
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో విపక్ష ఎమ్మెల్యేలను అధికార టీడీపీ ప్రలోభాలకు గురి చేస్తోందని కేంద్ర ఎన్నికల సంఘానికి వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు చేసింది. ఎంపీ వి. విజయసాయిరెడ్డి శుక్రవారం ప్రధాన ఎన్నికల కమిషనర్ ఓపీ రావత్‌ను కలిసి ఈ మేరకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వం విచ్చలవిడిగా అవినీతి పాల్పడుతూ, ఆ సొమ్ముతో ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొంటోందని ఆరోపించారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలపై తప్పుడు కేసులు పెడుతూ వేధిస్తోందన్నారు. రాజ్యసభ ఎన్నికల సమయంలో కొంత మంది ఎమ్మెల్యేలను అరెస్ట్ చేయాలని కుట్ర పన్నుతోందని వెల్లడించారు.
‘మా పార్టీకి చెందిన 67 మంది ఎమ్మెల్యేల్లో 23 మందిని రూ. 10 నుంచి 20 కోట్లు ఇచ్చి టీడీపీ ప్రభుత్వం కొనుగోలు చేసింది. మిగతా 44 మందిలో కనీసం నలుగుర్ని కొనాలని ప్రయత్నిస్తోంది. ఒక్కో ఎమ్మెల్యేకు రూ. 25 కోట్లు ఆఫర్ చేసినట్టు మా దృష్టికి వచ్చింది. ఈ విషయాన్ని సీఈసీ దృష్టికి తీసుకెళ్లాం. రాజ్యసభ ఎన్నికల సమయంలో పోలింగ్ బూత్‌లను ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో పెట్టాలని, కేంద్ర బలగాలతో ఎమ్మెల్యేలకు రక్షణ కల్పించాలని కోరాం. తప్పుడు కేసులు పెట్టకుండా చూడాలని, ప్రత్యేక పరిశీలకుడిని నియమించి ఎన్నికలను పర్యవేక్షించాలని విజ్ఞప్తి చేశాం. గతంలో తెలంగాణలో ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు ఇరుకున్నారు. అలాగే ఏపీ ప్రభుత్వ చట్టవ్యతిరేక కార్యకలాపాలపై కేంద్రం నిఘా పెట్టాలని కోరామ’ని విజయసాయిరెడ్డి తెలిపారు.
కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి (సీఈసీ)కి రాజ్యసభ సభ్యులు వి.విజయసాయి రెడ్డి సమర్పించిన వినతిపత్రం
Comments
Please login to add a commentAdd a comment