కొలువుల ‘భాగ్య’నగరం | Hyderabad Is The Preferred Choice For Jobs And Opportunities Says India Skills Report | Sakshi
Sakshi News home page

కొలువుల ‘భాగ్య’నగరం

Published Wed, Feb 24 2021 2:03 AM | Last Updated on Thu, Apr 14 2022 1:28 PM

Hyderabad Is The Preferred Choice For Jobs And Opportunities Says India Skills Report - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సర్వమతాల సమాహారంగా.. కాస్మోపాలిటన్‌ సిటీగా... మినీ ఇండియాగా పేరుగాంచిన భాగ్యనగరం మరో గుర్తింపును సొంతం చేసుకుంది. దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడో ఉన్నత చదువులు చదివిన యువతలో అత్యధికం ఉద్యోగంలో స్థిరపడేందుకు హైదరాబాద్‌నే ఎంపిక చేసుకుంటున్నట్లు వెల్లడైంది. దేశంలోకెల్లా ఉద్యోగార్థులు అత్యంత ఎక్కువగా ఇష్టపడే నగరాల జాబితాలో హైదరాబాద్‌ తొలి స్థానంలో నిలిచిందని వీబాక్స్, కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ (సీఐఐ), టాగ్డ్‌ సంస్థ సంయుక్తంగా రూపొందించిన ‘ఇండియా స్కిల్స్‌ రిపోర్ట్‌–2021’వెల్లడించింది. అలాగే ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉన్న నగరాల్లోనూ హైదరాబాదే ముందంజలో ఉన్నట్లు ఈ సర్వే పేర్కొంది. హైదరాబాద్‌ తర్వాత బెంగళూరు, పుణే, ఢిల్లీ ఉద్యోగానికి అనువైన నగరాలుగా, ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉన్న సిటీలుగా నిలి చాయి.

కరోనా వ్యాప్తి తర్వాత దేశవ్యాప్తంగా పరిశ్రమల అవసరాలు, ఉద్యోగ అవకాశాలు, విద్యార్థుల్లో అందుకు అవసరమైన సామర్థ్యాలు, వాటిపై కరోనా ప్రభావం వంటి అంశాలపై వీబాక్స్‌ నేషనల్‌ ఎంప్లాయిబిలిటీ టెస్ట్‌ను (డబ్ల్యూఎన్‌ఈటీ) నిర్వహించింది. దేశవ్యాప్తంగా 65 వేల మంది విద్యార్థులతోపాటు 15 పరిశ్రమలను, 150కిపైగా కార్పొరేట్‌ సంస్థలను సంప్రదించింది. పలు అంశాలపై అధ్యయనం చేసి ఈ నివేదికను రూపొందించింది.

క్రిటికల్‌ థింకింగ్‌లో నాలుగో స్థానంలో తెలంగాణ
క్రిటికల్‌ థింకింగ్‌లో తెలంగాణ విద్యార్థులు టాప్‌–10 జాబి తాలో 4వ స్థానంలో నిలిచారు. ఆంగ్లభాషా నైపుణ్యంలో రాష్ట్ర విద్యార్థులు ఐదో స్థానంలో ఉన్నారు. న్యూమరికల్‌ స్కిల్స్‌లో ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థులు ఐదో స్థానంలో ఉండగా తెలంగాణ విద్యార్థులు 8వ స్థానంలో ఉన్నారు. కంప్యూటర్‌ స్కిల్స్‌లో తెలంగాణ విద్యార్థులు 9వ స్థానంలో ఉన్నారు. వృత్తి, సాంకేతిక విద్యా సంబంధ ఉద్యోగాలకు అవసరమైన స్కిల్స్‌ పరంగా చూస్తే ఇంగ్లిష్‌ భాషా నైపుణ్యం, క్రిటికల్‌ థింకింగ్, కంప్యూటర్‌ స్కిల్స్‌లో రాజస్తాన్‌ విద్యార్థులు ముందంజలో ఉన్నారు. టాప్‌–10 రాష్ట్రాలవారీగా చూస్తే అక్కడి విద్యార్థులే తొలి స్థానంలో నిలిచారు. అలాగే ఇంగ్లిష్‌ భాషా పరిజ్ఞానం, న్యూమరికల్‌ స్కిల్స్, క్రిటికల్‌ థింకింగ్‌లో మధ్యప్రదేశ్‌ విద్యార్థులు రెండో స్థానంలో నిలిచారు. కంప్యూటర్‌ స్కిల్స్‌లో పశ్చిమ బెంగాల్‌ రెండో స్థానంలో నిలిచింది. 

అక్షరాస్యతలో ముందున్నా కేరళకు లభించని చోటు...
కేరళ అక్షరాస్యతలో ముందు వరుసలో ఉన్నా ఉద్యోగార్థులున్న టాప్‌–10 రాష్ట్రాల్లో ఆ రాష్ట్రం నిలువలేకపోతోంది. అయితే ఆంగ్ల భాష, న్యూమరికల్‌ స్కిల్స్‌లో మాత్రం టాప్‌–10లో నిలిచింది. మాతృ భాష కాకుండా రెండో భాషగా ఇంగ్లిష్, స్కిల్స్‌ అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో రాజస్తాన్‌ తొలి స్థానం సంపాదించింది. అక్కడ కార్పొరేట్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా లేకపోవడమే ఇందుకు కారణం. అయితే హైదరాబాద్, బెంగళూరు, పుణే, ఢిల్లీ ఉద్యోగానికి అనువైన పట్టణాలుగా, ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉన్న పట్టణాలుగా నిలిచాయి. 



No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement