Ballet box
-
'పోస్టల్ బ్యాలెట్' మిస్సింగ్.. ఉద్యోగుల్లో కలవరం..!
సాక్షి, ఆదిలాబాద్: ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులు, సిబ్బందికి అందించే పోస్టల్ బ్యాలెట్ మిస్సింగ్ అవ్వడం ఆదిలాబాద్ జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గంలో ఎన్నికల విధులు నిర్వహించే ఎన్నికల అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ కోసం ఫామ్ 12 ద్వారా ఇదివరకే దరఖాస్తు చేసుకున్నారు. దీని దరఖాస్తు గడువు ఈ నెల 8వ తేదీన ముగిసింది. అయితే పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకునేందుకు ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు 15 మంది కార్యాలయాలకు వెళ్లగా మీ దరఖాస్తులు అందలేదని సిబ్బంది చెప్పడంతో విస్తుపోయారు. తాము ఇదివరకే దరఖాస్తు చేసుకున్నా ఎందుకు అందలేదని అధికారులను ప్రశ్నించగా, వారినుంచి సరైన సమాధానం రాలేదు. దీంతో ఏం చేయాలో తెలియక వారు నిరాశతో వెనుదిరగాల్సిన పరిస్థితి నెలకొంది. ఎన్నికల్లో ప్రతీ ఓటు కీలకమని చెప్పే అధికారులు ఇలా తాము చేసుకున్న దరఖాస్తులను ఇంత నిర్లక్ష్యంగా పట్టించుకోకపోవడం ఏమిటని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే జిల్లాలో ఎన్ని ఓట్లు నమోదయ్యాయి. ఎన్ని గల్లంతయ్యాయనే సమాచారం కోసం కలెక్టరేట్ పర్యవేక్షకురాలు జాడి స్వాతిని సంప్రదించగా.. ఎలాంటి పోస్టల్ బ్యాలెట్ మిస్ అవ్వలేదని పేర్కొన్నారు. అయితే ఇంకా దరఖాస్తులు అందాల్సి ఉందని, అవి పూర్తిస్థాయిలో వస్తే తప్పా ఎన్ని వచ్చా యి.. ఎన్ని రాలేదనే సమాచారం చెబుతామని పేర్కొనడం గమనార్హం. ఇవి చదవండి: ‘సారూ.. మంచిగ చెప్పిండ్రు..' అందరు మూడు తోవల పోతున్నరు! -
బస్తర్‌లో 404 సార్లు చక్కర్లుకొట్టాయి!
సాక్షి, రాయ్‌పూర్: నక్సల్ ప్రభావిత ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లాలో ఎన్నికల నిర్వహణ నిజంగా కత్తిమీద సామే. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగాలంటే ముందుగా ఎన్నికల సిబ్బందిని క్షేమంగా పోలింగ్ స్టేషన్లకు పంపించాలి. పోలింగ్ పూర్తయ్యాక ఈవీఎం యంత్రాలుసహా సిబ్బందిని తిరిగి సురక్షితంగా తీసుకురావాలి. నక్సల్స్ మందుపాతరలు, మెరుపుదాడులకు పేరుగాంచిన బస్తర్ జిల్లాలో సిబ్బంది తరలింపు సవాళ్లతో కూడుకున్నదే. అందుకే ఈసారీ రోడ్డు మార్గంలోకాకుండా వాయుమార్గంలో సిబ్బందిని తరలించి శెభాష్ అనిపించుకుంది భారత వాయుసేన. రాష్ట్రంలో తొలి దఫా ఎన్నికలు జరిగిన నవంబర్ 7వ తేదీన 20 నియోజకవర్గాలకు పోలింగ్ నిర్వహించడం తెల్సిందే. ఈ నియోజకవర్గాల్లో అత్యంత సమస్యాత్మకమైన పోలింగ్ స్టేషన్లకు 860 మందికిపైగా సిబ్బందిని తరలించేందుకు వాయుసేన తన ఎంఐ–17 హెలికాప్టర్లను రంగంలోకి దించింది. ఎనిమిది హెలీకాప్టర్లు ఆరు రోజులపాటు ఇలా ఎన్నికల సిబ్బంది తరలింపులో అవిశ్రాంతంగా పనిచేశాయి. ‘సిబ్బంది తరలింపు కోసం హెలికాప్టర్లు 404 సార్లు రాకపోకలు సాగించాయి. విధి నిర్వహణలో పోలింగ్ సిబ్బంది మాత్రమే కాదు వాయుసేన హెలికాప్టర్లు తమ నిబద్ధతను మరోసారి చాటిచెప్పాయి’ అని ప్రశంసిస్తూ ఛత్తీస్‌గఢ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ తన సామాజిక మాధ్యమ ఖాతా ‘ఎక్స్’లో ట్వీట్‌చేశారు. ‘బస్తర్ ప్రాంతంలోని సుక్మా, బీజాపూర్, కాంకేర్, దంతేవాడ, నారాయణ్‌పూర్ జిల్లాలో 156 పోలింగ్ స్టేషన్లలో విధులు నిర్వర్తించిన 860కిపైగా సిబ్బందిని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ తన హెలికాప్టర్లలోనే తరలించింది’ అని ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ పి. సుందర్రాజ్ చెప్పారు. హెలికాప్టర్లపైకీ నక్సల్ కాల్పులు! 2008 అసెంబ్లీ ఎన్నికల్లో సిబ్బందిని తరలిస్తున్న హెలికాప్టర్లపైకీ నక్సల్స్ కాల్పులు జరిపారు. ఆనాడు బీజాపూర్ జిల్లాలోని పెడియా గ్రామంలో ఓటింగ్ యంత్రాలు, సిబ్బందితో వెళ్తున్న ఒక హెలికాప్టర్ పైకి నక్సల్స్ కాల్పులు జరపగా కాక్‌పిట్‌లోని ఫ్లైట్ ఇంజనీర్ సర్జెంట్ ముస్తఫా అలీ మరణించారు. వెంటనే అందులోని కెపె్టన్ స్క్వాడ్రాన్ లీడర్ టీకే చౌదరీ చాకచక్యంగా అది కూలిపోకుండా చూసి సురక్షితంగా జగ్దల్పూర్ పట్టణంలో ల్యాండ్చేశారు. -
పోస్టల్ సిరా..పచ్చ ఎర
సాక్షి, అనంతపురం అర్బన్ : ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఆయా నియోజకవర్గాల్లో అనుకూల కేంద్రాలను ఏర్పాటు చేశారు. ధర్మవరం నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన కేంద్రం వద్ద పోస్టల్ బ్యాలెట్‌ను కొనేందుకు అధికారపార్టీ నాయకులు సిద్ధపడ్డారు. ఈ క్రమంలో కేంద్రం వద్ద హంగామా చేశారు. ఉద్యోగులను ప్రలోభాలకు గురిచేశారు. అయితే వారి చర్యలను పలువురు తిరస్కరించారు. ఇక పుట్టపర్తి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన అనుకూల కేంద్రం వద్ద టీడీపీ అభ్యర్థి పల్లెరఘునాథ్‌రెడ్డి, ఆ పార్టీ నాయకులు హల్చల్ చేశారు. దీంతో టీడీపీ నాయకులు, వైఎస్సార్సీపీ నాయకులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అది కాస్తా పెద్దగా మారింది. దీంతో పోలీసులు ఇరువర్గాలపై లాఠీ చార్జీ చేసి అక్కడి నుంచి పంపించేశారు. రాప్తాడు నియోజకవర్గానికి సంబంధించి నగరంలోని ఎస్ఎస్బీఎన్ కళాశాలలో ఏర్పాటు చేసి కేంద్రం వద్ద వైఎస్సార్సీపీ, టీడీపీ నాయకులు కొద్దిపాటి వాగ్వాదం జరిగింది. అనంతరం ఇరువర్గాలు నాయకులు కేంద్రం వెలుపలకు వచ్చేశారు. ఇబ్బందిపడ్డ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ వేసేందుకు ఏర్పాటు చేసిన కేంద్రాల్లో కౌంటర్లు తక్కువగా ఏర్పాటు చేయడంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఓటరు ముందుగా ఫారం 12తో పాటు ఓటరు, ఆధార్ కార్డు అందజేస్తే ఫారం 13 ఇస్తారు. దానిపైన గెజిటెడ్ అధికారితో సంతకం చేయించి తిరిగి కౌంటర్లో అందజేయాలి. అప్పుడు పోస్టల్ బ్యాలెట్ ఇస్తారు. అభ్యర్థులకు ఓటు వేసి డిక్లరేషన్ కాపీ, పోస్టల్ బ్యాలెట్ పత్రాలను కవర్లో పెట్టి ట్రంక్ పెట్టలో వేయాలి. కౌంటర్లు తక్కువగా ఉండటంతో ఒక్కొక్కరికి గంటకు పైగా సమయం పట్టింది. అనంతపురం అర్బన్ కేంద్రంలో నాలుగు కౌంటర్లు ఏర్పాటు చేయగా... ఓటు వేసేందుకు దాదాపు 5 వేల మంది ఉద్యోగులు రావడంతో కేంద్రం కిక్కిరిసిపోయింది. రాప్తాడుకు సంబంధించి ఎస్ఎస్బీఎన్ కళాశాలలో ఏర్పాటు చేసిన కేంద్రం వద్ద కూడా ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో ఉద్యోగులు ఆందోళనకు దిగారు. కేంద్రంలో బైఠాయించి కౌంటర్లు పెంచాలంటూ నినాదాలు చేశారు. గుంతకల్లు, పుట్టపర్తి, తదితర నియోజకవర్గాల్లోనూ కేవలం ఒక కౌంటర్ ఏర్పాటు చేయడంతో పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేందుకు వచ్చిన ఉద్యోగులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. హిందూపురంలో తోపులాట.. ఆర్ఓకు వ్యతిరేకంగా ఆందోళన హిందూపురం : హిందూపురంలోని ఎస్డీజీఎస్ కళాశాలలో ఏర్పాటు చేసిన కేంద్రం వద్ద రెండు కౌంటర్లు మాత్రమే ఏర్పాటు చేయడం..ఉద్యోగులు వేలాదిగా తరలిరావడంతో తోపులాట జరిగింది. దీంతో ఉద్యోగులు ఆర్ఓ తీరుపై నిరసన వ్యక్తంచేశారు. సదుపాయాలు కల్పించడంతో విఫలమయ్యారని ధ్వజమెత్తారు. ఆర్ఓ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఇంతలో ప్రచారం కోసం వచ్చిన బాలకృష్ణ ఉద్యోగులకు సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా.. వారు ఆర్ఓకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో బాలకృష్ణ అక్కడినుంచి వెళ్లిపోయారు. రద్దీ ఎక్కువగా ఉన్నా...పోస్టల్ బ్యాలెట్ తీసుకున్న వారంతా సాయంత్రం 5 గంటల్లోపు వెనక్కు బాక్సులో వేయాలని ఆర్ఓ గుణభూషన్‌రెడ్డి చెప్పడంతో కొందరు ఉద్యోగులు ఆయన్ను నిలదీశారు. 22వ తేదీ వరకు సమయం ఉన్నందున ఇలా ఆంక్షలు విధించడం సరికాదన్నారు. మరోవైపు కేంద్రం వద్ద కనీస సౌకర్యాలు కల్పించకపోవడంతో మహిళా ఉద్యోగినులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఓట్ల కొనుగోలుకు బేరసారాలు హిందూపురం కేంద్రం వద్ద టీడీపీ నాయకులు హల్చల్ చేశారు. బ్యాలెట్ పత్రం తీసుకుంటున్న ఉద్యోగులను పలకరిస్తూ టీడీపీకి ఓటు వేయాలని బహిరంగంగానే ప్రచారం చేశారు. కొందరు ఉద్యోగ సంఘ నాయకులను పక్కకు పిలిపించి బేరసారాలు కూడా చేశారు. ఇక తన అనుచరులతో కలిసి వచ్చిన టీడీపీ అభ్యర్థి బాలకృష్ణ ఏకంగా లైన్లో ఉన్న ఉద్యోగుల వద్దకే వెళ్లి ప్రచారం చేశారు. మహిళ ఉద్యోగులను ముచ్చటిస్తూ సెల్ఫీలు తీసుకున్నారు. తర్వాత పోలింగ్ గదిలో వెళ్లి పోస్టల్ పేపర్లలో ఓట్లు టిక్ చేస్తున్న మహిళా ఉద్యోగులతో మాట్లాడుతూ ప్రచారం చేశారు. దీనిపై ఆర్ఓ గుణశేఖర్‌రెడ్డిని వివరణకోరగా.. గుంపులుగా పోలింగ్ కేంద్రం వద్దకు వెళ్లి ఉద్యోగులకు హామిలివ్వడం నిబంధనలకు విరుద్ధమన్నారు. దీనిపై నోటీసు జారీ చేస్తామని చెప్పారు. కుట్రలకు తెరలేపారు : మాలగుండ్ల శంకరనారాయణ పెనుకొండ: టీడీపీ పాలనలో నలిగిపోయిన ఉద్యోగులంతా పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ నిర్ణయాన్ని తెలుపుతుండటంతో ఓర్వలేని టీడీపీ నాయకులు కుట్రలకు తెరలేపారని వైఎస్సార్ సీపీ పెనుకొండ ఎమ్మెల్యే అభ్యర్థి మాలగుండ్ల శంకరనారాయణ అన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పెనుకొండ పట్టణంలోని ప్రభుత్వ కళాశాలలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ కేంద్రం వద్ద వలంటీర్లుగా మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి కళాశాలకు చెందిన డైట్ విద్యార్థులను ఎంపిక చేశారని, దీంతో వైఎస్సార్సీపీకి నష్టం జరిగేలా వారు వ్యవహరించారన్నారు. ఇక 5 మండలాలకు ఒకే కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఉద్యోగ, ఉపాధ్యాయులు ఓట్లు వేయకుండా అడ్డుకునే కుట్రలకు తెరలేపారన్నారు. 400 ఓట్లు దాటితే పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయాలన్న ఎన్నికల నిబంధన ఉన్నా... వేలాది మంది ఉద్యోగులున్నా... ఆర్ఓ ఎందుకు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టలేదన్నారు. తమకు ఎలాంటి అన్యాయం జరిగినా... దీనిపై న్యాయ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. పోస్టల్ బ్యాలెట్ పరిస్థితే ఇలా ఉంటే...11వ తేదీ జరిగే పోలింగ్ ఎలా ఉంటుందోనన్న భయం అందరిలోనూ నెలకొందన్నారు. జిల్లా ఎన్నికల అధికారి స్పందించి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. -
ఈవీఎంల వయసు 37ఏళ్లు
సాక్షి, కర్నూలు(వైఎస్ఆర్ సర్కిల్): స్వతంత్ర భారతావనిలో ఎన్నికలను తొలుత పేపర్ బ్యాలెట్ ద్వారా నిర్వహించేవారు. అభివృద్ధి చెందిన సాంకేతిక పరిజ్ఞానం సద్వినియోగం చేసుకుంటూ ఎన్నికల నిర్వహణలో పారదర్శకతకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (ఈవీఎం)లను ఎన్నికల సంఘం ప్రవేశపెట్టింది. దేశంలో మొదటి సాధారణ ఎన్నికలు 1951లో జరుగగా.. ఆ సమయంలో బ్యాలెట్ విధానం ఉంది. 1982లో తొలిసారిగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (ఈవీఎం)ను అందుబాటులోకి వచ్చింది. ప్రప్రథమంగా కేరళలో వాటిని వినియోగించారు. కేంద్ర ఎన్నికల కమిషన్ వీటి నిర్వహణలో లోపాలు, సందేహాలతో కొంత కాలం కొట్టుమిట్టాడి ఆ తర్వాత నిలదొక్కుకుంది. 2004 ఎన్నికల నుంచి వాటిని పూర్తిస్థాయిలో వినియోగిస్తోంది. ఈవీఎంల పనితీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తుండటంతో మరింత పారదర్శకత కోసం 2013 నుంచి వీవీప్యాట్ (ఓటర్ వెరిఫయిబుల్ పేపర్ అడిట్ ట్రయల్)ను ఈవీఎంలకు అనుసంధానం చేశారు. - మొదటిసారి కేరళ రాష్ట్రంలోని ఉత్తర పెర్వూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో 1982 మే 19న వినియోగించారు. - ఆ తర్వాత దేశ వ్యాప్తంగా పది నియోజకవర్గాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో వీటిని వినియోగించారు. - ఈవీఎంలను ఉపయోగించ వద్దని 1984 మే 5వ తేదీన సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. - ఈవీఎంల వాడకానికి 1988లో ప్రజామోదం లభించింది. - ఈవీఎంల వాడకాన్ని 1988 డిసెంబర్లో సెక్షన్ 61ఏ ద్వారా కేంద్రం ప్రజాప్రాతినిధ్య చట్టంలో చేర్చి సవరణ చేశారు. ఆ తర్వాత 1989 మార్చి 15న అమలులోకి రావడంతో సుప్రీంకోర్టు కూడా తర్వాత సమర్థించింది. - 1990 జనవరిలో ఎన్నికల సంస్కరణల కమిటీ (ఈఆర్సీ)ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అదే ఏడాది ఏప్రిల్‌లో ఈవీఎంల వినియోగాన్ని సాంకేతిక నిపుణల కమిటీ సమర్థించింది. - 1999, 2004లో వివిధ రాష్ట్రాల్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఈవీఎంల వాడకాన్ని వినియోగించారు. - లోక్‌సభకు 2004–14 మధ్య జరిగిన మూడు ఎన్నికల్లో ఈవీఎంలను వినియోగించారు. - వీవీ ప్యాట్లను ఈవీఎంలకు అనుసంధానం చేయాలని 2013 ఆగస్టు 14న నిర్ణయించారు. - నాగాలాండ్ రాష్ట్రంలోని ఆక్సె అసెంబ్లీ నియోజకవర్గానికి 2013 సెప్టెంబర్ 4న జరిగిన ఎన్నికల్లో వీవీ ప్యాట్లను మొదటి సారిగా వినియోగించారు. - దశల వారీగా వీవీ ప్యాట్లను వినియోగించాలని 2013 అక్టోబరు 8న సుప్రీం కోర్టు ఆదేశించింది. అప్పటి నుంచి వీవీ ప్యాట్లను ఎన్నికల్లో వినియోగిస్తున్నారు. - 2017 ఏప్రిల్‌లో రూ. 3173.47 కోట్లతో 16.15లక్షల వీవీ ప్యాట్ల కొనుగోలుకు ప్రభుత్వం ఆమోదించింది. దీంతో ప్రస్తుతం జరగబోయే ఎన్నికల్లో కూడా వీవీ ప్యాట్లను వినియోగించేందుకు ఎన్నికల కమిషన్ సిద్ధమవుతోంది. -
వచ్చేసింది.. ఓట్ల పండుగ
పేరు చెప్పడానికీ సిగ్గుపడే దశ నుంచి... ఓటు మా హక్కు అని మహిళలు గొంతెత్తే వరకూ... నా ఒక్క ఓటేయకపోతే పోయేదేముందిలే అనుకునే దగ్గర్నుంచి... బాధ్యతగా చేసుకున్న మిలినియల్స్ వరకూ.. గల్లీ గల్లీ తిరిగి కరపత్రాలు పంచి ప్రచారం చేసే స్థాయి నుంచి... కాక రేపే ఫేస్బుక్ పోస్టు ఒక్కటి చాలని అనుకునే వరకు... గెలిచింది ఎవరో తెలిసేందుకు రోజులు పట్టే కాలం నుంచి.. గంటల్లో విజేతలను నిర్ణయించే దశ వరకూ... ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యం.. మన భారతీయంలో వింతలు విశేషాలు.. అన్నీ ఇన్నీ కావు! సామాన్యుడు.. దేవుడయ్యే సమయం దగ్గరకొచ్చింది! ఎడమచేతి చూపుడువేలిపై సిరా గుర్తు పడే రోజు వచ్చేస్తోంది! ఏడు దశాబ్దాల ఎన్నికల పండుగ ప్రజాస్వామ్య ప్రస్థానం సాగింది ఇలా... అభ్యర్థికో బాక్స్ నుంచి ఈవీఎంల వరకు మన ఎన్నికల ప్రక్రియ అభ్యర్థికో బాక్స్ నుంచి బ్యాలెట్ పత్రం దిశగా వెళుతూ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల వరకు చేరుకుంది. తొలి ఎన్నికల్లో ప్రతీ అభ్యర్థికి వేర్వేరు రంగుల్లో ఉన్న ఒక్కో బ్యాలెట్ బాక్స్‌ని కేటాయించారు. ఆ బాక్స్‌పై వారి పేరు, ఎన్నికల గుర్తుని పెయింట్ చేశారు. ప్రతీ పోలింగ్ బూత్‌లో బరిలో ఉన్న అభ్యర్థులు ఒక్కొక్కరికీ ఒక బ్యాలెట్ బాక్స్ అన్నమాట. నచ్చిన అభ్యర్థి బ్యాలెట్ బాక్స్‌లో ఓటరు బ్యాలెట్ పేపర్‌ను వేస్తే సరిపోతుంది. అప్పట్లో ఈ బ్యాలెట్ బాక్స్‌లను గోద్రేజ్ కంపెనీ బొంబాయిలోని విఖ్రోలి ప్రాంతంలో తయారు చేసింది. 1957 ఎన్నికల్లోనూ ఇదే ప్రక్రియను అనుసరించారు. మూడవ సార్వత్రిక ఎన్నికల (1962)లో బరిలో ఉన్న అభ్యర్థులు, గుర్తులను ఒకే బ్యాలెట్ పేపర్‌పై ముద్రించారు. ఇరవైఏళ్లపాటు ఇదే పద్ధతి కొనసాగగా.. 1982లో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రయోగాత్మకంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు (ఈవీఎంలు) వాడారు. అయితే అప్పట్లో పరూరు నియోజకవర్గంలోని 50 పోలింగ్ స్టేషన్లకే వీటిని పరిమితం చేశారు. 1998లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 16 స్థానాల్లో వీటిని మరోసారి పరీక్షించారు. ఇవన్నీ మంచి ఫలితాలు ఇవ్వడంతో 2004లో తొలిసారి మొత్తం లోక్‌సభ నియోజకవర్గాల్లో ఈవీఎంల వాడకం మొదలుపెట్టారు. అవకతవకలు జరుగుతున్నాయన్న ఆరోపణలు రావడంతో ఓటింగ్ ప్రక్రియను మరింత పారదర్శకం చేసేందుకు 2010లో ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రెయిల్ (వీవీప్యాట్)లను ప్రవేశపెట్టారు. ఈవీఎంల వాడకంతో ఓటింగ్ ప్రక్రియ సులభతరం కావడమే కాకుండా, ఫలితాల ప్రకటన కూడా వేగవంతమైంది. పోలింగ్ కేంద్రాల్లో జరిగే రిగ్గింగ్, ఆక్రమణ వంటి అక్రమాలకు అడ్డుకట్ట వేయడం సాధ్యమైంది. తక్కువ బరువు ఉండటం వల్ల ఈవీఎల రవాణ కూడా సులభం. ఒక్కో ఈవీఎం ఖరీదు ఐదారు వేలు ఉంటుంది. పదిహేనేళ్ల పాటు పని చేస్తుంది. ఇన్ని లాభాలున్నా.. ఈవీఎంలలో లోపాలున్నాయన్న ఆరోపణలు రావడం సాధారణమైపోయింది. కాలినడక, పడవల్లో, ఏనుగులపై ప్రయాణాలు ఒకప్పుడు ప్రయాణ సాధనాలు అంతగా లేవు. సరైన రహదారి సౌకర్యాలు ఉండేవి కావు. కొండ ప్రాంతాల్లోనూ, నక్సల్స్ ప్రాబల్యం ఉన్న ఏజెన్సీ ప్రాంతాల్లోనూ, ఎడారుల్లోనూ, సముద్రం మధ్య ద్వీపాల్లోనూ ఓటింగ్ నిర్వహణ దుర్లభంగా ఉండేది. ఎన్నికల కమిషన్ సభ్యులు నానా పాట్లు పడేవారు. ఎన్నికల సామగ్రి మోసుకుంటూ మైళ్లకి మైళ్లు నడిచే పరిస్థితి. ఇఅదీ ప్రజాస్వామ్య వ్యవస్థకి మనం ఇచ్చే గౌరవం. హిందూమహాసముద్రం ద్వీపాల్లో ఎన్నికల కోసం ఏకంగా నేవీ అధికారుల సాయం కూడా తీసుకోవాల్సి వచ్చింది. కొన్ని ప్రాంతాలకు ఎన్నికల సిబ్బందిని, సామగ్రిని చేర్చడానికి హెలికాప్టర్ సాయం తీసుకునే వారు. ఇప్పుడు ప్రయాణ సాధనాలు మెరుగు పడినప్పటికీ అటవీ ప్రాంత పోలింగ్ స్టేషన్లకి వెళ్లాలంటే కాలినడకే మార్గం. ఇక ప్రత్యేక వాహనాలు, రైళ్లు, హెలికాప్టర్లు, బోట్లలో కూడా సిబ్బందని తరలిస్తారు. కొన్నిసార్లు పోలింగ్ స్టేషన్ చేరుకోవడానికి ఏనుగులు వాడిన సందర్భాలూ లేకపోలేదు. రాజస్థాన్ వంటి ఎడారుల్లో ఒంటెలే సాధనం. దేశం మొత్తమ్మీద దాదాపుగా 80 వేల పోలింగ్ కేంద్రాల వద్ద మోబైల్ఫోన్ సౌకర్యం కూడా లేదు. ఇంకో ఇరవై వేల పోలింగ్ స్టేషన్లు అటవీ ప్రాంతాల్లో ఉన్నాయి. ఒక్కడున్నాడు! ఒక్క ఓటు. ఒకే ఒక్క ఓటు. మన ప్రజాస్వామ్య వ్యవస్థలో అది కూడా ఎంతో కీలకం. అందుకే ఎన్నికల సంఘం ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి మరీ గుజరాత్లో దట్టమైన గిర్ అడవుల్లోకి కాలినడకన వెళుతుంది. ఆ ఒక్కడి కోసం పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుంది. అతని పేరు మహంత్ భరత్‌దాస్ దర్శన్ దాస్. ఆలయపూజారి. ఆయన ప్రతీ ఏడాది తన ఓటు హక్కును వినియోగించుకుంటారు. ఇందుకోసం ఎన్నికల సిబ్బంది గిర్ అడవుల్లోని బనేజ్కు ఏకంగా 35 కి.మీ. ప్రయాణం చెయ్యాలి. ఆ ప్రయాణంలో వారిని సింహాలు భయపెడతాయి. అడవి జంతువులు ఎదురవుతాయి. అయినా ప్రాణాలకు తెగించి మరీ ఆ ఒక్క ఓటు నమోదు కోసమే అధికారులు వెళతారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఏ పౌరుడు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి 2 కి.మీ.దూరానికి మించి ప్రయాణించకూడదు. అందుకే తాము భరత్‌దాస్ దగ్గరకి వెళతామని ఎన్నికల సంఘం అధికారి ఒకరు చెప్పారు. ఆ ప్రాంతంలో ఫోన్లు పని చెయ్యవు. టీవీ రాదు. కనీసం విద్యుత్ సౌకర్యం కూడా లేదు. అయినప్పటికీ దర్శన్‌దాస్ శివుడిపై అపారమైన భక్తితో ఆ ప్రాంతంలోనే చాలా ఏళ్లుగా ఉంటున్నారు. చూడడానికి కాస్త ఆధునికంగానే కనిపిస్తారు. 60 ఏళ్లు దాటిన దర్శన్ దాస్ నల్ల కళ్లద్దాలు,తెల్ల గడ్డం, తలకి టోపీతో అందరినీ ఆకర్షిస్తుంటారు. ఆయనపై నమ్మకంతో ఆ అడవిలో వెళ్లేవారికి ఆధ్యాత్మిక బోధనలు చేస్తారు. పౌర సమాజానికి దూరంగా విసిరేసి ఉన్నప్పటికీ ఆయనకు ఓటు విలువ గురించి బాగా తెలుసు. ‘‘నా ఓటు ఎంత ముఖ్యమో నాకు బాగా తెలుసు. వాజపేయి సర్కార్ కేవలం ఒక్క ఓటు తేడాతో కుప్పకూలిపోయింది. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చుకొని ఎన్నికల సిబ్బంది ఇంత దూరం వస్తున్నందుకు వారిని ఎంతో గౌరవిస్తాను. నా ఓటు ఎంత విలువైనదో తెలుసుకొని గర్విస్తాను‘‘ అని అంటారు. ఒక్క వ్యక్తి కోసం పోలింగ్ బూల్ ఏర్పాటు చేస్తున్న సంగతి వెలుగులోకి వచ్చాక ఎందరో జర్నలిస్టులు గిర్ అడవుల్లోకి వెళ్లి భరత్దాస్తో మాట్లాడారు. అతని ప్రత్యేకతను ప్రపంచ దేశాలకు పరిచయం చేశారు. శభాష్ శరణ్.. ఆయనకు ఓటంటే బాధ్యత శ్యామ్ శరణ్ నేగి. ఆయన వయసు 102 సంవత్సరాలు. మన దేశంలో అతి పెద్ద వయసున్న ఓటరు ఆయనే. స్వాతంత్య్ర సమర సంగ్రామంలో పాల్గొన్న నేగికు ఓటు అంటే హక్కు మాత్రమే కాదు బాధ్యత కూడా. అందుకే ఇప్పటివరకు అన్ని ఎన్నికల్లోనూ ఓటు హక్కు వినియోగించుకున్న ఏకైక ఓటరుగా ఆయన రికార్డులకెక్కారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కల్పా అనే చిన్న గ్రామంలో ఉంటారు. కిన్నెర కైలాస్ పర్వత శ్రేణుల్లో ఉండే ఆ గ్రామంలో నిత్యం మంచు కురుస్తూనే ఉంటుంది. ఎముకలు కొరికే చలిని సైతం లెక్కచేయరు. మొదటి ఓటు తనే వేయాలనుకుంటారు. దీనికి గ్రామస్తులు కూడా సహకరిస్తారు. పొద్దున్నే ఇంకా ఎన్నికల సిబ్బంది పోలింగ్ బూత్ తెరవక ముందే ఉన్ని కోటు వేసుకొని ఆయన వస్తారు. గ్రామస్తులందరూ కూడా ఆయనకు గౌరవాన్ని ఇచ్చి దారి విడిచిపెడతారు. 1951–52లో జరిగే మొదటి ఎన్నికల్లో కూడా నేగి తొలి ఓటును వేసి ప్రజాస్వామ్య భారతంలో తొలిసారిగా ఓటు హక్కు వినియోగించుకున్న వ్యక్తిగా చరిత్రపుటల్లో నిలిచిపోయారు. అప్పట్నుంచి వేగి ప్రతీసారి ఎన్నికల్లో తన ఓటు హక్కుని వినియోగించుకుంటూనే ఉన్నారు. స్వాతంత్య్ర సమరంలో పాల్గొన్న వ్యక్తిగా మహాత్మగాంధీ సిద్ధాంతాలను ఆయన బాగా ఒంట బట్టించుకున్నారు. నూలు ఒడికి ఖాదీ వస్త్రాలు ధరించేవారు. ఒకప్పుడు ఆయనకు కాంగ్రెస్ పార్టీ అంటే చెప్పలేనంత ఇష్టం ఉండేది. దేశానికి స్వాతంత్య్రం సాధించిన పార్టీగా ఆయనకు కాంగ్రెస్ పట్ల దేశభక్తి పొంగిపొర్లేది. కానీ కాలంతోపాటు ఆయన అభిప్రాయాలూ మారిపోయాయి. ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు అత్యంత ఇష్టమైన నాయకుడు. ‘‘ఇప్పుడున్నది ఒకప్పటి కాంగ్రెస్ కాదు. ఎన్నో కుంభకోణాలకు పాల్పడింది. ఇప్పుడున్న నేతల్లో మోదీనే అభిమానిస్తాను. అవినీతిని అంతమొందించడానికి ఆయన తనకు చేతనైంది చేస్తున్నారు‘‘ అంటూ ప్రశంసిస్తారు. 17వ లోక్‌సభ ఎన్నికల్లో మరోసారి ఓటేసేందుకు ఆయన అత్యంత ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. తొలి అడుగు.. సుకుమార్ సేన్ చుట్టూ చీకటి. ముందున్న దారి కనిపించదు. అడుగు ఎలా వెయ్యాలో తెలీదు. కానీ వెయ్యాలి. ఎవరో ఒకరు ముందుగా నడవాలి. అలా నడిచి మన ఎన్నికల వ్యవస్థని ఒక గాడిలో పెట్టింది మొట్టమొదటి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సుకుమార్‌సేన్. ఇండియన్ సివిల్ సర్వీసెస్ (ఐసీఎస్) అధికారిగా, న్యాయమూర్తిగా పనిచేసిన ఆయన దేశంలో ఎన్నికల ప్రక్రియకు తొలిసారిగా వేసిన బాట మరువలేనిది. ఎన్నికల నిర్వహణకు ముందు ఇంటింటికి తిరుగుతూ ఓటర్ల జాబితా రూపకల్పనలో సుకుమార్ సేన్ బృందానికి ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. ఓటర్లలో 70 శాతం నిరక్షరాస్యులు కావడం, మహిళా ఓటర్లు పేరు వెల్లడించడానికి ఇష్టపడకపోవడంతో ఓటర్ల జాబితా రూపొందించడమే కష్టసాధ్యమైంది. దీంతో చాలా మంది ఓటు హక్కు పొందలేకపోయారు. 17 కోట్ల మంది ఓట్లతో తొలి జాబితా రూపొందింది. ఎన్నికల్లో బూత్‌ల ఏర్పాటు, సిబ్బంది నియామకం, బ్యాలెట్ బ్యాక్స్‌లు రూపొందించడం వంటివన్నీ ఒక ప్రణాళికాబద్ధంగా చేసి సుకుమార్ సేన్ బృందం విజయవంతమైంది. తొలి ఎన్నికల ప్రక్రియ అక్టోబర్ 25, 1951 నుంచి 1952 మార్చి 27 వరకు మొత్తం నాలుగు నెలల పాటు జరిగింది. ఒకసారి వేటు వేసిన వాళ్లు మళ్లీ ఓటు వెయ్యకుండా చూపుడు వేలి మీద ఇంకు గుర్తు వేయడం తొలి ఎన్నికల్లోనే ప్రవేశపెట్టారు. నేపాల్, ఇండోనేసియా, సూడాన్ వంటి దేశాలు భారత్ ఎన్నికల నిర్వహణను దగ్గరుండి పరిశీలించడానికి తమ ప్రతినిధుల్ని పంపించాయి. విదేశీ మీడియా కూడా భారత్‌లో తొలి ఎన్నికల నిర్వహణను శెభాష్ అంటూ ప్రశంసించింది. సూడాన్ దేశం కూడా తమ తొలి ఎన్నికల నిర్వహణ బాధ్యతను సుకుమార్ సేన్ చేతుల్లోనే పెట్టింది. కానీ ఆయనకు రావల్సిన గుర్తింపు రాలేదని రామచంద్రగుహ వంటి చరిత్రకారులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటారు. భారతరత్న పురస్కారం ఇవ్వదగిన వ్యక్తిని చరిత్ర మరచిపోయిందన్నది ఆయన అభిప్రాయం. ఎన్నికల సిత్రాలు అనామకుడి చేతిలో ఓడిన అంబేడ్కర్... రాజ్యాంగ నిర్మాత, భారత తొలి న్యాయశాఖా మంత్రి, తరతరాలుగా అణచివేతకు గురవుతోన్న అట్టడుగు వర్గాలైన దళిత, ఆదివాసీలకు ప్రత్యేక నియోజవకర్గాలకోసం అహరహం కృషిచేసి రిజర్వుడు నియోజకవర్గాలను తీసుకువచ్చిన డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ అప్పటికే ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన రాజకీయవేత్త. అయినప్పటికీ ఒక అనామకుడి చేతిలో, అది కూడా రిజర్వుడు నియోజకవర్గంనుంచి ఓడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. బీఆర్ అంబేడ్కర్ బొంబాయి(నార్త్ సెంట్రల్) రిజర్వుడు నియోజకవర్గం నుంచి ఆల్ఇండియా షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్ తరఫున పోటీ చేసి ఓ అనామకుడి చేతిలో ఓడిపోయారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆ వ్యక్తి పేరు నారాయణ్ నడోబా కజ్రోల్కర్. నడోబా కజ్రోల్కర్కి 1,38,137 ఓట్లు వస్తే, డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్‌కి 1,23,576 ఓట్లు వచ్చాయి. ఆ తరువాత అంబేడ్కర్ రాజ్యసభ సభ్యుడిగా పార్లమెంటులోకి అడుగుపెట్టారు. మళ్ళీ 1954లో భన్దారా లోక్‌సభ ఉప ఎన్నికలో ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి బోర్కర్ చేతిలో మళ్ళీ ఓటమిపాలయ్యారు. జేబీ కృపలానీ – సుచేతా కృపలానీ... అతను ఓడినా ఆమె గెలిచారు... బ్రిటిష్ వారి నుంచి స్వాతంత్రాన్ని సాధించుకునే సమయానికి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆచార్య జేబీ కృపలానీ ఉన్నారు. పూర్తి పేరు జీవత్రామ్ భగవాన్‌దాస్ కృపలానీ. స్వాతంత్య్రానికి పూర్వమూ, స్వాతంత్య్రానంతరమూ భారత రాజకీయాల్లో కీలకంగా పనిచేశారు. ఉత్తర ప్రదేశ్‌లోని ఫైజాబాద్ కిసాన్ మజ్దూర్ ప్రజాపార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. కానీ కాంగ్రెస్ తరఫున పోటీచేసిన మన్మోహినీ సెహెగల్ ని ఢిల్లీలో ఆచార్యకృపలానీ భార్య సుచేతా కృపలానీ ఓడించారు. 1957లోనే పోలింగ్ బూత్‌ల ఆక్రమణ.... పోలింగ్ బూత్‌లను ఆక్రమించుకొని పోలైన ఓట్లను «ధ్వంసం చేయడం, తాము గెలవమనుకున్న చోట్ల బ్యాలెట్ బాక్స్‌లను ఎత్తుకెళ్ళడం, లేదా బ్యాలెట్ బాక్సుల్లో ఇంకుపోసి ఓట్లు చెల్లకుండా చేయడం లాంటి దుశ్చర్యలు 1957 సార్వత్రిక ఎన్నికల నుంచి ప్రారంభం అయ్యాయి. బీహార్‌లోని బేగుసరాయ్ జిల్లాలోని రచియాహిలోని మటిహాని అసెంబ్లీ నియోజకవర్గంలో 1957లో జరిగిన ఎన్నికల్లో తొలి పోలింగ్ బూత్‌ల ఆక్రమణ జరిగింది. పోటీ చేసే అభ్యర్థులూ, పార్టీల సంఖ్య ఎన్నో రెట్లు పెరిగి, పోటీ పెరిగిపోవడంతో 1970–80 వ దశకం చివర్లో బూత్‌ల ఆక్రమణ అనే పదం ప్రాచుర్యంలోకి వచ్చింది. దీని వల్ల దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని పార్టీలు బూత్‌లను ఆక్రమించుకోవడంతో పాటు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటం మొదలయ్యింది. పోలింగ్ బూత్‌ల ఆక్రమణని సైతం శిక్షార్హమైన నేరంగా పరిగణించి, బూత్‌ల ఆక్రమణ జరిగిన ప్రాంతాల్లో ఎన్నికలు రద్దు చేయడం, లేదా అక్కడ ఎన్నికలు వాయిదా వేసేలా ప్రజాప్రాతినిధ్య(1951) చట్టానికి 1989లో మార్పులు చేసారు. 13 రోజుల ప్రధాని... గుల్జారీలాల్ నందా మొత్తం రెండు సార్లు ప్రధాని అయ్యారు. అయితే రెండు సందర్భాల్లోనూ 13 రోజులు, 13 రోజులే ప్రధాని పదవిలో ఉండడం ఒక విశేషం అయితే, రెండు సార్లూ పదవిలో ఉన్న ప్రధానమంత్రులు మరణించడంతో ఈయనకు ఆ అవకాశం లభించింది. ఒకటి జవహర్ లాల్ నెహ్రూ మరణం అయితే, మరొకరు లాల్‌బహదూర్ శాస్త్రి మరణంతో గుల్జారీలాల్కి ఈ అవకాశం దక్కింది. రెండుసార్లూ కలుపుకొని మొత్తం 26 రోజులు పాటు గుల్జారీలాల్ నందా ప్రధానిగా పనిచేశారు. రెండవ లోక్‌సభ(ఏప్రిల్ 2, 1962 – మార్చి 3 1967)నుంచి 1964, మే 27 జవహర్లాల్ నెహ్రూ ప్రధానిగా ఉన్నారు. మే 27, 1964 జవహర్ లాల్ నెహ్రూ మరణం తరువాత తొలిసారి గుల్జారీలాల్ తాత్కాలిక ప్రధాని అయ్యారు. మే 27 నుంచి జూన్ 9, 1964న లాల్ బహదూర్ శాస్త్రి ప్రధాని బాధ్యతలు చేపట్టే వరకూ గుల్జారీలాల్ ప్రధానిగా ఉన్నారు. రెండవసారి 1966 జనవరి 11న లాల్‌బహదూర్ శాస్త్రి మరణించిన తరువాత మళ్ళీ 13 రోజుల పాటు గుల్జారీలాల్ ప్రధాని బాధ్యతలు చేపట్టారు. శాస్త్రి మరణానంతరం ఉత్తర ప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యురాలిగా ఉన్న ఇందిరాగాంధీ 1966 జనవరి 24న ప్రధాని బాధ్యతలు చేపట్టే వరకూ గుల్జారీలాల్ ప్రధానిగా కొనసాగారు. ఆపరేషన్ దుర్యోధన... 2005, డిసెంబర్ 12 న స్టార్ టీవీ న్యూస్ ఛానల్ ప్రసారం చేసిన స్టింగ్ ఆపరేషన్, ఆపరేషన్ దుర్యోధనతో 11 మంది పార్లమెంటు సభ్యులు స్వయంగా డబ్బులు తీసుకుంటున్న విజువల్స్ బయటపెట్టారు. దీనిపై పార్లమెంటులో దుమారం రేగడంతో రాజ్యసభలోని ఎథిక్స్ కమిటీ, లోక్ సభ ప్రత్యేక కమిటీ విచారణలో వీరిని దోషులుగా నిర్ధారించడంతో 10 మంది లోక్ సభ సభ్యులూ, ఒక రాజ్య సభ సభ్యుడిని ఆయా సభల నుంచి తొలగించారు. -
బ్యాలెట్ టు వీవీ ప్యాట్లు..
మారుతున్న కాలానుగుణంగా ఎన్నికల నిర్వహణలోనూ అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. నాడు బ్యాలెట్ విధానం ఉండగా ప్రస్తుతం ఆ స్థానంలో ఈవీఎంలు వచ్చాయి. అంతేకాకుండా వేసిన ఓటు సరి చూసుకోవడానికి ఈ ఎన్నికల్లో తొలిసారిగా వీవీప్యాట్లు అందుబాటులోకి రానున్నాయి. మిర్యాలగూడ రూరల్ : చట్ట సభలకు ప్రజా ప్రతినిధులను ఎన్నుకునే విధానంలో ఓటింగ్ ప్రధానమైంది. మారుతున్న కాలానికి అనుగుణంగా ఓటింగ్ విధానంలోనూ మార్పు సంతరించుకుంటోంది. ఎన్నిక సంఘం సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకుంటూ కొత్త ఒరవడికి శ్రీకారం చుడుతోంది. ఒకప్పుడు ఎన్నికలకు బ్యాలెట్ బాక్సులు ఉపయోగించగా.. ఇటీవలి కాలంలో ఈవీఎంల వినియోగం పెంచింది. ఈ ఎన్నికల్లో ఓటు కచ్చితత్వాన్ని ఓటరు తెలుసుకునేలా వీవీ ప్యాట్ (ఓటర్ వెరిఫై యేబుల్ పేపర్ ఆడిట్ ట్రాయల్ ) యంత్రాన్ని ఎన్నికల సంఘం వినియోగించనుంది. దేశంలో ఎన్నికలు సజావుగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు స్వతంత్ర ప్రతి పత్తిగల రాజ్యంగబద్ధ సంస్థ భారత ఎన్నిక సంఘాన్ని ఏర్పాటు చేసిన విషయం విధితమే. 1950 జనవరి 25న భారత ఎన్నికల కమిషన్ ఏర్పాటైంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ జాతీయ ఎన్నికల కమిషన్‌లో భాగమే. రాజకీయ పార్టీ గుర్తింపు, రద్దు, ఎన్నికల ప్రణాళిక, ప్రవర్తనా నియమావళి రూపకల్పన, ఓటరు జాబితా తయారీ, ఎన్నికల నిర్వహణ ఎన్నికల సంఘం విధుల్లో భాగం. భారత దేశంలో మొదటి సారిగా ఎన్నికలు 1951లో జరగగా , ప్రజలు ఓటు వేసేందుకు బ్యాలెట్ విధానం అమలులో ఉండేది. ముద్రించిన బ్యాలెట్ పేపరుపై ఏ అభ్యర్థిని ఎన్నుకుంటున్నామో దానిపై ముద్రవేసి బ్యాలెట్ బాక్స్‌లో వేసేవారు. ఆ తర్వాత నూతన టెక్నాలజీలో భాగంగా 2004 నుంచి ఈవీఎంలు అందుబాటులోకి వచ్చాయి. వీటి వినియోగంపై ఆరోపణలు రావడంతో ప్రస్తుతం రాబోయే ఎన్నికల్లో ఈవీఎం, వీవీ ప్యాట్లను వినియోగించనున్నారు. రిగ్గింగ్‌కు కాలం చెల్లు భారత దేశంలో మొట్టమొదటి సారి నిర్వహించిన సాధారణ ఎన్నిల్లో బ్యాలెట్ బ్యాక్స్‌లను వినియోగించారు. ఈ విధానంలో అభ్యర్థుల పేర్లు, పార్టీ గుర్తింపుతో ముద్రించిన పేర్లు వాడేవారు. వాటిపై ఓటరుకు వచ్చిన అభ్యర్థి వద్ద స్టాంప్ వేసి ఆ బ్యాలెట్ పేపర్‌ను బ్యాలెట్ బ్యాక్స్‌లో వేసేవారు. ఓటింగ్ పక్రియ పూర్తయిన అనంతరం పేపర్ల (ఓట్ల ) లెక్కింపు ఉండేది. ఈ విధానంలో రిగ్గింగ్‌కు ఎక్కువ అవకాశం ఉండేది. దొంగ ఓట్లు ఎక్కువగ పోలయ్యేవి. 1999 ఎన్నికల్లో బ్యాలెట్ పత్రాల ముద్రణకు 7,700 టన్నుల కాగితం వాడారు. వీవీఎం ప్యాట్లు.... ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం రాష్ట్రంలో డిసెంబర్ 7న నిర్వహించనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తెస్తోంది. ఈవీఎం, వీవీప్యాట్లను ఉపయోగించనుంది. ఈవీఎం ఓటు విధానం ద్వారా ఓటు ట్యాంపరింగ్ జరుగుతుందని, ఏ పార్టీ ఓటు వేసిన అధికార పార్టీకే ఓటు పడుతుందని కొన్ని రాజకీయ పార్టీలు ఈవీఎం ద్వారా ఓటింగ్‌ను వ్యతిరేకించాయి. దీంతో ప్రస్తుతం ఎన్నికల్లో ఈవీఎంలతో పాటు వీవీ ప్యాట్లను వినియోగంలోకి తేనుంది. వీవీ ప్యాట్ (ఓటర్ వెరిఫై యేబుల్ పేపర్ ఆడిట్ ట్రాయల్ ). ఈ పద్ధతిలో ఏ అభ్యర్థికి ఓటు వేశామో వీవీ ప్యాట్ డిస్ప్లే మీద కనిపిస్తుంది. ఈ కొత్త విధానంపై ఇప్పటికే ఎన్నికల అధికారులు నాయకులకు, ఓటర్లకు అవగాహన కల్పించారు. ఈ పద్ధతిలో ఏ పార్టీకి ఓటు వేస్తామో ఆ పార్టీ గుర్తు , అభ్యర్థి పేరు పేపర్‌పై ముద్రించి ఉంటుంది. ఈ పేపరు స్క్రీన్‌పై 7 సెకండ్ల కాలం కనిపిస్తుంది. అనంతరం ఆపేపరు మిషన్‌కు అమర్చిన బాక్స్‌లో పడి పోతుంది. దీనితో ఓటరుకు ఏ అభ్యర్థికి ఓటు వేసామో తెలుస్తుంది. మారుతున్న ప్రచార సరళి ఎన్నికల్లో ఆయా పార్టీల ఆభ్యర్థులు ఓట్లను ఆకర్శించేందుకు విపరీతంగా ప్రచారం నిర్వహిస్తుంటారు. ఇంటింటికి తిరిగి ప్రచారం చేయడం, గోడలపై రాతలతో మొదలు పార్టీ కండువాలు, టోపీలు , జెండాలు, కర పత్రాలు, వాహనాలకు మైక్ సెట్లతో ప్రచారం నిర్వహిస్తూ వస్తున్నారు. గతంలో గోడలపై రాతలు ఎక్కువగా కనిపించేవి. దీంతో పెయింటింగ్ కళా కారులకు చేతినిండా పని ఉండేది. సత్తు రేకుపై అభ్యర్థి పేరు గుర్తుతో అచ్చువేయించే వారు. వాటిని గోడలపై అచ్చు వేయడం ద్వారా పెయింటింగ్ చేయాల్సిన అవసరం ఉండేది కాదు. పార్టీ కార్యాలయ భవనంపై తమ పార్టీ గుర్తులను ఏర్పాటు చేసి దీనికి లైటింగ్ ఏర్పాటు చేసే వారు. పార్టీ జెండాలతో కార్యకర్తలు తన అభిమాన నాయకుడి వెంట ర్యాలీగా వెళ్లే వారు. కానీ ప్రస్తుతం టెక్నాలజీ పెరగడంతో అభ్యర్థుల ప్రచార సరళిలో మార్పొచ్చింది. డిజిటల్ ప్రచారం ఇప్పుడంతా డిజిటల్ హవా నడుస్తోంది. రాజకీయ నాయకులు సహితం టెక్నాలజీని ప్రచారానికి అనుగుణంగా మార్చుకుంటున్నారు. ఫేస్బుక్, వాట్సప్, ట్విటర్లను వేదికగా చేసుకొని ఓటర్లను ఆకర్శించే పనిలో పడ్డారు. మెసేజీలు, వాట్సప్ కాల్స్ ద్వారా ఓటర్లకు ఫోన్ చేçస్తున్నారు. వాల్ పెయింటింగ్‌ల స్థానంలో ఫ్లెక్సీలు వచ్చాయి. గతంలో భారీ కటౌట్లు ఏర్పాటు చేసేందుకు ప్లైవుడ్‌ను వా డే వారు. దానిపై అభ్యర్థుల, నాయకుల బొమ్మలు వేసే వారు. ఇందుకు కొన్ని రోజుల సమయం పట్టేది. ప్రస్తుతం ఫ్లెక్సీలు అందుబాటులోకి రావడంతో ఎంత పెద్ద కటౌట్ అయినా క్షణాల్లో రెడీ అవుతోంది. ఈవీఎంలు..... 2004 నుంచి సార్వత్రిక ఎన్నికల్లో అన్ని చోట్ల ఓటింగ్ కోసం బ్యాలెట్ బాక్స్‌ల స్థానంలో ఈవీఎం (ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్)వాడకం అమల్లోకి వచ్చింది. అంతకుముందు రాజస్థాన్, ఢిల్లీ, మధ్యప్రదే«శ్ రాష్ట్రాల్లో ఈవీఎంలను ప్రయోగాత్మకంగా వినియోగించారు. ఇక్కడ ఈ విధానం సఫలం కావడంతో 2004 నుంచి అన్నిచోట్ల ఈవీఎం ఓటింగ్ విధానం అమల్లోకి వచ్చింది. దీనివల్ల బ్యాలట్ పత్రాల ముద్రణ వల్ల జరిగే కాగితం వాడకాన్ని అరికట్టినట్లయింది. ఈ ఏవీఎంలను భారత్ లిమిటెడ్, ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనే రెండు ప్రభుత్వం సంస్థలు తయారు చే సాయి. విద్యుత్ సరఫరా వ్యవస్థ లేని చోట్ల కూడా వినియోగించవచ్చు. బ్యాటరీ సహాయంతో పనిచేస్తాయి. ఒక్కోక్క ఈ ఈవీఎంలో 1400 లోపు మంది ఓట్లను ఓటింగ్‌కు అనుమతిస్తుంది. పోటీలో 64 మంది కంటే తక్కువగా ఉంటే ఈవీఎంలను వాడతారు. ఎక్కువగా ఉంటే బ్యాలెట్ విధానం వినియోగిస్తారు. యువగళం ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే వారికే ఓటు వేస్తా .... హుజూర్నగర్ : ఈసారి ఎన్నికలలో యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే వారికి ఓటు వేస్తాం. ప్రతి ఏడాది లక్షలాది మంది ఎంతో కష్టపడి ఉన్నత విద్యను పూర్తి చేస్తున్న ప్పటికీ ఉద్యోగ ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కుటుంబంలో ఆర్థిక పరిస్థితి సహకరించనప్పటికీ అప్పులుచేసి మరీ విద్యను కొనసాగించి ఉద్యోగాల కోసం అనేక మంది ఎదురు చూస్తున్నారు. మాటలతో కాలయాపన చేయకుండా మాట ఇచ్చి అమలు చేసే వారికి మాత్రమే ఓటు వేయాలని నిర్ణయించుకున్నా. మధిర దేదీప్య, హుజూర్నగర్ అండగా ఉండే వారికే ఓటు వేస్తా నకిరేకల్: ప్రజలు అందుబాటులో ఉండాలి. ఎలాంటి ఆపద, సమస్యలు వచ్చిన పరిష్కరించి అండగా ఉండే వారికి ఓటు వేయాలనుకుంటున్నా. ప్రస్తుతం ఎన్నికల తీరు చూస్తే అంత డబ్బుమయంగా మారింది. ప్రజలు కూడా డబ్బుకోసం ఆశపడి ఆమూల్యమైన ఓటును దుర్వినియోగం చేసుకోవద్దు. ప్రజల మేలు కోరే అభ్యర్థులకు మాత్రమే తమ ఓటును వేయాలి. – గుల్లోజు సుదీర్, నకిరేకల్ నోటు కాదు ఓటు ముఖ్యం ఓటు ఎంతో విలువైనది. కానీ చాలా వరకు నోటు కోసం ఓటును అమ్ముకుంటున్నారు. ప్రజల వద్దకు వెళ్లి ప్రజా సమస్యలు అడిగి సమస్యలను పరిష్కరించే వారికి మాత్రమే ఓటు వేస్తా. చాలా వరకు గెలిచిన తరువాత సమస్యలను పట్టించుకునే వారు కరువయ్యారు. నోటు కోసం ఓటును తాకట్టు పెట్టితే ఐదేళ్ల పాటు తప్పు చేసిన వారమవుతాం. నీతి నిజాయితీతో పాటు అభివృద్ధి కోసం పాటు పడే వారికి మాత్రమే ఓటు వేస్తా. సమస్యలపై స్పందించాలి.. అలాంటి వారికి మాత్రమే తాను ఓటు వేస్తా. – రాజశేఖర్, మిర్యాలగూడ నిజాయితీగా పనిచేసే వారికి మాత్రమే ఓటు ప్రతి విషయంలో నితి నిజాయితీగా పనిచేసే అభ్యర్థికి మాత్రమే తన ఓటు వేస్తా. ఏ రాజకీయ పార్టీ అయినా కూడా ప్రతి సమస్యపై స్పందించాలి. అదే విధంగా నిరుద్యోగ సమస్య మరింత పెరిగింది ఆ సమస్యపై స్పందించే అభ్యర్థికి ఓటు వేస్తా. చాలావరకు ఎన్నికల సమయంలోనే వచ్చే ఓటు అడుగుతున్నారు తప్ప సమస్యలపై స్పందించడం లేదు. అధికారంలోకి వచ్చి ఎలా సంపాదించుకోవాలా అని ఆలోచనచేసే వారు కానీ సమస్యలపై స్పందించే వారు కరువయ్యారు. ఈసారి నేను ఆలోచించి ఓటు హక్కును వినియోగించుకుంటా. – అనిపిరెడ్డి నవ్య, దామరచర్ల మంచి నాయకుడికి ఓటు వేస్తా భువనగిరి : నాకు ఓటు హక్కు రావడం సంతోషంగా ఉంది. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకుంటున్నా. సరైన నాయకులను ఎన్నుకున్నప్పుడే ఏ సమస్య అయినా పరిష్కారమవుతుంది. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది బలమైన ఆయుదం. ఈసారి మంచి నాయకుడికి ఓటు వేస్తా . – రమ్య, భువనగిరి అందుబాటులో ఉండే వారికే ప్రజాప్రతినిధులుగా గెలిచే వ్యక్తులు ప్రజా సమస్యలను పరిష్కరించాలి. ప్రజలను అందుబాటులో ఉండాలి. అభివృద్ధి చేసే మంచి నాయకుడిని ఎన్నుకుంటా. మహిళలకు సంక్షేమ పథకాలను అమలు చేసే మంచి నాయకుడికి ఈసారి ఓటు వేయాలని నిర్ణయించుకున్నా.– పర్వేజ్, వలిగొండ యువతతోనే సాధ్యం సమాజంలో మార్పు యువతతోనే సాధ్యం. యువత అనుకుంటే ఏదైనా సాధించగలరు. యువత ఓట్లే కీలకం. పార్టీలు పోటీ చేసేందుకు యువకులకు అవకాశం కల్పించాలి. యువకుల అభిప్రాయాలను గౌరవించాలి. యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలి. ప్రభుత్వ శాఖల్లో ఖాళీ పోస్టులను భర్తి చేయాలి. గ్రామాలు అభివృద్ధి పథంలో ముందుకు వెళ్లాలంటే యువత పాత్ర కీలకం. – రచ్చ కల్పన, ఆలేరు ఇచ్చిన హామీని అమలు చేసే వారికే ఓటు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీని అమలు చేసే అభ్యర్థులకు మాత్రమే ఓటు వేస్తాను. ఓట్ల కోసం అది చేస్తాం.. ఇది చేస్తామని చెప్పి ఓట్లు వేయించుకొని ప్రజలను పట్టించుకోని వారికి మాత్రం ఈ ఎన్నికల్లో ఓటు వేసేందుకు సిద్ధంగా లేము. ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే వారికి మాత్రమే ఈ సారి ఎన్నికల్లో ఓటు వేస్తా. కె.సాయికుమార్, కీతవారిగూడెం మంచిచేసే వాళ్లకే ఓటు ఈ ఎన్నికల్లో గెలుపు స్వార్థం కోసం కాకుండా ప్రజలందరికీ మంచిచేసే అభ్యర్థికి ఓటు వేయాలనుకుంటున్నాను. చదువుకునే వారికి చేయూత ఇస్తూ, నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించాలి. రైతులకు మంచి చేయాలి. ప్రస్తుతం ఎన్నికలు పోటీపోటీగా సాగుతున్నాయి. గెలుపు ఓటములు కూడా అంచనాలు వేయలేకపోతున్నాం. – కీసర మమతారెడ్డి, నకిరేకల్ ప్రజాసేవ చేసే వారినే ఎన్నుకోవాలి అర్వపల్లి : ఎన్నికల్లో ప్రజాసేవ చేసే వారినే ఎన్నుకోవాలి. ఎన్నికల్లో గెలవగానే ప్రజలకు అందుబాటులో ఉండకుండా డబ్బు సంపాదనే ధ్యేయంగా పనిచేసే వారికి ఎట్టి పరిస్థితుల్లో ఓట్లు వేయరాదు. డబ్బు, మద్యంనకు బానిసై మోసపోవద్దు. ఓటు వజ్రాయుధం లాంటింది. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా 5ఏళ్లు అన్ని రకాలుగా సేవలందించే వారిని గెలిపించుకోవాలి. – కేసాని రాహుల్, బొల్లంపల్లి,అర్వపల్లి -
ఈవీఎంలు వద్దు..మళ్లీ బ్యాలెట్లే కావాలి!
-
మళ్లీ బ్యాలెట్‌కే వెళ్దాం!
న్యూఢిల్లీ: ఎన్నికల్లో ఈవీఎం(ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రం)ల విశ్వసనీయతపై సందేహాలు వ్యక్తం చేస్తూ.. భవిష్యత్తులో బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. ఈవీఎంలతోపాటు వాటికి అనుసంధానించే వీవీప్యాట్ (ఓటు ధ్రువీకరణ యంత్రాల)ల్లో లోపాలపై అభ్యంతరాలు తెలిపాయి. అలాగే ఓటరు జాబితాలో నకిలీల్ని నివారించేందుకు ఓటర్లను ఆధార్‌తో అనుసంధానించాలని ఈసీకి సూచించాయి. ఈ ఏడాది చివర్లో పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది ప్రథమార్థంలో లోక్‌సభ ఎన్నికలున్న నేపథ్యంలో అన్ని పార్టీలతో సోమవారం ఈసీ సమావేశం నిర్వహించింది. ఈ అఖిలపక్ష భేటీలో బీజేపీ మినహా మిగతా ఆరు జాతీయ పార్టీలు, పలు ప్రాంతీయ పార్టీలు మళ్లీ పాత పద్ధతిలో బ్యాలెట్ విధానంతోనే దేశంలో ఎన్నికల ప్రక్రియను కొనసాగించాలని నొక్కిచెప్పాయి. ఈవీఎంలపై లేవనెత్తిన సందేహాలకు ప్రతిపక్ష పార్టీలు సంతృప్తి చెందేలా సమాధానం ఇస్తామని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. బ్యాలెట్ పద్ధతికి మళ్లడమంటే పోలింగ్ బూత్‌ల ఆక్రమణల్ని స్వాగతించినట్లేనని సీఈసీ ఓపీ రావత్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘కొన్ని పార్టీలు మళ్లీ బ్యాలెట్ విధానానికి వెళ్లాలని కోరడం మంచిది కాదు. అదే సమయంలో ఈవీఎంలతో కొన్ని సమస్యలున్నాయని, వీవీపాట్ల స్లిప్‌ల లెక్క విషయంలో లోపాలున్నాయని మా దృష్టికి తీసుకొచ్చాయి. మేం వాటిపై దృష్టిపెడతాం’ అని ఆయన చెప్పారు. 70% పార్టీలది బ్యాలెట్ బాటే: కాంగ్రెస్ ఎన్నికలకు ముందు ఈసీ అన్ని పార్టీల అభిప్రాయాల్ని వినడం సంప్రదాయంగా వస్తోంది. ఆ నేపథ్యంలో నిర్వహించిన ఈ భేటీలో నిజానికి ఈవీఎంల ట్యాంపరింగ్, వీవీప్యాట్‌ల్లో సాంకేతిక లోపాలు అజెండా కాకపోయినా.. ప్రతిపక్ష పార్టీలు మాత్రం వాటినే ప్రధానంగా ప్రస్తావించాయి. ఈవీఎంల్ని ట్యాంప రింగ్ చేస్తున్నారని, పేపర్ బ్యాలెట్లకు మళ్లాలని కాంగ్రెస్, సమాజ్‌వాదీ, బీఎస్పీ, ఎన్సీపీ, ఆమ్ఆద్మీ, జనతాదళ్(ఎస్), సీపీఐ, సీపీఎం, ఫార్వర్డ్ బ్లాక్ తదితర పార్టీలు తమ వాణిని గట్టిగా వినిపించాయి. సమావేశం అనంతరం కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ మాట్లాడుతూ.. ‘నాల్గింట మూడొంతు పార్టీలు ఈవీఎంల ట్యాంపరింగ్, సాంకేతిక లోపాల్ని ప్రస్తావించాయి. ఈ విషయంలో బీజేపీ ఒంటరైంది. 70 శాతం రాజకీయ పార్టీలు పాత విధానంలోనే ఎన్నికలు జరపాలని ఈసీని కోరాయి’ అని చెప్పారు. ‘ఒకవేళ పేపర్ బ్యాలెట్‌కు ఈసీ మొగ్గు చూపనిపక్షంలో.. ఓటింగ్ విశ్వసనీయత కోసం కనీసం 30 శాతం పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలకు పేపర్ ట్రయల్ యంత్రాల్ని ఏర్పాటు చేయాలి’ అని డిమాండ్ చేశారు. ఈసీ గుర్తింపు పొందిన ఏడు జాతీయ, 51 ప్రాంతీయ పార్టీల్ని ఈసీ ఆహ్వానించగా.. మొత్తం 41 పార్టీలు మాత్రమే హాజరయ్యాయి. రాజకీయ పార్టీల ఎన్నికల ఖర్చులకు పరిమితి విధించడాన్ని భేటీలో బీజేపీ వ్యతిరేకించింది. దానికి బదులు మరింత పారదర్శకంగా ఎన్నికలు జరిగేలా చూడాలంది. పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టడంపై తాము సానుకూలంగా ఉన్నామని తెలిపింది. ఆధార్‌తో అనుసంధానించాలి ఎన్నికల్లో అక్రమాల్ని నిరోధించేందుకు జాబితాలోని ఓటర్లను వారి ఆధార్ నెంబర్‌తో అనుసంధానం చేయాలని బీజేపీ సహా పలు పార్టీలు ఈసీని కోరాయి. ‘ఓటర్లతో ఆధార్‌ను అనుసంధానించాలని రాజకీయ పార్టీలు ఈసీకి సూచించాయి. 10 పార్టీలు ఈ అంశాన్ని లేవనెత్తాయి’ అని ఎన్నికల సంఘం ఒక ప్రకటనలో వెల్లడించింది. అక్షరక్రమంలో ఓటర్ల జాబితాను రూపొందిస్తే.. నకిలీల్ని తొలగించేందుకు అవకాశముంటుందని సమావేశంలో బీజేపీ సూచించింది. కాగా ఆగస్టు 2015లో సుప్రీంకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో.. ఓటరు జాబితాతో ఆధార్ అనుసంధాన ప్రక్రియను బ్రేక్ పడింది. 1982లో తొలి ఈవీఎం ప్రతిపక్షాల ఆరోపణల నేపథ్యంలో ఈవీఎంల్ని హ్యాక్ చేయాలంటూ గతేడాది జూన్‌లో పార్టీల్ని ఈసీ ఆహ్వానించగా.. కేవలం రెండు పార్టీలు మాత్రమే ఆ సవాలు స్వీకరించాయి. చివరికి ఆ రెండూ కూడా ఈవీఎంల హ్యాకింగ్ సవాలుకు గైర్హాజరయ్యాయి. 1982లో కేరళలో జరిగిన ఉప ఎన్నికల్లో మొదటిసారి ఈవీఎంల్ని ఉపయోగించారు. వాటి వాడకంపై అప్పటికి ఎలాంటి చట్టం లేకపోవడంతో ఆ ఎన్నిక చెల్లదని సుప్రీంకోర్టు ప్రకటించింది. ఈవీఎంల్ని వినియోగించేందుకు వీలుగా 1989లో ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని సవరించినా.. 1998 వరకూ పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. దాదాపు అన్ని ఎన్నికల్లో ఈవీఎంల వైఫల్య రేటు 0.7 శాతంగా ఉంటోంది. -
బ్యాలెట్ బాక్సు కోర్టుకు తరలింపు
♦ 6న బుడతవలస పంచాయతీ ఎన్నికల రీకౌంటింగ్ లావేరు: బుడతవలస పంచాయతీ ఎన్నికల బ్యాలెట్ బాక్సులను లావేరు ఎంపీడీవో ఎం.కిరణ్‌కుమార్‌తో పాటు పలువురు అధికారులు శ్రీకాకుళంలోని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకు సోమవారం తరలించారు. 2013వ సంవత్సరంలో జూలైలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో బుడతవలస పంచాయతీకి వైఎస్సార్ సీపీ నుంచి బుడుమూరు పాపారావు, టీడీపీ తరఫున బుడుమూరు నర్సింహులు పోటీ చేశారు. 12 ఓట్లు మెజారిటీతో బుడుమూరు నర్సింహులు గెలుపొందినట్టు అప్పటి ఎన్నికల అధికారి మూడడ్ల రమణ ప్రకటించారు. బ్యాలెట్ల లెక్కింపులో 61 ఓట్లును చెల్లనివిగా ఎన్నికల అధికారి తీసివేశారు. అయితే ఈ 61 ఓట్లు వైఎస్సార్ సీపీ సర్పంచ్ అభ్యర్థికి పడినవేనని తిరిగి రీ కౌటింగ్ నిర్వహించాలని బుడుమూరు పాపారావు, అతని తరఫున ఏజెంట్లు పట్టుపట్టినా ఎన్నికల అధికారి రమణ రీ కౌంటింగ్ నిర్వహించలేదు. దీనిపై వైఎస్సార్ సీపీ మద్దతుదారుడు బుడుమూరు పాపారావు శ్రీకాకుళంలోని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో పిటీషన్ వేశారు. అతని పిటీషన్ విచారణ చేపట్టిన పీడీఎఫ్ కోర్టు రీకౌంటింగ్ నిర్వహణకు బుడతవలస పంచాయతీ ఎన్నికల బ్యాలెట్ బాక్సులును కోర్టుకు అందజేయాలని జిల్లా కలెక్టర్‌కు ఆదేశించింది. కోర్టు ఆదేశాలు మేరకు కలెక్టర్ బ్యాలెట్ బాక్సులును కోర్టుకు అందజేయాలని లావేరు ఎంపీడీవోకు ఆదేశించారు. ఈ మేరకు లావేరు ఎంపీడీవో కిరణ్‌కుమార్, సూపరింటెండెంట్ విజయరంగారావు, లావేరు పోలీసులు పొందూరులోని ట్రెజరీలో భద్రపరిచిన లావేరు మండలంలోని 26 పంచాయతీల బ్యాలెట్ బాక్సులను లావేరు పోలీస్ స్టేషన్‌కు సోమవారం తీసుకువచ్చారు. బుడతవలస పంచాయతీ ఎన్నికల బ్యాలెట్ బాక్సు మినహా మిగతా పంచాయతీల బ్యాలెట్ బాక్సులను లావేరు పోలీస్ స్టేషన్లో భద్రపరిచారు. అనంతరం బుడతవలస పంచాయతీ ఎన్నికల బ్యాలెట్ బాక్సును పోలీస్ బందోబస్తు నడుమ ఎంపీడీవో కిరణ్‌కుమార్ శ్రీకాకుళం కోర్టుకు తీసుకువెళ్లారు. 6నకౌంటింగ్ నిర్వహణ బుడతవలస పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 6వ తేదీన రీకౌంటింగ్ నిర్వహించనున్నట్టు శ్రీకాకుళంలోని ప్రిన్సిపల్ జూనియర్ కోర్టు సివిల్ జడ్జి పద్మావతి తెలిపారని లావేరు ఎంపీడీవో కిరణ్‌కుమార్ చెప్పారు. బుడతవలస పంచాయతీ ఎన్నికల బ్యాలెట్ బాక్సును తీసుకొని ప్రిన్సిపల్ జూనియర్ కోర్టు సివిల్ జడ్జి వద్దకు వెళ్లగా ఈ నెల 6వ తేదీన రీకౌంటింగ్ నిర్వహించాలన్నారు. అప్పటివరకూ బ్యాలెట్ బాక్సును భద్రపరచాలని సూచించడంతో దానిని పొందూరులోని ట్రెజరీకు తీసుకువెళ్లి భద్రపరిచామని ఎంపీడీవో తెలిపారు. -
బ్యాలెట్ ఆఫీస్