ముంబై రేప్ కేసులో మరో ఇద్దరు అరెస్టు
ముంబై: ముంబైలో మహిళా ఫొటో జర్నలిస్టుపై మూడు రోజుల కిందట సామూహిక అత్యాచారానికి తెగబడ్డ మొత్తం ఐదుగురు నిందితులనూ పోలీసులు అరెస్టు చేశారు. సెంట్రల్ ముంబైలోని అగ్రిపడా ప్రాంతానికి చెందిన మహమ్మద్ కాసిం హఫీజ్ షేక్ అలియాస్ కాసిం బెంగాలీని ఆదివారం వేకువ జామున 4.15 గంటలకు ముంబై సెంట్రల్ స్టేషన్ వద్ద అరెస్టు చేశారు. అతడి సహచరుడు సిరాజ్ రెహమాన్ ఖాన్‌ను శనివారం రాత్రే అరెస్టు చేశారు. వారిద్దరినీ కోర్టులో హాజరుపరచగా, కోర్టు వారిని ఈనెల 30 వరకు పోలీసు కస్టడీకి అప్పగించింది. ఇంకో నిందితుడు సలీం అన్సారీని ముంబై క్రైమ్‌బ్రాంచ్ బృందం ఆదివారం వాయవ్య ఢిల్లీలోని భరత్‌నగర్ ప్రాంతంలో అరెస్టు చేసింది.
అతడిని ముంబై తీసుకురానున్న పోలీసులు, సోమవారం అతడిని కోర్టులో హాజరుపరచే అవకాశాలు ఉన్నాయి. అన్సారీపై సమాచారంతో ఢిల్లీ చేరుకున్న పోలీసులు, తమ వద్ద ఉన్న సమాచారం ఆధారంగా అతడు ఉండే ప్రాంతం గురించి భరత్‌నగర్ పోలీసులను కనుక్కున్నారు. అన్సారీ ఢిల్లీలోని బంధువుల ఇంటికి వెళుతుండగా, ముంబై క్రైమ్‌బ్రాంచ్ పోలీసులు అతడిని అరెస్టు చేశారు. తర్వాత అతడికి బాబూ జగ్జీవన్ రామ్ స్మారక ఆస్పత్రిలో వైద్య పరీక్షలు జరిపించారు. కాగా, ఈ కేసుకు సంబంధించి ఇద్దరు నిందితులను పోలీసులు ఇదివరకే అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. తొలుత అరెస్టయిన విజయ్ జాదవ్, చాంద్‌బాబు, సత్తార్ షేక్‌లను శనివారం కోర్టులో హాజరుపరచగా, కోర్టు వారిని ఈనెల 30 వరకు పోలీసు కస్టడీకి అప్పగించింది.
మొబైల్ ఫోన్‌తో ఘాతుకం చిత్రీకరణ...
ముంబైలోని శక్తి మిల్స్ ప్రాంగణంలో విధి నిర్వహణలో భాగంగా ఫొటోలు తీస్తున్న మహిళా ఫొటో జర్నలిస్టుపై ఈనెల 22న అత్యాచారానికి తెగబడ్డ నిందితులు, తమ కీచకాన్ని మొబైల్ ఫోన్‌లోని కెమెరాలో చిత్రించారు. ఆమెతో వచ్చిన సహోద్యోగిపై దాడిచేసి, అతడిని కట్టి పడేసిన నిందితులు, మహిళా జర్నలిస్టు మెడపై పగిలిన బీరుసీసా పెట్టి, బెదిరించి అత్యాచారానికి ఒడిగట్టారని పోలీసులు కోర్టుకు తెలిపారు. జరిగిన ఘటనను ఎవరికైనా చెబితే, మొబైల్‌లో చిత్రించిన ఫొటోలను బయటపెడతామని బాధితురాలిని బెదిరించినట్లు చెప్పారు. ఈ కేసులో కీలక నిందితుడు కాసిం బెంగాలీ మొబైల్ ఫోన్‌ను ఎక్కడ దాచిందీ చెప్పడం లేదని, అతడు దర్యాప్తునకు ఏమాత్రం సహకరించడం లేదని పోలీసులు కోర్టుకు తెలిపారు. అయితే, బాధితురాలిపై అత్యాచారానికి ఒడిగట్టిన విషయాన్ని కాసిం అంగీకరించాడని చెప్పారు. ఆమెను బెదిరించేందుకు ఉపయోగించిన పగిలిన బీరుసీసాను నిందితుల వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులపై పోలీసులు అత్యాచారం(376-డీ), అక్రమ నిర్బంధం (342), బెదిరించడం(506-2), ఉమ్మడి ఉద్దేశం(34) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తమ తరఫున వాదించేందుకు ఎవరైనా న్యాయవాదులను ఏర్పాటు చేసుకున్నారా అని మేజి స్ట్రేట్ నిందితులు కాసిం, సిరాజ్ ఖాన్‌లను ప్రశ్నించగా, లేదని వారు బదులిచ్చారు. నిందితుల గుర్తింపు పరేడ్‌ను ఇంకా నిర్వహించనందున వారిని కస్టడీకి అప్పగించాలని పోలీసులు అభ్యర్థించడంతో, ఈనెల 30 వరకు పోలీసు కస్టడీకి అప్పగిస్తూ మేజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేశారు.
ఐఫోన్, కెమెరా ఇచ్చేస్తామన్నా వదలని నిందితులు...: శక్తి మిల్స్ వద్ద ఫొటోలు తీసే పని ముగించుకుని మహిళా ఫొటో జర్నలిస్టు, ఆమె సహోద్యోగి అక్కడి నుంచి తిరుగుముఖం పడుతుండగా, తొలుత ముగ్గురు నిందితులు వారిని అటకాయించారు. మరో ఇద్దరికి ఫోన్‌చేసి, అక్కడకు పిలిపించారు. తమను విడిచిపెడితే, తమ వద్దనున్న ఐఫోన్, ఖరీదైన కెమెరా ఇచ్చేస్తామని చెప్పినా, వారు బాధితులను వదల్లేదని పోలీసులు తెలిపారు. తమ కీచకం ముగిశాక బాధితులిద్దరినీ నిందితులు సమీపంలోని రైల్వేస్టేషన్ వద్ద విడిచిపెట్టారన్నారు. విడిచిపెట్టే ముందు బాధితురాలి చేతే సంఘటనా స్థలాన్ని శుభ్రం చేయించారు. రైల్వేస్టేషన్ వద్ద నుంచి బాధితురాలు తన బాస్‌కు ఫోన్‌చేసి, జరిగిన విషయాన్ని చెప్పింది. అక్కడి నుంచి దాదాపు 800 మీటర్లు నడిచి వెళ్లాక, క్యాబ్ దొరకడంతో, బాధితులిద్దరూ జస్‌లోక్ ఆస్పత్రికి వెళ్లారు.
పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా ఉజ్వల్ నికమ్
ముంబైలో మహిళా ఫొటో జర్నలిస్టుపై జరిగిన గ్యాంగ్‌రేప్ కేసును వాదించేందుకు ప్రముఖ క్రిమినల్ లాయర్ ఉజ్వల్ నికమ్‌ను ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నియమించినట్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ఆదివారం పుణేలో తెలిపారు. బాధితురాలికి సత్వర న్యాయం చేకూర్చేందుకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా ఈ కేసుపై విచారణ జరిపించనున్నట్లు ఆయన చెప్పారు. కాగా, ఈ కేసును వాదించాలని ముఖ్యమంత్రి చవాన్, హోంశాఖ మంత్రి ఆర్.ఆర్.పాటిల్ తనను కోరారని, తాను అందుకు అంగీకరించానని నికమ్ తెలిపారు. కాగా, ఉజ్వల్ నికమ్ ఇదివరకు 1993 నాటి ముంబై పేలుళ్లు, 2006లో ఖైర్లాంజీ దళితుల ఊచకోత, 2008 నవంబర్ 26 నాటి ముంబై ఉగ్రవాద దాడులు వంటి కీలకమైన కేసులను కూడా ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా వాదించారు.