తారుమారైన బీకాం ఫండమెంటల్ అకౌంటింగ్ ప్రశ్నపత్రాలు ఇవే..
డాక్టర్ బీ.ఆర్.అంబేడ్కర్ యూనివర్సిటీ పరీక్షల విభాగం డొల్లతనం మరోసారి బయటపడింది. బీకాం ప్రథమ సంవత్సరం రెగ్యులర్ విద్యార్థులకు అందజేయాల్సిన పేపర్ తారుమారు (ఒక ప్రశ్నపత్రం బదులు మరోప్రశ్నపత్రం ఇవ్వడం) అయిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సప్లిమెంటరీ విద్యార్థులకు ఇవ్వాల్సిన ప్రశ్నపత్రం రెగ్యులర్ విద్యార్థులకు ఇవ్వడంతో వారంతా తీవ్ర గందరగోళంలో ఉన్నారు. తమకు యూనివర్సిటీ ఉన్నతాధికారులు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.
శ్రీకాకుళం: బీఆర్‌ఏయూ పరిధిలో గతనెల 24 నుంచి ఈ నెల నాలుగో తేదీ వరకు ఐదో సెమిస్టర్, ఈ నెల 8 నుంచి 16వ తేదీ వరకు మొదటి, మూడో సెమిస్టర్ పరీక్షలు జరిగాయి. ఇందులో బీకాం ఫస్టియర్ చదువుతున్న విద్యార్థులకు మొదటి సెమిస్టర్ పరీక్షల్లో భాగంగా ఈనెల 13వ తేదీన ఫండమెంటల్ అకౌంటింగ్ పరీక్ష జరిగింది. అయితే వీరికి ఇచ్చిన ప్రశ్నపత్రం తారుమారైంది. 2016–17 బ్యాచ్‌కు చెందిన రెగ్యులర్ విద్యార్థులకు ఇవ్వాల్సిన ప్రశ్నాపత్రం ఇవ్వకుండా.. సప్లిమెంటరీ (2015–16) విద్యార్థులకు ఇవ్వాల్సిన ప్రశ్నాపత్రాన్ని అందజేశారు. తమ ప్రశ్నాపత్రమే ఆనుకుని వారంతా పరీక్ష రాసేశారు. జిల్లాలో శ్రీకాకుళం నగరంతోపాటు చాలా ప్రాంతాల్లోని కేంద్రాల్లో ప్రశ్నపత్రం తారుమారైనట్లు విద్యార్థులు ఆలస్యంగా గుర్తించారు.
స్కోరింగ్ సబ్జెక్ట్ అకౌంటింగే!
వాస్తవానికి బీకాం విద్యార్థులకు ఫండమెంటల్/ఫైనాన్షియల్ అకౌంటింగ్ పేపర్‌ను స్కోరింగ్ సబ్జెట్‌గా అంతా భావిస్తారు. సెమిస్టర్ విధానంలో జరుగుతున్న పరీక్షలకు గత ఐదు మాసాలగా సన్నద్ధమయ్యారు. అయితే పరీక్షలకొచ్చేసరికి తమది కాని ప్రశ్నపత్రాన్ని అందజేసి తమకు నిండా ముంచారని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫస్టియర్ బీకాం విద్యార్థులు సుమారు నాలుగు వేల మంది ఉండగా ఇందులో సగానికిపైగా విద్యార్థులు తారుమారు ప్రశ్నపత్రం కారణంగా నష్టపోయినట్లు తెలిసింది. తమకు జరిగిన నష్టాన్ని తెలుసుకుని లబోదిబోమంటున్నారు. యూనివర్సిటీ అధికారులు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. న్యాయం చేయని పక్షంలో విద్యార్థి సంఘాలతో మమేకమై యూనివర్సిటీ వద్ద ధర్నాకు దిగుతామని చెబుతున్నారు. ఇలాంటి తరుణంలో యూనివర్సిటీ ఉన్నతాధికారులు కల్పించుకుని ఏ మేరకు నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాలి.
మాదృష్టికి రాలేదు
పేపర్లు మారిన విషయం ఇప్పటి వరకూ మా దృష్టికి రాలేదు. రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షల ప్రశ్నపత్రాలు వేర్వేరుగా పరీక్షా కేంద్రాలకు పంపిస్తాం. వీటి పంపిణీలో పొరపాటు జరిగితే వెంటనే చీఫ్ సూపరింటెండెంట్, ఇన్విజిలేటర్లు మాదృష్టికి తీసుకురావాలి. లేదంటే అది వారి తప్పిదమవుతుంది. మా దృష్టికి వస్తేనే ఎలా న్యాయం చేయాలనేదానిపై ఆలోచన చేస్తాం.
– తమ్మినేని కామరాజు, బీఆర్ ఏయూ పరీక్షల విభాగం డీన్
Comments
Please login to add a commentAdd a comment