సాక్షి, హైదరాబాద్: తెలంగాణ...కొత్త రాష్ట్రం మరో సరికొత్త రికార్డుకు వేదికైంది. ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలున్న మహిళలకు తెలంగాణ నెలవుగా మారింది. ఉద్యోగానికి కావాల్సిన నైపుణ్యాలున్నవారిలో మహిళలు, పురుషులను కలుపుకుని చూస్తే తెలంగాణ ఆరో స్థానంలో ఉన్నప్పటికీ మహిళల పరంగా మాత్రం మొదటిస్థానంలో నిలిచింది. ఈమేరకు ఇండియా స్కిల్ రిపోర్టు –2020 నివేదిక వెల్లడించింది. 2019 జూలై నుంచి నవంబర్ వరకు నేషనల్ ఎంప్లాయబిలిటీ టెస్టు సర్వేను కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సహకారంతో ‘ది వీ బాక్స్’నిర్వహించింది. ఈ సర్వేలో భాగంగా దేశంలోని 28 రాష్ట్రాలు, 9 కేంద్ర పాలిత ప్రాంతాల్లో 3 లక్షల మంది విద్యార్థులను, వివిధ రంగాలకు చెందిన 150 కంపెనీలను కలిసి సర్వే చేసింది. ఆ సర్వే నివేదికలోని ప్రధానాంశాలు.
పెరిగిన మహిళల సంఖ్య...
►ఉద్యోగానికి కావాల్సి న నైపుణ్యాలున్న మహిళల సంఖ్య ఈసారి పెరిగింది. 2018లో నైపుణ్యాలు కలిగిన మహిళల సంఖ్య 46% ఉంటే 2019లో 47 శాతానికి పెరిగింది.
►ఉద్యోగ నైపుణ్యాలున్న మహిళలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. రాజస్తాన్ రెండో స్థానంలో నిలిచింది.
►నగరాల పరంగా చూస్తే ఉద్యోగ నైపుణ్యాలున్న మహిళలు ఎక్కువగా ఉన్న నగరాల్లో హైదరాబాద్ మొదటి స్థానంలో నిలిచింది.
తగ్గిన పురుషుల సంఖ్య..
►ఉద్యోగ నైపుణ్యాలు కలిగిన పురుషుల సంఖ్య 2018 సంవత్సరంలో 48% ఉంటే 2019లో 46 శాతానికి తగ్గిపోయింది. ఉద్యోగ నైపుణ్యాలున్న పురుషులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఢిల్లీ, పంజాబ్ తొలి రెండు స్థానాల్లో ఉండగా, తెలంగాణ పదో స్థానానికి పరిమితమైంది.
►నగరాల పరంగా చూస్తే ముంబై మొదటి స్థానం లో ఉండగా, ఘజియాబాద్ రెండో స్థానంలో, హైదరాబాద్ మూడో స్థానంలో ఉంది.
మొత్తంగా చూస్తే రెండోస్థానంలో హైదరాబాద్..
ఉద్యోగానికి కావాల్సిన నైపుణ్యాలు కలిగినవారు ఎక్కువ మంది (స్త్రీ, పురుషులు) ఉన్న నగరాల్లో మొదటి స్థానంలో ముంబై నిలువగా, రెండో స్థానంలో హైదరాబాద్ నిలిచింది. ఉద్యోగ నైపుణ్యాలు కలిగిన వారు ముం బైలో 70.27% మంది ఉంటే హైదరాబాద్‌లో 66.52% ఉన్నట్లు తేలింది. 63.20%తో పుణే మూడో స్థానంలో ఉండగా, 62.86%తో ఢిల్లీ నాలుగో స్థానంలో ఉంది. 54.83%తో బెంగళూరు ఐదో స్థానంలో ఉంది. 46.09%తో విశాఖపట్నం 8వ స్థానంలో నిలిచింది.
రాష్ట్రాల్లో మొదటి స్థానంలో మహారాష్ట్ర..
ఉద్యోగానికి కావాల్సిన నైపుణ్యాలు కలిగిన యువతను (స్త్రీ, పురుషులు) అందించడంలో మహారాష్ట్ర మొదటి స్థానంలో నిలిచింది. అక్కడ 67.99 శాతం మంది ఉద్యోగానికి కావాల్సిన నైపుణ్యాలు కలిగిన వారు ఉన్నారు. తమిళనాడు 62.97 శాతం మందితో రెండో స్థానంలో, ఉత్తరప్రదేశ్ 61.78%తో మూడో స్థానంలో నిలిచాయి. ఆంధ్రప్రదేశ్ 53.56%తో నాలుగో స్థానంలో, కర్ణాటక 52.83%తో ఐదో స్థానంలో, తెలంగాణ 50.39%తో ఆరో స్థానంలో నిలిచాయి. ఆ తరువాత స్థానాల్లో వరుసగా ఢిల్లీ (49.99%), రాజస్తాన్ (38.09%), పశ్చిమ బెంగాల్ (37.30%), గుజరాత్ (30.39%) ఉన్నాయి.
యువతలో తగ్గిన ఉద్యోగ నైపుణ్యాలు..
ఉద్యోగానికి కావాల్సిన నైపుణ్యాలు కలిగిన యువత సంఖ్య దేశంలో ఈసారి తగ్గింది. ఉద్యోగానికి కావాల్సిన నైపుణ్యాలున్న వారు 2018 లో 47.38% ఉంటే , 2019లో వారి సంఖ్య 46.21 శాతానికి పడిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment