సాక్షి ప్రతినిధి, బెంగళూరు : ‘అయ్యా...నా బిడ్డ ఎలాగూ బతకడు. వాడిని అక్కడే సమాధి చేయడానికి అనుమతించండి. తవ్వేసిన నా భూమిని... గతంలో ఉన్నట్లు యథా స్థితిలో తిరిగి నాకు అప్పగించండి’...ఇది బాగలకోటె జిల్లా సూళగేరిలో గత ఆదివారం బోరు బావిలో పడిపోయిన ఆరేళ్ల తిమ్మన్న తండ్రి హనుమంతప్ప జిల్లా కలెక్టర్ మేఘన్ననవర్‌కు చేసిన విన్నపం. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉందని కలెక్టర్ వెల్లడించారు.
మరో వైపు 160 అడుగుల లోతు నుంచి సజీవంగా తీసుకు రాలేని తిమ్మన్నను, నిర్జీవంగానైనా తీసుకు రావడానికి చేస్తున్న ప్రయత్నాలకు అనేక విఘ్నాలు ఎదురవుతున్నాయి. దీంతో అతను మట్టిలో కలసిపోవడం దాదాపు ఖాయమని వినవస్తోంది. తిమ్మన్న బోరు బావిలో పడిపోయినప్పటి నుంచి అతనిని బయటకు తీసుకు రావడానికి చేపట్టిన సహాయక చర్యల్లో భాగంగా తవ్విన సమాంతర గుంతలో లోతుకు వెళ్లే కొద్దీ ఉన్నఫళంగా కూలిపోతుందేమోననే భీతి సిబ్బందిని వెంటాడుతోంది.
పొలంలో లోతున మట్టి స్వభావం బంక మట్టిని పోలి ఉంది. ఇలాంటి బురద మట్టితో అపాయమని సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పకడ్బందీగా జాగ్రత్త చర్యలు చేపట్టి, శవాన్ని వెలికి తీయాలంటే కనీసం ఎనిమిది రోజులు పడుతుందని అంచనా. కుమారుడు బోరు బావిలో పడిపోవడంతో తీవ్ర అస్వస్థతకు గురై బాగలకోటె ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొంది, సూలగిరికి తిరిగి వచ్చిన హనుమంతప్ప, గురువారం రాత్రి సంఘటనా స్థలానికి చేరుకున్నాడు. కాగా పొలంలో మట్టి స్వభావాన్ని పరీక్షించడానికి ఆ రంగంలో నిపుణుడైన ప్రొఫెసర్ శ్రీనివాసమూర్తిని పిలిపించినట్లు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ఎస్‌ఆర్. పాటిల్ తెలిపారు.
ఆయన మట్టి పరీక్షలను పూర్తి చేసిన అనంతరం జిల్లా యంత్రాంగం, స్థానిక ప్రజా ప్రతినిధులు, సూళగేరి గ్రామ పెద్దలతో మాట్లాడి తదుపరి నిర్ణయం తీసుకుంటామని ఆయన వెల్లడించారు. కాగా తిమ్మన్న శవాన్ని వెలికి తీయడానికి సాగుతున్న పనులను ప్రభుత్వం ఆపివేయలేదు. అయితే బాలుడి తండ్రి విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
పడిన చోటే..
Published Sat, Aug 9 2014 2:26 AM | Last Updated on Sat, Sep 2 2017 11:35 AM
Advertisement