ఎంపికల కోసం వచ్చిన అభ్యర్థులు
రెండు సంవత్సరాల క్రితం ప్రచురితమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాటు వెబ్‌సైట్‌లలో పొందుపరచడంతో అందులోని అంశాలు వాస్తవమేనని భ్రమపడిన పలువురు ఎయిర్‌ఫోర్స్ ఆశావాహ అభ్యర్థులు తీరా కడపకు వచ్చిన తర్వాత అది పాత సమాచారం అని తెలుసుకుని భంగపడ్డారు. ఇప్పటికైనా వాస్తవాలు విచారించుకున్న తర్వాతనే అభ్యర్థులు ఎంపికలకు హాజరుకావాలని సదరు అధికారులు పేర్కొంటున్నారు.
కడప స్పోర్ట్స్ : కడప నగరంలోని డీఎస్‌ఏ క్రీడామైదా నంలో సెప్టెంబర్ 16 నుంచి ఎయిర్‌ఫోర్స్ ఎంపికలు నిర్వహిస్తున్నారన్న తప్పుడు సమాచారం వైరల్ కావడంతో ప్రకాశం, కర్నూలు, నెల్లూరు, అనంతపురం జిల్లాలకు చెందిన కొందరు అభ్యర్థులు శనివారం రాత్రి, ఆదివారం ఉదయం కడప నగరానికి చేరుకున్నారు. వివరాల్లోకి వెళితే... 2016 సెప్టెంబర్ 16 నుంచి 22వ తేదీ వరకు కడప నగరంలోని డీఎస్‌ఏ క్రీడామైదానంలో ఎయిర్‌ఫోర్స్‌లో మెడికల్ అసిస్టెం ట్, సెక్యూరిటీ వైట్రేడ్ ఉద్యోగాలకు ఎయిర్‌ఫోర్స్ రిక్రూట్‌మెంట్ ర్యాలీ నిర్వహించారు. ఈ రిక్రూట్‌మెంట్ ర్యాలీలో కడప, అనంతపురం, కర్నూలు, చి త్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల అభ్యర్థులు పాల్గొన్నారు. సరిగ్గా రెండు సంవత్సరాల తర్వాత ఇదే వార్త గత కొద్దిరోజులుగా సోషల్‌మీడియాలో వైరల్ అవుతూ వచ్చింది.. ఇందుకు ఆధారంగా 2016 సెప్టెంబర్‌లో అప్పటి కలెక్టర్ కె.వి. సత్యనారాయణ ఇచ్చిన ప్రెస్‌మీట్‌కు సంబంధించిన వార్తా క్లిప్పింగ్‌ను సైతం జతపరిచారు. క్లిప్పింగ్‌ను జతజేసిన వారు అది ఏ సంవత్సరానికి చెందినదో తెలుపకుండా సెప్టెంబర్ 16 నుంచి ఎయిర్‌ఫోర్స్ ఎంపికలు అని సోషల్ మీడియాలో పెట్టడంతో నిరుద్యోగ అభ్యర్థులు ఎంతో ఆత్రుతతో కడపకు చేరుకున్నారు.
కంగుతిన్న అభ్యర్థులు..
సెప్టెంబర్ 16 నుంచి 22వ తేదీ వరకు ఎంపికలు జరుగుతాయన్న ఉద్దేశ్యంతో ప్రకాశం, అనంతపురం, కర్నూలు, చిత్తూరు, వైఎస్‌ఆర్ జిల్లాలకు చెందిన పలువురు నిరుద్యోగ అభ్యర్థులు ఎంపికల కోసం శనివారం రాత్రికి కడపకు చేరుకున్నారు. రాత్రి నగరంలోని డీఎస్‌ఏ స్టేడియం వద్దకు చేరుకుని అక్కడ ఎటువంటి ఏర్పాట్లు లేకపోవడంతో కంగుతిన్నారు. అదే సమయంలో అటుగా బీట్‌కు వచ్చిన పోలీసులు అభ్యర్థులను ప్రశ్నించడంతో విషయం బయటకు వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చారని పోలీసులు ప్రశ్నించడంతో రిక్రూట్‌మెంట్ ర్యాలీ కోసం వచ్చామని పేర్కొనగా.. ఇక్కడ ఎటువంటి రిక్రూట్‌మెంట్ ర్యాలీ నిర్వహించడం లేదని.. ఉంటే కనీసం మాకైనా సమాచారం ఉండేదని పోలీసులు వారికి తెలియజేశారు. దీంతో డీఎస్‌ఏ కిందిస్థాయి సిబ్బందిని అడుగగా ఇక్కడ ఎటువంటి ఎంపికలు నిర్వహించడం లేదని పేర్కొనడంతో పాటు రెండు సంవత్సరాల క్రితమే ఇక్కడ రిక్రూట్‌మెంట్ ర్యాలీ నిర్వహించారని.. ఇప్పుడేమీ జరగలేదని వారు పేర్కొనడంతో అభ్యర్థులకు ఏమి చేయాలో పాలుపోలేదు. దీంతో అభ్యర్థులు తిరుగుముఖం పట్టారు. మళ్లీ ఆదివారం ఉదయానికి మరికొంత మంది అభ్యర్థులు రావడంతో సిబ్బంది ఇక్కడ ఎంపికలు నిర్వహించడం లేదని చెప్పి పంపించారు. ఈ విషయమై స్టెప్/డీఎస్‌ఏ అధికారుల దృష్టికి విషయం తీసుకెళ్లగా.. అభ్యర్థులు సోషల్ మీడియాలో వచ్చిన అంశాల ఆధారంగా ఎంపికలకు హాజరుకావడం సరికాదన్నారు. ఏవైనా ఎంపికలు ఉంటే ఆయా జిల్లాల స్టెప్ కార్యాలయాల్లో ఖచ్చితమైన సమాచారం లభిస్తుందని.. అభ్యర్థులు తెలుసుకుని వస్తే ఇటువంటి తిప్పలు తప్పుతాయని వారు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment