బీకాం కంప్యూటర్స్ కోర్సు యధాతథం
Published Tue, Jun 28 2016 10:00 PM | Last Updated on Tue, Mar 19 2019 9:23 PM
-సిలబస్ మార్పుతో గందరగోళం
-కాలేజీల నిరసనతో సిలబస్‌లో మార్పులకు కమిటీ
-పునరాలోచనలో ఉన్నత విద్యామండలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో డిగ్రీ కాలేజీల్లో ఇప్పటివరకు అమల్లో ఉన్న బీకాం కంప్యూటర్స్ కోర్సుకు సంబంధించి ఉన్నత విద్యామండలి చేసిన మార్పులు, చేర్పులపై కాలేజీలనుంచి నిరసన వ్యక్తం అవుతోంది. మంగళవారం పలు డిగ్రీ కాలేజీల యాజమాన్యాలు, అధ్యాపకులు ఉన్నత విద్యామండలి కార్యాలయానికి చేరుకొని నిరసన తెలిపారు. రాష్ట్రంలోని విద్యార్ధులకు ఎంతో ప్రయోజనకరంగా ఉన్న బీకాం కంప్యూటర్స్ కోర్సులో మండలి చేసిన మార్పుల వల్ల నష్టం వాటిల్లుతుందని వారు ఆవేదన వ్యక్తంచేశారు. ముఖ్యంగా పాత విధానంలో ఫస్టియర్‌నుంచి మూడేళ్ల పాటు కంప్యూటర్ సిలబస్‌ను విద్యార్ధులు నేర్చుకొనే వారు. దీనివల్ల ఆయా కంపెనీలు ఈ కోర్సు చదివిన వారికి ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి.
అయితే ఉన్నత విద్యామండలి ఈ ఏడాదినుంచి బీకాం కంప్యూటర్స్ కోర్సులో చేసిన మార్పులు, చేర్పులతో వివాదం ఏర్పడింది. బీకాం కోర్సులో మొదటి రెండేళ్లు కామన్‌గా అందరికీ ఒకే సిలబస్‌ను ఏర్పాటుచేసి మూడో సంవత్సరంలో స్పెషలైజేషన్ సిలబస్‌ను రూపొందించింది. మూడో సంవత్సరంలో ఆయా విద్యార్ధులు తమకు నచ్చిన సబ్జెక్టును ఎంచుకొని అధ్యయనం చేయాలి. అలా నచ్చిన సబ్జెక్టుకు సంబంధించిన సిలబస్ మూడో సంవత్సరంలో మాత్రమే పెట్టారు. బీకాం కంప్యూటర్స్ కోర్సులో మూడో సంవత్సరంలోనే మొత్తం సిలబస్ ఉందని, ఒకే సంవత్సరం మొత్తం అన్ని పేపర్లను చదవడం విద్యార్ధులకు భారంగా మారుతుందని కాలేజీల ప్రతినిధులు పేర్కొంటున్నారు.
మొదటి రెండు సంవత్సరాల్లో కంప్యూటర్ సబ్జెక్టుకు సంబంధించి ప్రాధమికంగా పెట్టిన సిలబస్ చాలా స్వల్పంగా ఉందని పేర్కొంటున్నారు. వివిధ కంపెనీలు మొదటి రెండేళ్ల సిలబస్‌ను చూశాక కంపెనీలు ఉద్యోగాలు కల్పించడానికి ముందుకు వచ్చే అవకాశం లేదని వివరించారు. పాత విధానంలోనే మొదటి సంవత్సరం నుంచే కంప్యూటర్ సిలబస్‌ను పక్కాగా పెట్టి మూడో సంవత్సరంలో పూర్తిస్థాయి సిలబస్‌ను పొందుపర్చడం వల్ల ఫలితాలుంటాయని ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌కు విన్నవించారు.
దీంతో మండలి ఇంతకు ముందు తాను తీసుకున్న నిర్ణయంపై పునరాలోచనలో పడింది. బీకాం కంప్యూటర్ కోర్సుకు ఉన్న ఆదరణను పరిగణనలోకి తీసుకొని దాన్ని యథాతథంగా కొనసాగించడానికి, కాలేజీల విన్నపం మేరకు సిలబస్‌లో మార్పులు చేయడానికి నిర్ణయించింది. సిలబస్ మార్పులపై నిపుణుల కమిటీని ఏర్పాటుచేశామని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ ఎల్.వేణుగోపాలరెడ్డి పేర్కొన్నారు. మాజీ ఉపకులపతులు కేవీ రావు, వెంకయ్య, ప్రొఫెసర్ చలం, కృష్ణా యూనివర్సిటీ రిజిస్ట్రార్ సూర్యచంద్రరావులతో ఈ కమిటీని ఏర్పాటుచేసినట్లు వివరించారు. మూడో సంవత్సరంలోని సిలబస్‌నుంచే కొన్ని చాప్టర్లను మినహాయించి మొదటి, రెండో సంవత్సరం బీకాం కంప్యూటర్ తరగతులకు సిలబస్‌గా మార్పు చేయనున్నారు.
Advertisement