సాక్షి, న్యూఢిల్లీ : భారత్ లాంటి ప్రజాస్వామ్య దేశంలో స్వేచ్ఛగా, సజావుగా ఎన్నికలను నిర్వహించడం ఓ ముఖ్యమైన ఘట్టం. ఎవరి ఒత్తిడులు లొంగకుండా ఈ ఘట్టాన్ని సమర్థంగా నిర్వహించే అధికారాలను రాజ్యంగంలోని 324వ అధికరణం ఎన్నికల కమిషన్‌ను కట్టబెట్టింది. అంటే ఎన్నికల కమిషన్ పూర్తి స్వయం ప్రతిపత్తిగల సంఘం. ఎలాంటి అనుమానాలకు, పక్షపాతానికి ఆస్కారం ఇవ్వకుండా సహేతుకంగా నిర్ణయాలు తీసుకునే బాధ్యత కూడా ఎన్నికల కమిషన్‌కు ఉంది. కానీ ఇటీవల ఎన్నికల కమిషన్ తీసుకుంటున్న నిర్ణయాలన్నీ కూడా అనుమానాస్పదమే కాకుండా వివాదాస్పదం అవుతున్నాయి.
ఐదు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్డ్‌ను శనివారం నాడు ప్రకటించిన ఎన్నికల కమిషన్, ఆ రోజున విలేకరుల సమావేశాన్ని షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 12.30 గంటలకు నిర్వహించాల్సి ఉంది. ఈ మేరకు అన్ని మీడియా సంస్థలకు ముందుగానే సమాచారాన్ని అందించింది. ఆ తర్వాత విలేకరుల సమావేశాన్ని 3.30 గంటలకు వాయిదా వేసింది. విలేకరుల సమావేశం గురించి మీడియాకు పది గంటలకు తెలియజేశామని, మీడియా అంతా రావడం కోసం సమావేశాన్ని మూడున్నర గంటలకు వాయిదా వేయాల్సి వచ్చిందని, ప్రధాన ఎన్నికల కమిషనర్ ఓపీ రావత్ వివరణ ఇచ్చారు. ఆయన వివరణ ఎంత అర్థరహితమో ఇట్టే తెలిసిపోతుంది. మీడియా మిత్రులు రావడానికి రెండున్నర గంటల సమయం సరిపోదా? సరిపోదనుకుంటే ఓ అరగంటో, గంటో వాయిదా వేయాలిగానీ మూడు గంటలు వాయిదా వేయాల్సిన అవసరమే లేదు.
అందుకే దీనిపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ సౌకర్యార్థమే విలేకరుల సమావేశాన్ని వాయిదా వేసిన ట్లు విమర్శించింది. ఆ రోజున మధ్యాహ్నం ఒంటి గంటకు రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో ర్యాలీని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించాల్సి ఉంది. ప్రసంగిచారు కూడా.అదే సభలో రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే ప్రసంగిస్తూ.. రైతులకు ఉచిత విద్యుత్ వరాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 12.30 గంటలకు ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించినట్లయితే అప్పటి నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది. అందుకని మోదీ ప్రసంగం తర్వాత ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేలా ఎన్నికల కమిషన్ తన షెడ్యూల్‌ను మార్చుకుందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది.
ఎన్నికల కమిషన్ నిర్ణయాలు వివాదాస్పదం ఇదే మొదటి సారి కాదు. గతేడాది ఎన్నికల కమిషన్ హిమాచల్ ప్రదేశ్, గుజరాత్‌ల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించడం కూడా వివాదాస్పదమైంది. కొన్ని వారాల తేడాతో కొన్ని రాష్ట్రాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నప్పుడు, వాటి ఎన్నికల షెడ్యూల్‌ను ఒకేసారి ప్రకటించడం సంప్రదాయం. గతేడాది అక్టోబర్ 12వ తేదీన హిమాల్ ప్రదేశ్‌కు ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిన ఎన్నికల కమిషన్, అక్టోబర్ 25వ తేదీన గుజరాత్‌కు ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించారు. దాదాపు ఈ రెండు వారాల్లో మోదీ గుజరాత్‌లో విస్తృతంగా పర్యటించి ప్రజలకు పలు ఎన్నికల వాగ్దానాలు చేశారు.
మొన్న శనివారం నాడు కూడా ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు, కర్ణాటకలో అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిన ఎన్నికల కమిషన్, తమిళనాడు ఉప ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించక పోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. నవంబర్, డిసెంబర్ నెలలో తమిళనాడుకు తుపాన్లు వచ్చే ప్రమాదం ఉంటుందని ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాసిన లేఖను పరిగణలోకి తీసుకొని వాటి షెడ్యుల్‌ను ప్రకటించలేదని రావత్ వివరణ ఇచ్చుకున్నారు.
తుపాన్లు వచ్చే సమయంలో రెండు అసెంబ్లీ నియోజక వర్గాలకు ఎన్నికలను నిర్వహించడం పెద్ద కష్టమా? రానున్న తుపాన్ల దృష్టిలో పెట్టుకొని ఎన్నికలను వాయిదా వేసిన సందర్భలు గతంలో ఎప్పుడైనా ఉన్నాయా? ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎలాంటి నర్ణయమైనా ఎన్నికల కమిషన్ తీసుకోవచ్చు. అది దాని అధికారం. తీసుకున్న నిర్ణయాలు సహేతుకంగా, నిర్వివాదాస్పదంగా ఉండేల చూసుకోవడం ముఖ్యమైన బాధ్యతన్నది విస్మరించరాదు.
Comments
Please login to add a commentAdd a comment