప్ స్థలంలో కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది.
విశాఖకు సహజ అందాలను తీసుకొచ్చిన సముద్రపు అలల ప్రేరణతో కార్యాలయంలోని ఇంటీరియర్ డిజైన్ రూపొందించారు. జావా, జే2ఈఈ, శాప్, డేటాసైన్స్, డేటా అనలటిక్స్ లాంటి సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎనర్జీ – యుటిలిటీ, రిటైల్ సహా బహుళ పరిశ్రమలకు ప్రపంచవ్యాప్తంగా క్లెయింట్స్ సేవలను ఈ కేంద్రం నుంచి అందిస్తారు.
ఇక్కడ పనిచేసే ఉద్యోగులలో సింహభాగం విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం పరిసర ప్రాంతాలకు చెందినవారే ఉన్నారు. కాగా మరింత మంది నియామకం కోసం విశాఖలోని వివిధ కళాశాలలతో ఇన్ఫోసిస్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇన్ఫోసిస్ రాక విశాఖలో ఐటీ పరిశ్రమ వృద్ధిపై ప్రత్యక్ష ప్రభావం చూపనుంది. ఇప్పటికే ఉన్న బీపీవో/కేపీవో పరిశ్రమలతో పాటు కోర్ ఐటీ కంపెనీలతో కలసి ఎమర్జింగ్ టెక్నాలజీ హబ్‌గా విశాఖ అడుగులు వేసేందుకు దోహదం చేయనుంది.
Comments
Please login to add a commentAdd a comment