India Skills Report
-
‘ఫ్యూచర్ స్కిల్స్’లో ఏపీకి అగ్రాసనం
సాక్షి, అమరావతి: నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట వేస్తూ యువతను ఉపాధి వైపు నడిపించడంలో మన రాష్ట్రం యావత్ దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. పరిశ్రమల నిర్దిష్ట అవసరాలకు తగ్గట్టుగా భవిష్యత్ నైపుణ్యాలు (ఫ్యూచర్ స్కిల్స్) కలిగిన మానవ వనరులను తయారు చేయడం, ఇంటర్న్‌షిప్ కోరుకుంటున్న విద్యార్థుల విషయంలో ఏపీ అగ్రశ్రేణిలో కొనసాగుతోంది. 21వ శతాబ్దపు విద్యార్థులను ‘కృతిమ మేధ’ (ఏఐ)సృష్టికర్తలుగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంకల్పానికి ‘ఇండియా స్కిల్స్ రిపోర్టు–2024’ ఊతం ఇచ్చింది. ఈ క్రమంలోనే భవిష్యత్ నైపుణ్యాల కల్పనలో 76.15 శాతం స్కోర్‌తో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలవడం విశేషం. ఆ తర్వాతి స్థానాల్లో కర్ణాటక, మహారాష్ట్ర ఉన్నాయి. టాలెంట్ అసెస్మెంట్ ఏజెన్సీ ‘వీబాక్స్’ ఏటా ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ), కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్త్రీ (సీఐఐ), అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీ (ఏఐయూ)తో కలిసి ‘ఇండియా స్కిల్స్ రిపోర్టు’ను విడుదల చేస్తోంది. భవిష్యత్‌లో పరిశ్రమల డిమాండ్లు, సాంకేతిక పురోగతులకు అనుగుణంగా శ్రామిక శక్తిని సిద్ధం చేయడంలో బలమైన ప్రాధాన్యతను ప్రదర్శిస్తోందని తాజా నివేదిక ప్రశంసించింది. ఇక నైపుణ్యాభివృద్ధిలో తీసుకొచ్చిన విప్లవాత్మక చర్యలతో ఆంగ్లం, న్యూమరికల్, క్రిటికల్ థింకింగ్, కంప్యూటర్ నైపుణ్యాల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తోంది. అత్యధిక న్యూమరికల్ స్కిల్స్ (సంఖ్యాపర నైపుణాలు) కనబరుస్తున్న సిటీల్లో బెంగళూరు తొలి స్థానంలో నిలవగా.. ఆ తర్వాత విజయవాడ, గుంటూరు ఉండటం విశేషం. ఇంటర్న్‌షిప్‌లోనూ టాప్ విద్యార్థులకు పాఠ్యాంశాల విజ్ఞానంతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్‌కు పెద్దపీట వేయాలన్న సీఎం వైఎస్ జగన్ నిర్ణయం సత్ఫలితాలను ఇస్తోంది. ఇందుకోసం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉన్నత విద్యలో 10 నెలల ఇంటర్న్‌షిప్‌ను దేశంలోనే ప్రప్రథమంగా తీసుకొచ్చారు. విద్యార్థులు మంచి ఉద్యోగాలు సాధించేలా ఓవైపు ఇంటర్న్‌షిప్.. మరోవైపు నైపుణ్య శిక్షణను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఈ క్రమంలోనే ఇప్పటివరకు వర్చువల్, హ్యాండ్ ఎక్స్‌పీరియన్స్‌లో సుమారు 8 లక్షల మందికి షార్ట్‌టెర్మ్, లాంగ్ టెర్మ్ ఇంటర్న్‌షిప్ అవకాశాలను కల్పించింది. ఇండియా స్కిల్స్ రిపోర్టు ప్రకారం వరుసగా రెండో ఏడాది ఇంటర్న్‌షిప్‌కు ఆసక్తి వ్యక్తం చేస్తున్న విద్యార్థులు గల రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. గతేడాది 93.50 శాతం స్కోరు సాధిస్తే.. ఇప్పుడు 98.33 శాతాన్ని నమోదు చేసింది. ఆ తర్వాత 96.72 శాతంతో తెలంగాణ, 93.44 శాతంతో పంజాబ్, 92.44 శాతంతో హర్యానా ఉన్నాయి. వచ్చే జనవరిలో మరో 2.20 లక్షల మందికి ఇంటర్న్‌షిప్ 22 ఎడ్యుటెక్ సర్విస్ ప్రొవైడర్ల ద్వారా స్టేట్, గ్లోబల్ ఇంటర్న్‌షిప్‌ను రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది. ఇప్పటికే అంతర్జాతీయ ఎడ్యుటెక్ సర్వీస్ ప్రొవైడర్లతో పాటు 27 వేలకుపైగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా, భారీ పరిశ్రమలను కళాశాలలకు అనుసంధానం చేసి వర్చువల్, హ్యాండ్స్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేలా ఇంటర్న్‌షిప్ అవకాశాన్ని కల్పించింది. ఉద్యోగాల కల్పనలోనూ మేటి ఆంధ్రప్రదేశ్ అంతటా ఉద్యోగ అవకాశాల విస్తృతిలో సమతుల్యతను ప్రదర్శిస్తోందని నివేదిక కొనియాడింది. గతంతో పోలిస్తే ఉపాధి వనరులను మెరుగుపర్చుకుని ఏపీ అగ్రగామి రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచింది. గతేడాది 65.58 శాతం స్కోరుతో 4వ స్థానంలో ఉండగా.. తాజాగా 72.38 శాతం స్కోరుతో 3వ స్థానానికి చేరుకుంది. హర్యానా (76.47శాతం), మహారాష్ట్ర (73.03 శాతం) తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో మెట్రోస్థాయి నగరాలు లేనప్పటికీ ఇంతటి గణనీయమైన స్థాయిలో నిలవడం చిన్న విషయం కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి ప్రధాన మెట్రోపాలిటన్ నగరాలు లేకపోవడం, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, ముంబై, ఢిల్లీ వంటి పారిశ్రామిక కేంద్రాలతో పోటీపడీ మరి ఆంధ్రప్రదేశ్ అద్భుతమైన పనితీరుతో అత్యున్నతంగా నిలిచిందని నివేదిక ఊటంకించింది. సీఎం జగన్ దార్శనికతో ఐటీ, ఇతర పరిశ్రమల రాకతో ఉద్యోగ, ఉపాధి కల్పనలో ఏపీ మెరుగైన ఫలితాలనే సాధించింది. ఇప్పుడు అన్ని వయసు్కలకు ఉపాధి బాగుందని, ముఖ్యంగా 18–21 ఏళ్ల వయసు్కల్లో (73.10 శాతం స్కోరు) ఉద్యోగాల అందించడంలో నాల్గవ స్థానంలో ఉంది. మహిళలు, పురుషులకు ఉపాధి, ఉద్యోగాల కల్పిస్తున్న అంశంలోనూ ఏపీ 3వ స్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా ఎంబీఏలో ఎక్కువ ఉద్యోగ అవకాశాలు దక్కుతుంటే ఆ తర్వాత బీఈ/బీటెక్‌లో లభిస్తున్నాయి. ఈ లెక్కన బీఈ/బీటెక్ విద్యార్థులకు ఎక్కువ ఉద్యోగాలు అందిస్తున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ (73.32 శాతం స్కోరుతో) 2వ స్థానంలో నిలిచింది. మహారాష్ట్ర అగ్రస్థానాన్ని కైవసం చేసుకోగా.. కేరళ, కర్ణాటక మూడు నాలుగు స్థానాల్లో ఉన్నాయి. ఐటీలో 68.44 శాతం, కంప్యూటర్ సైన్స్‌లో 66 శాతం, ఆ తర్వాత ఎల్రక్టానిక్స్, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విద్యార్థులకు ఎక్కువ ఉద్యోగాలు లభిస్తున్నాయి. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా గతేడాది సాంకేతిక విద్యార్థులకు ఏకంగా 1.20 లక్షలకు పైగా క్యాంపస్ ఉద్యోగాలు వచ్చాయి. గొప్ప టాలెంట్ రిజర్వాయర్! దేశంలో పరిశ్రమలకు తగిన నైపుణ్యాలు కలిగిన మానవ వనరులను సరఫరా చేయడంలో ఆంధ్రప్రదేశ్‌ను ‘టాలెంట్ రిజర్వాయర్’గా నివేదిక అభివర్ణించింది. విద్యార్థులకు మెరుగైన విద్య విషయంలో దృఢమైన నిబద్ధత, విభిన్న నైపుణ్యాల సాధికారత కల్పనలో చిత్తశుద్ధిని లేకుండా ఇతంటి వృద్ధి సాధ్యపడదని పేర్కొంది. భవిష్యత్ పారిశ్రామిక అవసరాల్లో ఏపీ కీలకంగా మారుతుందని, కంపెనీలకు స్వర్గధామంగా ఉంటోందని కొనియాడింది. ఉద్యోగాల్లో రూ.2.60 లక్షలు, అంతకంటే ఎక్కువ వేతనాన్ని కోరుకునే తొలి ఐదు రాష్ట్రాల జాబితాలో కేరళ, మహారాష్ట్ర తర్వాత ఆంధ్రప్రదేశ్ చోటు దక్కించుకుంది. ముఖ్యంగా బీఈ/బీటెక్ విద్యార్థుల్లో నైపుణ్యాలు గణనీయంగా మెరుగుపడినట్టు చెప్పింది. ఏపీలో అర్బన్, సెమీ అర్బన్ ప్రాంతాలే ఎక్కువ. కానీ, నైపుణ్యం కలిగిన ఉద్యోగానికి సిద్ధంగా ఉన్న మహిళా వర్క్పోర్స్లో మెట్రోపాలిటిన్ సిటీలను కూడా వెనక్కినెట్టింది. 39.96 శాతం స్కోర్‌తో హర్యానా తర్వాతో రెండో స్థానంలో నిలుస్తోంది. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, పంజాబ్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. సీఎం దార్శనికతకు నిదర్శనం భవిష్యత్ ప్రపంచం కృత్రిమ మేధపై ఆధారపడుతుంది. అలాంటి తరుణంలో మన విద్యార్థుల్లో ఫ్యూచర్ స్కిల్స్ అభివృద్ధి చేయాలి. ప్రపంచంలోనే ఏపీ విద్యార్థులను అగ్రస్థానంలో నిలపాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంకల్పిం చారు. అందుకే విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధితో పాటు ఉద్యోగ అవకాశాలను పెంపొందించే దిశగా చర్యలు చేపట్టారు. వాటిని ఫలితాల ప్రతిరూపం తాజా ఇండియా స్కిల్స్ నివేదిక ద్వారా వెల్లడైంది. దేశంలోనే ‘ఫ్యూచర్ స్కిల్స్ రెడీస్’లో మనం టాప్‌గా నిలవడం సంతోషంగా ఉంది. ఏఐలో పరిపూర్ణ విజ్ఞానవంతులుగా మన విద్యార్థులను తీర్చిదిద్దుతున్నాం. ఇప్పటికే ఎల్ఎంఎస్ ఆన్లైన్ పోర్టల్ ద్వారా సర్టిఫికెట్ కోర్సులను అందిస్తున్నాం. పరిశ్రమల భాగస్వామ్యంతో రిసోర్స్ సెంటర్లు, ఇన్నోవేటివ్ ల్యాబ్స్‌ను పెడతాం. – కె.హేమచంద్రారెడ్డి, చైర్మన్, ఉన్నత విద్యామండలి -
గణితంలో గర్వించేలా! స్కిల్ టాలెంట్ లో ఏపీ అదరహో
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా ఉద్యోగావకాశాలు విస్తృతంగా ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ నాలుగో స్థానంలో ఉంది. ప్రతిభ కలిగిన యువతతో 65.58 శాతం స్కోరు సాధించింది. ఇక ఆంగ్లం, గణితం నైపుణ్యాల్లో అగ్రశ్రేణిలో నిలిచింది. ఇండియా స్కిల్ నివేదిక 2023లో కేంద్ర ప్రభుత్వం ఈ అంశాలను వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక, సాంకేతిక మౌలిక సదుపాయాలు మెరుగ్గా ఉన్నాయని తెలిపింది. 2022లో ఏపీ అత్యధిక వృద్ధి సాధించినట్లు నివేదికలో పేర్కొంది. అందులో ముఖ్యాంశాలు ఇవీ.. ♦ అత్యధికంగా ఉపాధి కల్పించే రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ (72.7 శాతం) మొదటి స్థానంలో ఉండగా 69.8 శాతంతో మహారాష్ట రెండో స్థానంలో ఉంది. 68.9 శాతంతో ఢిల్లీ మూడో స్థానంలో నిలవగా 65.58 శాతంతో ఆంధ్రప్రదేశ్ నాలుగో స్థానంలో నిలిచింది. రాజస్థాన్, కర్నాటక వరుసగా తరువాత స్థానాల్లో ఉన్నాయి. ♦ ఏపీలో యువత ఉపాధి అవకాశాలను పెంపొందించేలా నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పీఎం కేవీవై ద్వారా రాష్ట్రంలో నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు పెద్దఎత్తున కొనసాగుతున్నాయి. ♦ ఆంగ్లం, గణితంలో చక్కటి నైపుణ్యాలున్న తొలి ఐదు రాష్ట్రాల సరసన ఆంధ్రప్రదేశ్ చోటు సాధించింది. గణితంలో మంచి నైపుణ్యం ఉన్న యువత లభ్యతలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. ఇంగ్లీషు ప్రావీణ్యం కలిగిన యువత లభ్యత రాష్ట్రాల్లో ఏపీ మూడో స్థానంలో ఉంది. ♦ ఆంధ్రప్రదేశ్‌లో 22 – 25 ఏళ్ల వయసున్న యువత ఉపాధి స్కోరు 64.36 శాతం ఉంది. ♦ మహిళలకు అత్యధికంగా ఉపాధి కల్పించే వనరులు రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్నాయి. ఒడిశా, ఢిల్లీలో పురుషులకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పన వనరులున్నాయి. రానున్న సంవత్సరాల్లో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, ఒడిశా, కేరళలో ఉపాధి అవకాశాలు మరిన్ని పెరుగుతాయి. ♦ ఘజియాబాద్, తిరుపతి, కర్నూలు, మంగుళూరు తదితర పది నగరాల్లో నైపుణ్యం కలిగిన మహిళా కార్మిక వనరులు అందుబాటులో ఉన్నాయి. ♦ న్యూమరికల్ స్కిల్స్ అత్యధికంగా ఉన్న నగరాల్లో చిత్తూరు, అమలాపురం ఉన్నాయి, ♦ ఆంగ్ల భాషతోపాటు బిజినెస్ కమ్యూనికేషన్ నైపుణ్యాలున్న నగరాల్లో ముంబై, తిరుపతి, పుణే ముందు వరుసలో ఉన్నాయి. -
Bachelor of Commerce: బీకాం.. భలే గిరాకీ!
సాక్షి, హైదరాబాద్: సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు వార్షిక ప్యాకేజీ రూ.20 లక్షలు అంటే.. అబ్బో అంటారు. కానీ ఇప్పుడు బీకాం చేసిన విద్యార్థికే ఏడాదికి రూ.21 లక్షల ప్యాకేజీ ఇస్తున్నారంటే నమ్మగలమా? నమ్మాల్సిందే! అంతర్జాతీయ సంస్థలే కాదు, భారత్‌లోని కంపెనీలూ ఇప్పుడు అనలిస్ట్‌లకు ఇంతకన్నా ఎక్కువ ప్యాకేజీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. 2023లో 60 శాతం వరకు అవకాశాలు వారికే దక్కే అవకాశం ఉందని ఇండియా స్కిల్ రిపోర్టు– 2023 చెబుతోంది. భవిష్యత్తులోనూ కామర్స్ చేసిన వారికి మంచి వేతనంతో కూడిన ఉద్యోగాలు లభిస్తాయని స్పష్టం చేస్తోంది. వాస్తవానికి గత ఆరేళ్ల నుంచే డిమాండ్ పెరుగుతూ వస్తోందని పేర్కొంది. 2017లో 37.98 శాతం బీకాం విద్యార్థులు ఉద్యోగాలు పొందితే, 2023లో ఇది ఊహించని విధంగా ఏకంగా 60.62 శాతానికి చేరుకోబోతోందని వివరించింది. ఇక బీటెక్‌లో కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్, సైబర్ క్రైం కోర్సుల విద్యార్థులకు ఎక్కువ అవకాశాలుంటాయని తెలిపింది. అన్ని రంగాల్లో పెరిగిన అవకాశాలు.. కరోనా తర్వాత వాణిజ్య రంగంలో పెద్ద మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ–కామర్స్ అనూహ్యంగా అభివృద్ధి చెందింది. అంతర్జాతీయంగా బహుళజాతి కంపెనీల్లో డేటా అనాలసిస్ వ్యవస్థ పెరిగింది. దీంతో అనలిస్ట్‌ల అవసరం పెరిగింది. బీకాం నేపథ్యం ఉన్న విద్యార్థులకు అంతర్జాతీయంగా డిమాండ్, తద్వారా ఉపాధి పెరగడానికి ఇది దోహద పడింది. ఇండియాలో బీకామ్‌కు ఉద్యోగావకాశాలు ఐదేళ్లలో దాదాపు 30 శాతం పెరిగినట్టు తెలుస్తోంది. దీంతో పాటు జీఎస్టీ తీసుకొచ్చిన తర్వాత ట్యాక్స్ నిపుణుల ప్రాధాన్యత ఎక్కువైంది. గతంలో ఉన్న ఇన్‌కం ట్యాక్స్‌కు, ఇప్పటి జీఎస్టీకి చాలా తేడాలున్నాయి. ఇదే కాలంలో డిజిటల్ చెల్లింపులు ఎక్కువగా పెరిగాయి. వీటన్నింటినీ సమన్వయం చేయడానికి ట్యాక్స్ నైపుణ్యతను పెంచుకోవాల్సిన అవసరం ఏర్పడింది. బ్యాంకింగ్, ఫైనాన్స్, రిటైల్ బిజినెస్ రంగాల్లో కూడా కామర్స్ నేపథ్యం ఉన్న సిబ్బంది అవసరం పెరిగింది. ఈ నేపథ్యంలోనే అనలిస్ట్ ఉద్యోగుల వేతనం మూడేళ్ళల్లోనే 98 శాతం పెరిగినట్టు ఇండియా స్కిల్ నివేదిక పేర్కొంది. బీకాం కోర్సుల్లో వచ్చిన మార్పులు కూడా ఈ పరిస్థితికి కారణమని తెలిపింది. బీకాం కోర్సులకు క్రేజ్ అందివస్తున్న మార్కెట్ అవసరాల నేపథ్యంలో రాష్ట్రంలో బీకాం కోర్సులకు రానురాను డిమాండ్ పెరుగుతోంది. డిగ్రీ ప్రవేశాల్లో 41 శాతం వరకు బీకాం విద్యార్థులే ఉంటున్నారు. వాస్తవానికి ఆరేళ్ళ కిందట 46 శాతం సైన్స్ విద్యార్థులే ఉండేవాళ్ళు. ఇప్పుడు వీరి సంఖ్య 36 శాతానికి పడిపోయింది. 2017–18లో 80,776 మంది బీకాం కోర్సులో చేరితే, 2022–23లో 87,480 మంది చేరారు. అంతర్జాతీయంగా ఉన్న డిమాండ్‌ను అందుకోవడానికి వీలుగా బీకాం కోర్సుల్లో తీసుకొచ్చిన మార్పులు ఇందుకు దోహదపడ్డాయి. బీకాంలో జనరల్, కంప్యూటర్స్, ట్యాక్సేషన్, ఆనర్స్, బిజినెస్ అనలిటిక్స్ వంటి కొత్త కోర్సులు ఉపాధి అవకాశాలు పెంచుతున్నాయి. స్టాక్ మార్కెట్ ట్రెండ్‌ను అంచనా వేసే టెక్నాలజీని కూడా బీకాం కోర్సుల్లో మేళవించారు. ఈ తరహా కామర్స్ కోర్సుల్లో నైపుణ్యం సాధిస్తే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ–కామర్స్ పెరగడంతో మంచి డిమాండ్ ఈ–కామర్స్ పెరిగిన నేపథ్యంలో ట్యాక్స్ కన్సల్టెన్సీ, ఆడిట్, రిస్క్ మేనేజ్మెంట్ విభాగాల్లో బహుళజాతి కంపెనీలు కామర్స్ విద్యార్థులను అత్యధిక వేతనాలతో నియమిస్తున్నాయి. ప్రతి ఏటా డెలాయిట్, బ్రాడ్‌రిచ్, వెల్స్‌ఫార్గో, జేపీ మోర్గాన్ వంటి సంస్థలు క్యాంపస్ నియామకాలు చేపడుతున్నాయి. హైదరాబాద్‌లో రూ.6 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు వార్షిక వేతనాన్ని ఆఫర్ చేస్తున్నాయి. ఢిల్లీలో రూ. 21 లక్షల వరకు బహుళజాతి సంస్థలు ఇస్తున్నాయి. బీకాం తర్వాత విదేశాల్లో ఎంబీఏ చేసిన వారికి మంచి వేతనంతో కూడిన ఉద్యోగాలు వస్తున్నాయి. – డాక్టర్ మోహన్‌కుమార్ (భద్రుక కాలేజీ ప్రిన్సిపల్) జీఎస్టీపై పట్టు ఉంటే మంచి వేతనం జీఎస్టీ వచ్చిన తర్వాత కామర్స్ విద్యార్థులకు డిమాండ్ పెరిగింది. అన్ని రకాల సర్టిఫికేషన్ కోర్సులు చేసిన వారికి ఎక్కువ వేతనం ఇస్తున్నారు. ఫైలింగ్ సిస్టమ్‌లో అనుభవాన్ని బట్టి వేతనాలు ఉన్నాయి. మల్టీ నేషనల్ కంపెనీలో సీఏ తర్వాత జీఎస్టీ అడ్మినిస్ట్రేషన్ ఉన్న వాళ్ళకు పొజిషన్ ఇస్తున్నారు. సీఏలకు ఏటా రూ.50 లక్షలు ఇవ్వడం కంటే జీఎస్టీ సర్టిఫికేషన్ ప్రోగ్రాం చేసిన వారికి రూ. 21 లక్షలు ఇవ్వడం కంపెనీలకు లాభదాయకంగా మారింది. – ఎక్కుల్‌దేవి పరమేశ్వర్ (ప్రైవేటు డిగ్రీ కాలేజీల సంఘం ప్రధాన కార్యదర్శి) సీఏ చేసే పనులన్నీ చేస్తున్నాం కామర్స్ తర్వాత యూఎస్‌లో మాస్టర్ ప్రోగ్రాం చేశాను. బహుళజాతి కంపెనీలో ఆడిట్, రిస్క్ మేనేజ్మెంట్ వింగ్‌లో ఉద్యోగం వచ్చింది. మొదట్లో రూ.18 లక్షలు ఇచ్చారు. సీఏ చేసే పనులన్నీ చేయగలుగుతున్నాం. జీఎస్టీ విధానంలో ఎక్కువ అనుభవం గడించాం. రెండేళ్ళల్లో నా వేతనం రూ.21 లక్షలకు పెరిగింది. – శశాంక్ (బహుళజాతి కంపెనీ ఉద్యోగి, ఢిల్లీ) -
కొలువుల ‘భాగ్య’నగరం
సాక్షి, హైదరాబాద్: సర్వమతాల సమాహారంగా.. కాస్మోపాలిటన్ సిటీగా... మినీ ఇండియాగా పేరుగాంచిన భాగ్యనగరం మరో గుర్తింపును సొంతం చేసుకుంది. దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడో ఉన్నత చదువులు చదివిన యువతలో అత్యధికం ఉద్యోగంలో స్థిరపడేందుకు హైదరాబాద్‌నే ఎంపిక చేసుకుంటున్నట్లు వెల్లడైంది. దేశంలోకెల్లా ఉద్యోగార్థులు అత్యంత ఎక్కువగా ఇష్టపడే నగరాల జాబితాలో హైదరాబాద్ తొలి స్థానంలో నిలిచిందని వీబాక్స్, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ), టాగ్డ్ సంస్థ సంయుక్తంగా రూపొందించిన ‘ఇండియా స్కిల్స్ రిపోర్ట్–2021’వెల్లడించింది. అలాగే ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉన్న నగరాల్లోనూ హైదరాబాదే ముందంజలో ఉన్నట్లు ఈ సర్వే పేర్కొంది. హైదరాబాద్ తర్వాత బెంగళూరు, పుణే, ఢిల్లీ ఉద్యోగానికి అనువైన నగరాలుగా, ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉన్న సిటీలుగా నిలి చాయి. కరోనా వ్యాప్తి తర్వాత దేశవ్యాప్తంగా పరిశ్రమల అవసరాలు, ఉద్యోగ అవకాశాలు, విద్యార్థుల్లో అందుకు అవసరమైన సామర్థ్యాలు, వాటిపై కరోనా ప్రభావం వంటి అంశాలపై వీబాక్స్ నేషనల్ ఎంప్లాయిబిలిటీ టెస్ట్‌ను (డబ్ల్యూఎన్ఈటీ) నిర్వహించింది. దేశవ్యాప్తంగా 65 వేల మంది విద్యార్థులతోపాటు 15 పరిశ్రమలను, 150కిపైగా కార్పొరేట్ సంస్థలను సంప్రదించింది. పలు అంశాలపై అధ్యయనం చేసి ఈ నివేదికను రూపొందించింది. క్రిటికల్ థింకింగ్‌లో నాలుగో స్థానంలో తెలంగాణ క్రిటికల్ థింకింగ్‌లో తెలంగాణ విద్యార్థులు టాప్–10 జాబి తాలో 4వ స్థానంలో నిలిచారు. ఆంగ్లభాషా నైపుణ్యంలో రాష్ట్ర విద్యార్థులు ఐదో స్థానంలో ఉన్నారు. న్యూమరికల్ స్కిల్స్‌లో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఐదో స్థానంలో ఉండగా తెలంగాణ విద్యార్థులు 8వ స్థానంలో ఉన్నారు. కంప్యూటర్ స్కిల్స్‌లో తెలంగాణ విద్యార్థులు 9వ స్థానంలో ఉన్నారు. వృత్తి, సాంకేతిక విద్యా సంబంధ ఉద్యోగాలకు అవసరమైన స్కిల్స్ పరంగా చూస్తే ఇంగ్లిష్ భాషా నైపుణ్యం, క్రిటికల్ థింకింగ్, కంప్యూటర్ స్కిల్స్‌లో రాజస్తాన్ విద్యార్థులు ముందంజలో ఉన్నారు. టాప్–10 రాష్ట్రాలవారీగా చూస్తే అక్కడి విద్యార్థులే తొలి స్థానంలో నిలిచారు. అలాగే ఇంగ్లిష్ భాషా పరిజ్ఞానం, న్యూమరికల్ స్కిల్స్, క్రిటికల్ థింకింగ్‌లో మధ్యప్రదేశ్ విద్యార్థులు రెండో స్థానంలో నిలిచారు. కంప్యూటర్ స్కిల్స్‌లో పశ్చిమ బెంగాల్ రెండో స్థానంలో నిలిచింది. అక్షరాస్యతలో ముందున్నా కేరళకు లభించని చోటు... కేరళ అక్షరాస్యతలో ముందు వరుసలో ఉన్నా ఉద్యోగార్థులున్న టాప్–10 రాష్ట్రాల్లో ఆ రాష్ట్రం నిలువలేకపోతోంది. అయితే ఆంగ్ల భాష, న్యూమరికల్ స్కిల్స్‌లో మాత్రం టాప్–10లో నిలిచింది. మాతృ భాష కాకుండా రెండో భాషగా ఇంగ్లిష్, స్కిల్స్ అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో రాజస్తాన్ తొలి స్థానం సంపాదించింది. అక్కడ కార్పొరేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా లేకపోవడమే ఇందుకు కారణం. అయితే హైదరాబాద్, బెంగళూరు, పుణే, ఢిల్లీ ఉద్యోగానికి అనువైన పట్టణాలుగా, ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉన్న పట్టణాలుగా నిలిచాయి. -
మన మహిళలే బెస్ట్..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ...కొత్త రాష్ట్రం మరో సరికొత్త రికార్డుకు వేదికైంది. ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలున్న మహిళలకు తెలంగాణ నెలవుగా మారింది. ఉద్యోగానికి కావాల్సిన నైపుణ్యాలున్నవారిలో మహిళలు, పురుషులను కలుపుకుని చూస్తే తెలంగాణ ఆరో స్థానంలో ఉన్నప్పటికీ మహిళల పరంగా మాత్రం మొదటిస్థానంలో నిలిచింది. ఈమేరకు ఇండియా స్కిల్ రిపోర్టు –2020 నివేదిక వెల్లడించింది. 2019 జూలై నుంచి నవంబర్ వరకు నేషనల్ ఎంప్లాయబిలిటీ టెస్టు సర్వేను కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సహకారంతో ‘ది వీ బాక్స్’నిర్వహించింది. ఈ సర్వేలో భాగంగా దేశంలోని 28 రాష్ట్రాలు, 9 కేంద్ర పాలిత ప్రాంతాల్లో 3 లక్షల మంది విద్యార్థులను, వివిధ రంగాలకు చెందిన 150 కంపెనీలను కలిసి సర్వే చేసింది. ఆ సర్వే నివేదికలోని ప్రధానాంశాలు. పెరిగిన మహిళల సంఖ్య... ►ఉద్యోగానికి కావాల్సి న నైపుణ్యాలున్న మహిళల సంఖ్య ఈసారి పెరిగింది. 2018లో నైపుణ్యాలు కలిగిన మహిళల సంఖ్య 46% ఉంటే 2019లో 47 శాతానికి పెరిగింది. ►ఉద్యోగ నైపుణ్యాలున్న మహిళలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. రాజస్తాన్ రెండో స్థానంలో నిలిచింది. ►నగరాల పరంగా చూస్తే ఉద్యోగ నైపుణ్యాలున్న మహిళలు ఎక్కువగా ఉన్న నగరాల్లో హైదరాబాద్ మొదటి స్థానంలో నిలిచింది. తగ్గిన పురుషుల సంఖ్య.. ►ఉద్యోగ నైపుణ్యాలు కలిగిన పురుషుల సంఖ్య 2018 సంవత్సరంలో 48% ఉంటే 2019లో 46 శాతానికి తగ్గిపోయింది. ఉద్యోగ నైపుణ్యాలున్న పురుషులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఢిల్లీ, పంజాబ్ తొలి రెండు స్థానాల్లో ఉండగా, తెలంగాణ పదో స్థానానికి పరిమితమైంది. ►నగరాల పరంగా చూస్తే ముంబై మొదటి స్థానం లో ఉండగా, ఘజియాబాద్ రెండో స్థానంలో, హైదరాబాద్ మూడో స్థానంలో ఉంది. మొత్తంగా చూస్తే రెండోస్థానంలో హైదరాబాద్.. ఉద్యోగానికి కావాల్సిన నైపుణ్యాలు కలిగినవారు ఎక్కువ మంది (స్త్రీ, పురుషులు) ఉన్న నగరాల్లో మొదటి స్థానంలో ముంబై నిలువగా, రెండో స్థానంలో హైదరాబాద్ నిలిచింది. ఉద్యోగ నైపుణ్యాలు కలిగిన వారు ముం బైలో 70.27% మంది ఉంటే హైదరాబాద్‌లో 66.52% ఉన్నట్లు తేలింది. 63.20%తో పుణే మూడో స్థానంలో ఉండగా, 62.86%తో ఢిల్లీ నాలుగో స్థానంలో ఉంది. 54.83%తో బెంగళూరు ఐదో స్థానంలో ఉంది. 46.09%తో విశాఖపట్నం 8వ స్థానంలో నిలిచింది. రాష్ట్రాల్లో మొదటి స్థానంలో మహారాష్ట్ర.. ఉద్యోగానికి కావాల్సిన నైపుణ్యాలు కలిగిన యువతను (స్త్రీ, పురుషులు) అందించడంలో మహారాష్ట్ర మొదటి స్థానంలో నిలిచింది. అక్కడ 67.99 శాతం మంది ఉద్యోగానికి కావాల్సిన నైపుణ్యాలు కలిగిన వారు ఉన్నారు. తమిళనాడు 62.97 శాతం మందితో రెండో స్థానంలో, ఉత్తరప్రదేశ్ 61.78%తో మూడో స్థానంలో నిలిచాయి. ఆంధ్రప్రదేశ్ 53.56%తో నాలుగో స్థానంలో, కర్ణాటక 52.83%తో ఐదో స్థానంలో, తెలంగాణ 50.39%తో ఆరో స్థానంలో నిలిచాయి. ఆ తరువాత స్థానాల్లో వరుసగా ఢిల్లీ (49.99%), రాజస్తాన్ (38.09%), పశ్చిమ బెంగాల్ (37.30%), గుజరాత్ (30.39%) ఉన్నాయి. యువతలో తగ్గిన ఉద్యోగ నైపుణ్యాలు.. ఉద్యోగానికి కావాల్సిన నైపుణ్యాలు కలిగిన యువత సంఖ్య దేశంలో ఈసారి తగ్గింది. ఉద్యోగానికి కావాల్సిన నైపుణ్యాలున్న వారు 2018 లో 47.38% ఉంటే , 2019లో వారి సంఖ్య 46.21 శాతానికి పడిపోయింది. -
అతివలు.. అదుర్స్
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఉద్యోగ నైపుణ్యాలున్న మహిళల సంఖ్య పెరిగింది. ఈ విషయాన్ని ఇండియా స్కిల్ రిపోర్టు–2019 స్పష్టం చేసింది. వీబాక్స్, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) సంయుక్తాధ్వర్యంలో నిర్వహించిన సర్వే నివేదిక ఇటీవల విడుదలైంది. వివిధ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు, విద్యార్థుల స్థితిగతులపై నివేదికలో అంచనా వేశాయి. 29 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 100కు పైగా కంపెనీలు, 3.1 లక్షల మంది విద్యార్థులను కలిశాయి. గతంతో పోలిస్తే ఉద్యోగ నైపుణ్యాలున్న మహిళల సంఖ్య ఈ ఏడాది గణనీయంగా పెరిగిందని పేర్కొంది. 2014 సంవత్సరం నివేదిక ప్రకారం అప్పట్లో 30.3 శాతం పురుషుల్లో ఉద్యోగ నైపుణ్యాలు ఉంటే, 42.1 శాతం మంది మహిళల్లో ఉద్యోగ నైపుణ్యాలు ఉన్నాయి. అయితే ఆ తర్వాత నైపుణ్యాలు కలిగిన మహిళల సంఖ్య మధ్యలో తగ్గిపోయింది. ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం ఉద్యోగ నైపుణ్యాలు కలిగిన పురుషుల సంఖ్య 47.39 శాతానికి క్రమంగా పెరుగుతూ రాగా, 2015లో నైపుణ్యాలు కలిగిన మహిళల సంఖ్య 37.88 శాతానికి తగ్గిపోయింది. ఆ తర్వాత 2016, 2017 నివేదిక ప్రకారం ఆ రెండేళ్లలో పెరిగినా 2018 నివేదిక ప్రకారం 38.15 శాతానికి తగ్గిపోయింది. ఏడాది మళ్లీ పుంజుకుందని, 45.6 శాతానికి నైపుణ్యాలున్న మహిళల సంఖ్య పెరిగిందని తాజా నివేదికలో వివరించింది. ఎమోషనల్ ఇంటెలిజెన్స్‌లో రెండో స్థానం సబ్జెక్టుల్లోని పరిజ్ఞానంతో పాటు ఇతర నైపుణ్యాలనూ అధ్యయనం చేసింది. రాష్ట్రాల వారీగా విద్యార్థులు స్థితిగతులను అంచనా వేసింది. నేర్చుకునే సామర్థ్యాలు (లెర్నింగ్ ఎబిలిటీ), విషయ స్వీకరణ సామర్థ్యం (అడాప్టబిలిటీ), ఇతరులతో భావవ్యక్తీకరణ సామర్థ్యాలు (ఇంటర్ పర్సనల్ స్కిల్స్), భావోద్వేగ మేధస్సు (ఎమోషనల్ ఇంటెలిజెన్స్), సంక్షోభ పరిష్కార సామర్థ్యం, స్థిర దృక్పథం అంశాలపై అధ్యయనం చేసింది. ఇందులో తెలంగాణ విద్యార్థులు భావోద్వేగ మేధస్సు, కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్‌లో రెండో స్థానంలో నిలవగా, లెర్నింగ్ ఎబిలిటీలో 7వ స్థానం, అడాప్టబిలిటీ, ఇంటర్ పర్సనల్ స్కిల్స్‌లో 8వ స్థానం, సెల్ఫ్ డిటర్మినేషన్‌లో 6వ స్థానంలో నిలిచారు. పనిలో భాగస్వామ్యం పెరగాలి.. పనిలో మహిళల భాగస్వామ్యం ఇంకా పెరగాల్సిన అవసరం ఉందని పేర్కొంది. తాజా నివేదిక ప్రకారం పనిలో పురుషుల భాగస్వామ్యం 75 శాతం, మహిళల భాగస్వామ్యం 25 శాతం ఉంది. పట్టణాల్లో 68.3 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 67శాతం డిగ్రీ పూర్తి చేసిన మహిళలకు ‘పెయిడ్ జాబ్స్’లేవని పేర్కొంది. -
మళ్లీ కొలువుల జోరు
న్యూఢిల్లీ: ఉద్యోగాలు వచ్చే ఏడాది జోరుగా రానున్నాయని ఇండియా స్కిల్స్ రిపోర్ట్, 2019 పేర్కొంది. దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత ఐటీ, వాహన, పర్యాటక, ఆతిథ్య రంగాల్లో ఉద్యోగవకాశాలు ఇబ్బడిముబ్బడిగా రానున్నట్లు ఈ నివేదిక వెల్లడించింది. హెచ్ఆర్ సొల్యూషన్స్, హెచ్ఆర్ టెక్నాలజీ కంపెనీ పీపుల్ స్ట్రాంగ్, గ్లోబల్ టాలెంట్ అసెస్మెంట్ సంస్థ వీబాక్స్ సంస్థలు, భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) సహకారంతో ఈ నివేదికను రూపొందించాయి. ఇంజనీరింగ్ అభ్యర్థులకు అధిక అవకాశాలుంటాయంటున్న ఈ నివేదిక వెల్లడించిన కొన్ని ముఖ్యాంశాలు... ♦ ఉద్యోగాలిచ్చే విషయమై 64 శాతం కంపెనీలు సానుకూలంగా ఉన్నాయి. 20 శాతం కంపెనీలు మాత్రం 2018లో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చామో 2019లో కూడా అన్నే ఉద్యోగాలు ఇస్తామని పేర్కొన్నాయి. కొన్ని కంపెనీలు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వలేమని చెప్పాయి. ♦ 2017లో 7 శాతం వృద్ధి ఉన్న కొత్త ఉద్యోగాల కల్పన వచ్చే ఏడాది రెట్టింపై 15 శాతానికి చేరుతుంది. వివిధ రంగాల్లోని చిన్న, మధ్య, పెద్ద, భారీ స్థాయి కంపెనీలు చెప్పుకోదగిన స్థాయిలోనే ఉద్యోగాలివ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. ♦ 2010–11 సంవత్సరంలో వివిధ రంగాల్లో భారీగా ఉద్యోగాలొచ్చాయి. వచ్చే ఏడాది ఈ స్థాయిలో కాకపోయినా, గత 2–3 ఏళ్లతో పోల్చి తే మంచి స్థాయిలోనే ఉద్యోగాలు వస్తాయి. ♦ టెక్నాలజీ రంగంలో భారీగా ఉద్యోగాలు వచ్చే అవకాశాలున్నాయి. డిజైన్, అనలిటిక్స్ ఉద్యోగాలు అధికంగా ఉంటాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్ వంటి స్పెషలిస్ట్ టెక్నాలజీ ఉద్యోగాలకు డిమాండ్ అధికంగా ఉండనుంది. ♦ ఉద్యోగ కల్పన విషయంలో దేశంలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలుస్తుంది. తర్వాతి స్థానాల్లో పశ్చిమ బెంగాల్, ఢిల్లీ ఉన్నాయి. ♦ ఇంజనీరింగ్ విద్యార్థులకు అధికంగా ఉద్యోగాలు లభించే అవకాశాలున్నాయి. వీరిలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ (ఈసీఈ), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) అభ్యర్థులకు అవకాశాలు అధికంగా ఉన్నాయి. -
23% పెరగనున్న కొలువులు
ముంబై: భారత కంపెనీలు వచ్చే ఏడాది 23 శాతం అధికంగా ఉద్యోగాలనివ్వనున్నాయని ఇండియా స్కిల్స్ రిపోర్ట్ 2015 వెల్లడించింది. అంతర్జాతీయ టాలెంట్ అసెస్మెంట్ కంపెనీ వీబాక్స్, భారత హెచ్ఆర్ అవుట్సోర్సింగ్, రిక్రూట్మెంట్ కంపెనీ పీపుల్ స్ట్రాంగ్, ప్రొఫెషనల్ ఆన్లైన్ నెట్వర్క్ లింకెడిన్, సీఐఐలు సంయుక్తంగా ఈ నివేదికను రూపొందించాయి. ఈ నివేదిక ప్రకారం..., వచ్చే ఏడాది ఆతిథ్య, పర్యాటక రంగాల్లో అధికంగా ఉద్యోగాలు రానున్నాయి. ఈ రంగాల్లో 50 శాతం అధికంగా ఉద్యోగాలు వస్తాయి. ఈ రెండు రంగాల తర్వాత బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా, రంగాలు అధికంగా ఉద్యోగాలు కల్పిస్తాయి. తయారీ, టెలికాం, ఫార్మా రంగాల్లో హైరింగ్ తక్కువ స్థాయిలో ఉంటుంది. కార్యకలాపాలు నిర్వహించడానికి న్యూఢిల్లీ, ముంబై నగరాలు అనువైనవిగా పలు కంపెనీలు భావిస్తున్నాయి. కర్నాటక, గుజరాత్ రాష్ట్రాలు కూడా ప్రాధాన్యతా ప్రాంతాలుగా గుర్తింపు పొందాయి. కంపెనీలు కార్యకలాపాలు నిర్వహించడానికి అనువైన విధానాల కోసం ఈ రెండు రాష్ట్రాలు సంస్కరణలు తెస్తున్నాయి. యువకులకే ఉద్యోగాలివ్వాలని 72 శాతానికి పైగా కంపెనీలు భావిస్తున్నాయి. మహిళా ఉద్యోగుల సంఖ్య పెరుగుతోంది. గత ఏడాది హైరింగ్‌లో పురుషులు, మహిళ ఉద్యోగుల వాటా 76:24 గా ఉండగా, ఈ ఏడాది 68:32 శాతంగా ఉంది. అయితే బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా, బీపీఓ, ఆతిధ్య రంగాల్లో మహిళ ఉద్యోగుల సంఖ్య తగ్గుతోంది. 2.7 లక్షల ఉద్యోగవకాశాలు ఏడు ప్రధాన నగరాల్లో ఈ ఏడాది సెప్టెంబర్ వరకూ కొత్త కార్యాలయాల స్పేస్ లీజింగ్ 23 మిలియన్ చదరపుటడుగులుగా ఉందని ప్రోపర్టీ కన్సల్టెంట్ సీబీఆర్ఈ తెలిపింది. హైదరాబాద్, నేషనల్ క్యాపిటల్ రీజియన్, ముంబై, కోల్‌కత, చెన్నై, బెంగళూరు, పుణేలో వచ్చిన ఈ కొత్త ఆఫీస్ స్పేస్ లీజింగ్ కారణంగా 2.7 లక్షల ఉద్యోగాలు వస్తాయని వివరించింది. ఐటీ/ఐటీఈఎస్ కంపెనీలు అధికంగా కొత్త కార్యాలయాలను ప్రారంభించాయని ఆ తర్వాతి స్థానాల్లో బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా, తయారీ, ఇంజినీరింగ్, కన్సల్టింగ్, రీసెర్చ్ రంగాలు ఉన్నాయని వివరించింది. బెంగళూరులో అధికంగా ఉద్యోగావకాశాలు వస్తాయని, ఆ తర్వాతి స్థానాల్లో ముంబై, నేషనల్ క్యాపిటల్ రీజియన్లు ఉంటాయని పేర్కొంది.