rayachur
-
బస్తర్‌లో 404 సార్లు చక్కర్లుకొట్టాయి!
సాక్షి, రాయ్‌పూర్: నక్సల్ ప్రభావిత ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లాలో ఎన్నికల నిర్వహణ నిజంగా కత్తిమీద సామే. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగాలంటే ముందుగా ఎన్నికల సిబ్బందిని క్షేమంగా పోలింగ్ స్టేషన్లకు పంపించాలి. పోలింగ్ పూర్తయ్యాక ఈవీఎం యంత్రాలుసహా సిబ్బందిని తిరిగి సురక్షితంగా తీసుకురావాలి. నక్సల్స్ మందుపాతరలు, మెరుపుదాడులకు పేరుగాంచిన బస్తర్ జిల్లాలో సిబ్బంది తరలింపు సవాళ్లతో కూడుకున్నదే. అందుకే ఈసారీ రోడ్డు మార్గంలోకాకుండా వాయుమార్గంలో సిబ్బందిని తరలించి శెభాష్ అనిపించుకుంది భారత వాయుసేన. రాష్ట్రంలో తొలి దఫా ఎన్నికలు జరిగిన నవంబర్ 7వ తేదీన 20 నియోజకవర్గాలకు పోలింగ్ నిర్వహించడం తెల్సిందే. ఈ నియోజకవర్గాల్లో అత్యంత సమస్యాత్మకమైన పోలింగ్ స్టేషన్లకు 860 మందికిపైగా సిబ్బందిని తరలించేందుకు వాయుసేన తన ఎంఐ–17 హెలికాప్టర్లను రంగంలోకి దించింది. ఎనిమిది హెలీకాప్టర్లు ఆరు రోజులపాటు ఇలా ఎన్నికల సిబ్బంది తరలింపులో అవిశ్రాంతంగా పనిచేశాయి. ‘సిబ్బంది తరలింపు కోసం హెలికాప్టర్లు 404 సార్లు రాకపోకలు సాగించాయి. విధి నిర్వహణలో పోలింగ్ సిబ్బంది మాత్రమే కాదు వాయుసేన హెలికాప్టర్లు తమ నిబద్ధతను మరోసారి చాటిచెప్పాయి’ అని ప్రశంసిస్తూ ఛత్తీస్‌గఢ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ తన సామాజిక మాధ్యమ ఖాతా ‘ఎక్స్’లో ట్వీట్‌చేశారు. ‘బస్తర్ ప్రాంతంలోని సుక్మా, బీజాపూర్, కాంకేర్, దంతేవాడ, నారాయణ్‌పూర్ జిల్లాలో 156 పోలింగ్ స్టేషన్లలో విధులు నిర్వర్తించిన 860కిపైగా సిబ్బందిని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ తన హెలికాప్టర్లలోనే తరలించింది’ అని ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ పి. సుందర్రాజ్ చెప్పారు. హెలికాప్టర్లపైకీ నక్సల్ కాల్పులు! 2008 అసెంబ్లీ ఎన్నికల్లో సిబ్బందిని తరలిస్తున్న హెలికాప్టర్లపైకీ నక్సల్స్ కాల్పులు జరిపారు. ఆనాడు బీజాపూర్ జిల్లాలోని పెడియా గ్రామంలో ఓటింగ్ యంత్రాలు, సిబ్బందితో వెళ్తున్న ఒక హెలికాప్టర్ పైకి నక్సల్స్ కాల్పులు జరపగా కాక్‌పిట్‌లోని ఫ్లైట్ ఇంజనీర్ సర్జెంట్ ముస్తఫా అలీ మరణించారు. వెంటనే అందులోని కెపె్టన్ స్క్వాడ్రాన్ లీడర్ టీకే చౌదరీ చాకచక్యంగా అది కూలిపోకుండా చూసి సురక్షితంగా జగ్దల్పూర్ పట్టణంలో ల్యాండ్చేశారు. -
ప్రధానోపాధ్యాయుడి కష్టాలు.. పని చేస్తున్న స్కూల్లోనే నైట్ డ్యూటీలు
రాయచూరు: మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన సరుకులు దొంగలపాలు కాకుండా ప్రధానోపాధ్యాయుడు కాపలా కాయాల్సిన దుస్థితి యాదగిరి జిల్లాలో వెలుగు చూసింది. వివరాలు.. యాదగిరి జిల్లా సురపుర తాలూకా మాలహళ్లిలోని పాఠశాలలో 1నుంచి పదో తరగతి వరకు చదివే విద్యార్థులకు సంబంధించిన బియ్యం, బేడలు, ఇతర నిత్యావసరాలను పాఠశాలలోనే నిల్వ చేశారు. ఇటీవల చుట్టు పక్కల ప్రాంతాల్లో చోరీలు జరుగుతున్నాయి. దీంతో సరుకులను కాపాడుకునేందుకు ప్రధానోపాధ్యాయుడే రోజూ రాత్రి పాఠశాలకు వెళ్లి గదికి తాళం వేసి అక్కడే నిద్రిస్తున్నాడు. -
ఎమ్మెల్యే, ఎస్ఐ ప్రేమకలాపం!
రాయచూరు రూరల్ : రాయచూరు గ్రామీణ శాసన సభ్యుడు తిప్పరాజు హవల్దార్ ఓ మహిళా ఎస్ఐ ప్రేమకలాపం సాగిస్తున్నట్లు బుధవారం కొన్ని టీవీ చానళ్లలో విస్తృత ప్రచారం జరిగింది. ఎమ్మెల్యే తిప్పరాజు హవల్దార్ గతంలో స్థానిక మార్కెట్ యార్డులో పని చేసిన ఓ మహిళా ఎస్ఐను ప్రేమించాడని, ఆమెతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ భార్యా పిల్లల్ని నిర్లక్ష్యం చేస్తున్నాడని ఎమ్మెల్యే భార్య పేరుతో గత మార్చి 16న రాష్ట్ర మహిళా కమిషన్‌కు లేఖ వెళ్లింది. దీనిపై మహిళా కమిషన్ స్పందించడంతో ఈ వార్తలు టీవీ చానళ్లలో బుధవారం గుప్పుమన్నాయి. అయితే తాను ఆ లేఖ రాయలేదని ఎమ్మెల్యే భార్య, మాన్వి తాలూకా కుర్డి జిల్లా పంచాయతీ సభ్యురాలిగా ఉన్న విరుపమ్మ (సౌమ్య) పేర్కొంటున్నారు. అంతా వట్టిదే: ఎమ్మెల్యే సాక్షి, బెంగళూరు: నాకు, నా భార్యకు మధ్య ఎటువంటి తగాదాలు లేవు.. అన్యోన్యంగా ఉన్నాం..ఆరోపణలు అవాస్తవం అని రాయచూరు రూరల్ ఎమ్మెల్యే తిప్పరాజు హవాల్దార్ అన్నారు. బుధవారం బెంగళూరు విధానసౌధలో ఆయన మీడియాతో మాట్లాడారు. తమపై బురదజల్లడానికి ఎవరో కావాలనే తన భార్య పేరుతో మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారన్నారు. మహిళా కమిషన్ అధ్యక్షురాలు నాగలక్ష్మీబాయి తమతో చర్చించకుండానే ఫిర్యాదు ప్రతిని మీడియాకు విడుదల చేయడం చూస్తుంటే రాజకీయంగా తొక్కేయడానికి రాజకీయ ప్రత్యర్థులు పన్నిన కుట్రగా అనుమానం కలుగుతోందన్నారు. ఆమెకు కమిషన్ అధ్యక్షురాలిగా ఉండే అర్హత లేదన్నారు. భార్య సౌమ్య కూడా మహిళా కమిషన్‌కు ఫోన్‌చేసి తనకు తన భర్తకు మధ్య విభేదాలు లేవని స్పష్టం చేసింది. ఏ తప్పూ చేయలేదు: ఎస్ఐ బేబి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్.ఐ బేబీ వాలేకర్ మీడియాతో మాట్లాడుతూ... తన పరువుకు నష్టం కలిగించేలా కొంతమంది ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. తాను ఏ తప్పు చేయలేదన్నారు. తనపై అనవసర ఆరోపణలు చేసిన వారిని గుర్తించి త్వరలో పరువునష్టం దాఖలు చేస్తానన్నారు. -
రైలు కిందపడి కర్ణాటక వాసి మృతి
హిందూపురం అర్బన్ : ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా హిందూపురం–దేవరపల్లి రైల్వేస్టేషన్ మధ్య రైలు కింద పడి కర్ణాటక రాష్ట్రం రాయచూర్‌కు చెందిన షేక్ ఖాజా హుసేన్(41) బుధవారం మృతి చెందినట్లు రైల్వే ఎస్ఐ ప్రభాకర్ తెలిపారు. రైలులో ప్రయాణిస్తూ ప్రమాదవశాత్తు జారి రైలు కింద పడిపోయి చనిపోయాడని వివరించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు.