పోస్టల్‌ సిరా..పచ్చ ఎర | Employees Cast Their Vote Through Ballet | Sakshi
Sakshi News home page

పోస్టల్‌ సిరా..పచ్చ ఎర

Published Sat, Apr 6 2019 9:51 AM | Last Updated on Sat, Apr 6 2019 9:52 AM

Employees Cast Their Vote Through Ballet - Sakshi

రాయదుర్గంలోని పోలింగ్‌ సెంటర్‌లో ఉద్యోగులను ప్రలోభపెడుతున్న కాలవ

సాక్షి, అనంతపురం అర్బన్‌ : ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఆయా నియోజకవర్గాల్లో అనుకూల కేంద్రాలను ఏర్పాటు చేశారు. ధర్మవరం నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన కేంద్రం వద్ద పోస్టల్‌ బ్యాలెట్‌ను కొనేందుకు అధికారపార్టీ నాయకులు సిద్ధపడ్డారు. ఈ క్రమంలో కేంద్రం వద్ద హంగామా చేశారు. ఉద్యోగులను ప్రలోభాలకు గురిచేశారు. అయితే వారి చర్యలను పలువురు తిరస్కరించారు. ఇక పుట్టపర్తి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన అనుకూల కేంద్రం వద్ద టీడీపీ అభ్యర్థి పల్లెరఘునాథ్‌రెడ్డి, ఆ పార్టీ నాయకులు హల్‌చల్‌ చేశారు. దీంతో టీడీపీ నాయకులు, వైఎస్సార్‌సీపీ నాయకులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అది కాస్తా పెద్దగా మారింది. దీంతో పోలీసులు ఇరువర్గాలపై లాఠీ చార్జీ చేసి అక్కడి నుంచి పంపించేశారు. రాప్తాడు నియోజకవర్గానికి సంబంధించి నగరంలోని ఎస్‌ఎస్‌బీఎన్‌ కళాశాలలో ఏర్పాటు చేసి కేంద్రం వద్ద వైఎస్సార్‌సీపీ, టీడీపీ నాయకులు కొద్దిపాటి వాగ్వాదం జరిగింది. అనంతరం ఇరువర్గాలు నాయకులు కేంద్రం వెలుపలకు వచ్చేశారు. 


ఇబ్బందిపడ్డ ఉద్యోగులు 
పోస్టల్‌ బ్యాలెట్‌ వేసేందుకు ఏర్పాటు చేసిన కేంద్రాల్లో కౌంటర్లు తక్కువగా ఏర్పాటు చేయడంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఓటరు ముందుగా ఫారం 12తో పాటు ఓటరు, ఆధార్‌ కార్డు అందజేస్తే ఫారం 13 ఇస్తారు. దానిపైన గెజిటెడ్‌ అధికారితో సంతకం చేయించి తిరిగి కౌంటర్‌లో అందజేయాలి. అప్పుడు పోస్టల్‌ బ్యాలెట్‌ ఇస్తారు. అభ్యర్థులకు ఓటు వేసి డిక్లరేషన్‌ కాపీ, పోస్టల్‌ బ్యాలెట్‌ పత్రాలను కవర్‌లో పెట్టి ట్రంక్‌ పెట్టలో వేయాలి. కౌంటర్లు తక్కువగా ఉండటంతో ఒక్కొక్కరికి గంటకు పైగా సమయం పట్టింది. అనంతపురం అర్బన్‌ కేంద్రంలో నాలుగు కౌంటర్లు ఏర్పాటు చేయగా... ఓటు వేసేందుకు దాదాపు 5 వేల మంది ఉద్యోగులు రావడంతో కేంద్రం కిక్కిరిసిపోయింది. రాప్తాడుకు సంబంధించి ఎస్‌ఎస్‌బీఎన్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన కేంద్రం వద్ద కూడా ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో ఉద్యోగులు ఆందోళనకు దిగారు. కేంద్రంలో బైఠాయించి కౌంటర్లు పెంచాలంటూ నినాదాలు చేశారు. గుంతకల్లు, పుట్టపర్తి, తదితర నియోజకవర్గాల్లోనూ కేవలం ఒక కౌంటర్‌ ఏర్పాటు చేయడంతో పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకునేందుకు వచ్చిన ఉద్యోగులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. 


హిందూపురంలో తోపులాట.. ఆర్‌ఓకు వ్యతిరేకంగా ఆందోళన 
హిందూపురం : హిందూపురంలోని ఎస్‌డీజీఎస్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన కేంద్రం వద్ద రెండు కౌంటర్లు మాత్రమే ఏర్పాటు చేయడం..ఉద్యోగులు వేలాదిగా తరలిరావడంతో తోపులాట జరిగింది. దీంతో ఉద్యోగులు ఆర్‌ఓ తీరుపై నిరసన వ్యక్తంచేశారు. సదుపాయాలు కల్పించడంతో విఫలమయ్యారని ధ్వజమెత్తారు. ఆర్‌ఓ డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. ఇంతలో ప్రచారం కోసం వచ్చిన బాలకృష్ణ ఉద్యోగులకు సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా.. వారు ఆర్‌ఓకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో బాలకృష్ణ అక్కడినుంచి వెళ్లిపోయారు. రద్దీ ఎక్కువగా ఉన్నా...పోస్టల్‌ బ్యాలెట్‌ తీసుకున్న వారంతా సాయంత్రం 5 గంటల్లోపు వెనక్కు బాక్సులో వేయాలని ఆర్‌ఓ గుణభూషన్‌రెడ్డి చెప్పడంతో కొందరు ఉద్యోగులు ఆయన్ను నిలదీశారు. 22వ తేదీ వరకు సమయం ఉన్నందున ఇలా ఆంక్షలు విధించడం సరికాదన్నారు. మరోవైపు కేంద్రం వద్ద కనీస సౌకర్యాలు కల్పించకపోవడంతో మహిళా ఉద్యోగినులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

 
ఓట్ల కొనుగోలుకు బేరసారాలు 
హిందూపురం కేంద్రం వద్ద టీడీపీ నాయకులు హల్‌చల్‌ చేశారు. బ్యాలెట్‌ పత్రం తీసుకుంటున్న ఉద్యోగులను పలకరిస్తూ టీడీపీకి ఓటు వేయాలని బహిరంగంగానే ప్రచారం చేశారు. కొందరు ఉద్యోగ సంఘ నాయకులను పక్కకు పిలిపించి బేరసారాలు కూడా చేశారు. ఇక తన అనుచరులతో కలిసి వచ్చిన టీడీపీ అభ్యర్థి బాలకృష్ణ ఏకంగా లైన్‌లో ఉన్న ఉద్యోగుల వద్దకే వెళ్లి ప్రచారం చేశారు. మహిళ ఉద్యోగులను ముచ్చటిస్తూ సెల్ఫీలు తీసుకున్నారు. తర్వాత పోలింగ్‌ గదిలో వెళ్లి పోస్టల్‌ పేపర్లలో ఓట్లు టిక్‌ చేస్తున్న మహిళా ఉద్యోగులతో మాట్లాడుతూ ప్రచారం చేశారు. దీనిపై ఆర్‌ఓ గుణశేఖర్‌రెడ్డిని వివరణకోరగా.. గుంపులుగా పోలింగ్‌ కేంద్రం వద్దకు వెళ్లి ఉద్యోగులకు హామిలివ్వడం నిబంధనలకు విరుద్ధమన్నారు. దీనిపై నోటీసు జారీ చేస్తామని చెప్పారు. 


కుట్రలకు తెరలేపారు : మాలగుండ్ల శంకరనారాయణ 
పెనుకొండ: టీడీపీ పాలనలో నలిగిపోయిన ఉద్యోగులంతా పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా తమ నిర్ణయాన్ని తెలుపుతుండటంతో ఓర్వలేని టీడీపీ నాయకులు కుట్రలకు తెరలేపారని వైఎస్సార్‌ సీపీ పెనుకొండ ఎమ్మెల్యే అభ్యర్థి మాలగుండ్ల శంకరనారాయణ అన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పెనుకొండ పట్టణంలోని ప్రభుత్వ కళాశాలలో ఏర్పాటు చేసిన పోస్టల్‌ బ్యాలెట్‌ కేంద్రం వద్ద వలంటీర్లుగా మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి కళాశాలకు చెందిన డైట్‌ విద్యార్థులను ఎంపిక చేశారని, దీంతో వైఎస్సార్‌సీపీకి నష్టం జరిగేలా వారు వ్యవహరించారన్నారు. ఇక 5 మండలాలకు ఒకే కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఉద్యోగ, ఉపాధ్యాయులు ఓట్లు వేయకుండా అడ్డుకునే కుట్రలకు తెరలేపారన్నారు.

400 ఓట్లు దాటితే పోలింగ్‌ కేంద్రం ఏర్పాటు చేయాలన్న ఎన్నికల నిబంధన ఉన్నా... వేలాది మంది ఉద్యోగులున్నా... ఆర్‌ఓ ఎందుకు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టలేదన్నారు. తమకు ఎలాంటి అన్యాయం జరిగినా... దీనిపై న్యాయ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌ పరిస్థితే ఇలా ఉంటే...11వ తేదీ జరిగే పోలింగ్‌ ఎలా ఉంటుందోనన్న భయం అందరిలోనూ నెలకొందన్నారు. జిల్లా ఎన్నికల అధికారి స్పందించి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement