దీపావళి నాటికి కొత్త శిఖరాలకు సెన్సెక్స్!.
దీపావళి నాటికి కొత్త శిఖరాలకు సెన్సెక్స్!.
Published Mon, Oct 21 2013 12:49 AM | Last Updated on Fri, Nov 9 2018 5:30 PM
బీఎస్‌ఈ సెన్సెక్స్ సూచీ ఈ దీపావళి నాటికి కొత్త శిఖరాలను తాకొచ్చని స్టాక్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. కార్పొరేట్ల రెండో త్రైమాసిక ఫలితాలు అంచనాలను మించి మెరుగ్గా ఉండటం, విదేశీ పెట్టుబడుల వెల్లువ, అంతర్జాతీయంగా సానుకూల పరిణామాలు ఇందుకు చేయూతగా నిలుస్తాయనేది వారి అభిప్రాయం. గత శుక్రవారం సెన్సెక్స్ 20,932 పాయింట్ల గరిష్టాన్ని తాకి.. చివరకు 20,883 వద్ద స్థిరపడిన సంగతి తెలిసిందే. కీలకమైన 21,000 పాయింట్లకు కూతవేటు దూరంలో నిలబడింది.
అమెరికాలో సహాయ ప్యాకేజీల కోత ఇప్పుడప్పుడే ఉండకపోవచ్చన్న అంచనాలు, చైనాలో ఆర్థికవ్యవస్థ పుంజుకోవడం వంటివి దేశీ మార్కెట్లకు జోష్‌నిచ్చాయి. ఇక 2008లో సెన్సెక్స్ ఆల్‌టైమ్ గరిష్టం(21,207 పాయింట్లు)తో చూస్తే ప్రస్తుతం కేవలం 324 పాయింట్లు మాత్రమే వ్యత్యాసం ఉంది. ఈ నెలలో ఇప్పటిదాకా సెన్సెక్స్ 6.99% (1,366 పాయిం ట్లు) ఎగబాకడం గమనార్హం.
దేశీయంగా, అంతర్జాతీయంగా సానుకూల పరిస్థితులు, లిక్విడిటీ జోరును చూస్తుంటే... మార్కెట్లలో దూకుడు కొనసాగుతుందన్న విశ్వాసం కలుగుతోందని విశ్లేషకులు అంటున్నారు. సమీప కాలంలో సెన్సెక్స్ కొత్త శిఖరాలను అందుకోవచ్చని, బహుశా ఈ దీపావళి నాటికే ఆల్‌టైమ్ గరిష్టాన్ని తాకే అవకాశం ఉందని ఆషికా స్టాక్ బ్రోకర్స్ రీసెర్చ్ హెడ్ పారస్ బోత్రా అభిప్రాయపడ్డారు. ఇందుకు ఎఫ్‌ఐఐల పెట్టుబడుల జోరు ప్రధాన చోదకంగా నిలవనుందని కూడా ఆయన పేర్కొన్నారు. జియోజిత్ బీఎన్‌పీ రీసెర్చ్ హెడ్ అలెక్స్ మాథ్యూస్ కూడా ఇదే విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
Advertisement
Advertisement