సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా ఉద్యోగావకాశాలు విస్తృతంగా ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ నాలుగో స్థానంలో ఉంది. ప్రతిభ కలిగిన యువతతో 65.58 శాతం స్కోరు సాధించింది. ఇక ఆంగ్లం, గణితం నైపుణ్యాల్లో అగ్రశ్రేణిలో నిలిచింది. ఇండియా స్కిల్ నివేదిక 2023లో కేంద్ర ప్రభుత్వం ఈ అంశాలను వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక, సాంకేతిక మౌలిక సదుపాయాలు మెరుగ్గా ఉన్నాయని తెలిపింది. 2022లో ఏపీ అత్యధిక వృద్ధి సాధించినట్లు నివేదికలో పేర్కొంది. అందులో ముఖ్యాంశాలు ఇవీ..
♦ అత్యధికంగా ఉపాధి కల్పించే రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ (72.7 శాతం) మొదటి స్థానంలో ఉండగా 69.8 శాతంతో మహారాష్ట రెండో స్థానంలో ఉంది. 68.9 శాతంతో ఢిల్లీ మూడో స్థానంలో నిలవగా 65.58 శాతంతో ఆంధ్రప్రదేశ్ నాలుగో స్థానంలో నిలిచింది. రాజస్థాన్, కర్నాటక వరుసగా తరువాత స్థానాల్లో ఉన్నాయి.
♦ ఏపీలో యువత ఉపాధి అవకాశాలను పెంపొందించేలా నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పీఎం కేవీవై ద్వారా రాష్ట్రంలో నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు పెద్దఎత్తున కొనసాగుతున్నాయి.
♦ ఆంగ్లం, గణితంలో చక్కటి నైపుణ్యాలున్న తొలి ఐదు రాష్ట్రాల సరసన ఆంధ్రప్రదేశ్ చోటు సాధించింది. గణితంలో మంచి నైపుణ్యం ఉన్న యువత లభ్యతలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. ఇంగ్లీషు ప్రావీణ్యం కలిగిన యువత లభ్యత రాష్ట్రాల్లో ఏపీ మూడో స్థానంలో ఉంది.
♦ ఆంధ్రప్రదేశ్‌లో 22 – 25 ఏళ్ల వయసున్న యువత ఉపాధి స్కోరు 64.36 శాతం
ఉంది.
♦ మహిళలకు అత్యధికంగా ఉపాధి కల్పించే వనరులు రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్నాయి. ఒడిశా, ఢిల్లీలో పురుషులకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పన వనరులున్నాయి. రానున్న సంవత్సరాల్లో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, ఒడిశా, కేరళలో ఉపాధి అవకాశాలు మరిన్ని పెరుగుతాయి.
♦ ఘజియాబాద్, తిరుపతి, కర్నూలు, మంగుళూరు తదితర పది నగరాల్లో నైపుణ్యం కలిగిన మహిళా కార్మిక వనరులు అందుబాటులో ఉన్నాయి.
♦ న్యూమరికల్ స్కిల్స్ అత్యధికంగా ఉన్న నగరాల్లో చిత్తూరు, అమలాపురం ఉన్నాయి,
♦ ఆంగ్ల భాషతోపాటు బిజినెస్ కమ్యూనికేషన్ నైపుణ్యాలున్న నగరాల్లో ముంబై, తిరుపతి, పుణే ముందు వరుసలో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment