సాక్షి, న్యూఢిల్లీ : అసెంబ్లీ రద్దయితే వెంటనే ఎన్నికలు జరపాలని, 6 నెలలపాటూ ప్రభుత్వాన్ని కొనసాగించాల్సిన అవసరం లేదని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి ఓపీ రావత్ వ్యాఖ్యానించారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరం రాష్ట్రాలతోపాటూ తెలంగాణ ఎన్నికలు నిర్వహించే అవకాశాలను ఇప్పుడే చెప్పలేమని రావత్ వ్యాఖ్యానించారు. నాలుగు రాష్ట్రాల ఎన్నికలతో పాటు తెలంగాణలో కూడా ఎన్నికలు నిర్వహించాలంటే అందుకు తగిన ఏర్పాట్లను సమీక్షించాల్సి ఉంటుందన్నారు.
మరోవైపు 4 రాష్ట్రాల ఎన్నికలతోపాటే తెలంగాణ ఎన్నికలు నిర్వహించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామన్నారు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్నాకే ఎన్నికల నిర్వహణపై తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. నాలుగు రాష్ట్రాలతో పాటే తెలంగాణలో ఎన్నికలు జరుగుతాయని ఎవరో చెప్పిన జోష్యంతో ఈసీకి సంబంధంలేదన్నారు. అక్టోబర్ మొదటి వారంలోనే ఎన్నికల షెడ్యూలు విడుదల చేసే అవకాశాలను కూడా పరిశీలిస్తున్నట్టు తెలిపారు. కాగా, శుక్రవారం సాయంత్రం కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో తెలంగాణ ఎలక్షన్ కమిషనర్ రజత్ కుమార్ భేటీ అయ్యారు. ఎన్నికల సన్నద్ధత పరిశీలన కోసం ఈనెల 11న హైదరాబాద్ కు ఎన్నికల సంఘం బృందాన్ని పంపాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. తెలంగాణ అసెంబ్లీ రద్దు నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ పరిస్థితులను తెలుసుకునేందుకు సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ ఉమేష్ సింహ నేతృత్వంలోనీ బృందం హైదరాబాద్ లో పర్యటించి నివేదిక తయారు చేయనుంది.
Comments
Please login to add a commentAdd a comment