సాక్షి, ముంబై: ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ఎన్నికల ప్రవర్తన నియమావళి (కోడ్)ని ఉల్లంఘించారని ‘దేశ్ బచావ్ పార్టీ’ కేంద్ర ఎన్నికల కమిషన్‌కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసింది. సీఎం వైఖరిపై ఎన్నికల సంఘం విచారణ ప్రారంభించిందని దేశ్ బచావ్ పార్టీ అధ్యక్షుడు హేమంత్ పాటల్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ‘రాష్ట్రంలో వచ్చే నెల 15న ఎన్నికలు జరుగుతాయని ఈ నెల 12వ తేదీన సాయంత్రం 4.30 గంటలకు కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది.. వెనువెంటనే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది..
నియమాల ప్రకారం కోడ్ అమలులోకి వచ్చిన తర్వాత మంత్రులు ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోకూడదు.. అయినప్పటికీ ముఖ్యమంత్రి 35 రకాల ఫత్వాలు (ఆదేశాలు) జారీ చేశారు.. అదేవిధంగా ఐపీఎస్ అధికారుల బదిలీలతోపాటు వివిధ శాఖల్లో పనిచేస్తున్న కొందరు ఉన్నతాధికారుల బదిలీ ఫైళ్లపై సంతకాలు చేశారు.. ఇలా చేయడం నియమాలు ఉల్లంఘించడమే’నని పేర్కొంటూ కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఆ పార్టీ ఫిర్యాదు చేసింది. విచారణలో ఆరోపణలు నిజమని తేలితే చవాన్‌పై తప్పకుండా చర్యలు తీసుకుంటామని కమిషన్ స్పష్టం చేసిందని హేమంత్ పాటిల్ తెలిపారు.
సీఎంపై ఈసీకి ఫిర్యాదు
Published Thu, Sep 18 2014 11:15 PM | Last Updated on Tue, Aug 14 2018 4:34 PM