సాక్షి, ముంబై: నగరంలో శాంతిభద్రతల పరిస్థితి దయనీయంగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక్కడ రోజురోజుకూ మహిళలపై అత్యాచారాలు, దాడులు పెరిగిపోతున్నా ప్రభుత్వం నివారణ చర్యలు తీసుకోవడంలో విఫలమవుతోంది. గురువారం సాయంత్రం ముంబైలో మహిళా ఫొటో జర్నలిస్ట్‌పై జరిగిన అత్యాచారం సంఘటనపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు పెల్లుబికాయి. జాతీయ రాజధానితోపాటు దేశ ఆర్థిక రాజధానిలో సైతం మహిళలకు తగిన రక్షణ లేకుండా పోయిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల నగరంలో జరిగిన కొన్ని సంఘటనలు మహిళా భద్రతను ప్రశ్నార్థకంగా మార్చేశాయి. ముంబైలోని బాంద్రా రైల్వేస్టేషన్‌లో ఓ యువతిపై ఆసిడ్ దాడి, రైల్లో అత్యాచార ప్రయత్నం, అమెరికా యువతిపై బ్లేడ్‌తో దాడి సంఘటనలన్నీ ముంబైలో ఇటీవల కాలంలోనే జరిగిన విషయం విదితమే. మూడు రోజుల కిందటే పుణేలో సామాజిక కార్యకర్త నరేంద్ర దాబోల్కర్ హత్య సంఘటనను మరవకముందే ముంబైలో ఫొటో జర్నలిస్ట్‌పై అత్యాచారం జరిగింది. ఇలాంటి సంఘటనల నేపథ్యంలో రాష్ట్రంలో శాంతిభద్రతలను నెలకొల్పడంలో రాష్ట్ర పోలీసులు విఫలమవుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ముంబైతోపాటు రాష్ట్రంలోని ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ సంఘాలు, కెమెరామెన్, ఫొటోగ్రాఫర్ జర్నలిస్ట్ సంఘాలు ఈ సంఘటనపై తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. ముంబైలోని హుతాత్మ చౌక్‌లో శుక్రవారం జర్నలిస్ట్ సంఘాలు ర్యాలీలు, ధర్నాలు నిర్వహించాయి. మరోవైపు ఠాణేలో కలెక్టర్ కార్యాలయం ఎదుట ఠాణే జర్నలిస్ట్ సంఘాలు ర్యాలీ నిర్వహించాయి. పుణే, ఔరంగాబాద్, నాగపూర్‌తోపాటు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో నిరసన ర్యాలీలు నిర్వహిస్తూ జర్నలిస్ట్‌లకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశాయి. అదేవిధంగా ఈ సంఘటనలో నిందితులకు కఠినంగా శిక్షించాలని పేర్కొన్నాయి.
మరోవైపు వివిధ పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు సైతం పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తూ ప్రభుత్వంపై మండిపడ్డారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్‌తోపాటు హోంశాఖ మంత్రి ఆర్ ఆర్ పాటిల్‌పై విమర్శలు గుప్పించారు. పాటిల్ హోంమంత్రిగా పనికిరాడని, అతడు వెంటనే పదవి నుంచి తప్పుకోవాలని వివిధ పార్టీలు డిమాండ్ చేశాయి.
పింప్రిలో రాస్తారోకో
పింప్రి, న్యూస్‌లైన్: మహిళా ఫొటోజర్నలిస్టుపై సామూహిక అత్యాచార ఘటనకు నిరసనగా బీజేపీ, శివసేన పార్టీలకు చెందిన మహిళా శాఖ శుక్రవారం నగరంలో రాస్తోరోకో నిర్వహించింది. ఈ సందర్భంగా ముంబై-పుణే హైవేపై పెద్దసంఖ్యలో మహిళలు, నాయకులు, కార్యకర్తలు బైఠాయించారు. వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. దీంతో ఈ రహదారిపై వాహనాలు పెద్దసంఖ్యలో నిలిచిపోయాయి. శాంతిభద్రతలను కాపాడడంలో విఫలమైనందువల్ల హోం శాఖ మంత్రి ఆర్.ఆర్.పాటిల్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. మహిళలకు రిజర్వేషన్లు ప్రకటించడం సంగతి పక్కనబెట్టి ముందు వారికి రక్షణ కల్పించాలని కోరారు. ఆర్.ఆర్.పాటిల్ డౌన్ డౌన్ అంటూ పెద్దఎత్తున మహిళలు నినదించారు. శివసేన కార్పొరేటర్ సులభా ఉభాలే, సీమా సావలే, బీజేపీ మహిళా విభాగం ప్రదేశ్ కార్యదర్శి ఉమా భాపరలు రాస్తారోకో ఈ కార్యక్రమానికి నేతృత్వం వహించారు. అన ంతరం స్థానిక అంబేద్కర్ విగ్రహంవద్ద సులభా ఉభాలే, సీమా ఖాపరేలు ఓ సభ ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమంలో పలువురు వక్తలు మాట్లాడుతూ ప్రభుత్వం దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఆశా షేడగే, శారదా బాబర్, అశ్విని చించ్వడ్, సంగీతా భోంద్వే, సంగీతా పవార్, మాజీ కార్పొరేటర్లు విజయ, శివసేన మహిళా శాఖ నాయకురాలు సునీతా చౌహాన్ తదితరులు పాల్గొన్నారు.
ముంబై..భద్రతకు బైబై..!
Published Sat, Aug 24 2013 12:16 AM | Last Updated on Mon, Jul 23 2018 9:13 PM