- అభ్యర్థుల రాజకీయ నేపథ్యమే కారణం
- కొత్త జాబితా ఇవ్వాలని సూచన
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : శాసన మండలికి ఐదుగురు సభ్యులను నామినేట్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన సిఫార్సులపై గవర్నర్ హెచ్‌ఆర్. భరద్వాజ్ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది. జాబితాను పునఃపరిశీలించాల్సిందిగా సలహా ఇచ్చినట్లు సమాచారం. కళలు, సాహిత్యం, సామాజిక సేవ, విద్య, వైద్య, క్రీడలు తదితర రంగాలకు చెందిన వారిని ఎగువ సభకు నామినేట్ చేయడం ఆనవాయితీ కాగా ప్రభుత్వం సమర్పించిన జాబితాలో నలుగురు రాజకీయ నాయకులు ఉండడంపై గవర్నర్ ఆక్షేపణ వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
నటి జయమాల మినహా ఉగ్రప్ప, ఇక్బాల్ అహ్మద్ సరడగి, శాంత కుమార్, అబ్దుల్ జబ్బార్‌లకు కాంగ్రెస్ పార్టీతో ప్రత్యక్ష సంబంధాలున్నాయి. దీనిపై బీజేపీ రాష్ర్ట శాఖ కేంద్ర హోం మంత్రికి ఫిర్యాదు చేయగా, ఈ విషయంలో నింపాదిగా వ్యవహరించాలని గవర్నర్‌కు అక్కడి నుంచి సలహాలు అందినట్లు తెలిసింది. ఈ నెల 29న రిటైర్ కానున్న గవర్నర్, ఆఖరి నిముషాల్లో ఆత్రుతగా వ్యవహరించారనే అపవాదును మూట కట్టుకోకూడదనే ఉద్దేశంతో ఉన్నారు.
జాబితాను ఆమోదింపజేసుకోవడానికి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఎంతగా ప్రయత్నించినా, ఆయన సమ్మతించ లేదని సమాచారం. వేరే పేర్లతో కొత్త జాబితాను పంపించాలని సూచించినట్లు తెలిసింది. కాగా నెల కిందట ఏర్పడిన ఖాళీలో అబ్దుల్ జబ్బార్ నామినేటెడ్ సభ్యుడుగా నియమితులయ్యారు. ఆయనను తిరిగి నామినేట్ చేయాలని సిఫార్సు చేయడం కూడా వివాదాస్పదమవుతోంది.
హోం మంత్రితో గవర్నర్ భేటీ
రాష్ట్ర గవర్నర్ బుధవారం ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ అయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ తాను ఎందుకు రాజీనామా చేయాలని ప్రశ్నించారు. మంగళవారం ఆయన రాజీనామా చేశారని వదంతులు వ్యాపించిన సంగతి తెలిసిందే.