గోపీనాథ్ ముండే మృతిపై పలువురి దిగ్భ్రాంతి
సాక్షి, ముంబై: బీజేపీ నాయకుడు, కేంద్ర మంత్రి గోపీనాథ్ ముండే మృతిపై ప్రభుత్వం, పార్టీలు, ప్రజలు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఇక లేరనే వార్తను జీర్ణించుకోలేకపోయారు. ముండే స్వగ్రామానికి చెందిన కొందరు ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని కంటతడి పెట్టుకున్నారు. గవర్నర్, సీఎం సహా పలువురు నాయకులు ముండే కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ముండే లోకనాయకుడు-గవర్నర్
కేంద్రమంత్రి గోపీనాథ్ ముండే లోకనాయకుడు. ప్రజలతో నిరంతరం సంబంధాలు కొనసాగించేవారు. కేంద్రమంత్రిగా చేరిన వారం రోజులకే దుర్మరణం పాలుకావడం రాష్ట్రవాసులందరినీ దుఖంలో ముంచివేసింది. పేదలు, అణగారిన వర్గాల కోసం ఎంతో శ్రమించి ఉన్నతస్థాయికి ఎదిగారు. చేపట్టిన ప్రతి పదవిలోనూ తనదైన ముద్ర వేశారు.
పేదల పక్షపాతి: సీఎం పృథ్వీరాజ్ చవాన్
పేదల కోసం పోరాడుతూ అనతికాలంలోనే ప్రజలకు దగ్గరైన నాయకుల్లో ముండే ఒకరు. ఎలాంటి విపత్తులు వచ్చినా రాజకీయాలను పక్కన బెట్టి బాధితులకు సాయం చేసేవారు. ఇలాంటి నాయకుడు మనమధ్య లేకపోవడం దురదృష్టకరం. రాష్ట్ర ప్రజల తరఫున ముండేకు ఘనంగా నివాళులర్పిస్తున్నాను.
నాకు సన్నిహితుడు: ఎన్సీపీ అధిపతి పవార్
రాజకీయాలు పక్కనే బెడితే మా ఇద్దరి మధ్య చాలా కాలంగా అనుబంధం ఉంది. ఎక్కడ కనిపించినా ఒకరినొకరం అప్యాయంగా పలుకరించుకునేవాళ్లం. పేదలను ప్రేమించి సహృదయుడు కారు ప్రమాదంలో చనిపోవడం బాధాకరం. ఈ దుఖాన్ని తట్టుకునే శక్తి ఆయన కుటుంబానికి ఇవ్వాలని భగవంతుడ్ని మనస్ఫూర్తిగా కోరుతున్నాను.
పోరాట యోధుడు: మాణిక్‌రావ్ ఠాక్రే
పేదలు, వెనకబడిన తరగతుల హక్కుల కోసం ఎన్నో పోరాటాలు చేసిన యోధుడు ఇక లేరు. చాలా కాలం తరువాత ఆయనకు మంత్రిగా సేవ చేసేందుకు అవకాశం లభించింది. ఇలాంటి సమయంలో ఆకస్మికంగా ప్రమాదంలో మృతి చెందడం అత్యంత బాధాకరం. ఎన్నో ఆశలుపెట్టుకుని ప్రజలు ఆయనను గెలిపించారు. సేవ చేసేందుకు దేవుడు అవకాశమివ్వలేదు.
ప్రజలకు ఆప్తుడు : శివసేన
ముండే మృతి మహారాష్ట్ర వాసులకు తీరనిలోటు. కార్యకర్తలు, ప్రజలతో ఆయన ఎపుడూ మమేకమయ్యేవారు. ఏ సమయంలోనైనా ప్రశాంతగా, సంయమనంగా వ్యవహరించేవారు. మా పార్టీతో ఎప్పుడూ సత్సంబంధాలు కోరుకునేవారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించడానికి తీవ్రంగా శ్రమించారు.
ముండే లేని లోటు పూడ్చలేనిది : రాజ్ ఠాక్రే
కేంద్ర మంత్రిగా సేవలు అందించేందుకు ప్రజల్లోకి వస్తున్న తరుణంలో ముండే మృతి చెందడం దురదృష్టకరం. ఆయన లేరనే బాధ, లోటు కేవలం బీజేపీకే పరిమితం కాదు. యావత్ రాష్ట్రానికీ అన్యాయం జరిగింది. ముండే మృతిచెందారనే విషయం నమ్మశక్యంగా లేదు.
సీబీఐ దర్యాప్తు జరిపించాలి: ఆఠవలే
ఈ ఘటనపై సీబీఐ ద్వారా దర్యాప్తు చేస్తే బాగుంటుంది. ఉదయం వాహనాల రద్దీ లేదు. సిగ్నల్ జంప్ చేశారా..? ఢీ కొట్టిన కారు ముండే కాన్వాయ్‌లోకి ఎలా వచ్చింది.. ఇందులో ఏదైనా కుట్ర దాగుందా? అనే విషయం తేలాలంటే సీబీఐ ద్వారా దర్యాప్తు చేయించాల్సిన అవసరం ఎంతో ఉంది. ఆయన లేరనే వార్తను ఉదయం ఎవరో ఫోన్ చేసి చెప్పారు. కొద్దిసేపు నమ్మబుద్ధి కాలేదు. తరువాత నిజమని తేలడంతో జీర్ణించుకోలేకపోయాను. ఆయన మరణం బీజేపీకే కాదు.. యావత్ రాష్ట్ర ప్రజలకు తీరనిలోటు.