ఆరిన దీపం?
- తిరిగి రాని లోకాలకు తిమ్మన్న
- బోరు బావి నుంచి దుర్వాసన
- మృతదేహం వెలికితీతకు సాగుతున్న పనులు
- బాధిత కుటుంబాన్ని ఆదుకుంటాం : మంత్రి పాటిల్
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : ప్రార్థనలు ఫలించలేదు. దేవుడు కరుణించలేదు. అతని ఆయుష్షు అంతేనని తేల్చేశాడు. బాగలకోటె జిల్లా సూళికేరి వద్ద గత ఆదివారం బోరు బావిలో పడిపోయిన ఆరేళ్ల తిమ్మన్న అటు నుంచి అటే...తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడు. ప్రాణాలతో అతనిని బయటకు తీసుకు రావడానికి చేపట్టిన సహాయక చర్యలు...ఇప్పుడు మృతదేహాన్ని వెలికి తీయడానికి కొనసాగుతున్నాయి.
మధ్య మధ్యలో అవాంతరాలతో 88 గంటల పాటు ఏకబిగిన సహాయక చర్యలు సాగాయి. ‘బాలుడు బోరు బావిలో పడిపోయి ఎనభై గంటలకు పైగా గడిచిపోయాయి. కనుక అతను చనిపోయి ఉండవచ్చు. బోరు బావి నుంచి దుర్వాసన వస్తోంది’ అని జిల్లా సర్జన్ అనంత రెడ్డి బుధవారం రాత్రి బాగా పొద్దు పోయాక సంఘటనా స్థలం వద్ద ప్రకటించారు. అంతే...చాలా సేపు అక్కడ అయోమయం నెలకొంది.
రోబో ద్వారా బాలుని వెలికి తీయడానికి మధురై నుంచి వచ్చిన మణికంఠన్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. కాసేపటికే వర్షం ప్రారంభమైంది. దీంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. వర్షం కొద్దిగా తగ్గిన తర్వాత వైదుృల బందం అక్కడికి చేరుకుంది. బోరు బావి నుంచి కుళ్లిన వాసన వస్తుండడంతో బాలుడు బతికి ఉండడృని బందం నిర్ధారించింది.
శోక సంద్రంలో కుటుంబం
తిమ్మన్న మరణించి ఉంటాడని వైద్యులు తేల్చడంతో అతని కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇటు బిడ్డను పోగొట్టుకుని, అటు భర్త ఆస్పత్రి పాలవడాన్ని తలుచుకుని తిమ్మన్న తల్లి సంగవ్వ బోరున విలపించింది. నాలుగు రోజులుగా ఆమె నిద్రాహారాలు మానుకుని బిడ్డ కోసం విలపిస్తూ కూర్చుంది. ఆమెను ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు. తీవ్ర అస్వస్థతకు లోనైన తిమ్మన్న తండ్రి హనుమంతప్ప ఆస్పత్రిలో కోలుకుంటున్న సంగతి తెలిసిందే.
మృతదేహం వెలికితీతకు ప్రయత్నాలు
తిమ్మన్న మృతదేహాన్ని వెలికి తీసే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. రోబో ద్వారా వెలికి తీయాలంటే ముందుగా బోరు బావిలో పడిన మట్టిని తొలగించాల్సి ఉంది. శవంపై ఒకటిన్నర అడుగుల మట్టి ఉండవచ్చని అంచనా. రెండు వాక్యూమ్ సక్కర్ల ద్వారా మట్టిని తొలగించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మొత్తం మట్టిని తొలగిస్తేనే రోబో ద్వారా మృతదేహాన్ని వెలికి తీయడం సాధ్యమవుతుంది. సమాంతరంగా తవ్వుతున్న సొరంగ మార్గం ద్వారా బయటకు తీయాలంటే మరో రెండు రోజులు పట్టే అవకాశాలున్నాయి.
హనుమంతప్పను ఆదుకుంటాం
తిమ్మన్నను వెలికి తీయడానికి చేసిన ప్రయత్నాల్లో అతని తండ్రికి జరిగిన నష్టాన్ని ప్రభుత్వమే భరిస్తుందని పంచాయతీ రాజ్, గ్రామీణృభివద్ధి శాఖ మంత్రి హెచ్‌కే. పాటిల్ తెలిపారు. గురువారం ఆయనిక్కడ విలేకరులతో మాట్లాడుతూ పొలంలో తవ్విన సొరంగ మార్గాలను ప్రభుత్వమే పూడ్చి వేస్తుందని చెప్పారు. కాగా తిమ్మన్న కుటుంబానికి ప్రభుత్వం ఇదివరకే రూ.2 లక్షల నష్ట పరిహారాన్ని ప్రకటించింది. స్థానిక ఎమ్మెల్యేలు తలా రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయాన్ని ప్రకటించారు.