కొత్త ‘ఫిరాయింపు’ సిద్ధాంతం
కేంద్ర ఎన్నికల కమిషనర్ ఓపీ రావత్ ఆందోళన
న్యూఢిల్లీ: అధికార పార్టీలోకి ఫిరాయిస్తే చేసిన పాపాలన్నీ ప్రక్షాళన అయిపోతాయనే, నేరాలన్నీ సమసిపోతాయనే భావన పెరిగిపోతోందని కేంద్ర ఎన్నికల కమిషనర్ ఓపీ రావత్ వ్యాఖ్యానించారు. ‘అధికార పార్టీలోకి ఫిరాయిస్తే తాను చేసిన నేరాలతో పాటు అన్ని అపరాధాలు తొలగిపోతాయనే భావనలో ఉన్నారు. ఈ తరహా కొత్త రాజకీయ విధానం బాగా విస్తరిస్తోంది’ అని ఆందోళన వ్యక్తం చేశారు. చట్టసభల సభ్యులను తమవైపు తిప్పుకోవడం, డబ్బులు వెదజల్లి ఆకర్షించడం, ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించి బెదిరించడం మొదలైనవి తెలివైన రాజకీయ నిర్వహణగా చెప్పుకోవడం పరిపాటిగా మారిందన్నారు.
దీనిపై అన్ని రాజకీయ పార్టీలు, నాయకులు, మీడియా, ప్రజా సంఘాలు, రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు, ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉన్నవారు పోరాడాలి’ అని పిలుపునిచ్చారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎలక్టోరల్ బాండ్ల వల్ల ఎన్నికల వ్యవస్థలోకి నల్లధనం ప్రవేశించే అవకాశం ఉందన్నారు. అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) ఎన్నికలు, రాజకీయ సంస్కరణలకు సంబంధించి శుక్రవారం నిర్వహించిన సదస్సులో రావత్ ప్రసంగించారు. ప్రైవేటు పీఆర్ సంస్థలు డబ్బులు తీసుకుని సోషల్ మీడియా ద్వారా ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేసేందుకు చురుకుగా పనిచేస్తున్నాయి. దీనిపై ఈసీ దృష్టికి సారించింది. సోషల్ మీడియా పాలసీని రూపొందిస్తోంది’ అని రావత్ వెల్లడించారు.