కోల్‌కతా: ఈవీఎంలు, వీవీప్యాట్ (ఓటు ధ్రువీకరణ యంత్రం)ల ద్వారానే అన్ని ఎన్నికలు జరుగుతాయనీ, బ్యాలెట్ విధానాన్ని తీసుకువచ్చే ప్రశ్నే లేదని ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) ఓపీ రావత్ స్పష్టం చేశారు. శనివారం ఆయన కోల్‌కతాలో మీడియాతో మాట్లాడారు. ‘ఈవీఎంల పనితీరు, సమగ్రత విషయంలో అనుమానాలు అక్కర్లేదు. దేశవ్యాప్తంగా ఏకకాలంలో ఎన్నికలు జరిపేందుకు రాజ్యాంగం, చట్టాల్లో మార్పులు చేయడంతోపాటు అవసరమైన సామగ్రిని భారీగా సమకూర్చుకోవాల్సి ఉంటుంది.
ఎన్నికల్లో అవకతవకలపై ఎన్నికల సంఘం(ఈసీ) మొబైల్ యాప్ ద్వారా సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతాం. ఇటీవల జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ఈ మొబైల్ యాప్‌నకు 780 వరకు ఫిర్యాదులు వీడియోల రూపంలో అందాయి. యాప్ సాయంతో పౌరులూ సాక్ష్యాధారాలను ఈసీకి నేరుగా పంపొచ్చు. అన్ని ఎన్నికల్లో యాప్‌ను వాడకంలోకి తెస్తాం. ‘రికార్డుల్లో మాత్రమే ఉండి, కార్యకలాపాలు జరపని దాదాపు 1000 రాజకీయ పార్టీల గుర్తింపును రద్దు చేశాం. పార్లమెంట్, రాష్ట్ర శాసనసభల పూర్తి పదవీ కాలం ముగియడానికి 6 నెలల ముందుగా ఎలాంటి ప్రకటన చేసే అధికారం ఈసీకి లేదు’ అని రావత్ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment