బీకాం ఎక్కువగా ఇష్టపడుతున్న డిగ్రీ విద్యార్థులు | Degree Students Mostly Joining in Bcom | Sakshi
Sakshi News home page

జై బీకాం

Published Sat, Jul 20 2019 10:12 AM | Last Updated on Wed, Jul 24 2019 1:13 PM

Degree Students Mostly Joining in Bcom - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: ఐటీకి కేంద్ర బిందువైన హైదరాబాద్‌ నగరంలో ఎక్కువ మంది యువత బీకాం(బ్యాచిలర్‌ ఆఫ్‌ కామర్స్‌) కోర్సు వైపే మొగ్గు చూపుతున్నారు. ఒకప్పుడు సైన్సు కోర్సులకు ఉన్న ఆదరణ ఈ కోర్సుకు ఉండేది కాదు. కానీ ప్రస్తుతం గ్రేటర్‌లో అనేక జాతీయ, అంతర్జాతీయ స్థాయి వ్యాపార, వాణిజ్య సంస్థలు, ఐటీ, టెలికాం కంపెనీలు, ఔషధ పరిశ్రమలు, హోటళ్లు, బ్యాంకులు వెలిశాయి. ప్రతి సంస్థ తమ ఉత్పత్తులు, విక్రయాలు, రాబడులు, చెల్లింపుల ఆడిటింగ్‌ పక్కాగా నిర్వహించేందుకు ఆర్థిక అంశాలపై పట్టున్న బీకాం బ్యాక్‌ గ్రౌండ్‌ ఉన్న అభ్యర్థులను ఎంచుకుంటున్నాయి. ఫలితంగా బీఏ, బీఎస్సీ కోర్సులు చదివిన విద్యార్థులతో పోలిస్తే బీకాం కోర్సు చదువుకున్న విద్యార్థులకు సుల భంగా ఉపాధి అవకాశాలు లభిస్తుండటమే ఇందుకు కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ ఆఫ్‌ తెలంగాణ(దోస్త్‌) పరిధిలో ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలోని అత్యధిక కళాశాలలు గ్రేటర్‌ పరిసర ప్రాంతాల్లోనే ఉన్నాయి. సంప్రదాయ కోర్సులకు బదులు ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్న బీకాంలో కంప్యూటర్‌ కోర్సులను ఏర్పాటు చేశాయి. ఇతర వర్సిటీల పరిధిలోని విద్యార్థులు సైన్స్‌ కోర్సుల్లో ఎక్కువ మంది చేరితే.. గ్రేటర్‌లో మాత్రం ఇందుకు భిన్నంగా బీకాం కోర్సులను ఎంచుకోవడం విశేషం. నిజానికి కాలేజీలు, సీట్ల సంఖ్య పరంగా చూస్తే బీఎస్సీ కోర్సుల్లో ఎక్కువ అడ్మిషన్లు కన్పించినా..తక్కువ కాలేజీలు, సీట్లు ఉన్న బీకాం కోర్సుల్లో ఎక్కువ మంది విద్యార్థులు చేరారు. ప్రస్తుతం మిగిలిన సీట్ల సంఖ్యను విశ్లేషిస్తే..ఇదే అంశం స్పష్టమవుతుంది. 

ఆ ఖాళీల భర్తీ కోసం తుది విడత కౌన్సిలింగ్‌
తెలంగాణలోని ఉస్మానియా విశ్వవిద్యాలయం, కాకతీయ విశ్వవిద్యాలయం, మహత్మాగాంధీ విశ్వవిద్యాలయం, పాలమూరు విశ్వవిద్యాలయం, శాతవాహన విశ్వవిద్యాలయం, తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో ఈ విద్యా సంవత్సరం 1110 డిగ్రీ కాలేజీలు ఉండగా, వీటిలో 130 మైనార్టీ, ఇతర కాలేజీలు సొంతం గా అడ్మిషన్లు చేసుకోగా, మిగిలిన 980 కాలేజీలు దోస్త్‌లో చేరాయి. వీటి పరిధిలో బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీసీఏ తదితర కోర్సుల్లో మొత్తం 3,83,514 సీట్లు ఉండగా, ఇప్పటి వరకు చేపట్టిన మూడు దశల కౌన్సిలింగ్స్‌లో 1,41,503 సీట్లు భర్తీ అయ్యాయి. 2,42, 011 సీట్లు మిగిలిపోయాయి. వీటి భర్తీ కోసం ప్రత్యేక కౌన్సిలింగ్‌ ఏర్పాటు చేసింది. ఈ నెల 17 నుంచి 21 వరకు ప్రత్యేక రిజిస్ట్రేషన్, వెబ్‌ ఆప్షన్‌ ప్రక్రియను చేపట్టింది. జులై 26 నుంచి 29వ తేదీలోపు ఆయా వి ద్యార్థులంతా కౌన్సిలింగ్‌ ఫీజు చెల్లించి, ఆయా కాలేజీల్లో సెల్ప్‌రిపోర్టింగ్‌ చేయాల్సి ఉంది. గత ఏడాదితో పోలిస్తే ఈ సారి సీట్ల సంఖ్య తగ్గింది. సీట్ల సంఖ్య తో పాటు దరఖాస్తు దారుల సంఖ్య కూడా తగ్గడం కొసమెరుపు.

78 కాలేజీల్లో జీరో అడ్మిషన్లు
వందశాతం సీట్లు భర్తీ అయిన కాలేజీలు 11 ఉండగా, ఇప్పటి వరకు ఒక్క సీటు కూడా భర్తీ కానీ కాలేజీలు 78 ఉన్నాయి. కాకతీయ వర్సిటీ పరిధిలో  అత్య థికంగా 26 కాలేజీలు ఉండగా, మహత్మాగాంధీ వర్సిటీ పరిధిలో 13 కాలేజీలు, ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో 18 కాలేజీలు, పాలమూరు వర్సిటీ పరిధి లో ఐదు కాలేజీలు, శాతవాహన వర్సిటీ పరిధిలో పది కాలేజీలు, తెలంగాణ వర్సిటీ పరిధిలో ఆరు కాలేజీలు ఉండటం గమనార్హం. మౌలిక సదుపాయాల లేమి, అధ్యాపకుల కొరత, సొంత భవనాలు లేకపోవడంతో పాటు ఎక్కువ శాతం విద్యార్థులు సంప్రదాయ కోర్సులకు బదులు..సాంకేతిక, వృత్తి విద్యా కోర్సుల వైపు మొగ్గు చూపుతుండటమే ఇందుకు కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.  ఇదిలా ఉంటే ఇప్పటి వరకు నిర్వహించిన మూడు విడతల కౌన్సిలింగ్‌లో డిగ్రీ కోర్సుల్లో చేరిన వి ద్యార్థులను పరిశీలిస్తే...బాలురతో పోలిస్తే..బాలికలే అధిక సంఖ్యలో ఉండటం గమనార్హం. ఇప్పటి వరకు 1,41,503 సీట్లు భర్తీ కాగా వీరిలో 83,125 మంది అమ్మాయిలు కాగా,  58378 మంది అబ్బాయిలు ఉన్నారు. తెలంగాణలోని ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఎక్కువగా బీకాం కోర్సుల్లో విద్యార్థులు చేరారు.

ఉపాధి అవకాశాలు లభిస్తుండటం వల్లే: ప్రొఫెసర్‌ అప్పారావు
బీకాం కంప్యూటర్‌ పూర్తి చేసిన వారికి ప్రభుత్వ విభాగాల్లోనే కాకుండా ప్రైవేటు సంస్థల్లోనూ సులభంగా ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. అందువల్లే విద్యార్థులు ఎక్కువగా బీకాం వైపు మొగ్గు చూపుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement