భద్రత నడుమ బ్యాలెట్ బాక్సును తీసుకువెళుతున్న ఎంపీడీవో కిరణ్‌కుమార్
♦ 6న బుడతవలస పంచాయతీ ఎన్నికల రీకౌంటింగ్
లావేరు: బుడతవలస పంచాయతీ ఎన్నికల బ్యాలెట్ బాక్సులను లావేరు ఎంపీడీవో ఎం.కిరణ్‌కుమార్‌తో పాటు పలువురు అధికారులు శ్రీకాకుళంలోని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకు సోమవారం తరలించారు. 2013వ సంవత్సరంలో జూలైలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో బుడతవలస పంచాయతీకి వైఎస్సార్ సీపీ నుంచి బుడుమూరు పాపారావు, టీడీపీ తరఫున బుడుమూరు నర్సింహులు పోటీ చేశారు. 12 ఓట్లు మెజారిటీతో బుడుమూరు నర్సింహులు గెలుపొందినట్టు అప్పటి ఎన్నికల అధికారి మూడడ్ల రమణ ప్రకటించారు. బ్యాలెట్ల లెక్కింపులో 61 ఓట్లును చెల్లనివిగా ఎన్నికల అధికారి తీసివేశారు. అయితే ఈ 61 ఓట్లు వైఎస్సార్ సీపీ సర్పంచ్ అభ్యర్థికి పడినవేనని తిరిగి రీ కౌటింగ్ నిర్వహించాలని బుడుమూరు పాపారావు, అతని తరఫున ఏజెంట్లు పట్టుపట్టినా ఎన్నికల అధికారి రమణ రీ కౌంటింగ్ నిర్వహించలేదు. దీనిపై వైఎస్సార్ సీపీ మద్దతుదారుడు బుడుమూరు పాపారావు శ్రీకాకుళంలోని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో పిటీషన్ వేశారు. అతని పిటీషన్ విచారణ చేపట్టిన పీడీఎఫ్ కోర్టు రీకౌంటింగ్ నిర్వహణకు బుడతవలస పంచాయతీ ఎన్నికల బ్యాలెట్ బాక్సులును కోర్టుకు అందజేయాలని జిల్లా కలెక్టర్‌కు ఆదేశించింది. కోర్టు ఆదేశాలు మేరకు కలెక్టర్ బ్యాలెట్ బాక్సులును కోర్టుకు అందజేయాలని లావేరు ఎంపీడీవోకు ఆదేశించారు. ఈ మేరకు లావేరు ఎంపీడీవో కిరణ్‌కుమార్, సూపరింటెండెంట్ విజయరంగారావు, లావేరు పోలీసులు పొందూరులోని ట్రెజరీలో భద్రపరిచిన లావేరు మండలంలోని 26 పంచాయతీల బ్యాలెట్ బాక్సులను లావేరు పోలీస్ స్టేషన్‌కు సోమవారం తీసుకువచ్చారు. బుడతవలస పంచాయతీ ఎన్నికల బ్యాలెట్ బాక్సు మినహా మిగతా పంచాయతీల బ్యాలెట్ బాక్సులను లావేరు పోలీస్ స్టేషన్‌లో భద్రపరిచారు. అనంతరం బుడతవలస పంచాయతీ ఎన్నికల బ్యాలెట్ బాక్సును పోలీస్ బందోబస్తు నడుమ ఎంపీడీవో కిరణ్‌కుమార్ శ్రీకాకుళం కోర్టుకు తీసుకువెళ్లారు.
6నకౌంటింగ్ నిర్వహణ
బుడతవలస పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 6వ తేదీన రీకౌంటింగ్ నిర్వహించనున్నట్టు శ్రీకాకుళంలోని ప్రిన్సిపల్ జూనియర్ కోర్టు సివిల్ జడ్జి పద్మావతి తెలిపారని లావేరు ఎంపీడీవో కిరణ్‌కుమార్ చెప్పారు. బుడతవలస పంచాయతీ ఎన్నికల బ్యాలెట్ బాక్సును తీసుకొని ప్రిన్సిపల్ జూనియర్ కోర్టు సివిల్ జడ్జి వద్దకు వెళ్లగా ఈ నెల 6వ తేదీన రీకౌంటింగ్ నిర్వహించాలన్నారు. అప్పటివరకూ బ్యాలెట్ బాక్సును భద్రపరచాలని సూచించడంతో దానిని పొందూరులోని ట్రెజరీకు తీసుకువెళ్లి భద్రపరిచామని ఎంపీడీవో తెలిపారు.