సాక్షి, రాయ్‌పూర్: నక్సల్ ప్రభావిత ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లాలో ఎన్నికల నిర్వహణ నిజంగా కత్తిమీద సామే. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగాలంటే ముందుగా ఎన్నికల సిబ్బందిని క్షేమంగా పోలింగ్ స్టేషన్‌లకు పంపించాలి. పోలింగ్ పూర్తయ్యాక ఈవీఎం యంత్రాలుసహా సిబ్బందిని తిరిగి సురక్షితంగా తీసుకురావాలి. నక్సల్స్ మందుపాతరలు, మెరుపుదాడులకు పేరుగాంచిన బస్తర్ జిల్లాలో సిబ్బంది తరలింపు సవాళ్లతో కూడుకున్నదే.
అందుకే ఈసారీ రోడ్డు మార్గంలోకాకుండా వాయుమార్గంలో సిబ్బందిని తరలించి శెభాష్ అనిపించుకుంది భారత వాయుసేన. రాష్ట్రంలో తొలి దఫా ఎన్నికలు జరిగిన నవంబర్ 7వ తేదీన 20 నియోజకవర్గాలకు పోలింగ్ నిర్వహించడం తెల్సిందే. ఈ నియోజకవర్గాల్లో అత్యంత సమస్యాత్మకమైన పోలింగ్ స్టేషన్లకు 860 మందికిపైగా సిబ్బందిని తరలించేందుకు వాయుసేన తన ఎంఐ–17 హెలికాప్టర్లను రంగంలోకి దించింది. ఎనిమిది హెలీకాప్టర్లు ఆరు రోజులపాటు ఇలా ఎన్నికల సిబ్బంది తరలింపులో అవిశ్రాంతంగా పనిచేశాయి.
‘సిబ్బంది తరలింపు కోసం హెలికాప్టర్లు 404 సార్లు రాకపోకలు సాగించాయి. విధి నిర్వహణలో పోలింగ్ సిబ్బంది మాత్రమే కాదు వాయుసేన హెలికాప్టర్లు తమ నిబద్ధతను మరోసారి చాటిచెప్పాయి’ అని ప్రశంసిస్తూ ఛత్తీస్‌గఢ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ తన సామాజిక మాధ్యమ ఖాతా ‘ఎక్స్’లో ట్వీట్‌చేశారు. ‘బస్తర్ ప్రాంతంలోని సుక్మా, బీజాపూర్, కాంకేర్, దంతేవాడ, నారాయణ్‌పూర్ జిల్లాలో 156 పోలింగ్ స్టేషన్లలో విధులు నిర్వర్తించిన 860కిపైగా సిబ్బందిని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ తన హెలికాప్టర్లలోనే తరలించింది’ అని ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ పి. సుందర్‌రాజ్ చెప్పారు.
హెలికాప్టర్లపైకీ నక్సల్ కాల్పులు!
2008 అసెంబ్లీ ఎన్నికల్లో సిబ్బందిని తరలిస్తున్న హెలికాప్టర్లపైకీ నక్సల్స్ కాల్పులు జరిపారు. ఆనాడు బీజాపూర్ జిల్లాలోని పెడియా గ్రామంలో ఓటింగ్ యంత్రాలు, సిబ్బందితో వెళ్తున్న ఒక హెలికాప్టర్ పైకి నక్సల్స్ కాల్పులు జరపగా కాక్‌పిట్‌లోని ఫ్లైట్ ఇంజనీర్ సర్జెంట్ ముస్తఫా అలీ మరణించారు. వెంటనే అందులోని కెపె్టన్ స్క్వాడ్రాన్ లీడర్ టీకే చౌదరీ చాకచక్యంగా అది కూలిపోకుండా చూసి సురక్షితంగా జగ్దల్‌పూర్ పట్టణంలో ల్యాండ్‌చేశారు.
Comments
Please login to add a commentAdd a comment