సాక్షి, ముంబై: ఇళ్ల కోసం మిల్లు కార్మికులు మరోసారి ఆందోళనకు దిగారు. ఆజాద్‌మైదాన్‌లో బుధవారం ఉదయం నుంచి 25 మంది అమరణ నిరాహార దీక్ష చేపట్టారు. తమ డిమాండ్లు నెరవేరేంత వరకు ఆందోళన విరమించేది లేదని వీరు స్పష్టం చేశారు. దరఖాస్తు చేసుకున్న 1.48 లక్షల మంది మిల్లు కార్మికులకు ఇళ్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. కార్మికుల కోసం 12 మిల్లు స్థలాల్లో ఇళ్లు నిర్మించి ఇవ్వడమేగాకా ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీకి (ఎమ్మెమ్మార్డీయే) చెందిన 50 శాతం ఇళ్లు కార్మికులకు అందజేస్తామని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ గతంలో హామీ ఇచ్చారు.
ఈ హామీని ఆయన నిలబెట్టుకోవాలని వీరు డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్లపై పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వం, మాడా అధికారులతో భేటీ అయి, వారి వినతిపత్రాలు అందించినప్పటికీ ప్రయోజనం కనిపించడం లేదని మాజీ కార్మికుడు గన్నారపు శంకర్ ఆరోపించారు. అందుకే బుధవారం నుంచి రెండోసారి ఆందోళనకు దిగాల్సివచ్చిందని ‘రాష్ట్రీయ మిల్ మజ్దూర్ సంఘ్’ ఉపాధ్యక్షుడు భజరంగ్ చవాన్ ‘సాక్షి’కి తెలిపారు. ఆయన అందించిన వివరాల మేరకు బుధవారం నుంచి 25 మంది ఆజాద్ మైదాన్‌లో ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. మిగతా కార్మికులు కూడా వీరికి మద్దతుగా వేర్వేరు పద్ధతుల్లో నిరసనలు తెలుపనున్నట్టు చెప్పారు. నిరాహార దీక్ష చేస్తున్నవారిలో మరాఠీ దినపత్రిక నవకాల్ సంపాదకురాలు జయక్ష ఖాడీల్కర్ పాండే, ‘గిర్నీ కామ్‌గార్ సంఘర్ష్ సమితి’ అధ్యక్షుడు దత్తా ఇస్వాల్కర్, ‘సెంచరీ మిల్ కామ్‌గార్ ఏక్తామంచ్’కు చెందిన నందూ పార్కర్ తదితరులున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్రీయ మిల్లు మజ్దూర్‌సంఘ్ ప్రధాన కార్యదర్శి గోవింద్ మోహితే, నివృత్తి దేశాయి, అన్నా శిర్సేకర్ తదితరులు మిల్లు కార్మికులకు మార్గదర్శనం చేసి ఆందోళన గురించి తెలియపరిచారు.
పరేల్‌లో నేడు రాస్తారోకో...
ఆందోళనను మరింత తీవ్రం చేయాలన్న ఉద్దేశంతో గురువారం ఉదయం పరేల్‌లోని దాల్వీ బిల్డింగ్ ఎదుట రాస్తారోకో నిర్వహించనున్నట్టు భజరంగ్ చవాన్ తెలిపారు.
రాష్ట్రీయ మిల్లు మజ్దూర్‌సంఘ్ ప్రధాన కార్యదర్శి గోవింద్ మోహితే ఆధ్వర్యంలో ఈ రాస్తారోకో జరగనుందన్నారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం తొందరగా స్పందించకుంటే ఆందోళనను మరింత తీవ్రం చేస్తామని ఆయన ఈ సందర్భంగా ప్రకటించారు.
జాప్యమే కారణం
అర్హులైన మిల్లు కార్మికులకు తక్కువ ధరకు ఇళ్లు నిర్మించేందుకు మహారాష్ట్ర హౌసింగ్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (మాడా) ముందుకు వచ్చింది. ఇళ్ల నిర్మాణానికి నేషనల్ టెక్స్‌టైల్ కార్పొరేషన్‌కు(ఎన్‌టీసీ) చెందిన తొమ్మిది మిల్లులుసహా మూడు ప్రైవేటు మిల్లులు ఇలా మొత్తం 12 మిల్లుల స్థలాలను మాడా తన ఆధీనంలోకి తీసుకుంది. ఇళ్ల ధరలు ఎలా నిర్ణయించాలనే అంశం ఎటూ తేలకపోవడంతో నిర్మాణ పనులు పెండింగులో పడ్డాయి. దీంతో మిల్లు కార్మికుల ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వంతో పలుమార్లు చర్చలు జరిపారు. అయినప్పటికీ ఫలితం దక్కకపోవడంతో వారు మరోసారి ఆందోళనకు సిద్ధమయ్యారు.
ఎక్కడ వేసిన గొంగళి అక్కడే..
సెంచరీ, ప్రకాశ్ కాటన్, రూబీ ఇలా మూడు ప్రైవేటు మిల్లులతోపాటు తొమ్మిది ఎన్టీసీ మిల్లుల స్థలాలు మాడా అధీనంలో ఉన్నాయి. సెంచరీ మిల్లు స్థలంలో 2,500, ప్రకాశ్ కాట న్‌మిల్లు స్థలంలో 1,200, రూబీ మిల్లు స్థలంలో 500 ఇళ్లు నిర్మించవచ్చు. మిగతా తొమ్మిది మిల్లు స్థలాల్లో 2,800 ఇళ్లు నిర్మించేందుకు వీలుందని యూనియన్లు పేర్కొంటున్నాయి. దీంతోపాటు ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఎమ్మెమ్మార్డీయే) నిర్మించే వాటిలోనూ 50 శాతం ఇళ్లను మిల్లు కార్మికులకు ఇవ్వనున్నట్టు సీఎం హామీ ఇచ్చినట్టు వారు తెలిపారు. ‘నిబంధనల్లో మార్పులు చేయడానికి మరో నెల సమయం కావాలన్నారు. ఈ ప్రక్రియ పూర్తికాగానే ఆదేశాలు జారీచేస్తామని చవాన్ హామీ ఇచ్చారు. ఇంత వరకు ఆయన ఇచ్చిన హామీ నెరవేరనేలేదు’ అని నాయకులు వివరించారు. ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చేవరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టీకరించారు.
గూడు కోసం పోరు
Published Wed, Nov 6 2013 11:12 PM | Last Updated on Sat, Sep 2 2017 12:20 AM
Advertisement
Advertisement