భారత మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఓపీ రావత్ (ఫైల్‌ఫోటో)
సాక్షి, న్యూఢిల్లీ : నల్లధన ప్రవాహానికి అడ్డుకట్ట వేసే ఉద్దేశంతో నోట్ల రద్దు చేపట్టామని ప్రధాని నరేంద్ర మోదీ పలు సందర్భాల్లో పేర్కొన్నా వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉంది.గతంతో పోలిస్తే ఎన్నికల్లో బ్లాక్‌మనీ వినియోగం విచ్చలవిడిగా పెరుగుతున్నట్టు వార్తలొస్తున్నాయి. ఎన్నికల్లో భారీఎత్తున నగదు వాడకం పెరిగిపోయిందని స్వయంగా ఈసీ అత్యున్నత వర్గాలే వెల్లడించాయి.
ఎన్నికల్లో నల్లధన ప్రవాహంపై నోట్ల రద్దు ఎలాంటి ప్రభావం చూపలేదని మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) ఓపీ రావత్ పెదవివిరిచారు. నోట్ల రద్దు అనంతరం ఎన్నికల్లో నల్లధనం వాడకం తగ్గుతుందనే అభిప్రాయం కలిగినా నగదు స్వాధీనాల గణాంకాలు భిన్నంగా ఉన్నాయన్నారు. ఎన్నికల సందర్భంగా పలుచోట్ల పెద్ద మొత్తంలో నగదును అధికారులు సీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.
ఆయా రాష్ట్రాల్లో గతంలో జరిగిన ఎన్నికలతో పోలిస్తే నగదు పట్టుబడుతున్న సందర్భాలు ఇప్పుడే అధికంగా ఉన్నాయని రావత్ వెల్లడించారు. ఎన్నికల్లో వాడే నల్లధనంపై ఎలాంటి నియంత్రణ ఉండటం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయ నేతలు, వారికి ఆర్థిక వనరులు సమకూర్చే వారికి నగదు కొరత ఎంతమాత్రం లేదన్నారు.
ఎన్నికల్లో నగదు వాడకం, సోషల్ మీడియాలను నియంత్రించేలా నూతన మార్గదర్శకాలను జారీ చేసేలా న్యాయమంత్రిత్వ శాఖకు ఈసీ సిఫార్సు చేయకపోవడం బాధాకరమని ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా గత వారం పదవీ విరమణ చేసిన రావత్ విచారం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment