నువ్వు లేవు.. నీ సాక్ష్యం ఉంది | body guard story on salman case | Sakshi
Sakshi News home page

నువ్వు లేవు.. నీ సాక్ష్యం ఉంది

Published Fri, May 8 2015 12:48 AM | Last Updated on Wed, Apr 3 2019 5:44 PM

నువ్వు లేవు.. నీ సాక్ష్యం ఉంది - Sakshi

నువ్వు లేవు.. నీ సాక్ష్యం ఉంది

సల్మాన్ ‘హిట్ అండ్ రన్ ’ కేసులో
ప్రపంచానికి తెలియని ‘బాడీగార్డ్’ కన్నీటి గాథ

 
ముంబై: కళ్ల ముందే ఘోరం జరిపోయింది.. కారు చక్రాల కింద ఓ అభాగ్యుడు కన్నుమూశాడు.. అదే సమయంలో ఓ ఖాకీ చొక్కా మాటున ‘న్యాయం’ కళ్లు తెరిచింది! అన్యాయాన్ని బోనెక్కించేందుకు వడివడిగా అడుగులేసింది.. ధర్మదేవత ముందు నిలబ డి సాక్ష్యం చెప్పింది!! ఆ నిప్పులాంటి సాక్ష్యమే నేడు బాలీవుడ్ దిగ్గజం సల్మాన్‌ఖాన్‌ను కారాగారం దాకా తీసుకువెళ్లింది.

మరి ఆ సాక్ష్యమిచ్చిన సాక్షి ఏమయ్యాడు? సల్మాన్ కండలకు ఏమాత్రం తీసిపోని ఆయన దేహదారుఢ్యం ఎందుకు బక్కచిక్కి ఎముకల గూడులా మారిపోయింది? ఎవరూ పట్టించుకోని స్థితిలో చిక్కిశల్యమై ఓ అనాథలా ఆసుపత్రిలో.. 30 ఏళ్ల ప్రాయంలోనే ఎందుకు కన్నుమూశాడు..? సమాజంలో ఉన్నత స్థానంలో ఉండి, ఓ వెలుగు వెలుగుతున్న సెలబ్రిటీకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడమే దీనంతటికీ కారణమా!? 13 ఏళ్ల తర్వాత సల్మాన్ ‘హిట్ అండ్ రన్’ కేసు  కొలిక్కి వచ్చినా.. ప్రమాద సమయంలో కారు వెనుక సీట్లో కూర్చుని ఉన్న ఆయన బాడీగార్డ్ రవీంద్ర పాటిల్ మృతి వెనుక మాత్రం జవాబులేని ప్రశ్నలెన్నో..!

ఆ రోజు ఏం జరిగింది?
ముంబైలోని సతారాకు చెందిన పాటిల్‌కు 25 ఏళ్లు. లేతప్రాయంలోనే ‘ఖాకీ’రంగుపై తన భవిష్యత్తును అల్లుకున్నాడు. కష్టపడి కానిస్టేబుల్ అయ్యాడు. ముంబై పోలీసు విభాగంలో ఉద్యోగం. ఆ వెంటనే స్పెషల్ ఆపరేషన్ స్క్వాడ్(ఎస్‌వోఎస్)లో కమాండోగా చేరేం దుకు శిక్షణ. సరిగ్గా ఇదే సమయంలో సల్మాన్‌కు అండర్ వరల్డ్ ముఠాల నుంచి బెదిరింపులు రావడంతో ముంబై పోలీసు విభాగం.. పాటిల్‌ను సల్మాన్‌కు బాడీగార్డ్‌గా పంపింది. 2002 సెప్టెంబర్ 28న సల్మాన్ కారు ప్రమాదం రోజున పాటిల్ అదే వాహనంలో ఉన్నాడు. మద్యం మత్తులో ఉన్నందున కారు నడపొద్దని సల్మాన్‌ను పాటిల్ వారించినా వినలేదు.

కారు బయల్దేరిన కాసేపటికే అమెరికా ఎక్స్‌ప్రెస్ బేకరీ సమీపంలోని ఫుట్‌పాత్‌పై పడుకున్నవారిపైకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా, నలుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. బాడీగార్డ్‌లా కాకుండా ఓ పోలీసులా వ్యవహరించిన పాటిల్ వెంటనే బాంద్రా స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. ఎఫ్‌ఐఆర్‌లో జరిగింది జరిగినట్టు చెప్పాడు. దీంతోసల్మాన్‌పై కేసు నమోదైంది. ఆయన్ను పోలీసులు అరెస్టు చేశారు. అంతేకాదు కోర్టులో కూడా పాటిల్ సాక్ష్యమిచ్చాడు. చివరికి సల్మాన్‌ను కాపాడేందుకు కారును తానే నడిపానని డ్రైవర్ అశోక్‌సింగ్ చెప్పినా కోర్టు విశ్వసించకపోవడానికి కారణం నాడు పాటిల్ ఇచ్చిన సాక్ష్యమే.
 
తలకిందులైన జీవితం
ఈ సాక్ష్యం తర్వాత పాటిల్ జీవితం తలకిందులైంది. హైప్రొఫైల్ కేసులో ప్రధాన సాక్షిగా ఉన్నందున ఎస్‌వోఎస్ కమాండో ఉద్యోగం నుంచి తప్పించారు. ఆయనపై వివిధ వైపుల నుంచే గాకుండా పోలీసు శాఖ నుంచి సైతం తట్టుకోలేని ఒత్తిళ్లు వచ్చాయని పాటిల్ సన్నిహితులు చెబుతుంటారు. దీంతో శారీరకంగా, మానసికంగా ఆయన కుంగిపోయాడని, సొంత పోలీసు విభాగమే మానసిక స్థైర్యం ఇవ్వకపోవడంతో ఒంటరయ్యాడని పేర్కొంటారు. చివరికి పాటిల్‌కు కానిస్టేబుల్ విధులూ భారమయ్యాయి. తరచూ గైర్హాజరయ్యాడు. చివరికి ఒత్తిళ్లు తట్టుకోలేక ముంబైకి దూరంగా వెళ్లిపోయాడు.

ఆయన సోదరుడు మిస్సింగ్ కేసు కూడా పెట్టాడు. ఇంతలో కోర్టులో సల్మాన్ కేసు విచారణకు వచ్చింది. ఆ సమయానికి పాటిల్ లేకపోవడంతో న్యాయమూర్తి అరెస్ట్ వారంట్లు జారీ చేశారు. మహాబలేశ్వర్‌లో 2006 మార్చిలో పాటిల్‌ను అరెస్టు చేసిన పోలీసులు ఆర్థర్ రోడ్డు జైలుకు పంపారు. కమాండోగా శిక్షణ పొందిన ఓ పోలీసు జైల్లో ఖైదీలా మారిపోయాడు. పోలీసు విభాగం అతడిని డిస్మిస్ చేసింది. వచ్చే జీతం ఆగిపోయింది. కొన్నాళ్ల తర్వాత జైలు నుంచి విడుదలయ్యాడు. ఎంతో బలిష్టంగా ఉండే పాటిల్‌కు క్షయ సోకింది. 30 కిలోల అస్థి పంజరంలా తయారయ్యాడు. తలపై వెంట్రుకలన్నీ ఊడిపోయి ఎవరూ గుర్తుపట్టలేని దయనీయ స్థితికి చేరుకున్నాడు. ఇదే సమయంలో ఆయన భార్య విడాకులు తీసుకున్నట్టు సమాచారం. ఆ తర్వాత పాటిల్ మళ్లీ అదృశ్యమయ్యాడు. 2007లో ముంబైలోని శివిడీ రోడ్డుపై బిచ్చమెత్తుకుంటూ రూ.50 సంపాదించుకుని సెవ్రీలోని టీబీ హాస్పిటల్‌కు చేరాడు. కనీసం మాట్లడలేని, నడవలేని స్థితిలో పాటిల్ ఆసుపత్రిలో చేరాడు. వ్యాధి ముదరడంతో అదే ఆసుపత్రిలో 2007, అక్టోబర్ 4న కన్నుమూశాడు. కన్నుమూసేందుకు కొద్దిరోజుల ముందు.. ‘ఆ ప్రమాదం నా జీవితాన్ని నాశనం చేసింది’ అని

పాటిల్ కొందరు మీడియా ప్రతినిధులకు చె ప్పినట్టు తెలిసింది. పాటిల్ మరణించి సుమారు ఎనిమిదేళ్లు కావస్తున్నా.. ఆయన కోర్టులో ఇచ్చిన సాక్ష్యం మాత్రం ఇంకా బతికే ఉంది! కష్టాలపాలవుతానని తెలిసినా తుదకంటా న్యాయం వైపు నిలబడిన పాటిల్.. మధ్యలో మాట మార్చి ఉంటే బహుశా జీవితం మరోలా ఉండేదేమో!!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement