అఖిలపక్ష భేటీలో సీఈసీ ఓపీ రావత్, కమిషనర్లు సునీల్ ఆరోరా, అశోక్ లవాసా
న్యూఢిల్లీ: ఎన్నికల్లో ఈవీఎం(ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రం)ల విశ్వసనీయతపై సందేహాలు వ్యక్తం చేస్తూ.. భవిష్యత్తులో బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. ఈవీఎంలతోపాటు వాటికి అనుసంధానించే వీవీప్యాట్ (ఓటు ధ్రువీకరణ యంత్రాల)ల్లో లోపాలపై అభ్యంతరాలు తెలిపాయి. అలాగే ఓటరు జాబితాలో నకిలీల్ని నివారించేందుకు ఓటర్లను ఆధార్‌తో అనుసంధానించాలని ఈసీకి సూచించాయి. ఈ ఏడాది చివర్లో పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది ప్రథమార్థంలో లోక్‌సభ ఎన్నికలున్న నేపథ్యంలో అన్ని పార్టీలతో సోమవారం ఈసీ సమావేశం నిర్వహించింది.
ఈ అఖిలపక్ష భేటీలో బీజేపీ మినహా మిగతా ఆరు జాతీయ పార్టీలు, పలు ప్రాంతీయ పార్టీలు మళ్లీ పాత పద్ధతిలో బ్యాలెట్ విధానంతోనే దేశంలో ఎన్నికల ప్రక్రియను కొనసాగించాలని నొక్కిచెప్పాయి. ఈవీఎంలపై లేవనెత్తిన సందేహాలకు ప్రతిపక్ష పార్టీలు సంతృప్తి చెందేలా సమాధానం ఇస్తామని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. బ్యాలెట్ పద్ధతికి మళ్లడమంటే పోలింగ్ బూత్‌ల ఆక్రమణల్ని స్వాగతించినట్లేనని సీఈసీ ఓపీ రావత్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘కొన్ని పార్టీలు మళ్లీ బ్యాలెట్ విధానానికి వెళ్లాలని కోరడం మంచిది కాదు. అదే సమయంలో ఈవీఎంలతో కొన్ని సమస్యలున్నాయని, వీవీపాట్‌ల స్లిప్‌ల లెక్క విషయంలో లోపాలున్నాయని మా దృష్టికి తీసుకొచ్చాయి. మేం వాటిపై దృష్టిపెడతాం’ అని ఆయన చెప్పారు.
70% పార్టీలది బ్యాలెట్ బాటే: కాంగ్రెస్
ఎన్నికలకు ముందు ఈసీ అన్ని పార్టీల అభిప్రాయాల్ని వినడం సంప్రదాయంగా వస్తోంది. ఆ నేపథ్యంలో నిర్వహించిన ఈ భేటీలో నిజానికి ఈవీఎంల ట్యాంపరింగ్, వీవీప్యాట్‌ల్లో సాంకేతిక లోపాలు అజెండా కాకపోయినా.. ప్రతిపక్ష పార్టీలు మాత్రం వాటినే ప్రధానంగా ప్రస్తావించాయి. ఈవీఎంల్ని ట్యాంప రింగ్ చేస్తున్నారని, పేపర్ బ్యాలెట్లకు మళ్లాలని కాంగ్రెస్, సమాజ్‌వాదీ, బీఎస్పీ, ఎన్సీపీ, ఆమ్‌ఆద్మీ, జనతాదళ్(ఎస్), సీపీఐ, సీపీఎం, ఫార్వర్డ్ బ్లాక్ తదితర పార్టీలు తమ వాణిని గట్టిగా వినిపించాయి. సమావేశం అనంతరం కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ మాట్లాడుతూ.. ‘నాల్గింట మూడొంతు పార్టీలు ఈవీఎంల ట్యాంపరింగ్, సాంకేతిక లోపాల్ని ప్రస్తావించాయి. ఈ విషయంలో బీజేపీ ఒంటరైంది.
70 శాతం రాజకీయ పార్టీలు పాత విధానంలోనే ఎన్నికలు జరపాలని ఈసీని కోరాయి’ అని చెప్పారు. ‘ఒకవేళ పేపర్ బ్యాలెట్‌కు ఈసీ మొగ్గు చూపనిపక్షంలో.. ఓటింగ్ విశ్వసనీయత కోసం కనీసం 30 శాతం పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలకు పేపర్ ట్రయల్ యంత్రాల్ని ఏర్పాటు చేయాలి’ అని డిమాండ్ చేశారు. ఈసీ గుర్తింపు పొందిన ఏడు జాతీయ, 51 ప్రాంతీయ పార్టీల్ని ఈసీ ఆహ్వానించగా.. మొత్తం 41 పార్టీలు మాత్రమే హాజరయ్యాయి. రాజకీయ పార్టీల ఎన్నికల ఖర్చులకు పరిమితి విధించడాన్ని భేటీలో బీజేపీ వ్యతిరేకించింది. దానికి బదులు మరింత పారదర్శకంగా ఎన్నికలు జరిగేలా చూడాలంది. పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టడంపై తాము సానుకూలంగా ఉన్నామని తెలిపింది.
ఆధార్‌తో అనుసంధానించాలి
ఎన్నికల్లో అక్రమాల్ని నిరోధించేందుకు జాబితాలోని ఓటర్లను వారి ఆధార్ నెంబర్‌తో అనుసంధానం చేయాలని బీజేపీ సహా పలు పార్టీలు ఈసీని కోరాయి. ‘ఓటర్లతో ఆధార్‌ను అనుసంధానించాలని రాజకీయ పార్టీలు ఈసీకి సూచించాయి. 10 పార్టీలు ఈ అంశాన్ని లేవనెత్తాయి’ అని ఎన్నికల సంఘం ఒక ప్రకటనలో వెల్లడించింది. అక్షరక్రమంలో ఓటర్ల జాబితాను రూపొందిస్తే.. నకిలీల్ని తొలగించేందుకు అవకాశముంటుందని సమావేశంలో బీజేపీ సూచించింది. కాగా ఆగస్టు 2015లో సుప్రీంకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో.. ఓటరు జాబితాతో ఆధార్ అనుసంధాన ప్రక్రియను బ్రేక్ పడింది.
1982లో తొలి ఈవీఎం
ప్రతిపక్షాల ఆరోపణల నేపథ్యంలో ఈవీఎంల్ని హ్యాక్ చేయాలంటూ గతేడాది జూన్‌లో పార్టీల్ని ఈసీ ఆహ్వానించగా.. కేవలం రెండు పార్టీలు మాత్రమే ఆ సవాలు స్వీకరించాయి. చివరికి ఆ రెండూ కూడా ఈవీఎంల హ్యాకింగ్ సవాలుకు గైర్హాజరయ్యాయి. 1982లో కేరళలో జరిగిన ఉప ఎన్నికల్లో మొదటిసారి ఈవీఎంల్ని ఉపయోగించారు. వాటి వాడకంపై అప్పటికి ఎలాంటి చట్టం లేకపోవడంతో ఆ ఎన్నిక చెల్లదని సుప్రీంకోర్టు ప్రకటించింది. ఈవీఎంల్ని వినియోగించేందుకు వీలుగా 1989లో ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని సవరించినా.. 1998 వరకూ పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. దాదాపు అన్ని ఎన్నికల్లో ఈవీఎంల వైఫల్య రేటు 0.7 శాతంగా ఉంటోంది.
Comments
Please login to add a commentAdd a comment