ఫొటో జర్నలిస్టుపై సామూహిక అత్యాచారం కేసులో వీలైనంత త్వరగా న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తామని ముంబై పోలీసు కమిషనర్ సత్యపాల్ సింగ్ తెలిపారు. సాక్ష్యాలు సేకరించి, వీలైనంత త్వరగా చార్జిషీటు దాఖలు చేయాలన్నదే తమ లక్ష్యమని ఆయన విలేకరులతో అన్నారు. చివరి ఇద్దరు నిందితులను కూడా ఆదివారమే అరెస్టు చేయడంతో, ఇప్పుడు మొత్తం నిందితులంతా పోలీసుల అదుపులోనే ఉన్నట్లయింది.
తాము ఇప్పటికే సేకరించిన సాక్ష్యాలను ఫోరెన్సిక్ నిపుణులకు అందిస్తామని సత్యపాల్ సింగ్ చెప్పారు. నిందితులు ఈ సంఘటనను తమ మొబైల్ ఫోన్లో రికార్డు చేయగా అది లభ్యమైందని, బాధితురాలి ఫోన్ను నిందితులు అమ్మేయగా, దాన్ని కూడా తాము స్వాధీనం చేసుకున్నామని సింగ్ చెప్పారు. ఐదుగురు నిందితుల్లో ముగ్గురిపై ఇప్పటికే హిస్టరీ షీట్లు ఉన్నాయన్నారు. నిందితుల్లో ఏ ఒక్కరూ మైనర్ కాదని ఆయన స్పష్టం చేశారు. ఒకరు మైనర్ అని అతడి తల్లిదండ్రులు వాదిస్తున్నా, అతడు 2011లోనే ఓ కేసులో అరెస్టయ్యాడని చెప్పారు. కేవలం 18 ఏళ్లకు పైన ఉన్నవారినే ప్రశ్నిస్తారన్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. అయితే, అతడి వయసును మరోసారి నిర్ధారించుకోడానికి అవసరమైతే ఎముకల పరీక్ష చేయించే అవకాశం కూడా లేకపోలేదన్నారు.
అత్యాచార సంఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితురాలు ఇంకా ఆస్పత్రిలో చికిత్స పొందుతూనే ఉంది. ఆదివారం నాడు ఆమె కుటుంబ సభ్యులు ఆమె వివరాలు బయటకు వెల్లడించొద్దంటూ మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కలిశారు. ముంబై ఉగ్రదాడి కేసులో అజ్మల్ కసబ్కు ఉరిశిక్ష పడేలా సమర్థంగా వాదించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నికమ్కే ఈ కేసు కూడా అప్పగిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు వారికి తెలిపాయి.
ముంబై అత్యాచారం: వీలైనంత త్వరగా న్యాయం చేస్తామన్న కమిషనర్
Published Mon, Aug 26 2013 7:59 PM | Last Updated on Fri, Sep 1 2017 10:08 PM